Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 7

    "అతనికి జుట్టు పీక్కునే టైం అయినట్టుందే! త్వరగా పెరుగు వడ్డించు" అంటాడు శంభులింగం ఆవిడతో.

    శంభులింగం ఆఫీసునుండి రాగానే ఆ యింట్లో జరిగే సీనుమాత్రం కళ్లున్న ప్రతివాడూ చూడాల్సిందే! అసలు కళ్లున్నదే అందుకు అనిపిస్తుంది అప్పుడు.

    శంభులింగం  ఆఫీసునుండి రాగానే "రాణీ!" అంటూ ఓ గావుకేక పెడతాడు. రాణి రయ్యిమని తుపాకిగుండులా దూసుకుని వచ్చి అతనిమీద పడి అతన్ని క్రింద పడేసి, ముఖాన్ని ఓ అయిదు నిమిషాల పాటు ఎడాపెడా నాకేస్తుంది. మధ్య మధ్య బుగ్గలూ, చేతివేళ్ళూ, వీలుంటే మెడా "గుర్... గుర్... మంటూ కొరుకుతుంది సరసాలాడుతూ.

    "దీనికి ఆయనంటే మహాప్రేమ నాయనా, ఆయన ఇంటికి రాగానే అలా ముద్దు పెట్టుకోందే (నాకనిదే) వదలదు" అంటుంది వెంకుమాంబ.

    రాణి ముద్దులతో అలసిపోయిన శంభులింగం నేలమీద నుండి నెమ్మదిగా లేచి బాత్రూముకి వెళ్తాడు.

    వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా రాణి గురించి తప్ప వేరే విషయాలు మాట్లాడరు.

    "ఇది క్రాస్ బీడ్ నాయనా. పామరిస్ కి మరో మరియమ్మకీ పుట్టింది. దీని తల్లి ఫలానా యింట్లో పెరుగుతుంది. తండ్రి ఫలానా యింట్లో మొరుగుతున్నాడు" అంటూ సోది చెప్తుంది ఆవిడ.

    అతనేమో కుక్కలూ వాటిరకాలూ, ఏ కుక్క "కుయ్ కుయ్" అంటుందో, ఏ కుక్క "భౌభౌ" అంటుందో తదితర విషయాలన్నీ చెప్పి నన్ను చావగొట్టేస్తాడు. అంతకంటే కొరత వేయించుకుంటే సుఖంగా హాయిగా ఉంటుంది నా దృష్టలో.

    నేను పొరబాట్న ఎంతో గొప్పవాడిని అయిపోయి, ఏ పత్రికవాళ్ళో ఇంటర్వ్యూకని వచ్చి "మీ జీవితంలో మరుపురాని రోజేది?" అని అడిగితే "అక్టోబరు నాలుగోతేదీ మంగళవారం, సంవత్సరం పందొమ్మిది వందల ఎనభై మూడని" ఠకీమని సమాధానం చెప్తాను.

    అలా ఎందుకంటారా?

    ఆ రోజు మంగళవారం-

    అక్టోబరు నాలుగు పందొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం.

    సమయం ఉదయం ఎనిమిది గంటలు కావొస్తుంది.

    నా గదిలోకి శంభులింగం వచ్చాడు.

    "నీతో చిన్న పని పడిందోయ్" అన్నాడు.

                                    

    "ఏమిటండీ?"

    "మరేంలేదు.... ఈ రోజు ఆఫీసుకు కాజువల్ లీపు పెట్టెయ్"

    "ఎందుకూ?" ఆశ్చర్యంగా చూశాను. రాణికూడ గదిలోకి తోకూపు కుంటూ వచ్చింది.

    "ఇదిగో... ఈ పిచ్చిముండకోడమే" అన్నాడు దాని తల నిమురుతూ.

    రాణికి హుషారుపుట్టి ఎగిరి నా భుజాల మీద కూర్చుంది.

    "చూశావా?... దానికి నువ్వు బాగా అలవాటు అయ్యావ్. అందుకనే దాన్ని నీ దగ్గర వదిలిపెట్టి వెళ్లాలని అనుకుంటున్నాం" అన్నాడు.

    "ఎక్కడికి?"

    అప్పటికే నా గుండె పొట్టలోకి జారి పోయింది.

    "మరేంలేదోయ్. నా బాల్య స్నేహితుడి కూతురికి పెళ్ళిసంబంధం కుదిరింది"

    "కూతురంటే మన రాణీలాగనే నాండీ?" సందేహంగా అడిగాను.

    "కిస కిస కిస... భలే జోక్ చేస్తావయ్యా. కూతురంటే కూతురే - స్వయంగా వాళ్ళ కన్నకూతురు.ఈ వేళ మధ్యాహ్నం తాంబూలాలు పుచ్చుకుంటున్నారు. నేనే ఈ పెళ్ళికి మధ్యవర్తిని. మేమిద్దరమూ వెళ్ళక తప్పదు.

    "అలాగే వెళ్ళండి"

    రాణి ఇంకా నా భుజలమీదే ఉంది.

    "వాళ్ళది పొరుగూరు. కారులో గంటన్నర ప్రయాణం. పదిగంటలకు బయలుదేరి వెళ్తాం, తాంబూలాలు పుచ్చు కోవడం అయిన తరువాత కాస్సేపు ఆ మాటా ఈమాట మాట్లాడుకుని సాయంత్రం నాలుగుకి బయలుదేరి ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాం. అంతదాకా నువ్వు ఆఫీసుకు శలవుపెట్టి రాణీని చూసుకోవాలి."

    "రాణిని మీకూడా తీసుకెళ్ళొచ్చుగా?" అన్నాను నా భుజంమీద నుండి నెత్తిమీదికి ఎక్కాలని ప్రయత్నిస్తున్న రాణిని క్రిందికి లాగుతూ.

    "అబ్బే... నా స్నేహితుడు శ్రోత్రియ బ్రహ్మణుడు. వాళ్ళకి ఈ కుక్కలూ గట్రా పడవు. మడీ గిడీ ఏడుస్తాయ్ వాళ్ళింటి దగ్గర. దీన్ని తీసుకెళ్తే వాళ్ల మడిని కెలికేసి నానా భీభత్సం చేస్తుంది"

                                    

     రాణి గోళ్ళతో నా మెడ గీరసాగింది , దీంతో ప్రొద్దుననుండి సాయంత్రం దాకా నేను వేగగలనా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS