"బామ్మగారూ!' సన్నని గొంతు.
"అమ్మమ్మ లేదు. దేవాలయానికెళ్ళింది. రండి." నవ్వుతూ ఆహ్వానించాడు ప్రసాదరావు.
ఒక్కసారి సంకోచిస్తూ నిలుచుని, "వెళతానండి" అంది మధుమతి.
"ఏమైనా పని ఉండి వచ్చారా?' అడిగాడు.
'ఆహా. అమ్మ బామ్మగార్ని ఓసారి పిలుచుకు రమ్మంది.' చప్పున అబద్దమాడింది.
"చాలా సేపయింది వెళ్ళి, వచ్చేస్తుంది . కూర్చోండి." గదిలో కుర్చీ చూపించాడు.
మౌనంగా రెండు క్షణాలు దొర్లిన తరువాత, "మీకు సంబంధం రైటయిందని విన్నాను." అంది మధుమతి.
"ఆహా" అన్నాడు ప్రసాదరావు గడ్డం చేసుకుంటూ.
"ఆ అమ్మాయి యెలా ఉంటుందండీ?' అ గొంతులో కుతూహలం.
"నాకు నచ్చింది." అన్నాడు నవ్వే పెదవులు బిగపడుతూ.
"అయితే మా కెవరికీ నచ్చదా?" కొంటెగా నవ్వింది.
"సరి. మీకు నచ్చాలనేముంది?"
'అబ్బా... చెప్పండి, ఆ అమ్మాయేలా ఉంటుందో ఏం చదివిందో!"
"అసలా అమ్మాయికి నేనూ, నా రూపం నచ్చాయో లేదో, నేను ఇష్టం అవునో కాదో తెలుసుకుని నా అభిప్రాయం చెప్పాలి ఏమంటారు? నిజమేనా?" చిలిపిగా ఆమె వైపు చూశాడు.
చప్పున అతన్ని చూసే తన కళ్ళు వాల్చి, "పోనీలెండి మీ రంత చెప్పగూడదనుకుంటే , మీరంటే నచ్చక పోవడమేమిటి? తమాషా కబుర్లు కాని....' అంది.
"తమాషా కబుర్లా?" ఆశ్చర్యం నటించాడు.
"కాకపొతే!.... మీరే నచ్చకపోతే మీకన్నా అందమైన వారూ, మంచి వారూ ఆ అమ్మాయికి దొరకరు." టక్కున మనస్సులో తోచినది అనేసింది .
"అయితే రైటయిందనే అనుకోండి. అలానే ఆశిస్తాను."
"చ. పొండి . అర్ధమయ్యేలా మాట్లాడరు మీరు. నే వెళుతున్నాను." లేచి నిలుచుంది మధుమతి.
"ఆహా , వద్దు. కూర్చోండి. ఎలా ఉంటుందో ఆ అమ్మాయి-- అంటే నాకు నచ్చిన అమ్మాయి! ఎవరికీ చెప్పరు కదూ?" కొంటెగా ఆమె వైపు చూసి నవ్వాడు.
"చెప్పను."
"ఒట్టు!"
"మీ తల మీద చెయ్యి వెయ్యాలా?'
"వద్దు . అంత పని చెయ్యకండి. అమ్మమ్మ ని మీకే అప్పగించాలి . ఎవ్వరితో చెప్పకూడదు. కోపం వచ్చినా నా మాటలు మనస్సు లోనే దాచుకోవాలి."
'అబ్బా, ఏమిటండి చచ్చేలా! సస్పెన్సు." విసుక్కుంది మధుమతి.
"చామనచాయ రంగూ, సోగకళ్ళూ, సూది ముక్కూ, విశాల ఫాలం , అందమైన తలకట్టూ -- ఆ అమ్మాయి నాకు త్రిలోకసుందరి లా కనుపిస్తుంది. ఆమెని చూడని రోజు దుర్దిన మనిపిస్తుంది. ఆమె నా కందని ద్రాక్ష పండేమో అనిపిస్తుందండీ!" అంటూ వెనుతిరిగి చూసిన ప్రసాదరావు గుమ్మం దాటి విసురుగా వెళ్ళిపోతున్న మధుమతి కనుపించి, భయంగా "ఏమండీ!' అని పిలిచాడు.
ఆమె వినిపించుకోలేదు.
అతని గుండెలు దడదడ కొట్టుకున్నాయి. ఒళ్ళంతా చెమట పట్టింది. పెదవులు తడారాయి. కంగారుగా వాకిట్లోకి వచ్చాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో చెబుతుందేమో? అతని కాళ్ళు దడదడ లాడాయి....
వెంకట్రామయ్య గారి గుబురు మీసాలూ, గంబీరమైన మొహం గుర్తు వచ్చి భయంగా చలించి పోయాడు.
"ఏరా, బాబూ, అలా ఉన్నావ్?' అన్న నర్సమ్మ గారి ప్రశ్నకి -- "ఎలా ఉన్నాను?' అని కసురుకున్నాడు.
ఆఫీసుకి వెళుతూ, యాంత్రికంగా తహసీల్దారు గారి వీధి గేటు తెరిచి లోపలికి వెళ్ళి , గుండెల్ని చిక్కబట్టి తహసీల్దారు గారికి నమస్కరించాడు.
అయన ఎప్పటిలా హుందాగా చిరునవ్వు చిందించారు.
గుండెల నిండా తేలిగ్గా గాలి పీల్చి మధుమతి కి మనస్సు లోనే కృతజ్ఞత లర్పించుకున్నాడు ప్రసాదరావు.
* * * *
మధుమతి వరసగా నాలుగు రోజులు కనిపించక పోవడంతో ఆ అమ్మాయి తన నసహ్యించుకుంటుందనుకున్నాడు ప్రసాదరావు.
"అదేదో కూరట. మధు నీ కోసం తెచ్చింది.' అంటూ అన్నం పక్కన వేస్తున్న నర్సమ్మ గారి వైపు సంభ్రమంగా చూస్తూ, "తానీ మధ్య కనుపించడమే లేదే?" అన్నాడు ప్రసాదరావు.
"బాగుంది. ఇప్పుడే మనింటి నుంచి వెళ్ళింది. అదేం అనుబంధమో! నేనంటే ఆ అమ్మాయికి గొప్ప అభిమానం." నవ్వుకుంది నర్సమ్మ.
ఆమె తన ఇంటికి వచ్చినప్పుడు కాని, వాళ్ళ ఇంటికి తాను వెళ్ళినప్పుడు కాని ఆమెను చూస్తూనే తల వంచేస్తున్నాడు.
ఒకర్ని ఒకరు చూడాలనీ, మనస్సులు విప్పి నవ్వుతూ మాట్లాడు కోవాలనీ ఇద్దరి హృదయాలూ ఆరాట పడుతున్నాయి. ఒకరికి సంకోచం, ఒకరికి సిగ్గు.
తహసీల్దారు గారి అమ్మాయిగా మాత్రమే చూడలేక పోతున్న అతను బామ్మగారి మనవడు గా మాత్రమే అనుకోలేక పోతున్న ఆమె -- ఎంత మధురమైన భావనలు వారివి!
రోజూ సాయంత్రం టిఫిను తాహసీల్దారు గారింటి నుంచి ప్రసాదరావు కోసం వస్తుంది.
"రోజూ ఇదేమి మర్యాద? వద్దని చెప్పు" అంటూ నర్సమ్మ గారి మీద విసుక్కున్నాడు ప్రసాదరావు.
"ఎలారా , బాబూ? ఎన్నిసార్లు చెప్పినా ఆ అమ్మాయి వినందేను!"
"ఆ అమ్మాయి అంటే, ...! అతని కళ్ళు మెరిశాయి.
ఒకరోజు మాటల సందర్భం లో అన్నారు వెంకట్రామయ్య-- ప్రసాదరావు ని యు.డి.గా ప్రమోట్ చేశారనీ, అతను టెస్టులు చదివి పాసైనాడనీను.
'అబ్బాయి చాలా బాగుంటాడు సుమండీ!" అతని రూపాన్ని మెచ్చుకుంది జానికమ్మ.
"చాలా తెలివి గలవాడు. బుద్ది మంతుడూను!'పొగిడాడు వెంకట్రామయ్య.'
తృప్తిగా నిట్టూర్చింది మధుమతి; వారి సంభాషణ విని.
రోజులూ, నెలలూ గడిచి పోతున్నాయి. ఏదో ఒక వేళలో, ఎవరింటి దగ్గరో ప్రసాదరావు, మధుమతి -- ఇద్దరి చూపులూ కలుస్తూనే ఉన్నాయి. కాని , మాటలు కలియలేదు. 'ఎవరు యేమని ముందు ఎలా మాట్లాడాలి?' తాను మాట్లాడితేనే నేను మాట్లాడేది.'- ఇద్దరి సంకోచం, నిర్ణయం ఒక్కటే!
* * * *
"మధూ! బామ్మగారి కేలా ఉందమ్మా?"
త్రుళ్ళి పడి, ఏమిటి, నాన్నా? ఆమెకు సుస్తీయా? నాకు తెలియదే. ఈవేళ వారింటికి వెళ్ళలేదు" అని కంగారుగా అంది మధుమతి.
"అవునటమ్మా! అతనీవేళా , నిన్నా ఆఫీసుకి సెలవు పెట్టాడట. ఓసారి చూసిరా!" అన్నారు వెంకట్రామయ్య.
* * * *
నర్సమ్మ గారి చెంపలు, మెడ క్రిందా చేత్తో స్పృశించి చూస్తూ, 'అబ్బా, ఎంత, జ్వరంగా ఉంది! డాక్టర్ కి చూపించారా?' అని, చప్పున తలఎత్తి ప్రసాదరావు వైపు సూటిగా చూసింది మధుమతి.
"చూపించాను. ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు. మీరు....మీరు....." అంటూ నసిగాడు ప్రసాదరావు.
"ఆ.. మీరు?' నవ్వబోయి ఆగిపోయింది మధుమతి.
"మీరు నన్ను క్షమించాలి...."
"ఎందుకో?'
"ఆ వేళ నా వాగ్దోషాలు...." అతనిలో తడబాటు.
"ప్చ్! లాభం లేదు. ఇన్నాళ్ళ తరువాతా క్షమించేది! ఫనిష్మేంట్ ఇవ్వాల్సిందే!" నవ్వాపుకుంటూ అందామే.
"నిజంగా మీరు చాలా మంచివారు."
"ఓ, అలాగా?.... మీరీవేళ భోజనం చేశారా?"
"చేశానే?"
"ఎక్కడో?"
"హోటల్లో."
"అబద్దం!"
"నాకు ఆకలి లేదు.... మానేశాను." చురుగ్గా ఆమె వైపు చూస్తూ అన్నాడు.
"మీకు వంట రాదా?"
అతనికి చిరాకేసింది. "మా అమ్మమ్మ నేర్పలేదు" అన్నాడు.
"నేర్పాల్సింది..."
అతను ఊపిరి గట్టిగా పీల్చి వదిలాడు.
"వంటన్నా నేర్పాలి కనీసం.... పెళ్ళేలాగూ చెయ్యలేదు కదా! పెద్దామే కదా? ముందాలోచన వద్దూ?" స్వగతం లో అంటూ, "బామ్మగారూ!" అని పిలవబోయిన మధుమతి ని వారించాడు ప్రసాదరావు, ఆమె మాటకి చిన్నగా నవ్వుకుంటూ.
'సరే. నే వెళతాను మరి. మా అవసరం ఏమున్నా నిస్సంకోచంగా అడగవచ్చు. నేనొచ్చి బామ్మగార్ని చూస్తూనే ఉంటాను. మీకేమన్నా సహాయం కావాలంటే చేస్తాను. అమ్మా, నాన్నగారూ ఏమీ అనరు. మీకు కారియర్ లో భోజనం వస్తుంది....'
అతను వద్దని అంటున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది మధుమతి.
మరురోజు తహిసీల్దారు గారు స్వయంగా వచ్చి నర్సమ్మ గారి ఆరోగ్యం గురించి ప్రశ్నించి, ప్రసాదరావు ని భోజనానికి ఆహ్వానించారు.
"సార్...."అని ఏమో అనబోయిన ప్రసాదరావు ను , "నా మాట కాదనడానికి వీల్లేదంతే" అని వారించి, హుందాగా నవ్వుతూ వెళ్ళిపోయారాయన.
నర్సమ్మ గారికి సపర్యలు చేస్తున్న మధుమతి ని వారిస్తూ నోచ్చుకునేవాడు ప్రసాదరావు.
ఓరోజు ఖచ్చితంగా అన్నాడిలా!" మీరిలా ఆమెకు సేవ చేస్తుంటే నేను సహించలేక పోతున్నాను. మీ అంతస్తేమిటి? మీరిలా ఆమెకు సేవ చెయ్యడమేమిటి! ఏ పూర్వ అనుబంధమో! ఎంత చెప్పినా వినరు!"
ఓ...మీ కలాంటి అనుబంధమేమీ లేదా మాతో?"
"నాకూ ఉండవచ్చు. లేకపోతె మా అమ్మమ్మ జబ్బు కాదు కాని, అల్లుళ్ళా మేస్తున్నాను మీ ఇంట్లో. ప్లీజ్! ఈ రోజు మీ నాన్నగారితో చెప్పండి- ఇంక హోటల్లో తింటానని" అన్నాడు ప్రసాదరావు.
"మీరే చెప్పండి. " ఆమె కళ్ళు నవ్వుతున్నాయి.
"అయన ఎదురుగా మాట్లాడలేను."
"అయితే బుద్దిగా భోజనం చేసి వెళుతూ ఉండండి." నవ్వేసింది ఫక్కున.
"మీ కేందుకండీ అక్కర్లేని అపనిందలు!" కొన్ని క్షణాల తరువాత ఇబ్బందిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు ప్రసాదరావు.
"ఏమనుకుంటున్నారు?" ఆ గొంతులో నిర్లక్ష్యం.
"మీ నాన్నగారికి తెలిసే ఉంటుంది, ఆఫీసులోనూ, ఇరుగుపొరుగులు అవే మాటలు...." నసిగాడు ప్రసాదరావు.
"సరే, ఇంకేం? నాన్నగారికి తెలుసు. మీకు తెలుసు. ఇంకెందుకు భయం?'
"అది కాదండీ....."
"ఏది కాదు.? ఏమనుకుంటున్నారందరూ? ఓసారి వినాలనుంది , చెప్పరా?"
రెండు క్షణాల తరువాత , "ఏం, మాట్లాడరు? సిగ్గేస్తుందా?" అని కవ్వించింది నవ్వుతూ.
"నాకేం సిగ్గు! మగవాణ్ణి.... నాకోసమే , బామ్మగార్ని చూడాలనే మిషతో మా ఇంటికి మీరు వస్తున్నారట. వయసొచ్చిన ఇద్దరం గంటల కొద్ది ఓ ఇంట్లో గడుపుతున్నామట. కానీ కట్నం లేకుండా మీ నాన్నగారు అల్లుణ్ణి సంపాదించేరట. అందుకే మీ ఇంట్లో నాకు భోజనం పెడుతున్నారట.... విన్నారా? బాగున్నాయా ఈ మాటలు?"
ఆమె మొహం చాటు చేసుకుని నవ్వు కుంటుంది. గమనించని అతను -- "అసలే నా మనస్సదోలా ఉంది. ఎలాగోలా పోతాం. దయచేసి మీరు మా ఇంటికి రాకండి. నేనూ మీ ఇంటికి రాను. నన్నిలా బ్రతకనివ్వండి. ఏమీ అనుకోకండి. మీ కుటుంబం తో స్నేహమంటే ఇంతవరకూ గర్వించాను. కాని, తెలుసుకున్నాను నిప్పుతో చెలగాటమని.... నా ఎదురుగా మా స్నేహితులు హెచ్చరిస్తున్నారు. నాకేదో భయంగా ఉంది.... నాకు ట్రాన్సఫర్ చేయించండి. మా అమ్మమ్మ ఎంత కాలమో బ్రతకదు" అన్నాడు.
"మిస్టర్ ప్రసాదరావు గారు!" ఖంగుమంది మధుమతి గొంతు. గబగబా మాట్లాడేస్తున్న అతను టక్కున ఆగి ఆమె వైపు చూశాడు.
"హెచ్చరిస్తున్నారట స్నేహితులు. ఇప్పుడా వారు హెచ్చరించేది. మీరు వినేదీనూ? బుద్ది లేకపోతె సరి!' అసహనంగా అని, అతని వైపు రోషంగా చూసింది మధుమతి.
"ఏమండీ?" తెల్లబోయాడతను.
"ఏమండీ!' ఈ సంభోధన నా కక్కర్లేనిది. మీ స్వార్ధం కోసం ఈ ఊరు వదిలి పారి పోవాలను కుంటున్నారు కాని, కొంచెం సానుభూతి తో నా గురించి ఏమైనా ఆలోచించారా?" ఆమె పెదవులు వణికాయి.
"మీకేం? మీ నాన్నగారు ధనవంతులు. పేరున్న ఆఫీసరు."
"అయితే! నిందలు పోతాయన్న మాట! మా కుటుంబం మీద, నా మీద మీకు అభిమాన ముంటే మా నాన్నగారి మీద మీకేమన్నా కృతజ్ఞతాభావముంటే అందరూ అనుకునే మాట నిజం చెయ్యండి."
అతను మౌనంగా ఉండిపోయాడు. శూన్యంలోకి చూస్తూ.
"ఈ వేళ మీరు చెప్పాక తెలియడం కాదు -- మిమ్మల్ని ప్రేమిస్తున్నానని . నా ఎదురుగానే హాస్యం చేస్తున్నారు . కాని , లక్ష్య పెట్టలేదు నేను. మొండిగా తిరుగుతున్నాను. మీరు చాలా మంచివారనుకున్నాను. మీమీద మమతలు పెంచుకున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారని భ్రమించాను. ఏమండీ, నన్ను నవ్వుల పాలు చెయ్యకండి. "నన్ను.....నన్ను మోసం చేసి వెళ్ళిపోకండి." ఆమె రెండు చేతులతో మొహం కప్పుకుంది."
"మధూ!" అనురాగ పూరిత కంఠంతో ఆమెను వారుస్తూ ఆమె భుజం పై చెయ్యి వేశాడు ప్రసాదరావు.
