అయిదు
షీబియా చువాంగ్ హాపే రాష్ట్రానికి ముఖ్యపట్టణం. ఇది పీకింగ్ నగరానికి దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో వుంది. "భారతీయ మిత్రుడు డాక్టర్ డి.యస్. కోట్నీస్ స్మారక భవనం" అవిష్కరనోత్సవంలో పాల్గొనడానికి మా ప్రతినిధి వర్గాన్ని Chinese People's Association for Friendship with Foreign (విదేశాలతో స్నేహానికి చీనా ప్రజల సమాఖ్య) అనే సంస్థ ఆహ్వానించింది.
డిసెంబరు 9వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12 గంటల దాకా ఈ మహోత్సవం జరిగింది.
డాక్టర్ కోట్నీస్ స్మారక మందిరం ఇరవయ్యోకరాల భూభాగంలో నిర్మితమయింది. దీని ప్రక్కనే డాక్టర్ బెతూన్" స్మారక మందిరమూ, అయన పేరిట నిర్మితమైన చైనా ప్రజా విమోచన సైన్యపు డాక్టర్ నార్మన్ బెతూన్ అంతర్జాతీయ శాంతి వైద్యశాల ఉన్నాయి. ఈ వైద్యశాలకు మొట్టమొదటి డైరెక్టర్ డాక్టర్ కోట్నీస్.
డాక్టర్ కోట్నీస్ గురించి గాని , అంతకుముందు అయన లాగే చైనాను తన రెండవ మాతృభూమిగా చేసుకున్న కెనడా డాక్టర్ బెతూన్ ను గురించి గాని రాయాలంటే చాలా వుంది. వారు చేసిన మహత్తర త్యాగాలను గాని, వారి అంతర్జాతీయ సామ్రాజ్య వ్యతిరేక సంగ్రామ శక్తిని గాని అర్ధం చేసుకోలేని వారికి నే నేది వ్రాసినా విసుగ్గానే ఉంటుంది. లేదూ, వారిని గురించి ఏమాత్రం ఆసక్తి ఉన్న వారయినా చదువుకోడానికి చక్కని పుస్తకాలున్నాయి! డాక్టర్ కోట్నీస్ అమర గాధ తెలుగులో గ్రంధ రూపంగా వచ్చిందో లేదో గాని శాంతారామ్ నిర్మించిన చలన చిత్రాన్ని మాత్రం మనదేశంలో అత్యధిక సంఖ్యాకులు చూసే ఉంటారు.
(దురదృష్టవశాత్తూ ఈ చలన చిత్రం దేశవాళి చిత్ర నిర్మాణ పరిమితులను అధిగమించలేక పోయింది. అందుకే ఆ చలనచిత్ర నిర్నానానికి సలహాదారుగా వెళ్ళిన డాక్టర్ బాసూ- మా ప్రతినిధివర్గ నాయకుడు , 35 ఏళ్ళ క్రిందట కోట్నీస్ తో బాటు భారతీయ మెడికల్ మిషన్ లో సభ్యుడు - తన అసంతృప్తినీ, ఆవేదననూ తెలియబరుస్తూ బొంబాయి నుంచి మరలిపోయారు.)
చీనా ప్రజలు విముక్తి సాధించడానికి పూర్వం, ఆదేశానికి వెళ్ళి, అయిదు సంవత్సరాలుగా అయిదు సామ్రాజ్యవాదాలతో పోరాడుతున్న చీనా సైనికులకు వైద్య సహాయం చేస్తూ , తన ఆరోగ్యాన్నీ సహా లక్ష్యపెట్టక రేయింబవళ్ళు నిర్విరామంగా పనిచేస్తూ తన 34 వ యేట , డిసెంబరు 9 వ తేదీ 1942 లో డాక్టర్ కోట్నీస్ మరణించారు. చీనా ప్రజలు డాక్టర్ కోట్నీస్ ను తమ అభిమాన భారతీయ మిత్రునిగా పరిగణించారంటే ఆశ్చర్యం లేదు. ఆ అభిమానానికి ప్రతిబింబమే డాక్టర్ కోట్నీస్ స్మారక చిహ్నం.
ఈ మందిరంలోనికి ప్రవేశిస్తున్న మోటారు కార్లకు ఇరువైపులా బారులు తీరిన రెడ్ గార్డులు, పతాకాలతో, పాటలతో, నినాదాలతో, బాజాలతో స్వాగతం ఇచ్చారు. వీళ్ళందరూ పది పన్నెండేళ్ళ లోపు బాలబాలికలు. అంతటి అలజడిలోనూ వాళ్ళు ప్రదర్శిస్తున్న క్రమశిక్షణ నాకు ముచ్చట గోలిపింది. అప్పుడే అనుకున్నాను ఈ రెడ్ గార్డులు ఒక్క చైనా దేశానికే కాదు యావత్ప్ర్పపంచానికి భావి భాగ్య నిర్ణేతలని!
మందిర ముఖ ద్వారం దాటిన తర్వాత మా ప్రతినిదులందరికి ఒక్కొక్క రెడ్ గార్డు ఒక్కొక్క పుష్పదామం అర్పించాడు. అవి అందమైన ప్లాస్టిక్ పూలు. వాసనలేక పోవచ్చు గాని వాదిపోనివవి.
నా పుష్ప గుచ్చాన్ని లగేజి కన్నా భద్రంగా బొంబాయి దాకా కాపాడుకు వచ్చాను. అక్కడ దాని నొక మిత్రుడి యింట్లో మర్చిపోయాను.!
సిన్ హువా వార్తా సంస్థ స్మారక మందిరం అవిష్కరనోత్సవాన్ని చాలా విపులంగా రిపోర్టు చేసింది. అందులో కొన్ని ముఖ్య విషయాలు.
షిన్ చియాచువాంగ్ (డిసంబరు 9,1976) నేటి ఉదయం నార్మన్ బెతూన్ అంతర్జాతీయ శాంతి వైద్యశాల ఆడిటోరియంలో డాక్టర్ కోట్నీస్ మెమోరియల్ హాల్ ప్రారంబోత్సవం జరిగింది.
ఇందులో డాక్టర్ బి.కె. బాసూ నాయకత్వం కింద వచ్చిన అఖిల భారత డాక్టర్ కోట్నీస్ మెమోరియల్ కమిటీ ప్రతినిధులూ, కోట్నీస్ అన్నగారు, మంగేష్ బాస్, కొట్నీస్ చెల్లెలు డాక్టర్ వత్సలాబాస్ కొట్నీస్, భారత రాయబారి కె.ఆర్. నారాయణ్" పాల్గొన్నారు.
హుపే రాష్ట్ర విప్లవ కమిటీ అధ్యక్షుడు వియూసూ- హూ, చైనా విమోచన సైన్యం ఉప నాయకుడు నాన్ హై- ఫెంగ్ కూడా పాల్గొన్నారు. ఆవిష్కరణత్సవానికి ముందు వీరు భారతీయ మిత్రులతో హృదయ పూర్వకంగా మాట్లాడుతూ కొంతసేపూ గడిపారు.
విదేశాలతో చీనా సుహృదయ సంఘం అధ్యక్షుడు నాంగీపింగ్ - నాన్ ఆవిష్కరణ ప్రసంగం చేశారు.
(ఈ ప్రసంగంలో అయన "జపాన్ సామ్రాజ్యవాదుల దురాక్రమణను ఎదిరించి పోరాడుతున్న చీనా ప్రజలకు సహాయపడడానికి భారత ప్రజలు పంపించగా సుదూరం నుండి వచ్చిన డాక్టర్ కోట్నీస్ దైర్య సహసాలనూ, సేవా నిరతిని ఉగ్గడించారు. అప్పటి కొమింటాంగ్ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా భారతీయ వైద్య దళం, చైనా కమ్యునిస్ట్పార్టీ చైర్మన్ మావో నాయకత్వంలో విముక్తి చేసిన ప్రాంతాలకు ఎలా చేరుకున్నదో వివరించారు. ఉత్తర చైనాలోని యేనాన్, తదితర ప్రదేశాలలో అయిదు సంవత్సరాలపాటు ఎటువంటి దీక్షతో, కార్యక్రదక్షతతో పనిచేసింది పేర్కొన్నాడు.)
చైనా ప్రజల మహా నాయకుడూ, అధ్యాపకుడూ అయిన చైర్మన్ మావో డాక్టర్ కోట్నీస్ అకాల మరణానికి సంతాపం ప్రకటిస్తూ వ్రాసిన వాక్యాలనూ తమ ప్రియతమ ప్రధాని చౌ ఎన్ లై ఆ సందర్భంలో కామ్రేడ్ కోట్నీస్ కుటుంబానికి సానుభూతిగా పంపిన టెలిగ్రాం నూ అయన ఉదాహరించారు.
వాంగ్ పింగ్ నాన్ ఇంకా ఇలా అన్నారు. "డాక్టర్ కొట్నీస్ స్మృతికి శ్రద్దాంజలి ఘటించడంలో మనం మార్మ్రుజం- లెనినిజం , మావో భావాలను అధ్యయనం చేస్తూ డాక్టర్ కోట్నీస్ ఉదాహరణను అనుసరించి హృదయపూర్వకంగా విశ్వ విప్లవానికి , ప్రపంచ ప్రజలకూ అంకితం కావాలి. చైర్మన్ హువా కో ఫెంగ్ కు బాసటగా నిలిచి, చీనా సామ్యవాదవిప్లవాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. మానవ జాతి భవిష్యద్వికాసానికి తోడ్పడానికి ఇంకా ఎక్కువగా కృషి చెయ్యాలి."
