Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 6

    "నేను ఊదుతాను కానీ... అది సన్నాయి కాదు! బాకా!... సూర్యబాబురాముడి తర్వాత నేను ఆ బాకాని మంత్రిశేఖరరెడ్డి ముందు ఊది మరో ఎకరం హైటెక్ సిటీలో కొట్టేశా.... హహహా..." ఆనందంతో పొట్టని ఎగరేస్తూ నవ్వాడు తొట్టిపొట్టి శర్మ.
    "ఇప్పుడు చెప్పండి... పదివేలు నాకేమైనా అనుతుందా?"
    "నిజమేననుకోండీ... ఆమెకి మీరంటే చాలా అభిమానం... ఆ అభిమానంతో ప్రోగ్రాం పెట్టిస్తున్నారు మరి... అలాంటి ప్రోగ్రాంకి కోటి రూపాయలు ఇవ్వరు కదా?...." నీళ్లు నముల్తూ అన్నాడు రంగనాధం.
    "బాగానే అన్నారండీ... ఓ ప్రోగ్రాంకి అంత ఇస్తారని నేను ఎలా అనుకుంటానూ... పదికాదు గానీ ... ఇరవై వేలైతే బాగుంటుందేమో?!... మరి. అసలే నేను సరస్వతీ పుత్రుడ్ని కూడానూ!!..." అన్నాడు తొట్టిపొట్టి శర్మ బుంగమూతి పెడ్తూ.
    సర్లేండి.... ఆమెకి ఫోన్ చేసి నేను ఒప్పిస్తాను గానీ... మీరు మరీ అంత బుంగమూతి పెట్టకండి... మీ మూతి మరీ అంత ముందుకి పెడ్తే అచ్చం జాంబవంతుడిలా ఉన్నారు... హిహిహి..."
    "అలాగైతే ఆమెని ప్రోగ్రాం అరేంజ్ చేస్కోమని చెప్పండి... ఇంతకీ ఆమె పేరు?"
    "సీత!... ఆమెకి మీరంటే చచ్చేంత అభిమానం!! అందుచేత ఏ హోటల్ రూమో బుక్ చేయకుండా మీ స్టే కూడా వాళ్ళింట్లోనే ఎరేంజ్ చేస్తానని అన్నారు!"
    "ఓ... మరీ మంచిది!" అన్నాడు తొట్టిపొట్టి శర్మ.
    జూలై నెల రానే వచ్చింది.
    తొట్టిపొట్టి శర్మ తెలుగు సభలు అటెండ్ అయ్యాడు... అక్కడ స్టేజిమీద కవిత్వం చెప్పీ... స్పీచిలు ఇచ్చీ అందరూ ఆహా.... ఓహో అనేలా చేశాడు.
    ఆ సభలకి సీత కూడా వచ్చింది... తొట్టిపొట్టి శర్మ కవిత్వం విని ఆమె పరవశించి పోయింది. అలాంటి తొట్టిపొట్టి శర్మ తన ఇంటికి ప్రత్యేక అతిథిగా వస్తున్నాడు.
    తొట్టిపొట్టి శర్మ స్టేజి దిగగానే సీత గబగబా ఆయన దగ్గరికి వెళ్లి తనని తాను ఆయనకి పరిచయం చేస్కుంది.
    సీతని చూసి తొట్టిపొట్టి శర్మ గుటకలు మింగి ఆనందంగా నవ్వాడు.
    తెలుగు సభలు కాగానే సీత తొట్టిపొట్టి శర్మని తన కూడా వాళ్ల ఊరికి తీస్కెళ్ళి మొగుడు రాజుని పరిచయం చేసింది.
    "మరి పిల్లలు?...." అని అడిగాడు తొట్టిపొట్టి శర్మ.
    "లేరండీ.... దేవుడు మమ్మల్ని ఈ విషయంలో ఇంకా కరుణించలేదు..." బాధగా అంది సీత.
    సీత తొట్టిపొట్టి శర్మ అవధానం ప్రోగ్రాంని నాలుగురోజుల తర్వాత ఎరేంజ్ చేసింది.
    "ఈ నాలుగు రోజులూ మీరు మాకు అతిధి... మీకు ఏం కావాలన్నా నాకు నిర్మొహమాటంగా చెప్పండి... నేను మీకు రుచిగా అన్నీ వండిపెడ్తా.... మీరంటే నాకు అంత అభిమానం!"" అంది సీత, తొట్టిపొట్టి శర్మతో.
    తొట్టిపొట్టి శర్మ సంతోషంతో "హిహిహి..." అని నవ్వాడు.
    ఆ మర్నాడు...
    రాజు ఆఫీసుకి వెళ్తూ "సీతా...తొట్టిపొట్టి శర్మకి బోరు కొట్టకుండా మంచి కంపెనీ ఇవ్వు... కావాలంటే షాపింగ్ కి తీస్కెళ్లు!" అని చెప్పి వెళ్లిపోయాడు.
    మధ్యాహ్నం భోజనానికి రమ్మని చెప్పడానికి తొట్టిపొట్టి శర్మ గదికి వెళ్లింది సీత.
    "రా...సీతా...రా!... నీకోసమే ఎదురు చూస్తున్నా..." అన్నాడు తొట్టిపొట్టి శర్మ చాలా చనువుగా.
    సడెన్ గా అతను చనువుగా మాట్లాడేసరికి సీత ఉలిక్కిపడింది.
    "ఏంటి సీతా ఆలోచిస్తున్నావ్?... రా... కూర్చో..." మంచం మీద తన ప్రక్కన చోటు చూపిస్తూ అన్నాడు తొట్టిపొట్టి శర్మ.
    "ఏంటి మీరంటున్నది?" కాస్త సీరియస్ గా అంది సీత.
    "ఏంటి సీతా అంతకోపం?... నీకు నేనంటే యిష్టం... నాకు కూడా నిన్ను కరుణించాలని ఉంది!"
    "కరుణించడమా?... అదేంటి?" సీరియస్ గానే చూస్తూ అంది సీత.
    "అదే... నీకు పిల్లలు లేరు కదా?... నాతో కలువ్... నీకు సరస్వతీ పుత్రులు పుడ్తారు!..."
    "అసలు నా గురించి మీరేం అనుకుంటున్నారు!" కోపంగా అరుస్తూ అంది సీత.
    "ఇందులో తప్పేంలేదు సీత... నేను సరస్వతీ ఉపాసకుడ్ని... నన్ను కలిస్తే తప్పులేదు. పూర్వకాలంలో పెళ్లయిన తర్వాత నాలాంటి వాడితోనే గర్భాదానం చేయించేవారు!... ఇదేం తప్పుకాదు... రా..." అంటూ మంచం మీది నుండి లేచి సీతవైపు అడుగులు వేశాడు.
    సీత వెంటనే కాలికున్న చెప్పు తీసి తొట్టిపొట్టి శర్మ చెంపలు ఛెళ్లు ఛెళ్లుమని వాయించింది.
    ఆ రోజే తొట్టిపొట్టి శర్మ ఇండియాకి పరుగుతీశాడు.
    సీత ఆ విషయం భర్త రాజుకి తప్ప ఎవరికీ చెప్పలేదు... ఆ విషయం ఆ ముగ్గురి మధ్యే ఉంది...
    అదే కాదు... తొట్టిపొట్టి శర్మ లోగడ ఇలానే ఇండియాలోనూ అమెరికాలోనూ సింగపూర్ లోనూ వేరే ఆడాళ్ళతో ప్రవర్తించాడు... వాళ్లు కూడా అతని ప్రవర్తన గురించి ఎవరికీ చెప్పలేదు తమ పరువే పోతుందనే భయంతో...
    ఇన్ని చేసే ఈ సరస్వతీ పుత్రుడికి మన గవర్నమెంటు కోట్ల విలువ చేసే భూమినీ ఇస్తుంది... బోల్డన్ని అవార్డులూ ఇస్తుంది.
    ఇంత మంచి గవర్నమెంట్ కి అందరూ జేజేలు చెప్పండర్రా...
                                                                               *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS