Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 6

 

    ఒకరోజు కొత్తమ్మ పంతులు గారూ ఎందుకో పోట్లాడు కొన్నారు. కొత్తమ్మ ఏడుస్తూ ముసుగుదన్ని పడుకొన్నది. ఆరోజు జయమ్మా, వనజ సంగతి ఎవరూ పట్టించుకోలేదు. మర్నాడు పంతులు గారే చెయ్యి కాల్చుకొని పిల్లలకు వండి పెట్టాడు. ప్రకాశం అప్పటి కింకా అన్నం తినే వయసులో పడలేదు. ఐనా కొత్తమ్మ పట్టించుకోలేదు. జయమ్మ వాడికీ రెండు మెతుకులు పెట్టి సముదాయించింది.
    రెండో రోజు కాబోలు కొత్తమ్మ లేచి మళ్ళీ వంట ప్రయత్నం మొదలెట్టింది. కాని అప్పట్నించి అమ్మా, నాన్నా అప్పుడప్పుడు పోట్లాడు కొంటూనే ఉన్నారు. కొత్తమ్మ పూర్వం లా వనజ, జయమ్మా అంటే అపేక్ష చూపించటం లేదు. చీటికి మాటికీ విసుక్కోటం, అడపా దడపా చెయ్యి చేసుకోటం సాగించింది. ఆడపిల్ల లిద్దరికీ కొత్తమ్మ అంటే సింహ స్వప్నమై పోయింది. పంతులు గారు అన్నీ చూస్తూ కూడా కన్నీరు పెట్టుకోడం తప్ప మరేమీ చేయలేక పోయేవాడు. ఉన్నట్లుండి ఒకనాడు ముసలి భర్తనూ, పసివాడైనా ప్రకాశాన్ని కూడా వదిలేసి కొత్తమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఊర్లో రకరకాల పుకార్లు లేచాయి. లేచి పోయిందన్నారు కొందరు. జయమ్మకు అర్ధం కాలేదు. పంతులు గారు వారం రోజుల వరకూ ఇంట్లోంచి బయటకు రాలేదు. ఒక్క రోజులోనే ముసలితనం ముంచు కొచ్చింది.
    పంతులు గారు ఆ ఊరు నుంచి మరొక ఊరికి బదిలీ చేయించుకున్నారు. ఈ సారి ఇది కాస్త పెద్ద ఊరే. రైలు స్టేషనూ, బస్సులూ , ఎలక్ట్రిక్ దీపాలూ, జయమ్మ కు ఎంతో ఉత్సాహం కలిగింది. ఆ ఊర్లో ఒక హైస్కూలు కూడా ఉన్నది. ఇంటి పనీ, పసివాడైన ప్రకాశం పనీ జయమ్మ మీద పడ్డాయి. పంతులు గారు, మానసికంగా, శారీరకంగా కూడా చాలా కుంగి పోయాడు. జయమ్మ తండ్రి బలవంతం వల్ల హైస్కూల్లో చేరింది. రోజులు అలాగే దొర్లి పోతున్నాయి. జయమ్మ కు అప్పుడప్పుడు కాస్త ప్రపంచ జ్ఞాన మేర్పడుతుంది. ఉన్నట్టుండి మరొక దుర్దినాన ముక్కు పచ్చలారని ముగ్గురు పిల్లల్ని నిరశ్రయుల్ని చేసి పంతులు గారు మరో లోకం వెళ్ళిపోయారు. సువిశాలమైన ఈ లోకంలో తనకంటే నిస్సహాయు లైన చెల్లెలూ తమ్ముడూ తప్ప జయమ్మ కు నా అనే వాళ్ళెవరూ లేరు. ఎటు చూసినా అంధకారం, అయోమయం. ఆరోజులన్నీ జయమ్మ కోక పీడకల లాంటివి.
    నిరాశ్రయులైన ఆ పిల్లల కష్ట గాధ విని , దయామయుడైన ఒక మోతుబరి రైతు ఆ పిల్లల్ని తన ఇంటికి తీసుకెళ్ళి ఆదరించాడు. నిరంతరం పదిమందికి అన్నదానం జరిగే ఆ దివాణం లో ఈ ముగ్గురు పిల్లలూ భారమని పించ లేదు. జాలిగుండె గల ఏ పాలేరు భార్యో వీళ్ళ కిన్ని నీళ్ళు పోసి, వేళకింత తిండి పడేస్తుండేది. కడుపు నిండా తిని వనజా, ప్రకాశం తోటి పిల్లల్తో అడుకొంటుండేవారు.
    ఇంత కష్టం లోనూ జయమ్మ చదువు మాత్రం ఆపలేదు. నిరాధారులూ, నిర్జనులూ ఐన  ఈ పిల్లలకు చదివే దారి భవిష్యత్తు కు మార్గమని బావించిన ఆ దయామయుడు పట్టుబట్టి జయమ్మ నూ, వనజ నూ చదివించసాగాడు. ప్రకాశం కూడా వనజతో పాటు ఎలిమెంటరీ స్కూలు కెళ్ళేవాడు.
    జయమ్మ మంచి మార్కులతో యస్.యస్. ఎల్.సి పాసైంది. వెంటనే ఆ పెద్ద మనిషి ముగ్గురు పిల్లల్నీ విశాఖపట్నం తీసుకెళ్ళి . ఒక కాన్వెంటు లో మిషనరీ ల కప్పగించి , వారి దీన చరిత్ర నంతా వినిపించాడు. పిల్లల్తో పాటు రెండు వేల రూపాయల రోక్కాన్ని కూడా ఆమిషనరీ లకే ఒప్పగించాడు. కీర్తీ శేషులైన పంతులు గారు జీవితాంతం కష్టపడి సంపాయించిన ప్రావిదెంటు ఫండు అది.
    మిషనరీ లు జయమ్మ ను టీచరు ట్రైనింగు లో చేర్పించారు. వయసులో చిన్నదైన చెల్లెలూ తమ్ముడి విషయంలో తన బాధ్యత బాగా గుర్తించింది జయమ్మ. ట్రైనింగు పాసైంది. జయమ్మ మంచితనం చూసి మిషనరీ లే ఆమెకు ఒక స్కూల్లో ఉద్యోగ మిచ్చారు. తండ్రి ప్రావిడెంటు ఫండు తాలూకు డబ్బు కూడా జయమ్మ కే ఇచ్చి వేసి, ప్రపంచంలో వదిలి వేశారు.
    మానవ సేవా తత్పరులైన మిషనరీలు. దయా స్వరూపుడైన ఆ పెద్ద మనిషి తనలో కలిగించిన ఆత్మ విశ్వాస బలంతో సంసారపు యాత్ర మొదలెట్టింది జయమ్మ. హార్బరు సమీపం లో ఒక చిన్న ఇల్లు కొనుక్కుంది. స్వల్ప వయస్సులోనే పంతులమ్మ కు ప్రపంచమంటే యేమిటో తెలియ వచ్చింది. అన్ని రకాల బాధలనూ అనుభవించింది. యౌవనం లో ఉండి కూడా అన్ని కోర్కేలనూ చంపుకోంది. తన వివాహం సుఖం అనే స్వార్ధ చింతన ఎప్పుడూ దగ్గరకు రానీయలేదు. చెల్లెలు, వనజా, తమ్ముడు ప్రకాశం భవిష్యత్తే ధ్యేయంగా పెట్టుకొని సర్వ సుఖాలనీ త్యజించి వేసింది. దైహిక వాంఛలూ , సంసార బంధాలు తెంపుకొన్న క్రైస్తవ మిషనరీలకు యే శక్తి ఐతే నడిపిస్తుందో అదే శక్తి జయమ్మ లోనూ ప్రవేశించింది.
    ఇప్పుడు చెల్లెలూ, తమ్ముడూ ఇద్దరూ పెద్ద వాళ్ళయ్యారు. చదువు కొంటున్నారు. పంతులమ్మ కిప్పుడు జీవితంలో రెండే రెండు కోర్కెలు ! ప్రకాశాన్ని బాగా చదివించి గొప్ప వాణ్ణి చేయటం ఒకటి! వనజ ను - తనలాగా కాకుండా - తగిన సంబంధ మొకటి చూసి ఒక ఇంటి దాన్ని చేయటం రెండోది. ఇవి రెండూ నెరవేరిన నాడు హాయిగా ఒక నిట్టుర్పు విడవవచ్చు. అప్పటికి జీవితంలో తాను సాధించిన దిది అని చెప్పుకోటానికి కొంత లెక్క తేలుతుంది.
    పంతులమ్మ తమ పేదరికాన్ని కప్పి పుచ్చుకోవాలనే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. ఒకరోజు మాటల సందర్భం లో తమ చరిత్ర నంతా దాపరికమేమీ లేకుండా చెప్పి వేసింది. అంతా విన్న రాజు మనసులో ఆమె స్వార్ధ త్యాగానికి, అచంచల మైన ఆమె ఆత్మ విశ్వాసానికి జోహారు అర్పించాడు.
    "మిమ్మల్ని ఆదరించి, మీకు దారి చూపించిన ఆ మహనీయుడు ఎవరో గాని ఆయనకు చెయ్యెత్తి మొక్కాలని పిస్తుంది. అయన ఇప్పటికీ మీ యోగక్షేమాలు కనుక్కొంటూ ఉంటారా?"
    పంతులమ్మ తల ఊపింది. "లేదు. బహుశా మమ్మల్ని మర్చి పోయి ఉంటారు. అయన సహాయం పొందిన అనాధలు లెక్క లేనంత మంది ఉంటారు. కాని మేము మాత్రం మర్చి పోలేదు. ఉదయమే లేచి ఆయనకు నమస్కరిస్తూ ఉంటాము. గదిలో వారి ఫోటో ఉన్నది. రా బాబూ చూపిస్తాను." అంటూ పంతులమ్మ పైకి లేచింది. అయన గారి పట్ల కృతజ్ఞత భావంతో ఆమె కంఠం అర్ద్రమై పోయింది. ముఖాన్ని అనంతం చేసుకొని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ గదిలోకి దారి తీసింది.
    ఫోటో చూసిన రాజు ఆశ్చర్యానికి మేర లేకపోయింది. అది తన తండ్రి సత్యనారాయణ గారిది. నాన్నగారు ధర్మబుద్ధి తో సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఆశ్చర్య మేమీ లేదు. కాని - అనుకోకుండా -- వాళ్ళలో వీరు కూడా -- ఈ స్థితిలో తనకు తటస్థ పడటం విధి వైపరిత్యమే! తన ముఖంలో మారుతున్న రంగులను పంతులమ్మ గమనించే లోపలే రాజు గదిలోంచి బయటకు నడిచాడు.
    "ప్రపంచం లో దయా దాక్షిణ్యాలింకా నశించి పోలేదు బాబూ. అందువల్లనే ఈ ప్రపంచ మింకా నిలిచి ఉంది. నాకు మానవుల మంచితనం మీద నమ్మకముంది." పంతులమ్మ ఎవర్ని గురించి ఆ మాటలు అంటున్నదో రాజు గ్రహించాడు. 'ఔను . మీకా నమ్మకం కలగటం లో అసహజమైన దేమీ లేదు" అన్నాడు రాజు.
    అంతవరకూ మౌనంగా మఫ్లరు అల్లికలో లీనమై ఉన్న వనజ చటుక్కున తలెత్తి "నీకున్నదేమో గాని నాకు మాత్రం లేదు" అన్నది. అవసరం లేకపోయినా తమ హీనస్థితి అందరికీ చెప్పుకోవటం వనజ కిష్టం లేదు.
    "ఏం , ఎందుకు లేదు?' అంత వరకూ మౌనంగా కూర్చుని ఉన్న ఆనందరావు ప్రశ్నించాడు.
    ఆనందరావు ఆ రోజే రాజుకు పరిచయమయ్యాడు. అతనికి ఆ కుటుంబాని కీ ఉన్న బాంధవ్య మేమిటో తెలియదు గాని వారికతడు చాలా ఆప్తుడని మాత్రం గ్రహించాడు. కొన్ని కొన్ని విషయాల్లో పంతులమ్మ అతని సలహాలు తీసుకోటం, మాటల సందర్భం లో చాలాసార్లు అతణ్ణి గురించి చెప్పడం రాజు ఇది వరకే గుర్తించాడు. కాని పరిచయం మాత్రం ఈరోజే జరిగింది. అతనికి హర్భారు లో ఏదో ఉద్యోగం. ప్రతి ఆదివారం వాళ్ళింటికి వచ్చి, కాసేపు కూర్చుని యోగక్షేమాలు తెలుసుకొని పోతుంటాడు.
    వనజ ఆనందరావు ప్రశ్నకు సమాధాన మేమీ చెప్పలేదు. ఆనందరావు అంతటితో ఊరుకోకుండా "మరి తమరికి దేనిలో నమ్మక ముందో దేనిలో లేదో సెలవిస్తారా?" అన్నాడు వెటకారంగా.
    వనజ అతని వేపు  వాడి చూపు నొకదాన్ని విసిరి, వెటకారం గానే సమాధానం చెప్పబోయి, అంతలోనే మనసు మార్చుకొని "రైలు పట్టాల మీద నడుస్తుందంటే నమ్ముతాను. ఆకాశంలో ఎగురుతుందంటే నమ్మను" అన్నది.
    పంతులమ్మ తో సహా అందరూ నవ్వేశారు.
    "వీళ్ళిద్దరికి ఒక్క క్షణం కూడా పడదు. రేపు పెళ్ళయిన తర్వాత కూడా ఇలాగే పోట్లాడు కుంటారో ఏమో?" అన్నది పంతులమ్మ ఇద్దరి వేపూ ప్రేమాగా చూస్తూ.
    ఆనందరావు కూ, కుటుంబానికి ఉన్న బాంధవ్య మేమిటో రాజు కిప్పుడు స్పష్టంగా బోధపడింది.
    వివాహ ప్రసక్తి రాగానే వనజ లేచి కాఫీ తెస్తాననే నెపంతో లోపలి కెళ్ళిపోయింది, అంతలోనే ప్రకాశం వచ్చాడు. విరిగిపోయిన బ్యాటు ఊపుకుంటూ. ప్రకాశం సన్నగా, పొడవుగా ఎప్పుడూ ఉషారుగా ఉంటాడు. ఎప్పుడూ కౌ బాయ్ లా డ్రస్సూ, తమాషాగా మాట్లాడుతుంటాడు. అతనుంటే నవులకి కోదవ్వుండదు. వస్తూనే "అక్కా ఇవ్వాళ లేచి ఎవరీ ముఖం చూశానో చెప్తావా? నాకు గుర్తు లేదు. వెధవది ఈ మధ్య ఆలోచనలు ఎక్కువై, బుర్ర హౌస్ ఫుల్ ఐపోతోంది, హల్లో డాక్టర్ సాబ్ . మీరెప్పుడు వచ్చారు? కుశలమే కదా.... అంటూ మొదలెట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS