Previous Page Next Page 
ఆలింగనం పేజి 71


    "సార్... మీరు చెప్పినవి తెచ్చాను" అంటూ ప్యాకెట్లు అందించాడు. నన్ను చూసి అదోలా నవ్వాడు.

 

    నేను కాస్త గంభీరంగా ఉండటానికి ప్రయత్నించాను.

 

    కానీ బోస్ మాత్రం అదే ఉషారులో 'తెచ్చావా...రండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీ కోసమే...' అని వాళ్ళకి పంచిపెట్టడంలో మునిగిపోయాడు.

 

    అవి అందుకుంటున్న ఆ పిల్లల ముఖాల్లో సంతోషం చూస్తుంటే నాకు అతనిమీదున్న అభిప్రాయం మారిపోయింది. గొప్పవన్నీ నిరాడంబరమైనవే. సమయం వస్తే కాని మనం గుర్తించలేము!

 

    వాళ్ళకి టాటాలు చెప్పి పంపించేసి.

 

    "చీకటిపడిపోయింది. రండి వెళ్దాం" అన్నాడు.

 

    నేను అతనితో కలిసి నడుస్తుంటే, 'బుగ్గమీద మట్టి అంటింది. తుడుచుకోండి' అన్నాడు.

 

    బోయ్ నన్నుచూసి నవ్వు ఆపుకోలేక ఎందుకు అవస్థపడ్డాడో అర్థం అయి నాకూ నవ్వొచ్చింది. అలా అతని కంపెనీలో ఉండే సహజత్వం నేను ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాను. కానీ తెల్లవారి ఆఫీసు పనుల్లో మాత్రం... చండశాసనుడే. ఎప్పుడు ఏం అడుగుతాడో అని స్టాఫ్ అరచేతుల్లో గుండెలు పెట్టుకుని ఉండేవారు. మొత్తం టూర్ అంతా ఇలాగే గడిచింది."

 

    "సాయంత్రాలు గోటీలాడ్తూనా?" లిల్లీని ఆటపట్టించా.

 

    "కాదు... ఒక్కరోజు ఒక్కోలా ఎంజాయ్ చేసేవాడు. వాచ్ మెన్ ని, మిగతా పనివాళ్ళనీ పిలిచి చలిమంట వేసి తను పాడ్తూ వాళ్ళని డాన్స్ చెయ్యమనేవాడు. వాళ్ళచేత చేయించడం కోసం తనుచేసి చూపించేవాడు. చివరికి నా చేత కూడా స్టెప్స్ వేయించి తనచుట్టూ తిప్పి పది రూపాయిల నోటు ఇచ్చాడు." లిల్లీ కళ్ళు ఆ సంఘటనలు తలుచుకుని మెరిసిపోతున్నాయి.

 

    నేను చాలా సీరియస్ గా "ఇంతకీ నీకతను బాగా నచ్చిపోయాడంటావు!" అన్నాను.

 

    "అతనిలో ఒక విషయం మాత్రం చాలా నచ్చిపోయింది" అంది లిల్లీ.

 

    "ఏవిటదీ?" ఆత్రుతగా అంది ఆముక్త.

 

    "ఈ వారంరోజుల్లో నా పర్సనల్ విషయాల గురించి ఒక్క ప్రశ్నకూడా వెయ్యలేదు. తన పర్సనల్ విషయాల గురించి ఒక్క విషయం బయటికి రానివ్వలేదు. బట్... చాలా రోజులుగా పరిచయం అన్నట్లు ప్రవర్తించాడు. కొంతమందికి అసలు ఎవరితో కొత్త అనేదే ఉండదేమో. బహుశా... ఈ ప్రపంచమే వాళ్ళకి పాతదేమో!" అంది.

 

    నేను నిట్టూర్చి "హూ! ఇంతకీ నీ చీరని చూసి ఎప్పుడు మెచ్చుకున్నాడో చెప్పలేదు" అన్నాను.

 

    "ఇందాకా... ఎయిర్ పోర్ట్ లో... నేను సెండాఫ్ ఇస్తూ...' ఐ మిస్ యూ సార్!' అన్నప్పుడు... 'మీరు చీరలోనే చాలా బావున్నారు' అని నవ్వాడు. దట్ స్మైల్ ఈజ్ వెరీ రేర్... నిజంగా మనసులోంచి వచ్చిన స్మైల్!"

 

    ఆమె ముఖంలో ఎంతో దిగులు కనిపించింది.

 

    లిల్లీకి అతనెంత నచ్చాడో ఆ దిగులే చెప్తోంది!

 

    "నీకు అంతగా నచ్చిన వ్యక్తిని చూడలేకపోయాను. ఎక్కడికి వెళ్ళాడూ?" అడిగాను.

 

    "ప్రస్తుతం బాంబే ఆ తర్వాత మూడు నెలలు కెనడాలో ఉంటాడు. కంపెనీ పంపిస్తోంది" అంది.

 

    "ఇంతకీ లయన్, టైగర్, ఉల్ఫ్, జాకాల్... ఈ నాలుగు జాతుల్లోకీ రాడా?" అడిగాను.

 

    ఆమె వెంటనే "నో... నో... నువ్వు అన్నావే ఐదోరకం మగాళ్ళు కూడా ఉంటారని ఆ కోవలోకొస్తాడు. హి ఈజ్ ఎ మేన్. ఎమ్.ఏ.ఎన్!" అంది.

 

    "లిల్లీ... అంతగా నచ్చాకా అతనితో ఆ సంగతి చెప్పకుండా ఎందుకు పంపించావు? మళ్ళీ ఎప్పుడు కలుస్తాడో ఏమో?" ఆత్రంగా అడిగాను.

 

    "కావాలంటే ఈ నిమిషంలో మాట్లాడచ్చు" సెల్ ఫోన్ చూపించింది. "కానీ ఏం చెప్పమంటావు. ఓ వారం రోజుల్లో నేను నిన్ను గాఢంగా ప్రేమించాననా? అసలు ఆ వూహే ఎంత సిల్లీగా ఉందో! పైగా అతను ఓ వృత్తం గీసుకుని కావలసినప్పుడు తనే అందులోంచి బైటికి వస్తున్నాడు కానీ ఇతరులని అందులోకి రానివ్వడంలేదు. ఖాళీ సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో చాలా రిజర్వ్ డ్ గా ఉంటున్నాడు. బహుశా - ఆ విలక్షణమైన ప్రవర్తనే ఆకర్షణై కూర్చుందనుకుంట!" అంది.

 

    'ఏది ఏమైనా అన్ని విషయాలూ తెలిసీ ఒక సామాన్యమైన ఆడపిల్లలా లిల్లీకూడా సంకోచించడం, సందేహించడం నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది" అన్నాను.

 

    లిల్లీ లేచి వెళ్తూ "నేను సామాన్యమైన ఆడపిల్లనే... అని అతన్ని చూశాక తెలిసింది" అంది.

 

    ఒక పురుషుడి ముందు స్త్రీ మిగతా విషయాలన్నీ వదిలేసి తన స్త్రీత్వాన్ని మాత్రమే ప్రాజెక్ట్ చెయ్యాలనుకుంది అంటే... ఆమె తప్పకుండా అతనితో ఎంతో గాఢమైన ప్రేమలో పడినట్లే లెఖ్క!


                                                          *  *  *


    పరీక్షలవగానే చిత్ర పెళ్ళి నిశ్చయమైంది. ఈ మధ్య ఎవరి పెళ్ళి గురించైనా అమ్మ ముందు మాట్లాడాలంటే భయంగా వుంది. వెంటనే నా పెళ్ళి గురించి బాధపడడం మొదలుపెడ్తుంది.

 

    మొన్నామధ్య పక్కింటావిడతో అంటే మేనరికం ఉందన్నారుగా ఎందుకు తప్పిపోయింది? అంటూ ఆరాలు తీసిందట, అదో బాధ! నాన్న తనకి తెలిసినవాళ్ళందరికీ నాకు సంబంధం చూడమని చెప్తున్నారు.

 

    పెద్దక్క వచ్చి తన 'పెద్దక్కగారి కూతురి తోడికోడలి తమ్ముడు ఉన్నాడు" అని చెప్పింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS