Previous Page Next Page 
తప్పు పేజి 6

   
    'మరొక్క మాట. నా చెల్లెల్ని కంఠం లో ప్రాణం వుండగా అయన తీసుకు వెళ్ళలేడు. క్షుర కర్మ .....' విశ్వనాధం కళ్లల్లో నీళ్ళు టప్పున రాలిపడ్డాయి: '...యిరవై యేళ్ళు నిండని నా చెల్లెలికి మూడాచారాలతో నేను యింత కఠిన శిక్ష విధించదలుచుకాలేదు. మీ బ్రాహ్మణ్యం మంట కలిసి పోతుందనే బెంగ మీలో యెవరికైనా వున్నట్లయితే నా యింటికి యెవరూ రానవసరం లేదు. కాలం యెంతో మారిపోయింది. ఈ విషయం చర్చించేందుకే అయన పనిగట్టుకుని మిమ్మల్నందర్నీ పిలిచాడు. హత్య చేశాం అని ఆరోపించాడు. భగవంతుడు తప్పకుండా క్షమిస్తాడు నేనావిధంగా చేయనందుకు.'
    'ఈ యింట నిప్పులు కడిగే ఆచారాలు మేమేమీ అమలు జరపదలుచుకోలేదు. నా చెల్లెలు క్షురకర్మ చేయించుకుని తెల్లటి బట్టలతో సంప్రదాయాల్ని వమ్ము చేయకుండా తిరుగుతుందనే భ్రమ అయన పెట్టుకోనవసరం లేదు.'
    'మరో మాట. అయన ఆస్తి పాస్తులతో మాకేమీ సంబంధం లేదు. యిక యీ యింటి తో సంబంధం బాంధవ్యాలు ఆయనకి లేవని కూడా చెప్పండి. విష్ణుమూర్తి పోయిన వెంటనే వున్న సంబంధం తెగిపోయింది.'
    'నియమనిష్ఠలవీ మమ్మల్ని వుద్దరించవు. రేపు కాకపోయినా మరో రోజు నేను నా చెల్లెలికి పునర్వివాహం చేస్తానన్నా మీరేమీ ఆశ్చర్య పోనక్కరలేదు. మీరీ మాటలు మాట్లాడిందుకే వచ్చి నట్లయితే నేను బ్రాహ్మణ్యానికి కళంకం తీసుకువచ్చిన వాడిని కనుక మీరు వెళ్ళి పోవచ్చును.' విశ్వనాధం గిరుక్కున తిరిగి గదిలోకి వచ్చాడు. గోవింద ద్వార బంధానికి నిలుచున్నదల్లా పట్టుదప్పి పడిపోయేట్లయింది. విశ్వనాధం చెల్లెల్ని గుండె ల్లోకి తీసుకుని చంటి పిల్ల వాడిలా కుమిలి కుమిలి యేడ్చాడు.
    విశ్వనాధం చొరవగా మాట్లాడగానే చాలామంది చల్లగా దాతుకున్నారు. దీక్షితులు వొంటరివాడైపోయాడు. అతని డబ్బు చెక్కు చెదరదనే దృడ నిశ్చయం మనసులో కోటి దీపాల్ని వెలిగించింది. పైకి మాత్రం విశ్వనాధం వంశాన్నీ,  కోడలి శీలాన్నీ దుయ్యి బడుతూ భార్యతో సహా ఆ సాయంత్రమే బండి యేక్కాడు.
    విష్ణుమూర్తి స్నేహితుడు. హైదరాబాదులో పేరు పొందిన లాయరు. అతను విషయాలన్నీ విని కేసు పెట్టమని రకరకాలుగా చెప్పాడు. విశ్వనాధం మౌనం వహించి వూరుకున్నాడు.
    గోవింద కి అప్పుడే సుఖంగా ప్రసవం జరిగింది. పసివాడి యేడుపు సైతం గోవిందని కదిలించ లేకపోయింది.' యేడుస్తున్న వాడిని మీనాక్షి గోవింద పక్కగా పడుకో బెడుతూ "ఏం చేస్తాం వీడెం చేశాడు మధ్య. వీడిని కూడా పోగొట్టుకోకు అవివేకంతో ' అన్నది.
    కనురెప్పలు పైకెత్తి అప్పుడు అన్నా వదిన ల వైపు చూసి బావురుమంది. 'వీడు ఈ దౌర్భాగ్యుడు పుట్టాకే నా తలరాత బ్రద్దలయింది. దరిద్రుడిని యెవరి కైనా యిచ్చేయి వదినా.'
    మీనాక్షి గోవింద తల మీద చేయి వేసి నెమ్మదిగా అంది. 'ఒకళ్ళ అయః ప్రమాణానికి మరొకళ్ళు బాధ్యులంటే నేను ఒప్పుకోను గోవిందా. పల్లెటూరి వదినకి యీ విషయాలు అంతగా తెలియవు. చడుకోక పోయినా అర్ధం చేసుకుంటే మూర్కులకి సైతం తెలిసి పోతుంది. చూడు గోవిందా! బాబు అతని గుర్తుగా భగవంతుడు నీకు యిచ్చిన కానుక. బాబుని కూడా పోగొట్టుకుని ఏం బావుకుంటావు? గోడ్రాలి నైన నాకు బిడ్డ తీపి తెలియదనుకో. అయినా అభం శుభం యెరగని పసివాడి మీద మన కోపతాపాలు అంత మంచివి కావు. పోనీ మన లాయరు గారు పెంచుకుంటానన్నారు . యిచ్చేదా!
    గోవింద హృదయం లో వీలుచూసి బరిసె దిగేసినట్లయింది.విశ్వనాధం యింటికి యిప్పుడు యెవరూ రారు. ఆఫీసులో సాటి గుమస్తాలూ, విష్ణుమూర్తి కి సన్నిహితులూ తప్ప.
    హాస్పిటల్లో దూరంగా నిలుచుని శోకానికి నిలయం లా వున్న గోవిందని సానుభూతి గా చూడసాగాడు చటర్జీ.
    బలరాం చటర్జీ తల్లి దండ్రులూ తాత ముత్తాతలూ అందరూ ఆంధ్రులే. బలరాం ని చిన్నప్పటి నుంచీ పక్కింటి బెంగాలీ దంపతులు చేరదీశారు. ఆంధ్ర దేశం విడిచి వెళ్ళిపోతూ అయన ఆర్జించిన పాతిక  ఎకరాల సుక్షేత్రాన్ని బలరాం పేర రాసి మరీ వెళ్ళాడు. పెంచిన మమకారాన్ని , ఋణభారాన్నీ అంత తేలికగా తెంపుకోలేని చటర్జీ సంవత్సరానికోసారి బెంగాల్ వెళ్ళి తల్లి అనీనూ చటర్జీ ని తండ్రి సోమేంద్రనాధ చటర్జీ ని చూసి వస్తుంటాడు.
    బలరామ్ తల్లి దండ్రులు కూడా వున్న వాళ్ళే. యిద్దరు మగపిల్లల్లో చిన్నవాడు అమెరికా వెళ్ళి అక్కడే అమెరికన్ యువతిని పెళ్ళాడి యిండియా కి వచ్చి సెలవలు తల్లి తండ్రుల దగ్గర గడిపి వెడుతుంటాడు. చటర్జీకి వివాహం పట్ల విముఖత్వం లేకపోయినా యింతకాలం అతనికి నచ్చిన పిల్ల దొరకలేదు. కుల గోత్రాలతో అతన్నెవరూ బందించలేదు పెద్ద కొడుక్కి పెళ్ళి అయితే చాలని తల్లి తండ్రులు యెదురు చూస్తున్నారు. యిద్దరన్నల మధ్య గారాబాల రాధిక డాక్టరు. ఉస్మానియా హాస్పిటల్లో వుద్యోగం చేస్తోంది. గోవిందని చూసినప్పుడు తను డాక్టరైనా సంగతి మరిచిపోయి బేలగా కూర్చుండి పోయింది.
    ఒకప్పుడు రాధిక విష్ణుమూర్తి ని చేసుకోవాలనే తన అభిప్రాయాన్ని అన్నతో చెప్పింది. అతను విషయాన్ని కదపక మునుపే విష్ణుమూర్తి పెళ్ళి చేసుకోవడం, భార్యతో రావడం కూడా జరిగిపోయింది.
    రాధిక అందుకు విచారించలేదు. ప్రాప్తం అని సరిపెట్టుకుంది. క్లాస్ మేట్ నంద గోపాల్ ఆ తరువాత కొలీగ్ అయి తనని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఖచ్చితంగా అన్నది. ప్రేమేవిటి నాన్సెన్స్, పెళ్ళి చేసుకుంటానని చెప్పు. వెళ్ళి అమ్మ నాన్నలకి చెబుదాం . ప్రేమంటూ నీతో షికార్లు కొట్టిందుకు నాకు టైము లేదు. పెళ్ళి చేసుకుందాం అంటావా... టైముని కల్పించుకుని నీతో యెక్కడికి రమ్మన్నా వస్తాను.' అది విని అతను ముందు తెల్లబోయాడు. తేరుకుని రాధిక తెలివి తేటలకి మనసులోనే అభినందనలు తెలిపాడు. మంచి మనసుతో అతను వచ్చి అడగగానే రాధిక తల్లి తండ్రులు తమ అంగీకారాన్నీ కార్యరూపం లోకి రెండు మాసాల్లో తీసుకు వచ్చారు. రాధిక యిప్పుడు నందగోపాల్ యిల్లాలు. యిద్దరూ ఉస్మానియా హాస్పిటల్లోనే పని చేస్తున్నారు. అంతకు పూర్వం వరంగల్ లో చేసేవాళ్ళు. నంద గోపాల్ ఎమ్.డి. కూడా పూర్తి చేశాడు.
    చటర్జీ తన కొడుకుని పెంచుకుంటాడని అన్నావదినలు అనడంతో గోవిందకి ఒక్కసారి ఆ యింటి వాతావరణం మీదికి దృష్టి మళ్ళింది. అతని తల్లితండ్రులు చటర్జీ మాటకు చాలా విలువయిస్తారు.
    గోవింద తల పక్కకి తిప్పి చూసింది. అంతవరకూ యేడ్చి యేడ్చి వున్న బాబు అప్పుడే వదిన చేతుల్లో కళ్ళు మూసుకున్నాడు. పుట్టి నాలుగైదు రోజులు అయిందో లేదో వాడు పై పాలే తాగుతున్నాడు. గోవింద అంతరాత్మ తలెత్తి "నీకు కొంచెం ఆలోచనాశక్తి అవసరం గోవిందా! తల్లివి కదా. పిల్లాడి పట్ల కనికరం వుండద్దా' అన్నది.
    అసలే చిన్నగా గులాబీ పువ్వులా మృదువుగా వున్న బాబు తల్లి పాలు లేని కారణంగా నాలుగు రోజులకే చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. వాడి పక్క యెముకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉచ్చ్వాస విశ్వాసాలు చేస్తుంటే. కిటికీ దగ్గర నిలుచుని చెల్లెలితో కబుర్లాడుతున్న చటర్జీ బూట్లు టకటక లాడించుకుంటూ గోవింద వున్న మంచం దగ్గరికి రాగానే పక్కలో బాంబు ప్రేలినట్లు అదిరిపడింది. తననుండి బలవంతంగా బాబుని లాక్కు పోయేందుకు వచ్చిన మాంత్రికుడి లా కనిపించాడు. కళ్ళు మూసుకుంటే విష్ణుమూర్తి జాలిగా కనిపించి 'నిన్ను వదిలి వెళ్ళిపోవాలని నాకెలా వుంటుంది చెప్పు గోవిందా. నన్ను దేవుడు త్వరగా పిలిచాడు. వెళ్ళిపోక తప్పింది కాదు. బాబు చూడు ఎంత బావున్నాడో. నా పోలికలు రావాలని కోరుకునే దానివి. అ ముక్కూ, కళ్ళూ, పెదాలు అన్నీ నావే. పొతే రంగు నీది. వాడిని కూడా దూరం చేసుకుని ఒంటరిగా బ్రతకలేవు గోవిందా. చటర్జీ మంచివాడే కానీ నా రూపం నీ దగ్గర కదలడం వేరు, పైవాడు చటర్జీ దగ్గర పెరగడం వేరు. తల్లీవీ తండ్రివీ కూడా అయి పెంచాలి బాబుని.' అన్నట్లనిపించింది.
    గోవింద వదిన చేతుల్లో పిల్లాడిని తీసుకుని ఆత్రంగా ఆబగా చాలా ఆశగా అత్యంత ప్రేమతో హృదయానికి హత్తుకుంది.
    సాయంత్రం ఆరుగంటల కాగానే హాస్పిటల్లో గంట కొట్టారు విజిటర్స్ ని వెళ్ళి పోమంటూ.
    'బాబుని జాగ్రత్త' అంటూ వెళ్ళిపోయారు అన్నా వదినలు. చటర్జీ కాస్సేపు నిలుచుని వాడి బుగ్గ మీద చిటికే వేసి చెల్లెలు రాగానే 'వస్తామండీ' అంటూ సెలవు తీసుకున్నాడు.
    హాస్పిటల్లో లైట్లు వెలిగాయి. హడావుడిగా సందడిగా వెళ్ళిపోతున్నారు రోగుల్ని చూసేందుకు వచ్చినవారంతా. తెల్లటి గౌను వేసుకుని నైట్ డ్యూటీ లో చేరేందుకు వచ్చారు నర్సులు. డాక్టర్ల లో చాలామంది వెళ్ళిపోయారు. నర్సుల్ని చూస్తుంటే గోవింద కి నర్సు కోర్సు కి వెళ్ళాలని పించింది. ఉద్యోగం చేసిన ఈ మధ్య కాలంలో విష్ణుమూర్తి యేడెనిమిది వేలు మాత్రం దాచి వుంచాడు. వాటితో పిల్లవాడిని పెంచి పెద్ద చేయాలంటే తన వల్ల నౌతుందో లేదో అనిపించింది. బాబు ఎప్పుడు పెరిగి పెద్ద వాడవాలి? ఎప్పుడు వాడికి లోక జ్ఞానం రావాలి? ఎన్నేళ్ళు తను ఒంటరిగా బాధ్యతతో సంచరించాలి? గుక్కెడు ప్రాణం తీసుకుంటే ఏం?
    బాబు నిద్రలో కెవ్వు మన్నాడు. గోవింద తెప్పరిల్లింది. విష్ణుమూర్తి అదృశ్యంగా తనకి నీడ పట్టి కాపలా కాస్తున్నట్లు వుంది. తను ప్రాణం తీసుకోవాలని వూహ మాత్రంగా అనుకోగానే పసివాడు ప్రపంచం బ్రద్దలై పోతున్నట్లు కేక పెట్టాడు.
    గోవింద కి ఆలోచనలతో నిద్ర వుండేది కాదు. యిదివరకు మాదిరి పిల్లాడి పట్ల నిర్లక్ష్య భావంతో ఆదమరిచి నిద్రపోలేక పోతోంది. వాడికి ఆకలి వేసే వేల్టికి యెవరో కమ్చీతో కొట్టినట్లు తెలివి వొస్తోంది. పదిరోజులు హాస్పిటల్ లోనే వుండిపోవాల్సి వచ్చింది గోవిందకి. మధ్యలో ఒకరి రెండు సార్లు బాబుకి నలతగా వుండి జ్వరం రావడంతో యింటికి వెళ్ళేందుకు వీలులేక పోయింది.
    కాలం వేసే ముద్ర గమ్మత్తుగా వుంటుంది. నిన్నటి రోజున తగిలిన బలమైన గాయం మరో రెండు రోజుల్లో మానిపోవడం సహజం. మనసుకి తగిలిన గాయం పూడడం కొంత వ్యవధి ఎక్కువ తీసుకుంటుంది. గాయం మానిపోయినా దాని తాలుకూ మచ్చ మాసిపోదు.
    నెలలు గడుస్తుంటే బాబు పెంపకం లో తనని తాను మరిచిపోగల్గుతోంది గోవింద. చాలసార్లు వుద్యోగం చేయాలనీ అనుకునేది. అయినా పసివాడిని వదిలి ప్రొద్దున వెళ్ళి సాయంత్రం వరకూ చాకిరీ చేసేందుకు మనస్కరించేది కాదు. విశ్వనాధం, మీనాక్షీ చంటి వాడిని ప్రాణప్రదంగా చూసుకుంటున్నారు. మూదు నెలలప్పుడు మీనాక్షి యింట్లో బాబుకీ యే లోటూ రానివ్వకుండా వేడుక చేసింది. పసివాడు తండ్రి లేనంత మాత్రం లో అనాధ అయిపోవడం ఆవిడకు ఆశుభంగా తోచింది.
    ఆరునెలలు రాగానే తల పైకెత్తి వుయ్యాలచుట్టూ చేరిన వాళ్ళందర్నీ వాడు చక్రాల్లాంటి కళ్ళతో పోల్చుకోవడం ప్రారంభించాడు. పరిచయం వున్న మనుష్యులైతే బోసి నోటితో నవ్వడం, తల్లీ, మేనత్తా , మేనమామ లైతే కాళ్ళూ చేతులూ ఆడిస్తూ సంతోషం వెలిబుచ్చడం కొత్త వాళ్ళయితే యేడుపు మొహం వేయడం, మీనాక్షి ఆశ్చర్యంగా భర్త ఆఫీసు నుంచి రాగానే పూస గ్రుచ్చి నట్లు అన్ని విషయాల్నీ అతనితో యెకరువు పెట్టి అతనికి మాటల హారాల్నీ మెడలో వేసేది.
    చటర్జీ రాగానే పసివాడు కాళ్ళు తటపటలాడిస్తూ చేతుల్నీ అందించేందుకు తాపత్రయ పడేవాడు. చటర్జీ రాకను విశ్వనాధం అభ్యంతరం చెప్పలేదు. అతను ఒక విధంగా లోకం పోకడ తెలిసిన మనిషి. చటర్జీ తన మనసులో మాట చెప్పినప్పుడు ఆ విషయాన్ని మీనాక్షి కి చెప్పి సమయం కోసం యెదురు చూడసాగాడు. పసివాడిని చటర్జీ యెత్తుకుని ముద్దులతో ముంచెత్తుతున్నప్పుడు 'బాబు తండ్రి వుంటే' అనుకునేది గోవింద మనసులో. తండ్రి లేని బాబుని చూస్తుంటే సామ్రాజ్యాన్ని కోల్పోయి కిరీటాన్ని పారవేసుకున్న సామ్రాట్టు లా అనిపించేవాడు. పసివాడు బట్టలు తడిపినా చటర్జీ  అసహ్యించుకునే వాడు కాడు. అతని ఈ రాకకి అంతర్యం గోవింద కి అంతు చిక్కేది కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS