Previous Page Next Page 
మహిమ పేజి 7


    తన క్యాబిన్ దగ్గరికి చేరి చుట్టూ చూసింది. ఎవరి పని వారు చేస్తూ అందరూ కంప్యూటర్లలో మునిగిపోయారు. టేబుల్ మీద కంప్యూటర్, టేబుల్ కి రెండు అరలు, రివాల్వింగ్ చైర్, ఫైల్స్ ట్రేలు ... కుర్చీ జరుపుకుని కూర్చోబోతుండగా, "హాయ్ ! వెల్ కమ్!" అంటూ అనుపమ, గిరీష్ తమ సీట్లలోంచి లేచి వచ్చారు. అనుపమ షేక్ హ్యాండ్ ఇచ్చి తనను తాను పరిచయం చేసుకుని, గిరీష్ ని పరిచయం చేసి, "మన ముగ్గురిదీ ఒక జాబ్. సో ఉయ్ ఆర్ ఫ్రెండ్స్" అంది చనువుగా.
    "అఫ్ కోర్స్ ..." అంటూ గిరీష్ చాచిన చెయ్యి అందుకుంది మహిమ. "మీ ఇద్దరూ నాకు కాస్త సహాయం చెయ్యాలి. నాకు అలవాటయ్యేవరకు ఏం కావాలన్నా మీ ఇద్దర్నీ అడుగుతా, తెలియనివి చెప్పండి" అంది.
    'విత్ ప్లెజర్" అన్నాడు గిరీష్. ముప్పై ఏళ్ళ లోపు ఉండి చామనచాయగా, స్మార్ట్ గానే ఉన్నాడు గిరీష్. అనుపమ కాస్త చామనచాయగా ఉన్నా కళైన మొహం. సల్వార్ కుర్తా, బాబ్ డ్ హెయిర్, మాటకారిలా ఉంది. చనువుగా చకచక మాట్లాడేసి మహిమ కొత్త పోగొట్టింది. "బాస్ ని మీట్ అయ్యావా! మీనన్ బాస్ సరే ... మేనేజింగ్ డైరెక్టర్ ని కలిశావా?"
    "ఇప్పుడే కలిసి వస్తున్నాను. ఇంటర్వ్యూ అప్పుడు కూడా చూశారు ..."
    "ఓకే దెన్! సెటిల్ డౌన్! వర్కేమన్నా ఇచ్చారా! పని బాగానే ఉంటుంది. ఇది పెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. ప్రకటనలకి ఆర్డర్లు బాగానే వస్తాయి. ఏ ప్రకటనైనా మన డిపార్ట్ మెంటే తయారుచెయ్యాలి. నేను రాసిన స్క్రిప్టుకి బొమ్మలు వేయడం, విజువల్స్ అయితే స్క్రిప్ట్ పని. గిరీష్ కూడా అంతే ..."
    "నేను క్రియేటివ్ కాప్షన్స్ ఎలా ప్రెజెంట్ చెయ్యాలో ఆలోచించి ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి భాష, భావం... అంతా సృష్టించాలి. నాకిష్టమైన సబ్జెక్ట్ కి తగిన పని ఈ ఫీల్డ్ లోకి వచ్చాను..." మహిమ నవ్వుతూ అంది.
    "ఓకే గుడ్ లక్! అదిగో మీనన్ క్యాబిన్ లోంచి చూస్తున్నాడు" అంటూ తన సీట్ లోకి వెళ్ళింది అనుపమ. "ఏదన్నా హెల్ప్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగండి" గిరీష్ చెపుతూ తన సీట్ లోకి వెళ్ళిపోయాడు.
    మహిమ సీట్ లో కూర్చుంది. మీనన్ ఇచ్చిన ఫైలును టేబుల్ మీద పెట్టి, కంప్యూటర్ ఓపెన్ చేసి పనిలో పడింది. ఇచ్చిన రెండు కొత్త ప్రకటనలను శ్రద్ధగా చదివి, మెదడుకు పనిపెట్టి, ఒక్కొక్క దానికి రెండు మూడు వెర్షన్స్ తయారుచేసి, రాసినదాన్ని చదువుతూ, ఇంకా బాగా మంచి పదాలు వెతుకుతూ, కొత్త ఐడియాల కోసం కంప్యూటర్ గాలిస్తూ, గూగుల్ లో వెతుకుతూ, ఏకాగ్రతతో పనిచేస్తూ కూర్చుంది. ఒంటిగంట అయ్యాక గల గల అందరూ సీట్లల్లోంచి లేచిన చప్పుడుకి తలెత్తి చూసింది మహిమ. లంచ్ కి కాబోలు, కొంతమంది హ్యాండ్ బ్యాగ్స్ లోంచి టిఫిన్ డబ్బాలు పట్టుకుని డైనింగ్ స్పేస్ వైపు వెళుతూ కనిపించారు. అనుపమ సీట్ లోంచి లేచి వచ్చింది. "లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా? లేకపోతే కింద క్యాంటీన్ ఉంది" అంది.
    "లేదు ... తెచ్చుకున్నాను".
    "అయితే రా ..." అంటూ పక్కనున్న్ డైనింగ్ హాలు వైపు దారితీసింది.
    "గిరీష్..." అంది అటు చూస్తూ.
    "మగాళ్ళంతా ఓ గ్రూపుగా పోతారులే ..."
    పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూ కుర్చీలు, వాటర్ ఫిల్టర్. "ఆ వెనుక డోరు లోంచి వెడితే వాష్ రూములున్నాయి" కుర్చీ జరిపి కూర్చుంటూ చెప్పింది అనుపమ.
    "ఓ! అంతా చాలా ప్లాన్ డ్ గా, నీట్ గా మెయిన్ టైన్ చేస్తున్నారు" మహిమ అంది.
    "మరి. దానికి తగ్గట్టే డబ్బూ వస్తుందిగా. ప్రకటనలకు ఒక్కొక్కదానికి ఎంత వసూలు చేస్తారో తెలుసా? ఈ హంగామా, హంగులూ అన్నీ కార్పొరేట్ లెవల్లో ఉండాలి మరి".
    "నిజంగానా ! అంత పే చేస్తారా ?"
    "ప్రకటన బట్టి ! పేపర్లో ప్రకటనలను బట్టి, విజువల్స్ ఎంతో రిచ్ గా ఉండాలంటే కోట్లు, చిన్న ప్రోడక్ట్ కి లక్షల్లో. ఒక్కొక్కదానికి ఒక్కో రేటు. నాలుగు వందల మంది జీతాలు, ఆఫీస్ మెయిన్ టెనెన్స్, ఎక్విప్ మెంటు, కాంట్రాక్ట్ లేబర్స్, డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్, యాక్టర్స్ ... అబ్బో! అంతా కోట్లలో వ్యవహారం.
    "అవును. అడ్వర్టైజింగ్ వరల్డ్... ఇదో లోకం! వినడమే గాని చూడలేదు. ముద్రాలో కోర్స్ చేస్తున్నప్పుడే చాలా చెప్పారు..."
    "నీ పని అవుతోందా! ఏమయినా హెల్ప్ కావాలా? ఏదన్నా తట్టిందా ఐడియా ..."
    "ఆ... సాయంత్రానికి రెండు ప్రోడక్టులూ పూర్తిచేసి ఇస్తాను. హోప్ పుల్లీ!" తినడం పూర్తిచేసి, వాష్ రూములోకి వెళ్లి ఫ్రెషప్ అయి, మళ్లీ ఎవరి సీట్లలోకి వారు వెళ్లారు అరగంటలో.
    ఐదు గంటలకల్లా రెండు ప్రకటనలకి ఓ రూపు వచ్చి, ఫైనల్ కాపీ కంప్యూటర్ కి ఎక్కించి, మీనన్ కు పంపించి, ఒక కాపీ తన మెయిల్ లో సేవ్ చేసి, పనిపూర్తిచేసి, మీనన్ క్యాబిన్ వైపు నడిచింది.
    అప్పటికే మీనన్ మహిమ పంపిన ఫైనల్ వెర్షన్ చూస్తూ మహిమ లోపలికి రాగానే, 'కమాన్" కంప్యూటర్ చూస్తూనే అన్నాడు. అతని మొహంలో ప్రసన్నత కనపడింది. 'తనిచ్చిన కాప్షన్స్ నచ్చినట్టే ఉన్నాయి' అనుకుంది. 'గుడ్! రెండు కాప్షన్స్ బాగానే ఉన్నాయి. వెల్ డన్! ఫైనల్ గా సెలెక్ట్ చేసేముందు విశాల్ గారికి కూడా పంపి, ఓకే చేయించుకోవాలి. రేపటివరకు టైముంది. ఈలోగా ఇంకా బెటర్ ఐడియా తడితే మార్చవచ్చు. ప్రయత్నించండి. యూ డిడ్ గుడ్ బాజ్ ఆన్ ది ఫస్ట్ డే కంగ్రాట్స్!" ప్రోత్సాహకరంగా మాట్లాడాడు.
    మహిమ పెద్ద బరువు దిగినట్టు తేలికగా "థాంక్స్ సార్! రేపు ఆఫీసుకు వచ్చేలోగా ఆలోచిస్తూనే ఉంటాను ఫర్ బెటర్ ఐడియా" అంది.
    "ఓకే... మీరింక వెళ్ళవచ్చు" పావు తక్కువ ఆరవడం చూసి అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS