దేవదాసి వచ్చిన రెండుమూడు రోజుల వరకూ ఏం చేయలేకపోయినా మెల్లమెల్లగా ఇంటి పరిస్థితినంతా అవగాహన చేసుకొంది. ముందు మేనత్త విషయంలో శ్రద్ధ తీసుకొంది. "ఆమె అన్నం నీళ్ళ మీద కూడా ధ్యాస వదలుకొని అహోరాత్రాలు మామయ్య సేవలో నిమగ్నమైతే ఆమెమాత్రం ఎన్నాళ్ళుంది? ఆరోగ్యం దెబ్బతినదూ? అనుకొంది.
"అత్తయ్యా! మనిద్దరికి వడ్డించమని చెప్పాను సుబ్బయ్యగారితో నువ్వొస్తేగాని నేనుతినను" దేవదాసి కళ్ళలో నీళ్ళు తిప్పుకొని అనేటప్పటికి ఆ పిల్ల భోంచేయదన్న భయంతో మరి లేవక తప్పేదికాదు కృష్ణవేణికి.
ఒకనాటి సాయంత్రం ఇనప్పెట్టె తాళం చేతులు కూడా మేనకోడలి చేతిలోపెట్టి "ఇంటి బాధ్యతనంతా నీకప్పగిస్తున్నాను తల్లీ ఇంట్లో సామాను అదీ జాగ్రత్త" అని చెప్పింది కృష్ణవేణి.
బావగారికి ఇంకానయంకాలేదని తెలిసి కృష్ణవేణి తమ్ముడు సూర్యదేవులు వచ్చారు.
నాటు వైద్యాలవల్ల లాభంలేదని చెప్పి, పట్నంనుండి ఇంగ్లీషు డాక్టరును తీసుకువచ్చి చూపించారు. డాక్టరుకు ఫీజు ఏర్పాటుచేసి రెండురోజులకోసారి వచ్చి చూచిపోయేట్లు చెప్పి వెళ్ళిపోయారాయన.
డాక్టరుగారి వైద్యంవల్ల కాలునొప్పి కాస్త తగ్గి గుణం కనిపించినా రాత్రివేళల్లో చలిజ్వరం తీసుకొని రావుగారిని మంచం వదలకుండా చేసింది. డాక్టరుగారు కారులో రెండు రోజులకోసారి వచ్చి చూస్తూ వైద్యం సాగిస్తున్నారు.
అయిదారు రోజుల్లో దేవదాసికి ఒక దినచర్య ఏర్పడింది. వంట వాడికి వాడు చేయవలసిన వంటకాలు పురమాయించడం దగ్గరనుండి అన్నీఅతిశ్రద్ధతో నిర్వహిస్తూంది. నౌకర్లు ఏపనిచేసినా చిన్నమ్మగారి కన్నొకటి తమమీద ఉందన్న సంగతి వాళ్ళకు తెలిసేట్లు చేసింది. నౌకర్లు చేసే ఏ ఒక్క చిన్న పొరపాటుకు కూడా ఉపేక్షించదు దేవదాసి. తీవ్రదండనకు గురిజేస్తుంది. యజమాని కొన్నివిషయాల్లో ఉదారంగా ప్రవర్తించినా, యజమాని ప్రతినిధి మాత్రం అన్నింటా కఠినంగా ఉండడం కష్టమైంది వాళ్లకు తమ వస్తువును స్వంతదారు ఏం చేసుకొన్నా ఫర్వాలేదు. ఆవస్తువు బాధ్యత తీసుకొన్న వాళ్ళు మంచీ, చెడు చేసే హక్కు లేదుకదా? దేవదాసీ బాధ్యత సక్రమంగా నెరవేర్చే మనిషి మరి!
చిన్నమ్మగారి ప్రతాపం తెలిసిన గోవిందస్వామి మొదలయిన నౌకర్లు ఎదుట అనేచనువూ, సాహసం లేకపోయినా చాటుగా అనుకోసాగారు. "దొరసానికి ఇలాంటి కోడలొస్తేగాని ఈ ఇంటిపరువు వైభవాలు నిలబడవు. ఆ కొడుకు ఏదీ పట్టించుకోని బుద్ధావతారమాయే! కోడలయినా ఈ ఇల్లు నిలబెడుతుంది" అని.
మేడమీద భార్గవరామ్ గది తాళంవేసి ఉంది.
ఒకరోజు మేనత్త దగ్గరికి వెళ్ళి అడిగింది దేవదాసి. "అత్తయ్యా, బావగది తాళం చేతులివ్వు!"
"ఎందుకమ్మా!"
"ఊరికే చూస్తాను."
"ఏముందక్కడ? వాడి సన్యాసావతారానికి సంబంధించినవి తప్ప!" ఒక నిట్టూర్పు విడిచి నా గదిలో బొట్టుపెట్టెలో ఉంది. రింగుకు ఒకే తాళం చెవి ఉంటుంది చూడు - అది!" అని చెప్పింది కృష్ణవేణి.
మూడేళ్ళనాడు చూచిన మేనబావ రూపురేఖలు అంత స్పష్టంగా గుర్తులేవు దేవదాసికి. అతడి స్వభావంతో కూడా ఆమెకంతగా పరిచయంలేదు. అప్పుడు పదమూడేళ్ళ బాలిక! ఇప్పుడిప్పుడే లోకజ్ఞానం, హృదయ వికాసం కలుగుతున్నాయామెలో. ఇప్పుడు ఎవరునోటి వెంట చూచినా భార్గవరామ్ సన్యాసిగా. విరాగిగా పరిచయమౌతున్నాడు దేవదాసికి. కారణం ఏదైనా అతడి విషయం ఆమెకు కుతూహలంగా ఆకర్షణీయంగా ఉంది!
తాళంతీసి గదిలో అడుగు పెట్టింది దేవదాసి. భార్గవరామ్ వెళ్ళినప్పటినుండి ఆ గది వాడకంలేకున్నా తల్లి అప్పుడప్పుడూ గది చిమ్మిస్తూ దుమ్ము దులిపిస్తూ ఉంటుంది కనుక గది శుభ్రంగా, తొక్కుడూ వాడకం లేక ప్రశాంతంగానూ అనిపించింది దేవదాసికి.
భార్గవరామ్ ఆ గదినే పడకగదిగా, డ్రాయింగ్ రూమ్ గా ఉపయోగించేవాడు. అతనికి సంబంధించిన వస్తువులన్నీ ఆ గదిలోనే ఉంటాయి. ఒక పక్క టేబిల్, కుర్చీ ఉన్నాయి. టేబిల్ మీద భార్గవ్ రామ్ ఫోటో ఒకటుంది. చక్కని ఫ్రేమ్ లో బిగింపబడి గోడకు బుద్ధభగవానుని చిత్రపటం ఒకటి తగిలించి ఉంది. ఓ రెండు ఆల్మరాలు, ఓ ట్రంకు పెట్టెకూడా ఉన్నాయి.
ఓ అల్మరాలో పుస్తకాలు నిండి వున్నాయి. ఒక్కొక్క పుస్తకమే చేతికి తీసుకొని చూచింది దేవదాసి. ప్రతి పుస్తకంలోనూ చదువుతూ, చదువుతూనే ఆపివేసినట్లు కాగితం మడిచిన గుర్తులూ, పుల్లలు పెట్టిన గుర్తులూ ఉన్నాయి. అవన్నీ మహనీయుల జీవిత చరిత్రలూ, ఉత్తమ వేదాంత గ్రంధాతానూ, క్రింది అరలో భార్గవరామ్ వ్రాసుకొన్న డైరీలు కూడా పేర్చి ఉన్నాయి వరుసగా.
అప్పటికే సంధ్యపడిపోయి గదిలో చీకటి అలుముకొంది మరునాడు మధ్యాహ్నం తీరికగా వచ్చి కూర్చోవాలని నిశ్చయించుకొని గదికి తాళంవేసి క్రిందికి దిగింది దేవదాసి. తనకిష్టమైన పుస్తకం చేతికి తీసుకొని ముఖచిత్రం చూచినట్లుగా ఉంది ఆమెకు, ఆనాడు భార్గవరామ్ గదిని దర్శించిన అనుభవం! లోపల ఒక్కొక్కటే జాగ్రత్తగా తిరగవేసి సారాంశం అవగతం చేసుకోవాలన్న తపనతోటే ఆమె ఆ రాత్రి నిద్రకుపక్రమించింది.
