Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 6

    అది ఎంతో ఆరోగ్యదాయకం అని పెద్దలు చెబుతుంటారు.

    దానిమీద కూర్చుని ప్రజల ప్రేమానురాగాలను గౌరవాలను అందుకునే సుముహూర్తం తలుచుకుని అప్పుడే తాను తల్లి అంత అయిపోయినట్లు భావించుకుంది గాయత్రి.

    అక్కకు దగ్గరకు రానిచ్చి చెవిలో గుసగుసగా అంది ఆమని.

    "అక్కా! అసలే ఆయిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి కదా? ఇలా నిప్పుల్లో పోసి కాల్చేస్తారెందుకు?"

    గాయత్రి నాలుక కరుచుకుని చెంపలు వేసుకుంది.

    "తప్పు చెల్లీ! అలా అనకూడదు. లెంపలు వేసుకో!"

    "వేసుకోకపోతే ఏమవుతుందట---?" వెటకారంగా అంది.

    "తప్పమ్మా! కళ్ళుపోతాయి."

    "నా కళ్ళు పోయాయా! నో! ఇట్సాల్ థ్రాష్ ష్! ఐ డోంట్ బిలీవ్"వ్రేళ్ళతో కంటిరెప్పలు విశాలంగా చేసి చూపించింది ఆమని.

    "ఏమంటోంది?" అని ప్రశ్నించింది తల్లి వారిని గమనించి.

    "కంటిలో నలక పడిందట. ఊదమంటోంది" అంటూ చెల్లిని ప్రమాదం నుంచి గాయత్రి సమయస్ఫూర్తితో తప్పించింది.

    అర్చకస్వామి సుమిత్రాదేవికి జరగవలసిన కార్యక్రమం విపులంగా చెబుతున్నాడు. అది ప్రతి సంవత్సరం చేస్తున్నదే అంతా తెలిసిందే అయినా శ్రద్ధాసక్తులతో ఆలకిస్తోంది సుమిత్ర.

    ఆలయం అంటే ఆమె దృష్టిలో తమ కుటుంబం తాలూకు ట్రెడిషన్. అది చాలా గొప్ప సెంటిమెంట్. అక్కడ అంతా సవ్యంగా జరిగితేనే తమ కుటుంబంలో అన్నీ సుఖాలు జరుగుతాయని తిరుగులేని విశ్వాసం ఆమెకు వుంది.

    మైమ్యాట్స్ ని కూడా అతిశ్రద్ధగా పరిశీలించే కారణం అది.

    హోమానికి ఎన్నో కుంభారాలు అవసరమవుతాయి. అవన్నీ ఆలయ సిబ్బంది తెచ్చి అక్కడ అమర్చుతారు. కాని కొన్ని ముఖ్యమయిన కర్త తెచ్చే పదార్ధాలు దివాణం నుంచి సుమిత్ర స్వయంగా పళ్ళెంలో ఉంచుకుని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకు వస్తుంది. అది ఆనవాయితీ!

    ఈ సంవత్సరం అమ్మాయి కర్తగా కూర్చోంటోంది అని చెప్పాక ఏటా తెచ్చే సంభారాల లిస్టులో చిన్న మార్పు చేశాడు పూజారి.

    పూలు, ఆవుపాలు, గంధం, అక్షితలు ప్రతి సంవత్సరముంటాయి.

    తరుణ అగ్ని పుట్టించేందుకు రెండు పుల్లల్ని తరచి నిప్పు తెప్పించాలి. అంతేకాని హారతి కర్పూరం అగ్గిపెట్టెలు వాడకూడదు.

    హోమంలో వాడే అగ్నిహోమాగుండం ఎదుటే రావి + జమ్మి పుల్లల్ని తరచి నిప్పు తెప్పించాలి. అప్పుడే అది హోమాగ్ని అతి పవిత్రం!

    ప్రతి ఏడు ఇది జరిపిస్తుంది సుమిత్ర.

    అందుకోసం ఆమె అతిశ్రద్ధగా రెండు చెట్లను పెంచింది ఇంటిలో! రావి జమ్మి కొమ్మలను ముందుగానే తీయించి చైత్రమాసం అంతా ఎండలో వాటిని బాగా ఎండ పెట్టించింది.

    ఆరణిలోంచి అగ్ని పుట్టించి యజ్ఞం చేసే పద్ధతి అది.

    ఆ రెండు పుల్లలు కూడా పళ్ళెంతోపాటు మేళతాళాలతో భవనం నుంచి యజ్ఞవేదిక దగ్గరకు ఆమె స్వయంగా తీసుకురావాలి.

    అది ఆచారంగా నిలుపుకుంటూ వచ్చిందామె!

    ఈ సంవత్సరం వెండి పళ్ళెంలో పట్టువస్త్రం కప్పి తీసుకురావలసిన ఆ సంభరాల లిస్టులో పసుపు కుంకుమ చేర్చాడు పూజారి!

    ఆ చిన్న విషయాన్ని శ్రద్ధగా వింటూన్న సుమిత్ర గమనించింది. అది ఆమెకు పులకించిపోయే శుభవార్తగా అనిపించింది.

    ఇంతకాలం ఈ మొండిచేతుల మీదుగా జరిగిన యజ్ఞం ఈ ఏడాది గాజులు గలగలలాడే కూతురు చేతుల మీదుగా జరుగుతుంది. ఇన్నాళ్ళు లేని పసుపు కుంకుమలు మళ్ళీ ఈనాడు తన భవనం నుంచి యజ్ఞవేదిక దగ్గరకు వస్తాయి.

    స్వామి ఈ మార్పు కల్పించాడంటే తన ఇంటిలో శుభాలే జరుగుతాయని మనసారా నమ్మి ఆనంద పడిపోయిందామె.

    వెంటనే చేతికున్న బంగారు ఉంగరం తీసి అతనికి అందించింది.

    "పూజారిగారూ! సంకల్పం ఈశ్వరునిదే! అయినా శుభాన్ని ముందుగా మీ నోటివెంట పలికారు. నా ఇంటిలో నేను తలపెట్టుకున్న కళ్యాణ కార్యక్రమాలన్నింటికి ఇదే నాంది.

    "ఈ ఉంగరాన్ని మీ కోడలుకిచ్చి ధరించమనండి!" ఆమె ఉదార బుద్ధికి పూజారి ఒక్కరే కాకుండా అక్కాచెల్లెళ్ళు కూడా అబ్బురపడిపోయినారు.

    కాని సుమిత్ర దృష్టిలో ఇది తరాల అంతరాన్ని సూచించిన సుముహూర్తం అందుకు ఆమె బాగా ఎక్సయిట్ అయినట్లుగా కూడా కన్పించింది.

    ఉంగరాన్ని రొండిన దోపుకుంటున్న పూజారి వంక అదొకలా చూస్తోంది.

    ఆమని వారు యజ్ఞశాల వెలుపలకు వచ్చారు.

    యజ్ఞం జరిగే రోజు పంచేందుకు వుంచుకున్న బాంకు వారికి ఆర్డరిచ్చి వేయి తిరుపతి లడ్డూలు తెప్పించింది సుమిత్ర. అది కూడా అప్పుడే అక్కడ వారుండగానే చిన్నవ్యాన్ లో వచ్చాయి.

    సీలువేసిన బుట్టల్ని లోపల పెట్టించి ఆలయంలోకి వచ్చిందామె.

    జగదీశ్వరుని ఆలయంలో యజ్ఞశాల వాహనశాల కళ్యాణమండపం వేరు వేరుగా ఉన్నాయి! గర్భాలయం చిన్నదే అయినా ముఖమంటపం అంతరాలయాలు చాలా విశాలమయినవి.

    పంచలోహం తొడుగులతో ధ్వజస్థంభం చాలా ఎత్తుగా ఉంటుంది.

    మేఖలాలు గంటలు సూర్యకిరణాలు సోకి ధగధగలాడుతుంటాయి.

    విమానగోపురం మీది కలశాలు బంగారు పూతతో ఉన్నాయి.

    ఆలయంలో జేగంటలు తలుపులకు చిన్నగంటలు ఉన్నాయి.

    ఆముదము అవు నెయ్యి కలిసిన అఖండ దీపం తెల్లని మొగ్గలా నిలిచి వుంది. అది ముఖమంటపం దాటి అడుగుపెట్టిన వారికి ఒక విచిత్రమయిన పవిత్రమయిన వాసనను వెదజల్లుతోంది.

    "మమ్మీ! దేవాలయానికి అందరూ పవిత్రమైన భక్తిభావనతో వస్తారు కదా? మరి దేవాలయాల మీద ఇలాంటివి వుంటాయెందుకు?" అని తల్లి దగ్గరచేరి ప్రశ్నించింది ఆమని.

    ఆమె హృదయంలో ఆనందపు తెరలున్నాయి.

    "ఏమిటమ్మా నీ సందేహం?" అంది ఆమని భుజం మీద చేయి వేస్తూ.

    "దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?" అంది ఆమెని నిర్భయంగా.

    కాస్తంత చనువుయిస్తే ఇలాంటివే ఏవో మాటాడుతుంది.

    "ఆలయంలో అలాంటి మాటలు అనకూడదమ్మా!" అంది లాలింపుగా.

    "ఆలయం మీద అందరికి కన్పించేలా బొమ్మలుండవచ్చు కాని మాటాడుకుంటే తప్పా?" అని బుంగమూతి పెట్టింది ఆమని.

    "ఏమో! నాకు తెలియదు కాని ఇంతసేపూ సాక్స్ లో ఉన్నావా? చెప్పులు విప్పితే చాలదు. లోపలకు వెళ్ళేప్పుడు మేజోళ్లు కూడ విప్పాలి తీసి వానిటీలో దాచుకో" అని సలహా యిచ్చింది తల్లి.

    గునుస్తూ ఖరీదయిన మేజోళ్లువిప్పి వానిటీ బాగ్ లో దాచుకుంది ఆమని.

    గర్భాలయంలో జగదీశ్వరుని సన్నిధిలో ముగ్గురూ చేతులు కట్టి నిలిచారు. అర్చకుడు హారతి వెలిగించాడు.

    మహా భక్తి భావంతో నమకం చమకం చదివాడు.

    అష్టోత్తరం మంత్రపుష్పం ముగించాడు.

    హారతి కళ్ళకు అద్దుకుని కళ్ళు మూసుకుంది సుమిత్ర.

    "స్వామీ! తరాల వెంట సాగివచ్చే యీ చిన్న అపశకునాన్ని సవరించు, అనుగ్రహించు. సంపదలిచ్చావు. రత్నాలవంటి బిడ్డల్నిచ్చావు. గాయత్రికి మంచి మనువు కుదిరి మగ బిడ్డ కలిగితే నీపేరే పెట్టుకుంటాను. నీకు బంగారు పాదుకలు చేయిస్తాను" అని మొక్కుకుంది గాయత్రి కూడ స్వామికి మొక్కుకుంది.

    "జగదీశ్వరస్వామీ! అమ్మ కోరిన మేరకు మంచి వరుణ్ణి ప్రసాదించు! ఎక్కడికో వెళ్ళి ఏవో సుఖాలు అందుకోవాలని కోరను.

    ఇక్కడే వుండి ఆ యింటినీ ఈ ఆలయాన్ని చూచుకుంటాను

    నా మనసు తీర్చితే పానపట్టం మీద పచ్చలు పొదిగిస్తాను" అంది.

    ఆమని కూడ కాస్సేపు దిక్కులు చూచింది.

    తల్లి తన కదలికల్ని గమనిస్తోందని గ్రహించి యాంత్రికంగా చేతులు జోడించింది. కళ్ళు మూసుకుంది కనుక కోరిక వెళ్ళబెట్టుకుంది.

    "స్వామీ! నువ్వు వున్నావో లేవో నాకు తెలియదు. ఉంటే మాత్రం అమ్మ కోరికలు అన్నీ తీర్చు! నేను బాగా చదువుకుని కలెక్టర్ ని అవాలనుంది. కలెక్టర్ని అవాలంటే చాలా కృషి చేయాలి.

    నువ్వు వుంటే నాకు శక్తి తగ్గిపోకుండా కాపాడు.

    నీ మీద నమ్మకం వున్నా లేకపోయినా అమ్మ, అక్కలను సంతోష పెట్టేందుకు నీకు వెండి దీపపు సెమ్మ చేయిస్తాను" అని మ్రొక్కుకుంది. దారిలో స్వామి గురించి తల్లి అడిగింది.

    "మన కుల దైవానికి నువ్వేమిస్తానన్నావు"

    తన మ్రొక్కుబడి గురించి వివరించింది గాయత్రి,

    "నువ్వేమి అడిగావు గడుగ్గాయి పిల్లా?" అంది సుమిత్ర ఆమనితో.

    "వెండి సెమ్మా చేయిస్తానని అన్నాను."

    "మంచి మొగుడు రావాలని కోరుకోలేదా?"

    "నేను పెళ్ళి కోరలేదు మమ్మీ! కలెక్టర్ని కావాలనుకున్నాను"

    "ప్రయత్నించడంలో తప్పులేదు. కాని కోరికలు తీరకపోతే జీవితమంతా అదో వెలితి! కాని నీ ఆలోచన మంచిదే!"

    నువ్వు చదువుకుని నగరాల్లో వుంటే మన ఆస్తులను ఆజమాయిషీ చేయగలుగుతావు. గాయత్రి ఇక్కడ వుండి పల్లెలోని మన వ్యవస్థని కాపాడుతుంది. స్వామి దయతలచి ఒక్క మగ నలుసు పుట్టాడో వాడిని చూచిన తరువాత ఇహ నాకు నిశ్చింత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS