Previous Page Next Page 
మహిమ పేజి 6


    "యాడ్స్ లో నటిస్తుందా? ఎక్కడో చూసిన మొహంలా అనిపించింది".
    "ప్రీతి సంగతి తరువాత. అదంతా ఓ పెద్ద కథలే! పద, వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిరా. తెల్సుగా ఎక్కడో" అంటూ తన సీటు వైపు వెళ్ళింది సీమ.
    'సో, యూ ఆర్ మహిమ', అపాయింట్ మెంట్ కాగితాలు, జాయినింగ్ రిపోర్టు కాగితాలు అందుకుని పరిశీలిస్తూ మహిమని కళ్ళెత్తి ఓసారి పైనించి కింది వరకు చూస్తూ అన్నాడు మీనన్, క్రియేటివ్ హెడ్ మీనన్ ఏభై ఏళ్ళలోపు, బట్టతలతో, గంభీరంగా ఉన్నాడు.
    'ఓకే! బీ సీటెడ్! మీరు చెయ్యాల్సిన పని ... లెట్ మీ ఎక్స్ ప్లెయిన్. మా దగ్గరకు అనేక కంపెనీల కొత్త, పాత ప్రొడక్ట్స్ వస్తాయి. కొన్ని కేవలం పేపరులో ప్రకటనలకి, కొన్ని విజువల్ యాడ్స్ గా, కేవలం ప్రోడక్ట్ ని పరిచయం చేసే వాక్యాలు, కొన్ని బొమ్మలతో, కొన్ని డాక్యుమెంటరీలుగా, కొన్ని ఒకటి రెండు నిమిషాల వీడియోలుగా ... అనేక విధాలుగా ప్రోడక్ట్ ని కస్టమర్ కోరినట్టు తయారుచేయడం మన పని. ఏ ప్రకటనకైనా ముందు ఇక్కడ స్క్రిప్టు తయారుచెయ్యాలి. ఉదాహరణకి ఒక టూత్ పేస్ట్ ప్రకటన చెయ్యాలంటే ఆ టూత్ పేస్ట్ బొమ్మ, కొన్ని కొటేషన్స్, లేక పరిచయ వాక్యాలు ... కస్టమర్ ఎంత ఖర్చుపెట్టగలడు అన్నదాన్ని బట్టి తయారుచెయ్యాలి. ఆ టూత్ పేస్ట్ చిన్న ప్రకటనలా విజువల్ గా, అంటే ఒక డాక్టరు చెప్పినట్టో, తల్లి ఇంట్లో పిల్లలకి చెప్పి చూపిస్తున్నట్టో షూట్ చేసి ప్రెజెంట్ చెయ్యాలి. అదే ఉట్టి ప్రకటన అయితే ఆ టూత్ పేస్ట్ గురించి రెండు మూడు కాచింగ్ వాక్యాలతో మంచి అర్థమొచ్చి, కొనుగోలు దారులని ఆకర్షించే విధంగా ఉండాలి. "ఏ ప్రోడక్ట్ ఎలా తయారుచెయ్యాలి అన్నది కస్టమర్ కోరిక ప్రకారం, పేమెంటు ప్రకారం మనం తయారుచేసి వారికి అందించాలి. యూ గాటిట్"!
    "ఎస్ సర్! ముద్రా ఇనిస్టిట్యూట్ లో ఇవన్నీ వివరంగానే బోధపరుస్తారు".
    "ఓకె దెన్. అది ఎంత కొత్తగా, ఆకర్షణీయంగా ప్రెజెంట్ చెయ్యాలన్నది క్రియేటివ్ డిపార్ట్ మెంట్ పని. ఇక్కడ ప్రతి చిన్నది ముందు ఇంగ్లీషులో తయారుచెయ్యాలి. తరువాత భారతీయ భాషల్లో, వారు కోరిన భాషలో అదే ప్రకటన తర్జుమా చెయ్యాలి. ఇంగ్లీషులో చేసిన భావప్రకటన ఇతర భాషలలో చేసేటప్పుడు సహజంగా ఉండాలి. కాని వర్డ్ టూ వర్డ్ అనువదించినట్లు ఉండకూడదు. అన్ని భాషలకి కాపీ రైటర్లుంటారు. అది వారి పని. ఇంగ్లీషు డిపార్ట్ మెంట్ మెయిన్ కనక, మీ ఒరిజినల్ టాలెంట్ ఇక్కడ బయటపడాలి. అంటే మీ క్రియేటివిటీ, టాలెంట్ అన్నీ వెచ్చించి ఆకర్షణీయమైన స్క్రిప్టు తయారుచెయ్యడంలో మీ ప్రతిభ కనపడాలి. గాటిట్ ..." మీనన్ మహిమకు అర్థమయ్యేట్టు చెపుతూ, ఆమె ఎంత వరకు గ్రహించింది అన్నట్టు చూశాడు.
    "ఎస్ సర్! నాకు క్రియేటివిటి అన్నది ఇష్టమైన సబ్జెక్ట్. అందుకే ఈ వృత్తి ఎంచుకున్నాను. భాష మీద పట్టు ఉంది. అర్థమైన విషయాన్ని అక్షరాలలో భావ వ్యక్తీకరణ చెయ్యగలనని, మెప్పించగలనని అనుకునే ఈ జాబ్ కి వచ్చాను" చాలా నమ్మకం, ఆత్మవిశ్వాసంతో అంది మహిమ.
    "దెన్ లెటజ్ సీ! మా దగ్గరికి వచ్చిన ప్రకటనల ఆర్డర్ మీ దగ్గరికి వస్తుంది. అది మీరు కస్టమర్ కోరిన విధంగా ప్రజెంట్ చేసిన స్క్రిప్టు మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఆ తరువాత వాటిల్లో ఏమయినా మార్పులు చేర్పులు చెయ్యాల్సి ఉంటే, తిరిగి సవరించి పంపాలి. అది యాడ్ గా, లేక విజువల్స్ డిపార్ట్ మెంటుకి వెడుతుంది. ఈ పనికి మీతోపాటు ఇంకా ఇద్దరున్నారు. ఒక అమ్మాయి పెళ్ళి చేసుకుని రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఆ సీట్ లోకి మిమ్మల్ని తీసుకున్నారు. మీతో పాటు అనుపమ, గిరీష్ ఈ సెక్షన్ లో ఉన్నారు. యూ వర్క్ అండర్ మీ ... క్రియేటివ్ డిపార్ట్ మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ జైన్ తెలుసుగా ..." మీనన్ అడిగాడు.
    "ఎస్ సర్. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఉన్నారు. ఆ రోజు మీరూ ఉన్నారు. కానీ నాకు తెలియదు మీరెవరో..."
    తల ఊపాడు మీనన్. "ఎస్! డిపార్ట్ మెంట్ హెడ్ గా ఇంటర్వ్యూలో, సెలెక్షన్ లో నా పాత్ర ఉంటుంది. ఓకే దెన్ ... ఇదిగో, నిన్ననే వచ్చిన ఈ రెండు ఆర్డర్లు తీసికెళ్లి స్టడీ చేసి ఎలా ప్రెజెంట్ చేసేది రాసి పంపండి. కమాన్. మీ ప్రతిభకి పదునుపెట్టండి" అంటూ రెండు ఆర్డర్ కాగితాలున్న ఫైల్స్ ముందుకు జరిపాడు. మహిమ అందుకుని లేచి నిలబడింది. "ఆ, బై ది బై మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ గారిని కలిసి, జాయిన్ అయిన విషయం చెప్పి వెళ్లండి. నౌ యూ కెన్ గో" అన్నాడు.
    మహిమ గదిలోంచి బయటికి వచ్చి, రిసెప్షనిస్ట్ ని "మేనేజింగ్ డైరెక్టర్ ని కలవాలి, వెళ్ళొచ్చా?" అని అడిగింది.
    ఆమె చిరునవ్వుతో "లెట్ మీ సీ"! అంటూ ఫోను తీసి మాట్లాడి, "మీరు వెళ్ళొచ్చు. బాస్ రమ్మన్నారు" అంది.
    మహిమ ఆమె చూపిన గుమ్మం వైపు వెళ్ళి, డోర్ నాక్ చేసింది.
    "ఎస్ కమిన్" అన్నాడు విశాల్.
    మహిమ లోపలకు వెళ్ళి, 'గుడ్ మార్నింగ్ సర్! ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యాను. మీనన్ గారిని కలిసి ..."
    "ఐ హోప్ అతను అంతా మీకు వివరించి ఉంటాడు. హోప్ యూ ఎంజాయ్ వర్కింగ్ విత్ అజ్. ఆల్ ద బెస్ట్ మహిమ! మీకు ఏ విధమైన సలహా, సహాయం కావల్సినా నిస్సంకోచంగా అడగండి ప్లీజ్ ..." అని విష్ చేశాడు నవ్వుతూ.
    విశాల్ మర్యాద, మన్నన, సంస్కారవంతమైన అతని ప్రవర్తన మహిమకి ఎంతో నచ్చింది. పాతిక ముప్ఫై మధ్య వయసు, ఆకర్షణీయమైన మొహం, విదేశాలలో చదువుకుని వచ్చిన పాలిష్ అతనిలో కన్పించి, మంచి బాస్ దొరికాడు. బట్టతల, బానపొట్టవాడు కాదు" అనుకుంది మహిమ బయటికి వస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS