Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 6


                                                          వరాలస్వామి

    శ్రీమాత అనసూయ ప్రేమాంకమున చిఱు
        నవ్వులు చిందు చిన్నారి స్వామి;
    అత్రి మహాముని ఆశ్రమాంగణ మందు
        పారాడు మేలి బంగారు స్వామి;
    బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమ్ములు
        మేళవించిన రతనాల స్వామి;
    విశ్వకుటుంబియై వెలుగుచు బ్రహ్మచ
        ర్యమును పాటించు వరాలస్వామి;

    శ్రుతులు శునకత్వమూని సంస్తుతు లొనర్ప
    వేద వేదాంత వేద్యుడై వెలయు స్వామి;
    సకల భువనాంతరాళ విశ్రాంత కీర్తి;
    శాంతమూర్తి; దత్తాత్రేయ చక్రవర్తి.

    మూర్తి యొక్కటే ముగ్గురు మూర్తులగుచు
    పరిఢవిల్లెను "హరి హర బ్రహ్మ" లనగ;
    వారు మువ్వురు నొక్కరైనారు మరల
    అత్రి కోర "దత్తాత్రేయ" డనెడిపేర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS