అప్పుడే పక్కన స్థలంలో మేడ ఇల్లు లేచింది. వరలక్ష్మిగారు ఆ యింట్లో దిగిన ముహూర్తం ఏదో కాని ఆవిడతో చక్కని స్నేహం కుదిరింది. ఆయన రిటైర్డు జడ్జి. పిల్లల పెళ్లిళ్లు, చదువులు అయ్యాయి. తమకంటే పైస్థాయి అయినా యిద్దరి మధ్య చెరగని స్నేహం - ఇచ్చిపుచ్చుకోడాలూ, కష్టం, సుఖం చెప్పుకోడం, పెరట్లో కాసిన కూరలు వండి పంచుకోడం, పిట్టగోడ దగ్గర చేరి అమ్మలక్కల కబుర్లు, పూజలకీ, వ్రతాలకీ ఒకరికొకరు తోడై అక్కాచెల్లెళ్ల మాదిరి కల్సిపోయారు. అరవై ఏళ్లకే ఎదురుచూడని వైధవ్యం, స్కూటర్ యాక్సిడెంట్ రూపంలో వచ్చి మీద పడితే ఎలాగో తట్టుకుని నిలబడగలిగింది. ఆయన పోయాక సగం పెన్షనే వచ్చినా దానితో సరిపుచ్చుకునేది. ఏదో ఒంటరిగా క్రిష్ణా రామా అనుకుంటూ కాలం గడిపేది. ఆ సమయంలో మంచికీ, చెడ్డకీ వరలక్ష్మిగారే సాయం, సలహా చెప్పినా ఆవిడే...
అంతవరకు లేని కొత్త సమస్యలు, కొడుకు వున్న ఉద్యోగం వదిలి, ఇంకోటి ఇక్కడ చూసుకుని, 'ఒంటరిగా వున్నావని వచ్చేశాం అమ్మా!' అంటే కొడుకు ప్రేమకి, అభిమానానికి పొంగిపోయింది మొదట్లో. ఆ రోజు నుంచి బరువు బాధ్యతలు కొడుకుపైన పెట్టి, వంటిల్లు కోడలికి అప్పగించింది. మనవలు పెరుగుతుంటే పెత్తనం కోడలిదై తను ఆ ఇంట్లో పెట్టింది తిని ఓ మూల కూర్చునే స్థితికి వచ్చేసింది. ఇంటి విషయం మాత్రం తను ఉన్నంతవరకు అమ్మడానికి లేదని మొత్తుకుంది. హఠాత్తుగా పోవడంతో భర్త విల్లు రాయకుండానే పోయారు. ఆస్తి మొత్తం మూడు భాగాలన్నారు. తన మాట, పెత్తనం చెల్లనివ్వలేదు కొడుకు. కాగితాల మీద సంతకాలు పెట్టించాడు. ఇల్లు కూలగొట్టడం చూసి బాధపడక్కర లేకుండా తననిక్కడికి చేర్చాడు.
అప్రయత్నంగా రాజేశ్వరమ్మ కళ్లు నిండుకున్నాయి. కళ్ల ముందే ఇల్లు కోల్పోయి, అపార్ట్ మెంట్ సంస్కృతికి అలవాటు పడిపోక తప్పడం లేదు తమ తరంవారు.
* * *
మర్నాడు సాయంత్రం రాజేశ్వరమ్మ కొడుకు శ్రీనివాస్ ధుమధుమలాడుతూ వచ్చాడు. వస్తూ వస్తూనే, చేతిలోని పేపరు తల్లి ముందు విసిరికొట్టి 'ఏమిటమ్మా యిది? నలుగురిలో నా పరువు ఇలా ఈడ్చి రోడ్డున నిలబెట్టడానికి నీ మనసెలా ఒప్పింది?" అంటూ ఆవేశంగా అరిచాడు.
రాజేశ్వరమ్మ తెల్లబోయి చూసింది, విషయం అర్థం కాక.
"చూడు..." అంటూ పేపరు విప్పాడు.
"తల్లుల్ని ఇంట్లోంచి వెళ్లగొట్టి ఓల్డ్ ఏజ్ హోములో పారేసిన కొడుకుల లిస్ట్ లో నా పేరూ చేరింది నీ దయవల్ల. ఏదో ఆ రెండుగదుల అపార్ట్ మెంట్ లో నీకు సౌకర్యంగా వుండదని యిక్కడ కొన్నాళ్లు హాయిగా వుంటావని, ఇల్లు తయారయ్యేవరకూ ఈ ఏర్పాటని నీకు తెలీదా?" ఆగ్రహంగా కొడుకు దులిపి పారేస్తుంటే, విస్తుపోయిన రాజేశ్వరమ్మ పేపరు తీసి చూసింది.
ఆదివారం పేపరులో ఈ వృద్ధాశ్రమం గురించి వివరంగా బిల్డింగు, తోట, ప్రార్థనామందిరం, అక్కడున్నవారి కొందరి ఫొటోలలో తన ఫోటో, పేరూ - అన్నీ ప్రచురించారు. పిల్లల ఆదరణ, అభిమానం నోచుకోని తల్లితండ్రులంటూ కొన్ని కథలు సంక్షిప్తంగా మొత్తం ఒక పేజీ అంతా కవర్ చేస్తూ వార్త వచ్చింది.
రాజేశ్వరమ్మ తెల్లబోయింది.
"నడు యింటికి. ఆ చాలీచాలని రెండు గదుల్లోనే పడుందాం అందరం. అందరూ నేనేదో నిన్ను హత్య చేసినట్టే, ఇంట్లోంచి వెళ్లగొట్టినట్టే దోషిలా చూడడం, అడగడం... తలెత్తుకోలేకపోయాను. పద, బట్టలు సర్దుకో" ముఖం గంటు పెట్టుకుని విసురుగా అన్నాడు.
"చూడు శీనూ, అనవసరంగా ఆవేశపడకు. నిన్న మన పక్కింటి వరలక్ష్మిగారి మనవరాలు ఏదో టి.వి.లో పనిచేస్తోందట. ఈ ఓల్డ్ ఏజ్ హోము గురించి వ్యాసం రాయడానికి వచ్చిందట! నన్ను చూసి గుర్తుపట్టి పలకరించి అడిగింది. ఇల్లు అమ్మేం, ఆ స్థలంలో అపార్ట్ మెంట్స్ కడుతున్నారు. అంతవరకు వున్నాను అని చెప్పానంతే! ఇదంతా ఇలా కథలుగా వస్తుందని నాకేం తెలీదు" స్థిరంగా, శాంతంగా అంది.
"పేపర్లో పడ్డావుగా, సంతోషమే గదా! నామీద బదులు తీర్చుకున్నావు గదా! ఏదయితేనేం జరగవలసిన డామేజ్ జరిగింది. ప్రతి వెధవకీ జవాబు చెప్పుకుంటూ, సంజాయిషీ ఇచ్చుకునే ఖర్మ పట్టింది. అసలు నాదే బుద్ధి తక్కువ దీన్లో దిగడం... ఏదో నా పాటికి నేనేదో ఓ అపార్ట్ మెంట్ కొనుక్కుంటే, మీ అందరిచేత మాటలు పడాల్సిన ఖర్మ ఉండేది కాదు" మొహం ఎర్రగా చేసుకున్నాడు.
మొన్న సుజాత వచ్చి మోసగాడివి అన్నట్టు నానా మాటలు అని వెళ్లింది. ఈ రోజు నువ్విలా నన్ను బజారుకీడ్చావు."
"చేసే పనిలో నిజాయితీ వుంటే ఎవరేమన్నా పట్టించుకోనక్కరలేదు" స్థిరంగా కొడుకు వంక చూస్తూ అంది.
ఆ మాట ఎక్కడో తగిలినట్టు శ్రీనివాస్ మొహం నల్లబడింది.
"అంటే, ఏమిటి నీ ఉద్దేశం?" ఖంగుతిన్నట్టు ప్రశ్నించాడు.
"సుజాత అన్నదంటే వూరికే అనలేదు గదా! దాని తండ్రి ఆస్తిలో నీకెంత హక్కుందో దానికీ వున్నప్పుడు, దానికి చెందాల్సినవి చెందకపోతే ఏ చెల్లెలు మాత్రం వూరుకుంటుంది చెప్పు? నీవు చేసిన పని మోసం కిందకే వస్తుంది. విల్లు లేదు గదా అని స్థలం అమ్మకానికి నీ పేర పవర్ ఆఫ్ అటార్ని ఇచ్చినట్టు మా యిద్దరి సంతకాలూ తీసుకుని..."
"అది బెంగుళూరులో వుంటోంది, కాగితాలు అస్తమానూ సంతకాలకి పంపాలని..." మధ్యలో అన్నాడు.
"హా... ఏమిటి మరీ చదువురానివాళ్లకి చెప్పినట్టు చెప్తున్నావు. అది వెళ్లి బిల్డర్ తో మాట్లాడి విషయం తెల్సుకుంది. స్థలం నీ పేర రాస్తున్నట్టు కాగితాలు రాయించుకున్నావు. పవరాఫ్ అటార్ని ఉపయోగించుకుని, తోడబుట్టినదాన్ని ఇంత దగా చేశావు, తల్లిని బతికుండగానే నాకో ఇల్లంటూ లేకుండా చేశావు గదా..."
"అమ్మా! అనవసరంగా మాటలూ వద్దు, ఈ రాద్ధాంతమూ వద్దు. అపార్ట్ మెంట్స్ హేండోవర్ చేశాక దాని పేర రిజిష్టర్ చేయించుదామని..." బుకాయించాడు.
"అంత మంచి ఆలోచన వుంటే సంతోషమే! ఏదో నా కోసం ఓ రూమ్ లక్ష పెట్టి కొనిచ్చావు బిల్డర్ యిచ్చిన క్యాష్ లోంచి. నాకు ఆ మాత్రం ఉపకారం చేశావు. చాలు. నా పెన్షన్ నాకు తిండి పెడ్తుంది. ఈ ఆఖరి రోజుల్లో నాకింతకంటే ఏం అక్కరలేదు. ముందు కోపం వచ్చినా, యిప్పుడు నీవు చేసిన ఈ పని నాకు మేలే చేసింది. హాయిగా చీకూ చింతా లేకుండా, శుభ్రమైన గాలి, ప్రశాంతత, చుట్టూ మాటా, మంచీ, జనం, పుస్తకాలు, టి.వి. వసతి అన్నీ బాగున్నాయి. రేపు అపార్ట్ మెంట్ తయారైనా నేనింక రాను. ఇరుకు గదులు, ఇరుకు మనసుల మధ్య యింక వుండలేను. నీలో ఏదన్నా నిజాయితీ మిగిలివుంటే, నీకు ఆత్మసాక్షి అన్నది వుంటే, నీ చెల్లెలికి అన్యాయం చేయకు. ఆ ఇల్లు మా యిద్దరి కలల పంట. ప్రతి చెట్టూ, ఆకూ, పువ్వూ, కాయా, మా తరం తరువాత మా పిల్లలు అనుభవించాలన్న కోరిక ఎలాగూ తీరలేదు. కాని యిద్దరు పిల్లలూ సంతోషంగా వున్నారంటే మీ నాన్న ఆత్మ సంతోషిస్తుంది. నా పాటికి నేను చాలా హాయిగా,అ సంతోషంగా వున్నాను. వెళ్లు, తల్లిగా నేనెప్పుడూ నీ మేలే కోరుతాను. వీలయినప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి కనిపించి వెళ్లండి. అది చాలు" కుర్చీలోంచి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోకి వెళ్లిపోయింది రాజేశ్వరమ్మ.
(ఆదివారం ఆంధ్రజ్యోతి, 13 మే 2018)
* * * *
