"వద్దు ....వద్దు ......... అరె, ఇంతేసి వడ్డిస్తే ఎలా తినడం." పరధ్యానంగా వున్న సారధి -- తార కూర అలా వడ్డించేస్తుంటే గాభరాగా చేయి అడ్డం పెట్టాడు.
"భోజనం చెయ్యకుండా ఏమిటా ఆలోచన .... పరవాలేదు తిను.... అప్పుడు మా యింట్లో పచ్చడి మెతుకులు మాత్రం పెట్టగలిగాం .... ఇప్పుడు అన్నీ పెడ్తుంటే తినకపోతే ఎలా?......"
'అవునవును , నాకు మాత్రం యింతింత పెడ్తున్నావు . నీవు మాత్రం ఆ రెండు రొట్టెలే యిందాకటి నించి తింటున్నావు. అంతేనేమిటి నీ భోజనం? అన్నింటితో పాటు భోజనానికి కూడా నాజూకు నేర్చినట్టున్నావు....!" తార రెండు రొట్టెలు...... కూర, ఒక అరటిపండు, గ్లాసుడు మజ్జిగ మాత్రం తీసుకోడం చూసి అడిగాడు సారధి.
తార అదోలా నవ్వింది. "మీరంతా అదృష్టవంతులు బాబూ, కావాల్సినవి కడుపునిండా తినగలిగిన భాగ్యవంతులు..... యింత భాగ్యం వున్నా కావాల్సింది హాయిగా తినగలిగే అదృష్టం నాకు లేదు...." నిట్టూర్చింది.
"అదేమిటి?"
'అవును.... యీ ఫిగర్ యిలా కాపాడుకోవాలంటే నోరు కట్టుకోవాలి. లేకపోతే మీలాంటి వాళ్ళందరూ తెర మీద మమ్మల్ని చూస్తారా. లావెక్కిపొతే తెర వెనక్కి పంపుతారు..... అందుకోసం.....లక్ష లార్జిస్తూ , నా వాళ్ళందరూ తినడానికి నేను నోరు కట్టుకోవాలి . హు .....లేనన్నాళ్ళూ తినాలన్నా తినలేకపోయాను. ఇప్పుడు ఉన్నా తినలేక పోతున్నాను. ఇంతకంటే ఐరనీ ఏముంది.
"నాకు స్వీట్స్ అంటే ప్రాణం. తీపి పిండి వంటలంటే ఇష్టం. బిస్కట్స్, చాకలెట్లు, చంటిపిల్లలా తినాలని వుంటుంది. బంగాళాదుంపల వేపుడు ప్రాణం. పప్పులో నెయ్యి వేసుకు కమ్మగా తినాలని వుంటుంది. ఇందులో ఏదీ తినలేను ఇప్పుడు. అలా అందరూ తింటుంటే తినకుండా వుండడానికి ఎంత నిగ్రహం అలవాటు చేసుకుంటూన్నానో." తార పైకి నవ్వుతూ అన్నా, ఆమె మాటలలలో ఆవేదనకీ చలించాడు సారధి.
"గాడిదగుడ్డు, కడుపు నిండా తిండి కూడా లేక పోయాక యింకా సంపాదనెందుకు, ఈ లక్షలన్నీ ఏం చేసుకుంటావు. ఫిగర్ కాపాడుకోడానికి కడుపు మాడ్చుకోవాలా?"
"మీకేం తెలుసు మా అవస్థ. డైటింగ్, ఎక్సర్ సైజులు చేస్తుంటేనే ఇలా వుండగలం. ఇంత చేస్తున్నా ఇదివరకటి కంటే ఎంత వళ్ళు వచ్చిందో చూశావా."
నిజమే సుందరి నిండుగా వుంది ఇప్పుడు!
"ప్చ్, మీరందరూ అనుకునేటంత, అసూయపడేంత అందమైన జీవితం కాదు మాది. ఆకాశంలో మిలమిలలాడే అందమైన తారలని దగ్గర కెళ్ళి చూస్తె వుండే గుంటలు, గతుకులు మాదిరే మా జీవితాలలో వుండే లోటు పాట్లు, నిర్వేదాలని ఊహించలేరు ఎవరూ! ఇదివరకు డబ్బోక్కటి వుంటే చాలు, అన్ని ఆనందాలకి మూలం అనుకున్నాను.... ఇప్పుడు డబ్బే నా అన్ని మనస్తాపాలకి కారణం అన్పిస్తుంది. సరేలే..... అదేమిటి ఆ పళ్ళు తీసుకో ..... మరేం పరవాలేదు లెద్దూ.... తిను " అంటూ అరటి పళ్ళు, ఏపిల్ పండు ముక్కలు ముందుకు జరిపింది తార.
"వద్దు బాబు , చాలా హెవీ అయింది. ఇంక చాలు." అంటూ లేచాడు సారధి.
టవల్ అందించింది తార. తరువాత కప్ బోర్డు మీద బరిడే తీసి సుగంధాలు జల్లే వక్కపొడి ఇచ్చింది.
"రా.....అలా కాసేపు గార్డెన్ లోకి వెళ్ళి కూర్చుందాం. చల్లగా వుంటుంది."
సారధి వాచీ చూసుకున్నాడు. "ఇప్పుడా పది దాటింది, నే వెళ్ళొద్దు."
"అబ్బ, ఇంటికెళ్ళి ఏం చేస్తావు? పడుకోవడమేగా. అవిడెం లేదుగా సాధించడానికి. ఒక గంట ఆలస్యం అయితే మరేం పరవాలేదు నిద్రకి ..... నే డ్రాప్ చేస్తాగా ..... అసలు మనం మాట్లాడుకోనేలేదు ఇంకా."
కాదనలేకపోయాడు సారధి. పోర్టికో దాటి గార్డెను లోకి దారితీసింది తార. బంగాళా ఎదురుగా చల్లటి పూల తోట అందంగా పెంచారు. వెన్నెల్లో విరిసిన రకరకాల పూలు తెల్లగా మెరుస్తున్నావి. మల్లె, జాజి, నైట్ క్వీన్ , మాలతీలత అన్ని సువాసనలు కలిపి వింత పరిమళాన్ని అందిస్తున్నాయి. లైనుగా కత్తిరించిన హేడ్జింగ్..... గార్డేనుకి మధ్యగా రాధా మాధవుల విగ్రహం నించి పౌంటేన్ నీళ్ళు చిమ్ముతుంది. రంగురంగుల బల్బుల కాంతి మధ్య, చుట్టూ సిమెంటు బెంచీలు, క్రింద పసిరిక తివాచి లాంటి లాన్ , ఆ తోటలో విదేశీ స్వదేశీ అన్ని రకాల పూల మొక్కలు రంగు రంగుల పూలతో ......
