Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 6


    "ఆ దిక్కుమాలిన దేశం అందుకే వద్దన్నాను. గ్లాసులో నీళ్లన్నా ముంచుకుని తాగేవాడా ఇక్కడ? వాడి ఖర్మ కాలి అక్కడ వంట చేసుకుని, బట్టలు తుక్కుని, ఇల్లు తుడుచుకుని, నా బిడ్డ ఇప్పుడు పెళ్ళైనా కూడా ఇవన్నీ చేసుకోవాలా?" గిలగిల్లాడిపోయింది ఆవిడ ప్రాణం.
    తల్లి చాదస్తానికి నవ్వుకుని కొడుకు, కోడలు భోజనాలు తిని గదిలోకి వెళ్లిపోయారు.
    "నాన్నా! కాసేపు నా దగ్గర కూర్చోరా" అంది మామ్మగారు మనవడిని పక్కన కూర్చోపెట్టుకుని. "మళ్లీ ఎప్పుడొస్తావో, కాసిని కబుర్లు చెప్పరా" అంది.
    మనవడు మామ్మ ఒళ్లో తల పెట్టుకుని పడుకుని నడుం చుట్టూ చేతులు వేసి "మామ్మా! నాకెందుకో భయంగా ఉంది" అన్నాడు కాస్త దిగులుగా.
    "భయం ఎందుకురా పిచ్చినాన్నా! శుభమా అని పెళ్లి చేసుకుంటూ" లాలనగా అంది.
    "అదే భయం! చరిత్ర నా చరిత్ర మార్చేస్తుందని భయంగా ఉంది మామ్మా!"
    "అదేమిటిరా?"
    "ఏమో మామ్మా! చరిత్రని చూస్తే నాకెందుకో భయం. ఆ అమ్మాయి ముందు భయపడిపోయి నేనేదీ ఎదురుచెప్పడం చేతకానట్లు ఫీలింగ్."
    "అదేంటిరా?" ఆవిడ భయంగా చూసింది.
    "ఈ పెళ్లితో నేను నేనుగా మిగలగలనా అని. ఆ అమ్మాయి నన్ను డామినేట్ చేసేసి నన్నో చవట దద్దమ్మలా మూల కూర్చోపెట్టేస్తుందనిపిస్తోంది" దిగులు కనిపించింది మనవడిలో.
    "అదేమిటిరా ఎందుకలా? నీ మాట వినదా? ఎదిరిస్తుందా?" కలవరంగా అంది.
    "ఏమో! నాకు తెలీదు. నాకెందుకో... ఆ అమ్మాయి పద్ధతులు, ఏదన్నా లెక్కలేదు, భయం లేదు, డబ్బంటే లెక్కలేదు. ఆ బట్టలు కట్టుకోవడం ఏంటో అవన్నీ చూస్తే నేనుత్త వెధవాయినన్న ఫీలింగ్ వస్తుంది. రేపు ఎలా అని భయం..."
    ఆవిడ చటుక్కున మనవడి తల ఒళ్లోంచి తీసి కూర్చోపెట్టింది. "నాకు తెలుసురా, నీవు సంతోషంగా లేవని నీ మొహం చూస్తే నాకు తెలిసిపోయిందిరా. ఈ మాట ఇప్పుడా చెప్పడం, ముందే చెప్పేస్తే ఈ పెళ్లికి ఒప్పుకునేవాళ్లం కాదుగదరా?" ఆరాటంగా అంది.
    "ఏమో, అప్పుడనిపించలేదు. ఇప్పుడనిపిస్తోంది. ఏంటో మామ్మా! తను చాలా డేరింగ్, నేనో చవటాయిలా అనిపిస్తుంది తన ముందు."
    "నోరుముయ్యరా, నీకేంట్రా, ఇంజనీరింగ్ ఫస్టున ప్యాసై మంచి కంపెనీలో ఉద్యోగం వెనకాతల బోలెడాస్తి..."
    "అదంతా సరేగానీ, ఇవన్నీ ఆ పిల్లకేం లెక్కలేదు. తనకీ బోలెడు డబ్బుంది. నాతోపాటు ఉద్యోగం, చదువు అన్నీ ఉన్నాయి గదా! మన డబ్బేం లెక్కలేదు ఆ అమ్మాయికి. అలా పది క్రెడిట్ కార్డులు పర్సులోంచి తీసి, పెద్ద పెద్ద బ్రాండెడ్ షాపుల్లో వందలు, వేల డాలర్లు ఖర్చుపెట్టి అన్నీ కొనేస్తూ ఉంటుంది తెలుసా? రేపొద్దుట ఈ ఖర్చులు నేను తట్టుకోగలనా అని భయం వేస్తోంది."
    "ఇలాగే చచ్చుదద్దమ్మలా మాట్లాడితే నిజంగానే నిన్నో మూల కూర్చోపెట్టేస్తుంది. మగాడిలా ఉండాలి. ఇంటి ఖర్చుకింత, దానికింత, దీనికింత అని లెక్కపెట్టి ఇచ్చెయ్. మిగతాది దాని జీతం ఏమైనా చేసుకోనీ. గమ్మునుండు నువ్వు" సలహా చెప్పింది.
    "అలా అంటే మరి పెళ్ళెందుకు చేసుకున్నావంటుంది. అమ్మో! నీకు తెలీదు మామ్మా! అమ్మాయిలు ఎలా తెలివి మీరిపోయారో? ఇల్లు కొన్నాను మామ్మా! దాని అప్పుడే నా సగం జీతం అయిపోతుంది. తన జీతం కూడా కలిస్తేనే ఇల్లు నడుస్తుంది' లెక్కలు విడమర్చి చెప్పేశాడు మనవడు.
    మనవడి మొహం చూసి కరిగిపోయింది మామ్మ. "ఉండు, మీ నాన్నతో పొద్దుట మాట్లాడతాను. పెళ్లి కాన్సిల్ చేసేద్దామా అనడుగుతా."
    "అమ్మో! ఇందాక వచ్చాక ఇప్పుడు కాన్సిలంటే అమెరికాలో నా పరువు పీకి పందిరేస్తారు. ఆఫీసులో నా పరువు... పరువేమిటి ఉద్యోగమే గోవిందా! సర్లే, ఎవరితో ఏమీ చెప్పకు. చూస్తాలే, మంచిగా చెపితే వింటుందేమోలే. మేనేజ్ చేస్తా" అంటూ వెళ్లి పడుకున్నాడు. మామ్మకి రాత్రంతా నిద్రలేదు మనవడి భవిష్యత్తుమీద బెంగతో.
    తెల్లారి లేస్తూనే కాఫీ తాగుతున్న కొడుకు, కోడలు చెవిన వేసేసి మనవడిని రక్షించే పనికి మార్గాలు వెతకసాగింది. "నీకు మతిపోయిందా? రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని కాన్సిల్ చేయాలా? పెద్దదానివి వాడికిలాంటివి నేర్పిపెడతావా? ఈ అమ్మాయేంటి, ఇప్పుడందరు అమ్మాయిలూ అలానే ఉన్నారు. వాళ్లు చదువుకుని, సరిసమంగా సంపాదిస్తున్నారు. మన ఇండియాలో అమ్మాయిలే ఇలా ఉన్నారు. అమెరికాలో వింతేముంది? ఒక్కర్తే కూతురు, డబ్బుంది. ఏదో సరదాగా షాపింగులు చేస్తుంది. పెళ్లయ్యాక సంసారబాధ్యతలు అవే వస్తాయి" తల్లి మీద కోప్పడి అరిచాడు కొడుకు.
    "పెళ్లికి ముందే వాడిలా భయపడుతుంటే, ఆ సంసారం ఏం సాగుతుంది?" ఆవిడ వాదనకు దిగింది అంతకంటే గట్టిగా. ఆ గలాభా విని మనవడు గదిలోంచి పరిగెత్తుకు వచ్చాడు.
    "మామ్మా! చెప్పొద్దన్నానా?" అరిచాడు కోపంగా.
    "వద్దన్నావులే! నా మనసుండబట్టొద్దూ! పిచ్చినాగన్న మొహం వాడిపోయింది. పెళ్లి కళే లేదు."
    "ఏరా, ఏమిటిది? నువ్వు చేసుకుంటానంటే సరే అన్నాంగానీ, ఈ పిల్లని చేసుకోమని నిన్నేం బలవంతపెట్టలేదుగా?" కోపంగా కొడుకు వంక చూశాడు తండ్రి.
    "నాన్నా, ఏమిటి ఎనీ ప్రాబ్లమ్ మీ ఇద్దరి మధ్య? ఎందుకలా అన్నావు మామ్మతో?" తల్లి లాలనగా అడిగింది.
    'చెప్పే ప్రాబ్లమ్స్ కావే అమ్మా!' అని మనసులో అనుకుని "ఊరికే అన్నాను. డబ్బు లెక్కలేకుండా ఖర్చుపెట్టేస్తుంది. ఆవిడవన్నీ హై స్టాండర్డ్ అన్నాను అంతే!" సర్దిచెప్పాడు మనవడు.
    "చూడు చెర్రీ! ఇది ఇదివరకటి రోజులు కావు. ఆడవాళ్లతో ఎలా పడితే అలా డీల్ చేసే రోజులు కావు. ముందునుంచీ మంచిగా ఆ అమ్మాయిని దారికి తెచ్చుకోవాలి గానీ, కోపాలు తాపాలు పనికిరావు. తెల్సిందా? ఊ... ఆ... అంటే అమ్మాయిలే డైవోర్స్ అనేస్తున్నారు జాగ్రత్త! గోళ్లూడగొట్టి సగం జీతం, సగం ఆస్తి రాబట్టేస్తారు కోర్టుకెక్కి."
    "పెళ్లింట్లో డైవోర్స్ మాటలేమిటి?" భర్తను కసిరింది తల్లి.
    "ఏవో కాస్త జాగ్రత్తలు చెపుతున్నా. ఇదివరకు పెళ్లికి ముందు అత్తారింట్లో మొగుడితో ఎలా మసలాలో అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్పేవారు. ఇప్పుడు అబ్బాయిలకి చెప్పాలి" నవ్వాడాయన.
    "హాయ్, ఎవ్రీబడీ గుడ్ మార్నింగ్" షార్ట్స్, టీ షర్టు, వాకింగ్ షూస్ తో వచ్చిన చరిత్ర "హాయ్ చెర్రీ, సెల్ తీయవేమిటి? జాగింగ్ కి వెళదామని ఫోను చేస్తే తీయవే? సైలెంట్ మోడ్ లో పెట్టావా ఏమిటి? ఏదో డైవోర్స్ అంటున్నారు, ఎవరికి ఎవరు ఇస్తున్నారు డైవోర్స్? పెళ్లి కాకుండానే చెర్రీ డైవోర్స్ అంటున్నాడా కొంపదీసి?" అంటూ పకపక నవ్వింది. "చెర్రీ, నో ఛాన్స్, ఐ డోంట్ లీవ్ యూ సో ఈజిలీ. హే మేన్, గొప్పగా చెప్పావు ఇండియాలో అంత తొందరగా డైవోర్సులు ఇవ్వరని. చూస్తా, నిన్ను ముప్పుతిప్పలు పెడతా, డైవోర్స్ ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తావో?" ఆట పట్టిస్తూ నవ్వింది చరిత్ర. అందరూ నవ్వారు.
    "నో ప్లీజ్, అలా మాట్లాడకూడదు పెళ్లింట్లో" కాబోయే కోడలిని మందలించింది అత్తగారు.
    "ఓ సారీ ఆంటీ, సారీ. కాఫీ ఉందా ఆంటీ? చెర్రీ గెట్ రెడీ ఈ లోపల" అని ఆర్డర్లు వేస్తున్న అమ్మాయిని చూసి, రంగు మారిన మనవడి ముఖం చూసి మామ్మ మనసు ద్రవించిపోయింది. షార్ట్స్ వేసుకుని మామగారి ముందు కాలు మీద కాలేసుకుని కాఫీ తాగుతున్న పిల్లని చూసి 'ఈ పిల్ల కాపురం చేసే రకమేనా?" అనిపించిందావిడకి.
    ఇద్దరూ వెళ్లాక వాడిపోయిన తల్లి మొహం చూసి "అమ్మా! నీకు, ఆ అమ్మాయికి మధ్య రెండు తరాలున్నాయి అని మర్చిపోకు. నీకేం బెంగ అక్కరలేదు. వాళ్లకి తెలుసు వాళ్లకేం కావాలో? మన సలహాలు అక్కరలేదు. కాలంతోపాటు కదిలిపోవడం మనం నేర్చుకోవాలి. ఊరికే ఆలోచించి మనసు పాడుచేసుకోకు" సలహా చెప్పి లోపలికి వెళ్లిపోయాడు కొడుకు.
    "రామయ్యతండ్రీ! వాడుత్త వెర్రినాగన్న. నీ పేరే పెట్టుకున్నా. మా ఇంటి ఇలవేలుపువి నువ్వే వాణ్ణి ఓ కంట కనిపెట్టు తండ్రీ! నీ చరణాలే మాకు శరణ్యం" రామపట్టాభిషేకం ఫొటోకి దండం పెడుతూ అనుకుందావిడ. రామయ్యతండ్రి చిరునవ్వు చిందిస్తూ అభయహస్తం తనకే అన్నట్టు సంతృప్తి పడిందావిడ. రామయ్య కాళ్ల దగ్గర కూర్చున్న ఆంజనేయస్వామికి మరో దండం పెట్టింది. 'స్వామీ! రామయ్యని కంటికి రెప్పలా కాచుకున్నట్టే ఈ నా రాముణ్ణి కనిపెట్టు, నీ ధైర్యం, నిబ్బరం, నీ సాహసం, నీ బలం అన్నీ కాస్త వాడికీ ఇవ్వు. ఆ అమ్మాయి ముందు నా మనవడు బలహీనుడు కాకూడదు. గెలుపు వాడిదే కావాలి. పది కాలాలపాటు వాళ్ల కాపురం నిలబెట్టు' దండాలు పెట్టుకుంది.
    ఈ కాలం కాపురాల్ని నిలబెట్టడానికి ఆ దేముళ్లే పూనుకోవాలేమో అన్న ఆవిడ మనసులోని సందేహానికి కాలమే సమాధానం చెపుతుంది.
    కొత్తనీటి వెల్లువ ప్రవాహం వస్తుంటే ఎదురీది లాభం ఉండదు. ప్రవాహం వెంట సాగిపోవాలి గానీ, ఎదురీదితే మునగక తప్పదు. కాలం తెచ్చే మార్పులకు తలొగ్గడం తెలివైనవాళ్లు చేసే పని. అది గ్రహించినవాళ్లు సుఖపడతారు అని ఆ తరంవాళ్లకి అర్థం కావడానికి సమయం పట్టవచ్చు.
                                                                                              (నవ్య, 21 జూన్, 2017)

                                                 *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS