Previous Page Next Page 
ప్రతీకారం పేజి 6


    ఆమె వెనకే వెళ్ళి డ్రాయింగ్ రూంలో కూర్చున్నాను.
    రాధ ముఖంలోకి చూశాను. చాలా దిగులుగా కన్పించింది. బాగా చిక్కిపోయి వుంది.
    "రాధా నువ్వు లేకుండా నేను బతకలేను" చాలా పాత డైలాగే చెప్పాను.
    రాధ జవాబివ్వలేదు. కళ్ళలో నీరు తిరిగింది.
    "మేము ఈ దావా తప్పక గెలుస్తాం!" అన్నాను.
    ఆమె తల వంచుకొని కూర్చుంది. సమాధానం చెప్పలేదు.
    "ఒకవేళ గెలవకపోయినా నేను పెళ్ళాన్ని పోషించలేనంత అసమర్థుణ్ణి కాను" అన్నాను.
    రాధ చివ్వున తలెత్తి నా ముఖంలోకి బాధగా చూసింది. అంతలోనే దుఃఖం కట్టలు తెంచుకొన్నది. రెండు చేతుల్తో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
    నేను లేచి ఆమె దగ్గరగా వెళ్ళి నిల్చున్నాను. ఆమె చేతుల్ని ముఖం మీదినుంచి తొలగిస్తూ ఏడవకు రాధా! నాతో వచ్చేయ్. రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుందాం! పెద్దవాళ్ళ నమ్మకాలకూ, అభిప్రాయాలకూ మన జీవితాలు బలి కాకూడదు" అన్నాను ఉద్రేకంగా.
    రాధ ఒక్కసారిగా తనను నా చేతుల్నించి విడిపించుకుంది. దూరంగా జరిగి నిల్చుంది. బెదురుగా చూసింది.
    "నాకు సమాధానం కావాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేక నా డబ్బునా?"
    రాధ అసహాయంగా చూస్తూ నిలబడింది.
    నేను ఆమె చెయ్యి పట్టుకొని అనునయంగా "నీకు నా మనసు తెలుసు, వచ్చేయ్ నాతో!" అన్నాను.
    "నన్ను క్షమించండి! నేను అలాంటి పని చెయ్యలేను. కుటుంబానికి మచ్చ తేలేను. మా నాన్నను మోసం చెయ్యలేను" అన్నది ఏడుస్తూ.
    నేనెంతో బ్రతిమిలాడాను. నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. కాని రాధ తండ్రికి తెలియకుండా ఇల్లు విడిచి రావడానికి అంగీకరించలేదు. అటువంటి విషయాలు ఊహించడానికే ఆమెకు భయం అని తెలుసుకున్నాను.
    "సరే! నేను దావా గెల్చాకనే వస్తాను" అంటూ నేను విసురుగా బయటికి వచ్చేశాను.
    జీపు దగ్గిర నిల్చుని వెనక్కు తిరిగి చూశాను. రాధ వెక్కి వెక్కి ఏడుస్తూంది. ఆ క్షణంలో రాధ పిరికితనం మీద కోపం వచ్చింది.
    ఆ రోజు...నేను ఏనాటికీ మర్చిపోలేని రోజు...నన్ను పూర్తిగా మరో మనిషిగా మార్చిన రోజు...నా జీవితాన్నే తారుమారు చేసిన రోజు... మేము దాదా గెల్చినరోజు.
    "ఒరేయ్ ! జగ్గూ! మనం దావా గెల్చారాం! ఆ రఘురామయ్యను తలదన్నే సంబంధం తెస్తాను. రాధకంటే సౌందర్యవతిని ఈ ఇంటికి కోడలిగా తెస్తాను, ఆనాడు నన్ను అవమానించాడు." అంటూ నాన్న ఉత్సాహంగా ఏమేమో మాట్లాడుతూనే వున్నాడు.
    నేను గబగబా వెళ్ళి జీపు స్టార్టు చేశాను. నాన్న ఎక్కడి కెళుతున్నావని అడుగుతున్నా వినిపించుకోకుండా బయలుదేరాను. జీపు నడుపుతూనే ఊహల్లో తేలిపోతున్నాను, మధుర స్వప్నాలలో తేలిపోయాను. ప్రపంచంలో నేనూ... రాధా... ఇద్దరమే ఉన్నట్టు ఊహించుకుంటూ ఆ ఊళ్ళో ప్రవేశించాను. దూరంగా మంగళ వాద్యాలు విన్పించాయి. శుభం పలుకుతున్నాయనుకున్నాను. రాధా వాళ్ళ ఇల్లు దగ్గిరౌతుంటే ఆ వాద్యాలూ దగ్గిరగా వినిపించసాగాయి. ఓ క్షణం ఏదో ఆలోచన వచ్చి నిలువెల్లా కంపించిపోయాను. అంతలోనే నాకు నేనే ధైర్యం చెప్పుకుని ముందుకు వెళ్ళాను.
    రఘురామయ్యగారి ఇంటిముందు పందిరి...ఆ పందిరి నిండా జనం... చూసి జీపు పట్టుకొని స్థాణువులా ఎంతసేపు నిల్చుండిపోయానో నాకే తెలియదు. వాద్యాలు ఒక్కసారిగా మిన్ను అదిరిపోయేలా మ్రోగాయి. నేను యాంత్రికంగా పందిట్లోకి నడిచి గుంజకు చేరబడి నిల్చున్నాను.
    పెళ్ళి మండపంలో ఎదురుగా రాధ పెళ్ళికూతురై కూర్చుని వుంది. ఓ క్షణం గుండె ఆగిపోయినట్టూ, పందిరి విరిగి నా నడుం మీద పడినట్టూ అనిపించింది. కింద పడిపోకుండా గుంజ పట్టుకొని నిలదొక్కుకున్నాను. చూస్తూ నిల్చున్నాను. నాకేం అయిందో నాకే తెలియడం లేదు, నా జీవిత సర్వస్వం నా కళ్ళముందే ఎవరో దోచేస్తూ వుంటే అసహాయంగా చూస్తూ నిల్చున్నాను. మంగళసూత్రధారణ పెడుతున్నాడు. అంతా చూస్తున్నాను. నా చేతిలోనూ అక్షింతలు పెట్టబోయాడు. అనుకోకుండానే చెయ్యి చాపాను. అక్షింతలకేసి చూశాను. నేను ఈ అక్షింతలతో రాధను దీవించాలా? దీర్ఘసుమంగళిగా వుండాలని కాంక్షించాలా? పెళ్ళికొడుకు మాంగల్యం పట్టుకొని నిల్చున్నాడు. అది నా గొంతుకు తగిలిస్తున్న ఉరితాడులా అన్పించింది. ఉక్కిరి-బిక్కిరి అయిపోయాను. రాధ ఒకసారి తలెత్తి ఎవరికోసమో చూసింది. చూసిందో లేదో తెలియదు. కాని నాకు అలాగే తోచింది. నా కోసమే చూస్తుందనుకున్నాను, దూరంగా నిలబడ్డ నా ముఖంలోకి అసహాయంగా చూసింది. "ఓడిపోయాను క్షమించు" అన్నట్టు చూసింది. తల వంచుకుంది. పెళ్ళికుమారుడు మూడు ముళ్ళూ వేశాడు. పురోహితుల కంఠాలు తారాస్థాయిలో వినిపిస్తున్నాయి. వధూవరుల మీద అక్షింతలు దూరం నుంచి పడుతున్నాయి. నేనూ విసరబోయాను, ఎత్తిన చెయ్యి అలాగే ఆగిపోయింది. గిర్రున తిరిగి రోడ్డుమీదకు వచ్చాను. కసిగా చేతిలోని అక్షింతలు రోడ్డు ప్రక్కగా పారుతున్న మురిక్కాలవలోకి విసిరికొట్టాను.
    ఏడుపు రావడం లేదు. బాధ తెలియడం లేదు. కాని నా గుండెల్లో ఏదో కదులుతూ వుంది, బుసలు కొడుతూ వుంది.
    కసి పడగ విప్పింది. తేలుకొండి ఎత్తింది. పడగ విప్పిన సర్పం దేన్నయినా కాటు వెయ్యాలి. విషంతో బరువుగా వున్న తేలు దేన్నయినా కొట్టాలి. అంతవరకూ దానికి శాంతి వుండదు.
    నా పరిస్థితీ అలాగే వుంది. నా శరీరంలోని ప్రతి అణువూ అశాంతితో అలమటిస్తోంది. రక్తం ప్రతీకార జ్వాలతో సలసల కాగుతోంది. జీపు ఎక్కాను. ఎలా నడిపానో ఇప్పటికీ నేను ఊహించలేను. దారిలో జీపు కింద కుక్కపిల్లా, కోడి పడి చచ్చాయి. వెనక్కు తొంగి కూడా చూడలేదు. బహుశా ఆ రోజు నా జీపు కింద మనిషి పడి చచ్చినా అలాగే చేసి వుండేవాణ్ని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS