Previous Page Next Page 
మహిమ పేజి 8


    మహిమ రూమ్ లోంచి బయటకు రాగానే అనుపమ కంప్యూటర్ ఆఫ్ చేసి, హ్యాండ్ బ్యాగు పట్టుకుని లేచి, ఆరాటంగా, "ఏమన్నాడు? నచ్చాయటనా? లేక మళ్లీ మార్పులంటూ నసిగాడా ...?" తన అనుభవంతో అడిగింది.
    "లేదు లేదు. బాగున్నాయని మెచ్చుకున్నాడు. ఇంకా ఏమన్నా బెటర్ థాట్ ఉంటే ఆలోచించు, లేదంటే ఇది కన్ ఫర్మ్ చేసేస్తా అన్నాడు".
    "గుడ్! ఫరవాలేదు, మొదటిరోజే కాంప్లిమెంట్ ఇచ్చేశాడంటే...! ఈ మీనన్ గాడు ఒక పట్టాన ఏదీ నచ్చడు. అంచేత నేనేం చేస్తానో తెలుసా? మూడు వెర్షన్స్ తయారుచేసి ముందు మూడోది ప్రెజెంట్ చేస్తా. అది నచ్చలేదంటే రెండోది పెడతా. ఆఖర్న మొదటి వెర్షన్ ఇస్తాను. మొదటే మంచిది ప్రెజెంట్ చేస్తే 'ఇంకా బాగా రావాలి' అంటూనే ఉంటాడు. రెండుసార్లు రిజెక్ట్ చేశాక, మూడోది చచ్చినట్లు ఓకే చేస్తాడు" నవ్వుతూ అంది లిఫ్ట్ వైపు నడుస్తూ.
    "ఈ కిటుకులన్నీ నాకు నేర్పు ... ఫాలో అవుతా" మహిమ నవ్వింది.
    "ఇంటికేనా ...?" ఆరాతీసింది.
    "లేదు. సీమ వస్తుంది. ఇద్దరం కలిసి వెడతాం".
    "ఓకే దెన్ బై" చెప్పి అనుపమ వెళ్లిపోయింది. రిసెప్షన్ దగ్గర మ్యాగజైన్స్ తిరగేస్తుండగా సీమ వచ్చింది. "వచ్చేశావా పద వెడదాం" అంది లిఫ్ట్ వైపు నడుస్తూ. "ఎలా ఉంది మొదటిరోజు అనుభవం?"
    "నాకేం పెద్ద టెన్షన్, భయం వేయలేదు. ముద్రాలో ట్రైనింగప్పుడు ఇలా ప్రకటనలిచ్చి వర్క్ చేయించేవారు. ఆ అనుభవం ఉంది. ఎటొచ్చి ప్రతి ప్రకటనకి బుర్రకి పదును పెట్టాలి. ఒకరోజు వెంటనే మంచి కాప్షన్ తడుతుంది. మరో రోజు చచ్చినా రాదు. సడన్ గా ఫ్లాష్ లా ఐడియా వెలుగుతుంది. ఇదంతా అలవాటే. అయినా నా ప్రెజెంటేషన్ మీనన్ కి నచ్చినట్టే ఉంది. మొహం వికసించింది".
    "ఓ గుడ్ ! మొదటిరోజునే ఇంప్రెస్ చేశావన్నమాట" ఇద్దరూ లిఫ్ట్ దిగి స్కూటీ వైపు వెళ్ళారు.

                                                              *  *  *  *

    ఇంటికెడుతూనే చున్నీ, బ్యాగు టేబుల్ మీద పడేసి పక్కమీద వాలిపోయి, "రేణూ... రెండు టీలు పట్రా" కేక పెట్టింది సీమ. మహిమ కూడా విశ్రాంతిగా కుర్చీలో కూర్చుంది, కాళ్ళు జాపుకుని. ఆకలేస్తోంది. ఏదన్నా తింటే బాగుండుననిపించింది మహిమకి. అన్నట్టు అమ్మ ఇచ్చిన రవ్వలడ్డు, మురుకుల ప్యాకెట్టు ఉన్నాయిగా అనుకుంటూ, అవి తీద్దామనుకునే లోపలే రేణుక ఒక ట్రేలో రెండు కప్పులు టీ, ఒక ప్లేటులో అరడజను బిస్కట్లు, మరో గాజు బౌల్ లో కొంచెం మిక్చర్ పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. రెండో చేత్తో ఉతికి ఆరేసి మడత పెట్టిన బట్టలు ఇద్దరివీ తెచ్చి మంచం మీద పెట్టింది. "బట్టలు మీవి మీరు చూసుకుని తీసుకోండి" అంది రేణుక బయటకు వెడుతూ.
    రెండు బిస్కట్లు గబగబ తిని, ఇంత మిక్చర్ నోట్లో పోసుకుని టీ కప్పు అందుకుంది సీమ. "తిను, తిను, ఆకలేయడం లేదా?" అంది మహిమతో.
    "అమ్మ రవ్వలడ్డు, మురుకులు ఇచ్చింది. తీసి పట్రానా ..." అంది లేవబోతూ.
    "ఇవాళ వద్దులే. ఆదివారం సావకాశంగా తిందాం. ఏదున్నా అందరం పంచుకు తినాలని మా రూలు. మనిద్దరమే తినకూడదు.ఆదివారం ఎల్లుండేగా, అందరం టీతో తిందాం. డబ్బా ముందు పెట్టావంటే మరునిమిషం మిగలవు. ఆరురావురని తినేస్తారు. స్నాక్సు అప్పుడప్పుడు అందరం తలోటి కొంటాం. కొందరికి ఎవరన్నా వస్తే అమ్మలు పంపుతుంటారు" అంది.
    "గుడ్! బాగున్నాయి ఇక్కడ ఏర్పాట్లు. రేణుక బలే ట్రైనయింది. ఏదీ చెప్పనక్కరలేకుండా అన్నీ చేసుకుపోతోంది".
    "ఆ ... రెండేళ్లయింది మేము ఇల్లు తీసుకుని. అప్పటినుంచి మాతోటే ఉంది. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ, కాసేపు రెస్ట్ తీసుకో. నేను ఓ కునుకు తీస్తా. లేదంటే ఎనిమిది గంటల నించి కళ్లు వాలిపోతుంటాయి" అంది మంచం మీద అటు తిరిగి.
    మహిమ తలుపు దగ్గరకు వేసి, పక్క మీద వాలింది.

                                     *  *  *  *

    ఏడున్నరయ్యే సరికి అందరూ ఫ్రెష్ అయి నైట్ గౌన్లలోకి మారి హాల్లో చేరారు. టీ.వి. దాని పాటికి అది మోగుతుంటే, అమ్మాయిలందరూ ఆరౌ ఆఫీసు విషయాలన్నీ గల గల ముచ్చట్లాడేసుకున్నారు. బాస్ లని తిట్టుకున్నారు. కొలీగ్ లతో పేచీలు చెప్పుకున్నారు. "హాయ్ మహిమ ! పొద్దుట హడావిడిలో ఒకరిని గురించి ఒకరు సరిగా తేల్చుకోలేదు. అందరూ పరిచయాలు చెప్పండి మహిమకి" అంది సీమ. "మహిమ ... ముందు నీ సంగతి, అంటే, అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు అన్నదే కాదు, దాచకుండా బాయ్ ఫ్రెండ్స్, ఎఫైర్స్ లాంటివి, సక్సెస్ లు, ఫెయిల్యూర్స్ అన్నీ దాచకుండా చెప్పాలి ..."
    మహిమ నవ్వింది. "అంత కథలేం లేవు నాకు. చాలా గుడ్ గర్ల్ ని నేను. చదువు చదువు. మిడిల్ క్లాస్ అమ్మాయిలకు చదువొకటే ప్లస్ పాయింట్ అని నాన్న అంటారు. బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అమ్మ లెక్చరర్. తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు.మిడిల్ క్లాసు అమ్మాయిని ... చదువయింది. ఉద్యోగం ఎంజాయ్ చేసి, స్వంత సంపాదన చూసుకుని గర్వపడి, ఫ్రీగా కొన్నాళ్లు తిరిగి, అప్పుడు పెళ్ళి అని ఇంట్లో చెప్పేశా. అంటే ఇంకో రెండేళ్ళు ఫ్రీబర్డ్ ని, బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు ... క్లాస్ మేట్స్ తప్ప ..."
    "పిటీ... ఇంత అందంగా ఉన్నావు, అబ్బాయిలు ఊరుకున్నారా? అంత తేలిగ్గా వదిలేశారా నిన్ను?" అంది స్రవంతి ఆశ్చర్యపోతున్నట్టు.
    "మనం లక్ష్మణరేఖ గీస్తే, రావణుడే గీత దాటడానికి భయపడ్డాడు. బయటికి వచ్చేదాకా సీతని ఏం చేయగలిగాడు...? మహిమ తెలివిగా జవాబిచ్చింది. అంతా చప్పట్లు కొట్టారు. "వెల్ సెడ్ ... నిజమే. మనం బరి దాటి బయటికి వచ్చేట్లు ఎమోషన్స్ గుప్పిస్తారు అబ్బాయిలు. దాటగానే వల సిద్ధంగా ఉంటుంది" సీమ అంది.
    "సరే, మహిమ తల్లి బంగారుతల్లి. మనందరం ఈ గుడ్ కంపెనీలో గుడ్ గర్ల్స్ లా మారిపోదాం" ఆరతి యాక్ట్ చేస్తున్నట్టు కళ్ళు తిప్పుతూ అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS