Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 6


    "నువ్వు చెప్పింది తప్పేమీ కాదులే!" అని సమర్థించాను. సంతృప్తితో మీసం సవరించుకున్నాడు.
    "నేనా బాబయ్యా! సన్యాసి సాములోరు సెప్పినట్లు అర్థరాత్రులు పూనిను. ఎన్నిట్లో ఓ నదులు తింటాని కెల్లాను. మొత్తం కొండవీడు సెట్టూ పుట్టా కాలరిగేటట్టు తిరిగాను. అన్ని ఆకులూ తిన్నాను. అట్టా ఆరునెలలు తిరిగాను.
    ఓ రోజు పూనిమనాడు రాత్రి నట్టడవిలో కొత్త ఆకుల కోసం వెతుకుతూ వున్నాను. దూరంగా ఎత్తయిన తిప్ప మీద ఎవరో రుసి కూకుని తపస్సు చేసుకుంటున్న అలంకు తగిలింది. దగ్గరగా ఎల్లాను. నిజంగా రుసే! మడిసిన్నర పొడుగున్నాడు. మూరెడు గోల్లు, బారెడు తలెంట్రుకలూ ఉన్నాయి. దగ్గరగా బోయి దండవెట్టా. రుసి కరుణించి కల్లు తెరిశాడు.
    "ఒరే ఓబులూ! నాపేరు పెద్ది యజ్జ్వ. నేను కొండవీటి రెడ్డి రాజుల కొలువులో కులగురువుని. గోదావరీ తీరాన యెన్నో యాగాలు చేశాను. రెడ్డి రాజ్య పతనం కళ్ళారా చూసి సన్యసించాను. నేను చిరంజీవిని!" అన్నాడు.
    "అయితే సామీ నాకెందుకు దయసేశా" (కనుపించా?) అని అడిగాను.
    "మరేమీ లేదు నీవు యీ విషయాన్ని అందరికీ చెప్పు" అంటూ అంతర్థానమయ్యాడా రుసి పోతూ పోతూ ఒక ఆకు పేరు చెప్పాడు. అదే నేనిచ్చే బూడిద" అంటూ తన ఉదంతాన్ని వివరించాడు ఓబులు.
    నేను ఆశ్చర్యపోయాను. అందులో వున్న యదార్థమో, అయదార్థమో నేను వూహించటం నావల్ల కానిపని. అందువల్ల ఆ విషయాన్ని మర్చిపోయాను. వెంటనే ఇప్పుడీ వీర ముష్టి వాయిద్యాల మధ్య గండకత్తెరను పూలహారంగా ధరించి ధ్యాన నిమగ్నుడైపోయిన ఓబుల్ని చూడగానే అదంతా గుర్తుకొచ్చింది.
    వోబులు రెప్పల్లార్చి చింతనిప్పుల్లా వున్న గ్రుడ్లు నావైపు త్రిప్పాడు. మనిషి వాలకం చూస్తే ఇ.ఎస్.పి.లో వున్నట్లు తెలుస్తూ వున్నది.
    "పాలాసైకాలజీ" లో యి.యస్.పి. ఒక విభాగం, 'ఎక్స్ట్రా సైకలాజికల్ పర్ వర్షన్' సైకాలజీ శబ్దంలో పి, సైలెంట్ కనుక య.సి.పి. అనకుండా యి.యస్.పి. అన్నారు.
    అతడేదో అద్భుతమైన విషయం మాట్లాడబోతున్నాడని అనిపించింది. అతని యి.యస్.పి. చూపుల వల్ల నా సిక్త్స్ సెన్స్ కు అలా అనిపించింది.
    నేను కూడా సాధ్యమైనంత మానసిక శక్తిని చూపుల్లోకి కేంద్రీకరిస్తూ అతని చూపుల్లోకి గ్రుచ్చాను. సాక్షీ భూతుడైన ఆంజనేయస్వామి కన్నార్పక చూస్తున్నాడు. ఓబులు అలాగే కొంతసేపు చూచి నావైపు నడచి రావటం ప్రారంభించాడు. ప్రక్కనున్న స్నేహితులు దూరంగా తప్పుకున్నారు. ఓబులు నా భుజం పట్టి కుదిపాడు. నేను చూపులు మార్చలేదు. అతను మాట్లాడాడు.
    "బాబయ్యా? నామీద చూపు నిలిపేనా? సాములోరి దయ నీమీద సల్లంగ పడింది. నువ్వు సుక్కల్లో సెందురుడివై వెలగాల. గడిచిపోయిన కాలం నీ కన్నుల్లో కనపడాల. కొండవీడి రెడ్డి రాజుల కథ నీ కళ్ళముందు సుళ్ళు తిరగాల, ఫో! పెద్ద యజ్వ బాబయ్య దగ్గరికి ఫో! మంచులో తడిసిన మొగ్గ. లేక తమలపాకుల రవ్వ. నీలి మంటల నిప్పులో కురికింది. ఆ కథ నువ్వు సూడాల. లోకానికి సెప్పాల. ఆర్యదేశంలో అభిమన్య కుమారుడు పుట్టాడు. గిట్టాడు. అది వీర చరిత్రగా నిలిచిపోయింది. సోమదేవుడు అనార్య జాతిలో పుట్టాడు. అతడు అనార్యజాతిలో పుట్టిన అభిమన్యుడు. ఆరికథ నువ్వు సూడాల. లోకానికి సెప్పాల.   ఫో! పెద్ది యజ్ఞ్వ బాబయ్య ఆజ్ఞ కలిగింది పో! అంటూ నన్ను త్రోయసాగాడు.
    వీర ముష్టి వాయిద్యాలు తారాస్థాయినందుకున్నాయి. ఓబులు ప్రళయకాల రుద్రుడల్లే శివతాండవం ప్రారంభించాడు. వాయిద్యాల స్థాయి వెరిగిన కొద్దీ అతడి బిందు శృతిమించింది. అలా ఎంతసేపు చేశాడో చివరకు ప్రొద్దుకూకే వేళ్ళకు చెమటతో ఒళ్ళంతా తడిసిపోయింది. పూనకం నుండి తేరుకుండానే పడిపోయాడు. నా మిత్రులతో కలిసి నేనాచోటు వదిలిపెట్టాను. ఎలాగైనా చీకటిపడితే వేళకు కొండమీది సత్రానికి చేరుకోవాలి. అది ఇంకా మూడు మైళ్ళ దూరముంది. త్వరగా వెళితేకాని చేరుకోలేం. నా మిత్రులతో కలిసి నడక సాగించాను. కనుచీకటి పడుతున్న వేళకు 'కత్తుల బావి' 'చీకటి కోనేరు' గా పలుపేర్లతో పిలువబడుతున్న పుష్పక భవనం దగ్గరకు చేరుకున్నాము. పక్కనే పెద్ద నంది. ఎదురుగా ఏకశిలలో మలచిన కృష్ణ దేవరాయల విజయధ్వజమూ ఉన్నాయి. చీకటి కోనేరుది విచిత్రమైన కథ.
    రెడ్డి రాజులను శాపగ్రస్తులను చేసిన మహోజ్జలమై ఘట్టమొకటి జరిగిందక్కడ. ఆ మొత్తం కథనూ వివరించటానికి సమయం చాలదని మిత్రులకు టూకీగా వివరించాను. ఒక బ్రాహ్మణుడు పరశువేదిని కాజేశారనే నెపంతో రెడ్డి రాజులపై కక్ష కట్టి దేవాలయ నిర్మాణం ప్రారంభించాడు. లోపల ఆలయంలో కత్తుల బావి ఏర్పాటు చేశాడు. లోపలి ఆలయ గర్భంలో (గర్భాలయం) మురళీలోలుడు స్వయంగా వేణుగానం విన్పిస్తున్న భ్రమ కలిగించాడు. ఆ విచిత్రోదంతం చూడాలని వెళ్ళి పంటరెడ్లు అందరూ కత్తుల బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఇది అనుశృతంగా వస్తున్న కథ.
    నా కవిమిత్రుడు కథ యావత్తు విని ఆకర్షితుడై ఆ కధను ఒక కావ్యంగా వ్రాస్తానన్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS