Previous Page Next Page 
దేవదాసు పేజి 6

    "అక్కడే పైన వున్న గదిలో వుంది."
    దేవదాసు పైకి వెళ్ళి చూశాడు. పార్వతి సంద దీపం వెలిగిస్తూ వుంది.
    "పత్తో!" అని పిలిచాడు.
    మొదట పార్వతి ఆశ్చర్యపోయింది. తర్వాత నమస్కారం చేసి ప్రక్కనే కొంచెం ఎడంగా నిలబడింది.
    "ఇదేమిటి ఇలా జరుగుతున్నది పత్తో?"
    "ఈ విషయం చెప్పవలసిన అవసరం లేదు. అంచేతనే పార్వతి మౌనం వహించింది. తరువాత దేవదాసు సిగ్గుపడి "వెళ్తున్నాను. సాయంకాలమయింది. అందులో ఒంట్లో బాగాలేదు!" అన్నాడు.
    దేవదాసు వెళ్ళిపోయాడు.

                                    5
    పార్వతి పదమూడో సంవత్సరం వచ్చిందని వాళ్ళ నాయనమ్మ చెప్పుతూ వుంది. ఈ వయసులో శారీరక సౌదర్యం అకస్మాత్తుగా ఎక్కడ నుంచో వచ్చి కిశోరావస్థలో వున్న బాలిక యొక్క శరీరాన్నంతటినీ ఆక్రమిస్తుంది. తమ చిన్న కన్య యిప్పుడు పెద్దదయిపోయిందని ఆత్మీయులైన బంధువులందరూ ఒకరోజు హఠాత్తుగా ఆశ్చర్యపోయి చూస్తూ వుంటారు. అప్పుడు ఆమె వివాహం కోసం ఆరాటపడుతూ వుంటారు, చక్రవర్తి-మహాశయుని ఇంట్లో అనేక రోజుల నుంచి ఈ విషయాలన్నింటిని గురించి చర్చ జరుగుతూనే వుంది. తల్లి ఇందుకోసం చాలా విచారపడుతూ వుంది. ఇప్పుడు పత్తోను ఎక్కువకాలం అవివాహితగా వుంచడం ఉచితం కాదని, ఆమె పదే పదే భర్తను హెచ్చరిస్తూనే వుంది. వాళ్ళు అంత గొప్ప వాళ్ళేమీ కారు. వాళ్ళకు ఒకే ఒక నమ్మకం వుంది. అదేమిటంటే కన్య అద్వితీయమైన సుందరి. ప్రపంచంలో రూపం అనే దానికి గౌరవం అనేది వున్నట్లయితే పార్వతి వివాహం కోసం ఎక్కువగా విచారించవలసిన పని వుండదు. మరో విషయం కూడా యిక్కడే చెప్పడం ఉచితంగా వుంటుంది. నీలకంఠ చక్రవర్తి కుటుంబంలో ఆడపిల్ల పెళ్ళికోసం ఈనాటి వరకూ ప్రత్యేకంగా విచారించవలసిన అవసరం యేమీ కలగలేదు. అయితే మగపిల్లాడి పెళ్ళి కోసం తప్పకుండా కొంత విచారించవలసిన శ్రమ కలుగుతుంది. కన్య వివాహంలో కన్యాపక్షం వాళ్ళే కట్నం తీసుకుంటారు. కొడుకు వివాహంలో కట్నం యిచ్చి కన్యను ఇంటికి తీసికొని వస్తుంటారు. ఇదీ వాళ్ళ సాంప్రదాయం. అయితే నీలకంఠ చక్రవర్తి స్వయంగా యీ ఆచారాన్ని చాలా అసహ్యించుకునేవారు. కన్యను అమ్మి ధనం సంపాదించాలనే కోరిక ఆయనకు ఏమాత్రమూ లేదు. పార్వతి తల్లికి యీ విషయం బాగా తెలుసు. అందుచేతనే కన్య వివాహం కోసం భర్త అప్పుడప్పుడూ హెచ్చరిస్తూ వుండేది. ఆరంభం నుంచీ పార్వతి తల్లి హృదయంలో ఏదో విధంగా దేవదాసుతో తన కన్య పార్వతి వివాహం జరగాలనే అభిలాష ఉండేది. తన ఆశ దురాశ మాత్రమేనని ఆమె కలలో గూడా విశ్వసించేది కాదు. దేవదాసు గట్టిగా పట్టుబడితే ఏదో ఒక మార్గం దొరుకుతుందని ఆమె ఆలోచిస్తూ వుండేది. ఈ విషయం ఆలోచించే కావచ్చు నీలకంఠ చక్రవర్తి తల్లి దేవదాసు తల్లితో ఈ విధంగా చర్చ ప్రారంభించింది_
"ఆహా! కోడలా, దేవదాసుకూ, నా పత్తోకూ ఉన్నటువంటి స్నేహం మరెక్కడా వెతికినా కన్పించదు."
    "అవును, స్నేహం ఎందుకు వుండదు పిన్నీ? వాళ్ళిద్దరూ చిన్న తనం నుంచీ అన్నాచెల్లెళ్ళలాగా పెరిగి ఇంత పెద్దవాళ్ళయ్యారు." అన్నది దేవదాసు తల్లి.
    "అవును కోడలా! అది నాకూ తెలుసు. చూడరాదూ, దేవదాసు కలకత్తా వెళ్ళినప్పుడు పత్తో ఎనిమిది సంవత్సరాల పిల్ల. కాని ఆ వయసులోనే అతణ్ణి గురించి దిగులు పడుతూ పడుతూ చిక్కి సగం అయిపోయింది. దేవదాసు ఉత్తరం ఎప్పుడయినా ఒక్కటి వస్తే అది దానిని చాలా మక్కువతో రేయింబవళ్ళు అనేకసార్లు చదువుకుంటూ వుండేది. ఈ విషయం మాకు బాగా తెలుసు."
    దేవదాసు తల్లి మనస్సులోనే అంతా అర్ధం చేసుకొన్నది. కొద్దిగా చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వులో ఎన్నో దాగివున్న భావాలు కూర్చి వున్నాయి. అది నేను చెప్పలేను. అయితే వేదన చాలా వుంది. ఆమెకు అన్ని విషయాలూ తెలుసు. దానికి తోడు పార్వతిని ప్రేమిస్తున్నది కూడా. అయితే ఆమె కన్యలను అమ్ముకొనేవాళ్ళ, కొనుక్కొనేవాళ్ళ కుటుంబానికి చెందిన బాలిక. పైగా వారి కుటుంబం ఇంటి పక్కనే వుంది. అంచేత అటువంటి కుటుంబంతో వివాహ సంబంధం సరైనది కాదు. "పిన్నీ, ఆయనగారు ఇంత చిన్న వయసులో పిల్లవాడి పెళ్ళి చేయరు. ముఖ్యంగా చదువుకొనే రోజుల్లో. అందుకనే పెద్ద పిల్లవాడు ద్విజదాసుకు చిన్నతనంలో పెళ్ళి చేయడం వలన చాలా హాని జరిగిందనీ, అమాంతంగా చదువు ఆగిపోయిందనీ ఆయనగారు నాతో అంటూ వుంటారు" అన్నది.
    ఈ మాట విని పార్వతి నాయనమ్మ ముఖంలో పూర్తిగా రంగుమారిపోయింది. అయినా అంటూ వుంది__
"ఇది నాకూ తెలుసు కోడలా! పత్తో ఇప్పుడు పెద్దదై పోయింది. నీకు మాత్రం తెలియదా! ఆమె శరీర నిర్మాణం గూడా పొడవుగా, దృడంగా వుంటుంది. ఇందువల్ల ఒకవేళ నారాయణ ఈ విషయాన్ని...."
    దేవదాసు తల్లి మాటకు అడ్డం వచ్చి__"కాదు పిన్నీ, నేను ఈ విషయం ఆయనతో చెప్పలేను. నీవే చెప్పు! ఈ సమయంలో నేను ఏ ముఖం పెట్టుకొని ఆయనతో ఈ మాట చెప్పేది?" అన్నది.
    ఈ విషయం ఇక్కడే సమాప్తమయ్యింది. అయితే ఆడవాళ్ల కడుపులో మాట దాగుతుందా? భర్త బోజనానికి వచ్చినప్పుడే దేవదాసు తల్లి ఆయనతో "పార్వతి నాయనమ్మ, పార్వతి పెళ్ళి సంగతి మాట్లాడుతూ వుంది" అని చెప్పింది.
    భర్త వంచిన ముఖం పైకెత్తి "అవును, ఇప్పుడు పార్వతికి పెళ్ళీడు వచ్చింది. ఇప్పుడు ఆమె పెళ్ళి చేయడమే ఉచితంగా వుంటుంది" అన్నాడు.
    "ఈ సంగతే ఈ రోజు ముచ్చటిస్తూ వచ్చింది. దేవదాసుతో పార్వతి పెళ్ళి...."
    "నీవు ఏమన్నావు?" అన్నాడు భర్త కనుబొమ్మలు విరుస్తూ.
    "నేను ఏమంటాను? ఇద్దరిలో చాలా స్నేహం వుంది. అయితే అంత మాత్రంచేత కన్యలను అమ్ముకొని, కన్యలను కొనుక్కొనే నీలకంఠ చక్రవర్తి వంశంలోని పిల్లను కోడలుగా తెచ్చుకుంటానా? పైగా ఇంటిప్రక్క ఇల్లు. ఛీ!ఛీ!"
    భర్త సంతృప్తి పడి "బాగుంది, నేను మాత్రం వంశాన్ని నవ్వుల పాలు చేస్తానా? నీవు యిటువంటి మాటలు పట్టించుకోవద్దు" అన్నాడు.
    "లేదు, నేను ఈ విషయాన్ని అసలు పట్టించుకోను. కానీ నీవు కూడా ఈ విషయం మరచిపోవద్దు" అన్నది గృహిణి పొడిగా నవ్వుతూ.
    భర్త అన్నం ముద్ద చేతిలోకి తీసుకుంటూ గాంభీర్యంగా "ఇలా అయితే ఈ పెద్ద జమీందారీ అంతా ఎప్పుడో ఊడ్చుకుపోయేది" అన్నాడు.
    పెళ్ళి ప్రస్తావనను అంగీకరించలేదన్న మాట నీలకంఠ చక్రవర్తి చెవిన పడగానే ఆయన తల్లిని పిలిచి తిరస్కార భావంతో " అమ్మా! నీవు ఎందుకు ఇటువంటి మాట చెప్పడానికి వెళ్ళావు?" అన్నాడు.
    తల్లి మౌనం వహించింది! "కన్య వివాహం కోసం మనం ఎవడికాళ్ళమీదా పాడేది లేదు. ఎంతో మంది వచ్చి మన కాళ్ళమీదే పడతారు. నా కూతురు అందం లేనిది కాదు. చూడండి, ఒక వారం రోజుల లోపలే సంబంధం కుదుర్చుకొస్తాను. ఈ విషయం మీ అందరితో చెపుతున్నాను. పెళ్ళి కోసం ఆలోచించాలా ఏం?" అన్నాడు నీలకంఠ చక్రవర్తి.
    అయితే తండ్రి ఏ కన్య కోసం ఈ మాటన్నాడో ఆ మాట వినగానే ఆ కన్య నెత్తిమీద పిడుగు పడినట్లయింది. దేవదాసు మీద తనకొక్కదానికే అధికారం వుంది అనే నిశ్చయం ఆమెకు బాల్యం నుంచీ వుంది. ఆ అధికారం ఆమె చేతికి ఎవరో ఒప్పగించింది కాదు. మొదట ఆమె కూడా దీనిని బాగా అర్ధం చేసుకోలేకపోయింది. తెలియకుండా అస్థిరంగా వున్న ఆమె మనసులో రోజు రోజుకూ ఈ అధికారాన్ని నిశ్శబ్దంగా, దృడంగా తనదిగా చేసుకొని నిలుపుకున్నది. ఇప్పటివరకూ దాని బాహ్యరూపం తన కళ్ళారా చూడలేకపోయింది. అయినా కూడా అది చేజారిపోవటం చూసి ఆమె హృదయం అంతటా ఓ గొప్ప తుఫాను చెలరేగింది.
    కాని దేవదాసు విషయంలో ఈ మాట అనటం ఉచితంగా వుండదు. బాల్యంలో పార్వతిమీద పొందిన అధికారాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. అయితే కలకత్తా వెళ్ళిన తరువాత కార్యకలాపాలు ఎక్కువ కావడం, ఇంకా ఇతర ఆనందంలోనూ, ఉల్లాసంలోనూ పడిపోవడం కారణంగా అతడు పార్వతిని చాలా భాగం మరచిపోయాడు. కాని పార్వతి పరివర్తన చెందనటువంటి ఆ పల్లెటూరి జీవితంలో రేయింబవళ్ళు కేవలం అతణ్ణే స్మరిస్తూ వున్నదని అతనికి తెలియదు. అంతేకాదు, బాల్యంలో ఎవరి నయితే అన్ని విధాలా తన వాణ్ణిగా భావించిందో, ఎవరికయితే సుఖదుఃఖాలలో తోడ్పడిందో అతణ్ని యౌవనావస్థలోని ప్రథమ సోపానంమీద పాదం పెట్టగానే వదులుకొని జారిపోవలసి వస్తుందని ఆమె కలలో కూడా ఆలోచించలేదు. కాని ఆ సమయంలో వివాహం సంగతి యెవరు ఆలోచించేవాళ్ళు? కిశోరావస్థలోని బంధం వివాహ బంధం లేకుండా ఏ విధంగానూ స్థిరంగా వుండజాలదని ఎవరికి తెలుసు? 'కాబట్టి ఈ వివాహం అసంభవం' అనే సంభాషణ ఆమె ఆశనూ, అభిలాషనూ అంతటినీ చిందర వందర చేయడం కోసం ఆమె హృదయంతో పెనుగులాడుతూ వుంది. దేవదాసుకు ప్రాతఃకాలపు సమయం చదువు కొనడం,వ్రాసుకొనడంలోనూ గడచిపోతుంది. మధ్యాహ్నం చాలా వేడిగా వుంటుంది. కాబట్టి  ఇంట్లో నుంచి బయటికి రావడం కష్టంగా వుంటుంది. కేవలం సాయంకాలం అదీ రావాలనిపిస్తే అతడు బయట స్వచ్ఛమైన గాలిలో విహరించడానికి వెళుతూ వుంటాడు. ఆ సమయంలో అతడు ఒక్కొక్కప్పుడు ధోవతి, చొక్కా ధరించి, మంచి చెప్పులు వేసుకొని, చేతిలో బెత్తం తీసికొని షికారు చేయడానికి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు అతడు చక్రవర్తి ఇంటి ముందుగా వెళ్ళేవాడు. పార్వతి పైన బంగళాలో కన్నీళ్ళు తుడుచుకుంటూ అతణ్ణి చూస్తూ వుండేది. ఆమె మనసులో ఎన్నో విషయాలు మెదులుతూ వుండేవి. ఇరువురమూ పెద్దవాళ్ళమయ్యాం అనే విషయం తలపు కొచ్చేది. చాలాకాలం ఇతర ప్రాంతంలో వున్న కారణంగా ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు చాలా సిగ్గు పడుతున్నారు. దేవదాసు ఆ రోజు ఈ విధంగానే వెళ్ళి పోయాడు. లజ్జ కారణంగా అభిలాష వుండి కూడా ఆతడేమీ మాట్లాడలేక పోయాడు. ఈ విషయం పార్వతి కూడా గ్రహించకుండా లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS