Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 6


    ఒక ఫర్లాంగు నడిచేసరికి లైటు వెలుగు, చుట్టూ మనుష్యుల గోల-హరికథ మాటలు వినపడ్డాయి. మరో నాలుగడుగులు నడిచి రామాలయం దగ్గిరకి చేరింది వాణి- చిన్న రామాలయం మండపంలో పెట్రోమాక్సు లైటు వేలాడ దీసారు-హరికథ చెప్తున్నాడు హరిదాసు- పిల్లపెద్ద మగ ఆడ యించుమించు ఊర్లో అంతా అక్కడే చేరినట్టున్నారు- వాణి చుట్టూ చూసింది అంతా హరికథలో మునిగివున్నారు. ఎవరిని ఏం అడగడమో తెలియలేదు- అంతలో కాస్త దూరంగా విప్పేసి వాల్చివున్న రెండ్లెడ్ల బండి కన్పించింది వాణికి- ప్రాణం లేచివచ్చినట్లయి చకచక అటు నడిచింది. బండిమీద బండి వాడు గాబోలు శాలువా కప్పుకుని మఫ్లర్ కట్టుకుని ముడుచుకుని కూర్చుని హరికథ వింటున్నాడు. "ఏయ్.....ఈ బండి నీదేనా!" అందివాణి.
    వెనకనించి వచ్చిన వాణిని అతను చూడలేదు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ఆశ్చర్యంగా.
    వాణిని వింతగా చూస్తూ తలాడించాడు- "కొంచెం ఈ బండి కడ్తావా ప్రక్క వూరుకి-ఐదుమైళ్లేట-డబ్బిస్తాలే-తోవలో బస్సు పాడయిపోయింది. ఎప్పటికి బాగవుతుందో తెలియదు- నే వెళ్ళేసరికి చాలా ఆలశ్యం అయిపోయేట్టుంది-కాస్త బండికట్టి దింపి పెడతావా" వాణి ఆరాటంగా తన గోడు విన్పించింది- అర్ధిస్తున్నట్టుగా చూసింది.
    అతను వాణిని ఎగాదిగా చూసి "ఎక్కడి కెళ్ళాలక్కడ" అన్నాడు.
    "ఎడ్రసుందిలే నా దగ్గిర- రాజారావు గారింటికి అంటే ఎవరన్నా చెప్తారట- ఏం కడ్తావా?" ఆశగా అడిగింది.
    అతను మరింత ఆశ్చర్యంగా చూస్తూ..."ఒక్కరేనా" అన్నాడు.
    "ఊ....ఒక్కర్తినే"
    అతను వాణిని మరోసారి చూసి- ఏదో ఆలోచించి తలాడించి లేచాడు. ఎద్దుల్ని తెస్తాను-యిక్కడే వుండండి" అంటూ వెళ్ళాడు- కూచున్నప్పుడు శాలువా కప్పుకుని చీకట్లో వుండడంచేత వాణి అతన్ని సరిగా గుర్తించలేక పోయింది. కాని అతను లైటు వెలుగులోంచి వెడ్తూంటే చూసి ఆశ్చర్యపడింది. అతను కట్టుకున్న పంచె, చెప్పులు చూసి ఆశ్చర్యపడింది. బండివాడా అనుకుంది. తనేమో ముందు వెనక ఆలోచించకుండా మన్నించకుండా మాట్లాడింది. అతని మాట, అతని తీరు చూస్తే బండివాడిలా లేడే, ఏమను కుంటాడో నొచ్చుకుంది వాణి.
    "రండమ్మాయిగోరూ- ఎక్కండిబండి" అన్నాడు బండీవాడు- వాణి ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి వాస్తవం లోకి వచ్చింది- బండిలో గడ్డిమీద జంబుకానా పరిచి చేత్తో సరిచూస్తూ"ఎక్కండమ్మాయిగోరూ" అన్నాడు.
    వాణి బండి ఎక్కగానే చక్రం మీదనించి ఛంగున తొట్లోకి ఎగిరి కూర్చున్నాడు అతను. అతన్ని మరోసారి దగ్గిర నించి చూసిన వాణికి అతను మామూలు బండీవాడు కాదన్నది స్పష్టపడింది.
    "మీరు రాజారావుగారి బంధువులేటండి- ఎప్పుడూ ఇదివరకు రాలేదేమిటి ఇక్కడికి- ఏ వూర్నించి వస్తున్నారండి" బండి నడుపుతూ ఆరాలు మొదలుపెట్టాడు.
    వాణి వూరు పేరు చెప్పగానే ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి "మీరేనేమిటి రాజారావుగారి పెళ్ళికూతురుగారు" అన్నాడు. వాణి ఆశ్చర్యపోయింది.
    "రాజారావుగారు నీకు తెల్సేమిటి!"
    "తెలీకపోవడం ఏమిటండి-ఆరు...ఆరి పొలాలన్నీ నేనే కౌలుకు పుచ్చుకున్నానండీ- ఆరిని తెలీకపోవడం ఏమిటి? ఈ చుట్టుపక్కల వారిపేరు తెలీనివారు లేరండి."
    అప్పుడే పెళ్ళి కబురుకూడా తెల్సిపోయిందన్నమాట అనుకుంది వాణి.
    "అయితే అమ్మాయిగోరూ- యిదేటండీ యిలాపెళ్ళి కాకుండానే అత్తోరింటికి బయలుదేరారేమిటి?" ఏమిటీ అనవసర ప్రశ్నలు అని అనుకోకుండా వుండలేకపోయింది వాణి.
    "వారి అమ్మగారికి వంట్లో బాగులేదు కదా అందుకు-అదిసరే గాని నీ పేరేమిటి అడగనే లేదు- అసలు యీ బండి నీదేనా- చూస్తే నీవు బండివాడిలాగ లేవే" ఇందాకటినించి అడగాలనుకుంటున్న ప్రశ్నలు యింకా అడగకుండా వుండలేక పోయింది వాణి.
    "నా పేరు కిశోర్ అండి."
    "అబ్బో-మంచిపేరే పెట్టుకున్నావే" వాణి నవ్వుతూ అంది.
    "నేను మామూలు బండివాడ్ని అనుకుంటున్నా రేమిటి-ఏదో అడిగారు కదా, ఆడపిల్ల గదా. రాత్రి పాపం-సర్లే అన్నాననండి- నేనేం అల్లాటప్పాననుకున్నారేమిటి- నేనేం సదూరాని మామూలు బండివాడిని కానండమ్మాయిగోరూ" గర్వంగా అన్నాడు- "మాకు పొలాలు, పాడిగట్రా వుందండి."
    "అలాగా...ఏం చదివేవు-"
    "మెట్రిక్ సదివానండి. అంతేనేమిటండి- పుస్తకాలన్నీ చదివేస్తా నండి"
    "మరి మీ వూర్లో పుస్తకాలు దొరుకుతాయేమిటి?"
    "దొరక్క పోతేనా పట్నం ఎల్లి తెచ్చుకోలేనేటండి-లేదంటే ఏ బస్సులవాళ్ళని తెమ్మన్నా తెస్తారండి- కొన్ని పోస్టులో తెప్పిస్తానండి. పుస్తకాలకే ఏభై రూపాయలవుతుంది."
    "అయితే మీరు నా కంటే నయమే పల్లెటూర్లోవున్నా పుస్తకాలు చదువుతున్నారు."
    "అదేమిటండోయ్. హఠాత్తుగా మీరు అనేస్తున్నారు- ఇందాకటినించి లేనిది-" వాణి జవాబు చెప్పడానికి కాస్త తడబడి- "మీరేదో మామూలు వాళ్ళనుకుని అనేశాను అసలు ముందు మిమ్మల్ని చూసినపుడే అనిపించింది."
    "ఏమనిపించింది?" కొంటెగా అడిగాడు కిషోర్, ఏమనిపించింది? అట్టే రంగులేకపోయినా ఎత్తుగా, దృఢంగా ఆశ్చర్యంగా- నీట్ గా చెంపలు పెంచి, ఈ కాలంలా పూర్తిగా కాకపోయినా జుత్తు కాస్త పొడవుగానేవుంది- చేతులు దృఢంగా వున్నా మొరటుగా మట్టిలో పనిచేసే చేతుల్లా అసహ్యంగాలేవు. తళుక్కుమనే పలువరుస-కట్టుకున్నబట్టలు- చెప్పులు ఖరీదయినవి- ఇవన్నీ చూడగానే ఎవరయినా మామూలు పల్లెటూరి రైతు అనుకోరు- అదే వాణి అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS