Previous Page Next Page 
వైరం పేజి 7


    "నేను తాగనని నీకు తెలుసు"
    "బియర్ లేడీస్ డ్రింకురా! ఇవ్వాళ రేపు అమ్మాయిలూ కూడా పబ్స్ లో హార్డ్ డ్రింక్సే లాగిస్తున్నారు"
    "వాళ్ళ సంగతి వేరు."
    "నువ్వు బాగుపడవులే! ఇంతకీ ఏ యూనివర్సిటీలో సీటు వచ్చిందిరా?"
    ఫలాని అమెరికన్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు సూరజ్ ఓపిగ్గా.
    "వావ్! సుడిగాడివిరా బిడ్డా! పెద్ద కంపెనీ! పెద్ద ఉద్యోగం!
    యదునందన్ ని వదిలించుకోవాలని అతి తీవ్రంగా అనిపించింది సూరజ్ కి.
    కానీ, ఈ లోగానే గబగబా చెప్పేయడం మొదలెట్టాడు యదు.
    "నువ్వు అమెరికా చెక్కేసేముందు ఎవరో ఒహర్తి మెళ్ళో తాళి కట్టేసి పోరా అని మా అమ్మ ఒకటే పోరు! పది సంబంధాలు తెచ్చింది." అని బస్తాలాంటి జేబులోనుంచి పర్సులాంటి ఒక ఫోల్డరు తీశాడు.
    అందులో పది అరలు ఉన్నాయి.
    ఒకదానిలో పాస్ పోర్టు -
    ఒకదానిలో ఎయిర్ టిక్కెట్లు -
    ఒకదానిలో అమెరికన్ డాలర్లూ-
    ఒకదానిలో క్రెడిట్ కార్డులు -
    మిగతా అరల్లో -
    అమ్మాయిల ఫోటోలు.
    ముందు యధాలాపంగా చూశాడు సూరజ్.
    షాక్ కొట్టినట్లయి, ఈ సారి తీక్షణంగా చూశాడు.
    అన్నిటికంటే పై వరుసలో -
    ఒకమ్మాయి ఫొటో!
    అరుణ!!
    తన అరుణ!!

                       *    *    *    *

    "మళ్ళీ ప్రాబ్లెమా?" అని వినబడింది ఒక గొంతు. "ఇది మరీ రొటీనయిపోతున్నట్లుందే!" అన్నాడు అతను నవ్వుతూ.
    చటుక్కున తిరిగి చూసింది సునయన.
    అక్కడ -
    అభిరాం!
    "మీరా మళ్ళీ ఇక్కడా?" అంది తన కళ్ళని తనే నమ్మలేనట్లుగా చూస్తూ.
    "నేను ఒక సెయిలర్ ని అని చెప్పలేదా ఏమిటీ? ఎక్కడ సముద్రం ఉంటుందో అక్కడ నేను..." అని సగంలో ఆపి, సునయనని బెదిరిస్తున్న వాడినీ, కిందపడి వున్నవాడినీ ఇద్దరినీ కూడా లేపి, వాళ్ళ మెడల చుట్టూ తన చేతులు బలంగా బిగించాడు అభిరాం.
    తక్షణం తేలకళ్ళు పడ్డాయి వాళ్ళకి.
    "ఏం రంగురా ఇది?" అన్నాడు అభిరాం. వాళ్ళలో ఒకడి తలమీద వున్న వుత్తిత్తి 'రక్తాన్ని' తాకి చూస్తూ.
    వాళ్ళ గొంతులు నొక్కేసుకుపోతూ వుండడం వల్ల మూలుగులే తప్ప మాట బయటకి రావడం లేదు.
    బలిష్టులయిన ఆ ఇద్దరినీ అలా అలవోకగా పట్టేసుకుని, ఇష్టాగోష్టి సాగిస్తున్నట్లుగా, సునయనతో అన్నాడు అభిరాం.
    "అదిగో చూశార? అల్లంత దూరాన భూమీ ఆకాశం కలుస్తున్న రేఖమీద తేలుతోందే - అదే మా షిప్పు"
    ఏం మాట్లాడాలో తోచలేదు సునయనకి.
    అతనే మళ్ళీ అన్నాడు.
    "అల్లరి పిల్లలకి అప్పుడప్పుడూ" అని వాళ్ళ గొంతుల చుట్టూ తన పట్టు మరింతగా బిగించి... "కాస్త పనిష్ మెంటు ఇస్తూ వుండాలి" అన్నాడు.
    "అయ్యో! చచ్చిపోతారు!" అంది సునయన భయంగా.
    నవ్వి "మీరు కాసేపు కళ్ళు మూసుకోండి" అన్నాడు అభిరాం.
    "ఇప్పుడే వస్తాను. దగ్గర్లోనే ఎవరో ఒక పోలీసు వుండకపోడు. మిమ్మల్ని బెదిరించిన వాళ్ళకి బుద్ధి చెప్పక తప్పదు."
    ఆ తర్వాత వాళ్ళిద్దరినీ అలా మెడలు పట్టుకుని ఈడ్చుకుంటూ దూరంగా వెళ్ళిపోయాడు అభిరాం.
    వాళ్ళు ఇద్దరూ కూడా చేతులు వేళ్ళాడేసి, నిస్సహాయంగా ఇసకలో జారుతూ అతనివెంట వెళ్ళారు.
    కొంతదూరం నడిచాక, అతనికి కనబడ్డారు ఇద్దరు బీట్ కానిస్టేబుల్స్.
    ఇద్దరు బలాఢ్యులని అవలీలగా లాక్కొస్తున్న అభిరాంని చూసి ఆపారు వాళ్ళు.
    "ఏమిటి? ఏమయింది?" అన్నారు కఠినంగా.
    నిర్లక్ష్యంగా నవ్వాడు అభిరాం.
    "నేను ఇప్పుడు వీళ్ళని పీక పిసికి చంపేయాలనుకుంటున్నాను. నా పనికి అడ్డం రాకుండా చూస్తూ ఉండిపోవడానికి మీ రేటెంత?" అన్నాడు కూల్ గా.
    "డేయ్! ఎన్నాడా పైత్తకారి?" అన్నాడొక కానిస్టేబుల్ ఆగ్రహంగా.
    "ఒక్కొక్కళ్ళకీ వెయ్యి రూపాయలు కాదు డాలర్లు" అన్నాడు అభిరాం.
    చెరో వెయ్యి డాలర్లు అనగానే మొహమొహాలు చూసుకున్నారు పోలీసులు. గుటకలు మింగారు.
    అదే సమయంలో -
    గుటక వేయడానికి కూడా రావడం లేదు ఆ ఇద్దరు మనుషులకీ, గిజగిజ గింజుకుంటున్నారు. చేతులతో అభిరాంని కొట్టాలని విఫల ప్రయత్నం చేస్తున్నారు.
    వెయ్యి డాలర్లు! అన్నాడు ఒక కానిస్టేబులు, రెండోవాడితో గుసగుసగా.
    "అంటే అరలక్ష!" అన్నాడు రెండోవాడు.
    "ఏం చేద్దాం?"
    "నువ్వు సై అంటే నేను సై!"
    వెంటనే ఇద్దరూ అభిరాం దగ్గరకి వచ్చారు. "సార్! వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం - మాకు అప్పగించండి - మీకెందుకు శ్రమ!" అన్నారు.
    వాళ్ళమీద పట్టు సడలించాడు అభిరాం.
    పోలీసులు ఇద్దరూ వాళ్ళని చెరొకళ్ళ చొప్పున పట్టుకుని, మెడల చుట్టూ చేతులు బిగించారు.
    గిలగిల్లాడారు వాళ్ళు. క్రమక్రమంగా చేతులు మందగించాయి. తేలకళ్ళు పడ్డాయి.
    క్షణాల తర్వాత నిశ్చలంగా అయిపోయారు. అప్పుడు వాళ్ళని వదిలేశారు పోలీసులు.
    దబ్బున నేలమీదికి జారిపోయి, కదలికలు లేకుండా ఉండిపోయారు ఇద్దరూ.
    తన కాలిదగ్గర పడివున్న ఇద్దరిలో కొసప్రాణం ఇంకా కొట్టుకులాడుతుందేమో అన్నట్లుగా బూటుకాలితో బలంగా తన్ని చూశాడు అభిరాం.
    ఆ తర్వాత తృప్తిగా తల ఆడించి, "నాతో ఇంకెప్పుడూ పెట్టుకోకండి!" అన్నాడు తమాషాగా తర్జని చూపించి బెదిరిస్తూ.
    అతని పాలసీనే అది. తోకాడిస్తే తలకాయ తీసేసే రకం!
    డాలర్లు చేతులు మారాయి.
    "ఈ బాడీలని ఏం చేస్తారు?" అన్నాడు అభిరాం.
    "మేం చూసుకుంటాంగా" అన్నారు పోలీసులు ఇద్దరూ జంటకవులలాగా. వాళ్ళ మొహాలు మతాబులలాగా వెలిగిపోతున్నాయి.
    ఆ తర్వాత -  
    సముద్రంలో సుదూరంగా తేలియాడుతున్న తన షిప్పు వైపు చూశాడు అభిరాం.
    ఈస్ట్ ఇండియా!
    అదే ఆ షిప్పు పేరు.
    అభిరాం పెదిమలమీదికి చిరునవ్వు వచ్చింది.
    ఈ ఇండియా - దటీజ్ భారత్ - ఏమీ మారలేదు!
    'ఈస్టిండియా కంపెనీ' పేరు మీద తన దేశపు తెల్లదొరలు, ఈ నల్లవాళ్ళ దేశం- ఇండియాని- ఆక్రమించి రెండొందల ఏళ్ళపాటు పాలించినప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమీ లేదు.
    తప్పు తప్పు!
    తేడా లేకేం! వుంది.
    అప్పటికంటే ఇంకా కుళ్ళిపోయారు ఈ ఇండియన్సు.
    కరప్షన్ అనే కేన్సర్ తో!
    మనసులోనే నవ్వుకుంటూ సునయన దగ్గరికి తిరిగి వచ్చాడు అభిరాం.

                                     *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS