Previous Page Next Page 
కౌసల్య పేజి 6

 

    దాని చిలిపి చూపులు కౌసల్య చూపులను జ్ఞాపకం తెచ్చాయి వెంకట్రామయ్యకు. కౌసల్య చూపులు కూడా సరిగా ఇలాగే చిలిపిగా, కోరగా ఉండేవి. కౌసల్య! దాదాపు రెండు శతాబ్దాల క్రితం మాట. చారడేసి కన్నులూ, సూదిగా చివర కొనదేరిన ముక్కూ, సన్నని చిన్ని పెదమలూ-- వీటితో కౌసల్య ముఖం ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. పొంగులు వారే యౌవనం, పెల్లుబికే ఉత్సాహంతో తన జీవితంలో ప్రవేశించిన కౌసల్య కొన్ని నెలల పాటు ఈ లోకాన్ని ఎంతగా మరపింపచేసిందో! అంతే. తన జీవితంలో ఎలా ప్రవేశించిందో అలాగే నిష్క్రమించింది. అదంతా ఓ చిత్రమైన కధ.
    తను 1938 హరిపురం కాంగ్రేసు సమావేశాలకని వెళ్లి, తిరిగి వచ్చేటప్పటికి కుటుంబంలో పరిస్థితులన్నీ తారుమారాయి పోయాయి. ఆనందాన్ని కని , వదిన అసువులు బాసింది. తను ఇంటి దగ్గర లేనందుకు , ఆ క్రితం ఏడే ఇంటికి అల్లుడుగా వచ్చిన సూర్యనారాయణ కష్ట సమయంలో అన్నయ్యను ఆదుకున్నాడు. అప్పటికి విశాలాక్షి కి పదకొండు ఏళ్ళు. ముకుందానికి తొమ్మిది. ఆనందం పసికందు. అడ దిక్కులేని ఆ సంసారాన్ని ఆదుకొనే వాళ్ళెవరూ కనిపించలేదు.
    పరిస్థితులన్నీ స్తిమితపడి వదిన పోయిన దుఃఖం నుంచి అందరూ కొంత కోలుకొంటున్న సమయంలో తను వివాహం చేసుకోవలసిన అవసరాన్ని గురించీ, ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగంలో చేరి ముకుందాన్నీ, ఆనందాన్నిపైకి తీసుకురావలసిన అవసరాన్ని గురించీ కొత్త అల్లుడు నచ్చ చెప్పాడు.
    "రేపు నేను విశాలాక్షి ని కాపురానికి తీసుకుపోతే, మీకు ఆడదిక్కు ఏది? కుర్రవాళ్ళో , మీరో చెయ్యి కాల్చు కోవలసి వస్తుంది. ఇంట్లో చూసే వాళ్ళుండరు. అందుకని ఈలోగా మీరు పెళ్లి చేసుకుంటే ఆ ఇబ్బంది లేకుండా పోతుంది. ఆవిడగారు వచ్చి సంసారాన్ని ఆదుకుంటారు" అన్నాడు సూర్యనారాయణ.
    తన కతని మాటలు సమంజసం గానే తోచాయి.
    కొంతసేపు ఊరుకుని ఇంకా చెప్పాడు సూర్యనారాయణ . "మీరు మామగారి వెనకాలే ఉండి పొలం పనిలో సహాయం చెయ్యడం వల్ల, సంసారానికి కలుగుతున్న అదనపు లాభం ఏమీ లేదు. అలా కాకుండా మీరు పై చదువులు చదివి నట్లయితే , మిమ్మల్ని ఆధారం చేసుకుని, ముకుందం, ఆనందం కూడా చదువుకుని అభివృద్ధి లోకి వస్తారు. లేకపోతె, వాళ్లు కూడా మీలాగే వ్యవసాయం చేస్తూ వుండి పోవాలి."
    ఆ ప్రకారం తాను ఆఏడే కాకినాడ సి.ఆర్ కాలేజీ లో చేరాడు. అందం, చదువు , సంగీతం అన్నీ ఉన్న కౌసల్య తో తన వివాహం కూడా అయేడే నిశ్చయం అయింది. పెద్ద లాయరూ, జస్టిస్ పార్టీ మెంబరూ , తాలూకా బోర్డు ప్రెసిడెంట్ అయిన తన మామగారు రావు సాహెబ్ పెరుమాళ్ళయ్యగారు రామచంద్ర పురంలో తన వివాహాన్ని ఎంతో వైభవంగా జరిపించారు 1939 లో.
    పెళ్లి అయిన తర్వాత ఎన్నార్దానికి కాని పునస్సంధానం కాలేదు. ఆ ఏనార్ధం లోనూ తను మూడు నాలుగు సార్లు రామచంద్ర పురం వెళ్ళాడు పండుగలకని. కౌసల్య కూడా ఒకటి రెండు సార్లు పుల్లేటి కుర్రు వచ్చింది నోములకని. ఆ నాలుగైదు సందర్భాలలోనూ కౌసల్యా, తనూ ఒకే ఇంట్లో మసులుతున్నాము అన్న తలంపే మనస్సు కెంతో హాయినిచ్చెది.
    కౌసల్య తనూ ఒకేచోట ఉన్న సందర్భాల్లో , తనకు కావలసిన పరిచర్యలన్నీ కౌసల్యే చేసేది. నోటితో పలకరించుకోలేదన్న మాటే కాని, తను ఇద్దరి మధ్యా ఎంతో మౌన సంభాషణ జరుగుతూ ఉండేది. తను నిద్ర నుంచి లేచేటప్పటికి ఎదురుగా కిటికీ లో కుంచు చెంబుతో నీళ్ళు, పందుం పుల్ల ఉండేవి. మొహం కడుక్కొని వచ్చేటప్పటికి , టేబిల్ మీద కాఫీ గ్లాసు సిద్దంగా వుండేది. స్నానానికి వెళితే సబ్బూ, తువ్వాలూ, చన్నీళ్ళూ, వేన్నీళ్ళూ అమర్చబడి ఉండేవి. మాసిపోయిన చొక్కా నుండి , చాకలి తెచ్చిన చొక్కాకు గుండీలు మారడం , భోజనం చేసి వచ్చేటప్పటికి తన చొక్కా జేబులోకి నేర్పుగా చుట్టబడిన తమలపాకుల చిలకలు చేరడం -- ఇవన్నీ తనకు తెలుసు, ఎలా జరుగుతున్నాయో. ఏమంటే కౌసల్య లేనప్పుడీ పరచార్యలేవీ తనకు జరిగేవి కావు. తన పట్ల కౌసల్య చూపిస్తున్న ఆ ఆప్యాయతకు ఎంతో ఆనందం కలిగేది. ఇంట్లో ఉన్నంతసేపూ కౌసల్యే రూపే కళ్ళ ముందు కదలాడేది. తన ఆలోచనలన్నీ ఆమె చుట్టూనే తిరిగేవి. తనకు వేరే లోకం కనిపించేది కాదు, కౌసల్య తప్ప.
    మళ్ళీ కాలేజీ జీవితం వేరుగా ఉండేది. కాలేజీ లో అడుగు పెట్టింది మొదలు , తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేదాకా ఇంటి సంగతులు కాని కౌసల్య గురించిన ఆలోచనలు కాని ఏమీ వచ్చేవి కావు. అది ఆనందమయమైన ఇంకో లోకం లాగా ఉండేది. ఒకటి రెండు దశాబ్దాల క్రితం శ్రీ రఘుపతి వెంకట రత్నం గారు ఆ కాలేజీ వాతావరణం లో జల్లి వెళ్లిన భావసుమ పరీమళం విద్యార్ధులలో వినూత్న చైతన్యాన్నిస్తుంటే, శ్రీ పెద్దాడ రామస్వామి గారి మంద్ర గంబీరస్వరం మామిడి తో పుల్లోంచి మాక్ బెత్ , హమ్ లేట్ పాఠాలను విద్యార్ధుల చెవుల్లో మార్మోగిస్తుంటే, "ఆకులో ఆకునై పువూ లో పూవు నాయి సుమలేత రెమ్మనై ఈ అడవి దాగి పోనా" అంటూనూ , "అఘవంకము నుండి అంభోజము మొల్వ జేసితిని" అంటూనూ విద్యార్ధులు ఉచ్చై స్వరంతో భావ గీతాలు పాడుకుంటూ ఇంతినీ, లోకాన్ని మరిచి కాలేజీ ఏ స్వర్గంగా , చదువే తపస్సు గా, జీవితమే మధుర గీతంగా మలచుకొని రెండేళ్ళూ రెండు నిమిషాలుగా గడిసిన రోజులవి.
    కాలేజి వాతావరణం ఇలా ఉంటె, కాకినాడ ఊళ్ళో వాతావరణం రాజకీయ ఉపన్యాసాలతో దేశభక్తి గీతాలతో, కాంగ్రేసు కార్యకర్తల సాహస క్రియలతో ఉద్రేక పూరితంగా ఉండేది. శ్రీ బలుసు సాంబమూర్తి గారి ఉపన్యాసాలు ప్రజలను, అందులో ముఖ్యంగా విద్యార్ధులను ఉర్రూతలూగించేవి. అయన ప్రభావం ఎక్కువగా పండింది తన మీదా, జనార్దనం మీదానూ . సుబ్బారావు, సుబ్రహ్మణ్యం కూడా కాంగ్రేసు ఆఫీసుకు తమతో కలిసి తరుచు వచ్చేవారు కాని సాంబమూర్తి గారికి మాత్రం వాళ్ల కార్యదక్షత మీద, ధైర్య సాహసాల మీద ఏమీ నమ్మకం ఉండేది కాదు. "రేపొద్దున్న ఏదైనా అవసరం వస్తే ధైర్యంగా కార్య రంగంలోకి ఉరికేది వెంకట్రామయ్యా, జానార్ధనమూను. తక్కిన వాళ్ల సంగతి అంటారా? చెప్పలేము" అనేవారు. ఈ రకంగా రెండేళ్ళూ గడిచాయి.
    ఆరోజు తన పునస్పంధానం. మామగారి ఇంట్లోనే విడిది కింద కేటాయించిన ఒక భాగంలో, మగ పెళ్లి వారంతా దిగారు. తన ఆలోచనలూ, ఊహలూ చిత్ర విచిత్రమైన మార్గాల్లో మున్నెన్నడూ తను పొందని ఒకానొక వినూత్న మనోజ్ఞ భావనతో నమ్మి శ్రితాలై దేహానికో గగుర్పాటు, మనస్సుకో తత్తర పాటు, బుద్దికో పరధ్యానం , హృదయానికో దివ్యానుభూతి ఇచ్చాయి. తనలో కనిపిస్తున్న ఆ చైతన్యాన్ని ఎవరేనా కనిపెడతారేమోననే భయంతో ఒక మూల గదిలో ఒంటరిగా కూర్చున్నాడతను.
    తన ఊహలన్నీ తిరిగి తిరిగి కౌసల్య వేపే పరుగిడ జోచ్చాయి. ఈ ఏనార్ధం నుంచీ కౌసల్య తో ఏర్పడిన అనుబంధం! ఆమె తనపట్ల చూపించిన మమత! కౌసల్య కూ, తనకూ మధ్య మౌనంగా కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవి తనకు తెలుసు. తనకు తెలుసునని కౌసల్య కూ తెలుసు. అందుకే కృతజ్ఞతా సూచకంగా తను ఎప్పుడేనా నవ్వితే చూసి తలవంచుకొని నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఒకరి నొకరు వదిలి ఊరు వెళ్లి పోయేటప్పుడు కూడా 'వెళ్లి వస్తా' నని కళ్లతోనే మాట్లాడుకునే వారు. అప్పుడు కౌసల్య ముఖం చూసి తీరాలి. గుడ్ల నిండా నీరూ, అది కప్పి పుచ్చడానికి తెచ్చి పెట్టుకొన్న గంబీర్యం, తనలోని ఈతోట్రుపాటు ఎవరూ చూడకుండా ఉండడం కోసం పడే తాపత్రయమూనూ.
    ఇలా ఆలోచిస్తున్న తను ఏదో చప్పుడు విని వెనక్కు తిరిగి చూశాడు. 'కౌసల్య! యౌవనం, సౌందర్యం రెండూ కలిసి రూపు దాల్చి వచ్చినట్లున్న తన కౌసల్య అటు తిరిగి , బీరువా లో ఏవో పుస్తకాలు సర్దుతుంది.
    తలంటి పోసుకొని, వదులుగా జడ వేసుకుని ఒకే ఒక గులాబీ పువ్వు జడలో తురుముకుంది. లేతనీలం సిల్కు చీర, ఎర్రటి రవికె ధరించడం మూలాన, అవి పచ్చని కౌసల్య శరీరచ్చాయను స్పష్టా స్పష్టంగా మాత్రమే బహిర్గతం చేస్తున్నాయి. అందం అంతా ఒక చోట పోగు పెట్టినట్లున్న కౌసల్య ను చూసేసరికి కోరికలు రెక్కలు కట్టుకోన్నాయి. గుండె దడదడ కొట్టుకోవడం ప్రారంభించింది. గొంతు తడి ఆరిపోయింది. ఒళ్ళంతా వేడి ఎక్కింది. వెనకాలే నెమ్మదిగా వెళ్లి, అ మెడ మీద ముద్దు పెట్టుకుంటే? అమ్మో! ఇంకేమైనా ఉందా? ఎవరైనా చూస్తె? చూస్తె ఏం? ఆ భయం తనకేనా, కౌసల్య కు లేదా? ఉంటె ఈ గదిలోకి ఎలా వచ్చింది? బహుశా , తను ఉన్నాడని తెలియదేమో! మొదట్లో పోనీ తెలియదు. మరి ఇప్పుడు -- తెలిశాక? ఆ! అంతా దొంగ వేషం. రావాలేన్ వచ్చింది. తన్ను చూసింది. చూడనట్టు నటిస్తుంది.
    ఈ ఆలోచనతో తాను ఇంక కుర్చీ లో కూర్చోలేక పోయాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కౌసల్య ను సమీపించాడు. తల తిప్పి చూడకుండానే , కౌసల్య అంతా గ్రహించింది. కాని తనకేమీ పట్టనట్లు నటిస్తుంది. తను నెమ్మదిగా వంగి, కౌసల్య తలలోని గులాబీ పువ్వును వాసన చూశాడు. తన వేడి శ్వాస కౌసల్య చలించలేదు. తనను తాను సంబాళించుకోలేక పోయాడు. కౌసల్య మెడ ముద్దెట్టుకున్నాడు. కౌసల్య ఉలిక్కిపడి, వెనక్కు తిరిగి "అమ్మో!" అని ఒక్క పరుగు తీసింది.
    మళ్లీ రాత్రి పదింటి కి కాని, కౌసల్య తనకు కనిపించలేదు. పందిరి పట్టే మంచం మీద కూర్చుని మోచేతులు తలగడా మీద ఆనించుకొని, కమ్మని అగరవత్తుల వాసన లో , గంధం పన్నీరు సెంటుల గుబాళింపులో మత్తెక్కి,మసక వెలుతురు లో పలహరపు పళ్ళేలు కాంతివంతంగా కనిపిస్తుంటే, ఏం ఆలోచిస్తున్నాడో  తనకే తెలియని విచిత్రమైన మధుర స్వప్నం లో తానుండగా, కౌసల్య ను ఎవరో గదిలోకి తోసి, బయట గొళ్ళెం పెట్టారు. కౌసల్య తలుపు వైపు తిరిగి నిలబడి ఉంది.
    ఎదురు తిరుగుతున్నా గుండెను అతి కష్టం మీద చిక్క బట్టుకుని అలాగే కూర్చున్నాడు తను కొన్ని నిమిషాలు. ఏ నిమిషాన దగ్గరకు వస్తాడో అని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, కోటి గుండెలు గొంతులో కొట్టుకుంటూ ఉండగా, నిమిషం ఒక యుగంగా గడుపుతున్న కౌసల్య ఎంతకూ రావటం లేదు ఏమిటి చెప్మా అని, ముఖం తిప్పకుండా, కళ్ళు మాత్రమే కొంచెం పక్కకు తిప్పి చూసింది. తను కూడా సరిగ్గా ఆటే చూస్తుండటం మూలాన సిగ్గుపడి , తత్తర పాటుతో అటు తిరిగింది.    
    'దొరికింది దొంగ" అని నెమ్మదిగా అంటూ ఆమెను సమీపించాడు తను. బుజం మీద చెయ్యి వేసి తన వైపు తిప్పుకొని, చుబుకం సుతారంగా పట్టుకొని ముఖాన్ని పైకిఎత్తాడు. తన అబలత్వాన్ని అంతా కన్నులలోకి తెచ్చుకొని, బరువైన కనురెప్ప లెత్తి తన కేసి దీనంగా చూసి వెంటనే కళ్ళు దించేసింది. తనకెంతో జాలీ, మరెంతో మమతా, ఈ రెండింటి నీ మించిన ప్రేమా ముప్పిరి గొని, చట్టున పందిట్లోకి తీసుకుని హృదయానికి హత్తుకొని పాన్పు వేపు నడిపించాడు.
    ఆమెను తనకు దగ్గరగా తీసుకుని ముంగురులు సవరిస్తూ "పొద్దుట అలా పరిగెత్తావెం?' అన్నాడు.
    "లేకపోతె! పాపం, అక్కడే నిలబడాలా?"
    "తలుపు దగ్గరగా వేస్తె ఏం చేసి ఉందువు?"
    "అబ్బో! ఆ మాత్రం దైర్యం కూడానా?"
    ఆ మాట తనకు చురుక్కుమని తగిలింది. వెంటనే సంబాళించుకొని నవ్వేశాడు. మాటల కందని మధుర సుఖాన్ని అనుభవిస్తూ , కొన్ని క్షణాలిద్దరూ మౌనంగా ఉన్నారు. తర్వాత తను "పెళ్ళి చూపుల నాడు నీ వీణ పాట సరిగా విననే లేదు నేను" అన్నాడు.
    "అవును. దొంగ చూపులే చూస్తారా, వీణ పాటే వింటారా?"
    "అది కాదు , కౌసల్యా . నువ్వు పాట చాలా బాగా పాడతావని అందరూ అంటారు. నీ అందం గొప్పదో, పాట గొప్పదో తెలుసుకోవాలని...."
    "ఏం? -- పాట బాగా పాడితే 'అనాకారిని' అందామనా?"
    "అబ్బే!"
    "లేకపొతే 'నీకు సంగీతం ఏం రాదు -- అంతా డాబే కాని' అందామనా?"
    "నీతో మాట్లాడటం చాలా కష్టం సుమా, కౌసల్యా."
    "మీతో కాపురం చెయ్యడం కంటేనా?" అంది.
    అమృతపు జల్లుగా ఆనంద వల్లిగా, మధుర స్వప్నంగా గడిచిన క్రితం రాత్రి గురించి ఆలోచిస్తున్న తనను సమీపించి "అమ్మాయి హాల్లో   వీణ వాయిస్తోంది. రావోయి , కాసేపు విందువు గాని."అన్నారు మామగారు. ఇరవై నాలుగు గంటలు తిరక్కుండానే తన కోరిక చేల్లిచింది కౌసల్య!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS