Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 6

    హఠాత్తుగా రాణీ ఆవిడ ఒళ్లోంచి క్రిందికి దూకి మా దగ్గరికి వచ్చి మా ఇద్దరి కళ్ళూ వాసన చూసి మా సోఫా చుట్టూ నాలుగయిదు సార్లు ప్రదక్షిణం చేసి తోకూపింది.

    "రాణికి మీరు నచ్చారు... గది మీకు అద్దెకు ఇవ్వొచ్చు" అందావిడ సంతోషంగా.

    "రాణికి నచ్చకపోతే ఏం చేస్తుందండీ" కుతూహలం పట్టలేక ఆవిడని అడిగాను.

    "పిక్క పట్టుకుని కండ ఊడేలా లాగుతుంది బాబూ... ఇదివర్లో అద్దెకు కావాలని వచ్చిన దాదాపు ఓ పదిమంది దీనిచేత కండలు పీకించుకున్నారు.

     చంచల్రావు చటుక్కున సోఫాపైకి కాళ్ళు ముడిచేసుకున్నాడు ఎందుకైనా మంచిది రాణి మనసేమైనా మార్చు కుంటుందేమోనని.

    మొత్తానికి నాకు గది అద్దెకు దొరికింది. రెండునెలల అద్దె ఎడ్వాన్సుగా ఇచ్చి గదిలోకి చేరాను.

    ఇదిగో... సరిగా ఇక్కడినుంచే అసలు కథ ప్రారంభం అయింది.

    బహుశా ఈ కుక్కలూ, పిల్లలూ గట్రా పెంచేవారికి ఎదుటివారి అవస్థ గానీ బాధగానీ అర్థం కావనుకుంటా. వారికీ పెంపుడజంతువులంటే ఉన్న ఇష్టం ఎదుటి వారిక్కూడా ఉంటుందని ఎందుకను కోవాలి?

    ఇష్టం మాట అటుంచి నాకు కుక్కలంటేనే అసహ్యం. మరి వీళ్ళందరూ వాటిని ఒళ్ళోకి తీసుకోవడమే కాకుండా ముద్దులు కూడా ఎలా పెట్టేసుకుంటారో నాకు అర్థంకాని విషయం.

    నేను నా గదిలో వంట చేసుకుంటూ ఉంటే రాణి వచ్చేస్తుంది. దాని వెనకాలే వెంకుమాంబ కూడా వచ్చేస్తుంది. ఇంత సేపూ మా ఇంటి ఓనర్ల పేరు చెప్పలేదు కదూ?

    వెంకుమాంబ అంటే ఇంటావిడ. ఆవిడ భర్తపేరు శంభులింగం.

    సరే... తుర్రుమని రాణి వస్తుందా! అది ఊరికే ఉండదు. అక్కడ ఉన్న గిన్నెల్లో మూతి పెడ్తుంది.

      "నీ కూరల వాసన దీనికి నచ్చి నట్టుందబ్బాయ్... మాటి మాటికి వచ్చి నీ గిన్నెలన్నీ చక్కబెడ్తుంది" అంటూ                
 ఆనందంగా నవ్వుతుంది.
   

                                       

   నాకు మాత్రం పరమచిరెత్తుకొస్తుంది. ఈ వంటా పెంటా మానేసి మెస్సుకి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది.ఎప్పుడైనా నేను శంభులింగంతో హాల్లో మాట్లాడుతుంటే చెంగున ఓ గెంతు గెంతి నా ఒళ్ళో కూర్చుంటుంది. నాకు ముళ్ళమీద కూర్చోబెట్టి నట్టుంటుంది.

    "ఛీ...ఛీ" అంటే వాళ్ళకి ఎక్కడ కోపం వస్తుందోనని భయం.

                                          

    "తప్పమ్మా రాణీ... ఒళ్లోంచి దిగమ్మా, ప్లీజ్ రాణిమ్మా దిగమ్మా... దిగమ్మా" అంటూ దాన్ని బ్రతిమలాడుతాను.

    కుక్కకైనా జాలి ఉంటుందేమోగాని ఈ మనుషులకి అస్సలు జాలి  అనేది ఏ కోశానా ఉండదు.

    అది నా ఒళ్లోంచి దిగాలని ప్రయత్నించి నప్పుడు "ఏయ్ రాణి!... సిట్ దేర్! ఉండనీవోయ్... పిచ్చిముండకి నువ్వు బాగా నచ్చినట్టున్నావ్" అంటాడు శంభులింగం.

    వాళ్ళయింట్లో ఒక మనిషిగా బాగా కలిసి పోవడంవల్ల అప్పడప్పుడూ ఆదివారాలు నన్ను వాళ్ళింట్లోనే భోజనం చేయడం అంటే నాకు నరకం. అంటే వెంకుమాంబ వంట బావుండదని కాదు. ఆవిడ వంటకేం, దివ్యంగా ఉంటుంది. ఎటొచ్చి అక్కడ రాణి చేసే హడావిడే నాకు సహించదు.
 

      భోజనం చేస్తుంటే చెంగున ఎగిరొచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. దాన్ని బ్రతిమాలో బామాలో కిందికి దించితే ఎదురుగా కూర్చుని నాలుక ఓ అరగజం మేరకు బయటికిపెట్టి చొంగ కారుస్తుంటుంది. నాకు ఆ చొంగ చూస్తుంటే వికారం పుడ్తుంది. గొంతులోకి వెళ్ళిన ముద్ద మళ్ళీ నోట్లోకి వచ్చేస్తుంది. ఒక్కొక్కప్పుడు మూతి ముందుకు పెట్టి నా కంచం వాసన చూస్తుంది. దాని చొంగ కంచంలో ఎక్కడ కారిపోతుందోనని భయం.

    "చొంగ కారుస్తుండండీ...హిహిహి..." అంటాను సంతోషాన్ని నటిస్తూ.

    "నీ పళ్ళెంలో ఏమీ కార్చడం లేదుకదా? అయినా తప్పేమిటి? రేప్పొద్దున్న నీ పెళ్ళాం ఎంగిలి తినవూ?" అంటుంది వెంకుమాంబ రాణి నోటికి మాంసం ముక్కని అందించి అది కొరగ్గా మిగిలిన ముక్కని నోట్లో వేసుకుంటూ.

    "కిస కిస కిస...." అంటూ నవ్వుతాడు శంభులింగం. అతను నవ్వితే వంద ఎలుకలు ఒక్కసారిగా అరిచినట్లు ఉంటుంది.

    గుండెల్లో చాలా గాబరా పుట్టేస్తుంది ఆ సమయంలో.

                                   

   ఎదుటి మనిషి ముఖంలో ఇబ్బంది తాలూకు భావప్రకటన గ్రహించే సాటి హృదయం కుక్కలను పెంచేవారికి ఉండదా..." అనుకుంటూ నేను ఆ ఎంగిలి చేత్తోనే జుట్టు పీకేసుకుంటాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS