విలువలు మారాయి
"అమ్మమ్మగారూ! మీరేమిటి ఇక్కడున్నారు?" అందరికీ దూరంగా, వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న రాజేశ్వరమ్మ ఆ మాటకి తలెత్తి చూసింది. ఎదురుగా నిలబడ్డ అమ్మాయిని గుర్తుపట్టలేక "ఎవరమ్మా నీవు? నన్నెవరనుకుంటున్నావు?" ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది.
"నా పేరు వందన. మీరు శ్రీనగర్ కాలనీలో వుండేవారు కదా మా అమ్మమ్మ వరలక్ష్మిగారింటి పక్కన..." కుతూహలంగా అంది ఆ అమ్మాయి.
"ఆ... అవునవును, సుబ్రహ్మణ్యంగారు, రిటైర్డ్ జడ్జి, వరలక్ష్మిగారి మనవరాలివా?" ఆశ్చర్యానందాలతో అంది రాజేశ్వరమ్మ.
"అవునండి. మా అమ్మ సునీతతో కలిసి సెలవులకి అమ్మమ్మగారింటికి వచ్చినప్పుడల్లా చాలాసార్లు మిమ్మల్ని చూశాను. అప్పుడు చిన్నదాన్ననుకోండి, అయినా మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టాను" అంది వందన.
"చాలా సంతోషం తల్లీ! మీ అమ్మమ్మగారు పోయాక నాకు మాటా-మంచీ చెప్పుకునే తోడు కరువయ్యారు. అప్పటినించీ మీరంతా రావడమూ తగ్గిపోయింది. అంతేమరి! తల్లి పోతే తరం పోతుందంటారు. మీ తాతగారూ, అమ్మమ్మా రెండేళ్ల తేడాతో పోయారు. దాంతో ఆ యింటి కళే పోయింది. ఇప్పుడు మీ మామయ్య వున్నారనుకో! అంతేనమ్మా ఆడపిల్లలకి తల్లి వున్నన్ని రోజులే పుట్టిల్లు. అన్నట్టు, ఇక్కడికెందుకు వచ్చావమ్మా?" పాత బంధువుని చూసినట్టు ఆప్యాయంగా అంది రాజేశ్వరమ్మ.
"నేనొక టి.వి. ఛానల్లో పనిచేస్తున్నానండి. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కవరేజ్ ప్రోగ్రాం వుంటే షూటింగని వచ్చాను. అవునూ, మీరేమిటిక్కడ? మీ ఇల్లూ, మీ వారూ..." ఆశ్చర్యంగా అడిగింది.
రాజేశ్వరమ్మ విరక్తిగా నవ్వి నిట్టూర్చింది.
"మావారూ లేరు, మా ఇల్లూ లేదు యిప్పుడు. అలా కుర్చీ లాక్కొని కూర్చోమ్మా!"
"అదేమిటి?" కుర్చీలో కూర్చుంటూ అడిగింది వందన.
"అవునమ్మా, ఆయన పోయి నాలుగేళ్లయింది, ఇల్లు పోయి ఆర్నెల్లయింది."
"మీ అబ్బాయి, అమ్మాయి వుండాలిగా?" తెల్లబోయింది వందన.
"అమ్మాయి దాని కాపురం అది చేసుకుంటూ బెంగుళూరులో వుంది. అబ్బాయిక్కడే వున్నాడు."
"మరి?"
"వదిలేయమ్మా, అవన్నీ ఎందుకిక్కడ? చీకూ చింతా లేకుండా నిశ్చింతగా, ప్రశాంతంగా బాగుందిక్కడ" బలవంతంగా నవ్వింది ఆవిడ.
"ఆ ఇల్లు ఏమయింది?" వదలకుండా అడిగింది వందన.
"ఆ ఇల్లు లేదమ్మా, ఆ పక్కన ఎవరో స్థలం అమ్ముకుంటే మా స్థలం కూడా కలిపి అపార్ట్ మెంట్లు కడుతున్నారు. మాకు రెండు అపార్ట్ మెంట్స్ ఇస్తారట. పాత ఇంటి బదులు అనగానే ఎవరికైనా ఆశే గదమ్మా! మావాడూ మరి దానికి అతీతుడు గాదు గదా! నేనున్నన్ని రోజులూ వుండనీయరా అని బతిమాలా. 'మంచి ఛాన్స్. ఉట్టి మన ఇల్లయితే 250 గజాలే, ఎవరు కొంటారు? పక్కది, యిది కలిస్తే వెయ్యి గజాలు. అందుకే బిల్డర్ కొని అపార్ట్ మెంట్స్ కట్టడానికి ముందుకొచ్చాడు' అంటూ ఊదరగొట్టాడు. నేను రాలిపోయేదాన్ని. వాళ్లకి బోలెడు భవిష్యత్తుంది. వాడి ఆశలకీ, కోరికలకీ నేనడ్డుపడడం ఎందుకని ఒప్పుకున్నాను."
"అది సరే, ఓల్డ్ ఏజ్ హోమ్ లో వుండడం ఎందుకు... మీ అబ్బాయి ఎక్కడ వున్నారో అక్కడే వుండకుండా?"
"ఆ ఇల్లు పడగొట్టారు. వాడేదో చిన్న అపార్ట్ మెంట్ లో అద్దెకి వుంటున్నాడు. ఏడాదో, రెండేళ్లో అపార్ట్ మెంట్ తయారై చేతికి వచ్చేవరకు వాళ్లే ఇల్లు యిస్తారట. ఆ రెండు గదుల ఇల్లు వాడికే ఇరుకట, ఇక్కడ నీకు హాయిగా వుంటుంది. విశాలంగా తోట, ప్రత్యేకంగా గది, బాత్ రూమ్, టి.వి., పత్రికలు, ప్రార్థనకి మందిరం, టిఫిను, భోజనం అన్నీ వండి పెట్టి బాగోగులు చూస్తారు. ఇక్కడ కొన్నాళ్లుండు నీకు బాగుంటుంది అని యిక్కడ తీసుకొచ్చి చేర్చాడు" అదోలా నవ్వుతూ అంది.
"అదేమిటి? కాస్త పెద్ద ఇల్లు తీసుకుంటే సరిపోయేది కదా!" నొచ్చుకుంటూ అంది.
"లేదులేమ్మా, నేనిక్కడకి రాకముందు బాధపడ్డాను. వచ్చాక మంచి నిర్ణయమే వాడిది అనిపించింది. ఆ యిరుకు గదుల్లో బందీగా బ్రతికే కంటే హాయిగా విశాలంగా, శుభ్రమైన గాలి, వెలుతురు, అన్ని సదుపాయాలూ వున్నచోట - బాగానే వుంది నాకిక్కడ. సరే, మీ యింటి సంగతులు చెప్పు..."
కాసేపు అందరి విషయాలు చెప్పింది వందన.
"పోతే... అమ్మమ్మగారూ, ఈ వృద్ధాశ్రమంలో వున్నవాళ్లవి ఒక్కొక్కళ్లది ఒక్కొక్క కథండి. చూసేవాళ్లు లేక కొందరు, ఉండి కూడా చూడనివారు కొందరు, బరువు వదిలించుకున్నవారు కొందరు, తల్లిని చూసే తీరిక, కోరిక లేనివాళ్లు కొందరు... యిలా అనేక కారణాలతో యిక్కడ చేరారు. వీళ్లందరి గురించి ఒక స్టోరీ తయారుచేయడానికి వచ్చాను. మిమ్మల్ని యిక్కడ చూడడమే ఆశ్చర్యం. ఏదో విధంగా మిమ్మల్ని చాలా రోజులకి కలిశాను. అమ్మకి చెపుతా మీ గురించి..."
వందన వెళ్లాక అటే చూస్తూ కాసేపు ఆలోచనలో పడింది రాజేశ్వరమ్మ. పాతరోజులు గుర్తుకొచ్చాయి ఆమెకు.
గవర్నమెంటు అలాట్ చేసిన స్థలాలు - ఆ రోజుల్లో రెండొందల ఏభై గజాలు రెండువేల ఐదొందలు. ఆ డబ్బు జమ చేయడానికే ఎంత అవస్థ పడ్డారో గదా ఆయన. గవర్నమెంట్ ఉద్యోగాలకి ఆ రోజుల్లో జీతాలెంత గనక? తమ్ముడి చదువు, చెల్లెలు పెళ్లి బాధ్యత తీరగానే ఇటు పిల్లలూ ఎదిగివచ్చారు. వారి చదువులు, ఇంటి ఖర్చు, ప్రతి రూపాయి చూసి ఖర్చు పెట్టాల్సిన రోజులు. రిటైరయ్యేనాటికి రెండు గదుల కొంపన్నా వుండాలనే ఆయన తాపత్రయం, బాధ చూసి పుట్టింటివారు పెట్టిన రెండు పేటల పలకసర్ల గొలుసు అమ్మి ఆ స్థలం కొన్నారు. రిటైరయ్యాక చేతికొచ్చిన ప్రావిడెంట్ ఫండ్ లక్షన్నర నలభై ఐదువేలు ఖర్చుపెట్టి చిన్న డాబా ఇల్లు కట్టుకున్నారు. చుట్టూ కాస్త స్థలం, మధ్య రెండు పడక గదులు, హాలు, వంటిల్లు, భోజనాల గది, దేవుడి గది... తమ ఇల్లు ముచ్చటైన చిన్న కుటీరం.
తామిదరూ స్వంత ఇల్లు చూసుకుని పొంగిపోయారు. చుట్టూ వున్న కాస్త స్థలంలో ముందువైపు మందార, నందివర్ధనం, గులాబీ, కనకాంబరం, పారిజాతం వంటి పూలమొక్కలు, వెనకాల మామిడి, జామ, సపోటా, ఒక కొబ్బరిచెట్టు... పిల్లలని పెంచుకున్నట్టు శ్రద్ధగా ఎంత కష్టపడ్డారు? మొక్కలు పెరుగుతుంటే, మొగ్గ తొడిగినపుడు, మామిడిచెట్టున పిందె వేసిననాడు, మొదటి జామపండు అందరూ తలా ముక్క కోసుకుని తిన్న ఆ అనుభూతి, ఇన్ని మందారాలు, చామంతులు, గుప్పెడు పారిజాతాలు దేవుడికి పెడితే కళకళలాడిపోయేది దేవుడి మందిరం. ఎండాకాలం వస్తే మల్లెపూల సుగంధం పెరడంతా పరుచుకునేది.
తీరికున్న ప్రతి క్షణం మొక్కల మధ్యే గడిపారు యిద్దరూ. ప్రావిడెంట్ ఫండ్ తో పిల్లలిద్దరి చదువులూ, పెళ్లిళ్లూ అవగా పెన్షన్ డబ్బులు తప్ప ఏం మిగలకపోయినా, అందులోనే ఆడపిల్ల పురుళ్లు, కోడలికి ముచ్చట్లు, పండగలు, పబ్బాలు, అల్లుడి మర్యాదలు, ఎంత పొదుపుగా సంసారం చేసింది? అయినా వున్నంతలో దేనికీ యిబ్బంది లేకుండా గడిపారు. ఆ రోజులు కాబట్టి, పెన్షన్ అందేది కాబట్టి నిశ్చింతగా రోజులు వెళ్లిపోయాయి.
