Previous Page Next Page 
వైరం పేజి 8

    ఊపిరి ఆగిపోయినట్లయింది సూరజ్ కి.
    ఈ ఎద్దుగాడి పర్సులో తన అరుణ ఫొటోనా!
    ఏదో ఎగ్జామినేషన్స్ కోసం తీయించుకున్న ఫొటోలాగా ఉంది. కొంతమంది ఫొటోగ్రాఫర్స్ 'అటు తిరగండి-ఇటు తిరగండి- తల కాస్త వంచండి- కాస్త నవ్వండి' లాంటి ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నది కాస్తా చెడగొడతారే - అట్లాంటి రకం ఫొటోలాగా వుండి. ఫొటోమీద కాలేజ్ రబ్బరు స్టాంపు.
    అరుణకి ఫొటోలు తీయించుకోవడమే ఇష్టం లేదని తనకి తెలుసు.
    ఆమె ఇష్టం లేకుండానే పంపి ఉండాలి ఈ ఫొటోని ఎవరో! మరీ ముఖ్యంగా దేవత లాంటి అరుణ మొహం చుట్టూ పసుపు పచ్చటి కాంతి చక్రం లేదేం? అది కనబడకుండా తీసిన వీడేం ఫొటోగ్రాఫరూ!
    వీడికి వచ్చిన సంబంధాలలో అరుణ సంబంధం కూడా ఒకటా?
    వచ్చిన సంబంధాలు సరే- వీడికి నచ్చిన సంబంధం కూడానా?
    అలా అనుకున్నందుకు తనమీద తనకే చిరాకు వేసింది సూరజ్ కి.
    నచ్చడం ఏమిటీ? ఎగిరి గంతేసి ఎగరేసుకు పోతాడు వీడు అరుణని!
    అరుణ వీడికి భార్య కాబోతుందా?
    గుర్రం సకిలించిననట్లు నవ్వాడు 'ఎద్దు'
    "ఇందులో ఏ ఒక్కర్తీ నాకు నచ్చలేదు బాస్! అందులోనూ ఈ పోరి వుందే" అని అరుణ ఫొటో చూపిస్తూ.. "ఫొటో చూసీ చూడగానే దీన్ని వద్దనేశాను నేను. ఆహాహా! ఎట్లా పుడతార్రా బాబూ! వెనక పర్సనాలిటీ-ముందు మునిసిపాలిటీ!"
    "షటప్" అన్నాడు సూరజ్, హఠాత్తుగా సహనం కోల్పోతూ. "నీకు నచ్చకపోతే ఆ ఫొటో నాకు ఇచ్చెయ్! అంతే తప్ప ఆ ఫొటోని పర్సులో పెట్టి, అ పర్సుని జేబులో పెట్టుకుని తిరుగుతూ పాడుచెయ్యకు. ఇప్పటికే నాగా నలిగిపోయింది!" అన్నాడు కోపంగా.
    ఠక్కున మాటలు ఆపేసి, కొద్దిక్షణాలపాటు సూరజ్ మొహంలోకి చిత్రంగా చూశాడు యదునందన్.
    "వామ్మోవ్! నీకెందుకుబే అంత కోపం?"
    "ఎందుకంటే...ఈ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకోదలుచుకున్నాను. అందుకే అమెరికా వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోదలుచుకున్నాను" అన్నాడు సూరజ్, ఒక్కొక్క పదాన్ని స్పష్టంగా ఒత్తొత్తి పలుకుతూ.
    బ్రహ్మాండమైన సైజులో ఉన్న మంచుదిమ్మ ఒకటి తన నెత్తిన పడినట్లు దిగ్భ్రమగా చూశాడు యదునందన్.
    "ఏమిటీ..ఈ అమ్మాయిని...నువ్వు?"
    "అవును"
    అపహాస్యంగా నవ్వాడు యదు.
    "ఏం చూసి?"
    సూరజ్ మాట్లాడలేదు.
    "ఈ పిల్ల ఫొటో నాకు పంపించాడు ఎవడో తలకిమాసిన పెళ్ళిళ్ళ పేరయ్య. రేయ్! దీన్లో ఏ ఒక్క స్పెషాలిటీ ఉన్నా నేను ఓకే అని వుందునేమో! దోస్త్! పెళ్ళిచూపులతో ఆడపిల్లల క్వాలిఫికేషన్స్ ని కొలవడానికి ఎవడైనా ఒకటి నుంచి పది దాకా కొలమానం ఉండే స్కేలు గనక కనిపెడితే, అ స్కేలులో ఇది..."
    "యదూ!" అన్నాడు సూరజ్ కఠినంగా.
    అది పట్టించుకోకుండా -
    "ఈ అమ్మాయి ఈ స్కేలు ప్రకారం లెవెలులో ఉంటుంది" అని తమాషాగా తల అడ్డంగా ఆడించాడు యదు. అంతలోనే మళ్ళీ పుంజుకుని,
    "నా సలహా ఏమిటంటే, ఈ పోరిని ఎడంకాలితో తన్ని తగిలేసి, నీకు తగిన సంబంధం చేసుకోమని.." అని ఆగి, కన్నుగీటి, "కొంపదీసి కాలుజారేంత అడ్వాన్సు అయిపోయారా ఏమిట్రా?" అన్నాడు చాలా చౌకబారుగా.
    పెదిమల బిగువున కోపాన్ని ఆపుకున్నాడు సూరజ్.
    "నాకు కూడా నచ్చని పిల్ల నీకెందుకురా! ఇది ఏం సిన్మా అనుకుంటున్నావా బిడ్డా!
    యే జిందగీ హై బాస్...జిందగీ!" అన్నాడు యదు. సూరజ్ భుజం మీద చెయ్యివేస్తూ.
    అతని చెయ్యి తప్పించి, "నేను వెళ్ళాలి. ఆ ఫొటో నాకు ఇవ్వు" అన్నాడు సూరజ్.
    నలిగిపోయినదయినా సరే, చిరిగిపోయినదయినా సరే, అరుణ ఫొటో తనకి అమూల్యం!
    హఠాత్తుగా అతనికి ఒక విషయం స్ఫురించింది. మంచు విడిపోయినట్లు అంతా అర్థమైపోయింది!
    వీడు...యదు...వీడు తన ఫ్రెండు!
    అందుకే తనకోసం త్యాగం చేసేస్తున్నాడు!
    అరుణ సంబంధం వచ్చినా తిరగ్గొట్టేస్తున్నాడు!
    తన కోసం!
    లేకపోతే మెడకాయ మీద తలకాయ ఉన్నవాళ్ళెవరన్నా ఇంతటి మూర్ఖపు పని చేస్తారా?
    అరుణ సంబంధాన్ని కాదనడం!
    ఇది సినిమా కథ కాదు - జీవితం అని తనకే అనిపిస్తున్నా కూడా చిగురంత ఆశ!
    హఠాత్తుగా టెన్షన్ తగ్గిపోయినట్లయింది సూరజ్ కి. మొహం తేటబడింది.
    "నిజం చెప్పరా యదూ! ఇదంతా నువ్వు స్నేహం కోసం చేస్తున్న త్యాగమే కదూ? నిజం చెప్పెయ్!" అన్నాడు సూరజ్, యదు భుజాలు పట్టుకుని బలంగా కుదిపేస్తూ. ఎంతో ఆతృతగా.

                      *    *    *    *

    ఆ రౌడీలు ఇద్దరి పనీ పట్టిన తర్వాత, తాపీగా నడుస్తూ తిరిగివస్తున్న అభిరాం వైపే చూస్తోంది సునయన. అప్పటిదాకా - ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్లుగా నిలబడిపోయి వుంది ఆమె.
    అభిరాం వచ్చీరాగానే, "ఏమయ్యారు వాళ్ళు?" అంది ఆదుర్దాగా.
    "పోలీసుల సంరక్షణలో వున్నారు" అన్నాడు అభిరాం, అతి తేలికగా అర్ధసత్యం ఒకటి చెప్పేస్తూ.
    అతనివైపు అభిమానంగా చూసింది సునయన.
    "చిత్రంగా రెండుసార్లూ మీరే వచ్చి నన్ను రక్షించడం..."
    "చెప్పానుగా! రాసి పెట్టి ఉంటే మళ్ళీ కలుసుకుంటామనీ!"
    అతను చెప్పింది ఉత్త మెట్ట వేదాంతం కాదు. నిజంగా నిజమే! డైరీలో రాసిపెట్టుకున్నాడు-ఆ అమ్మాయిని మళ్ళీ కలవాలని.
    అలాగే ఇప్పుడు కలుసుకున్నాడు కూడా!
    అనుకున్నది అనుకున్నట్లుగా చేయడం అతని పద్ధతి. అయితే -
    తను అనుకుంటున్న వాటిలో, ఈ అమ్మాయితో పరిచయం అన్నది చాలా చిన్నది. చాలా!
    ఇంకా చేయవలసిన పనులు పెద్దవి.
    చాలా చాలా పెద్దవి!
    మోకాళ్ళు బలహీనమైపోయినట్లు హఠాత్తుగా అక్కడే ఇసకలో కూర్చుండిపోయింది సునయన. కాస్త విశ్రాంతి కావాలని తీవ్రంగా అనిపించింది ఆమెకి.
    "నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని కలలో కూడా అనుకోలేదు" అంది సునయన.
    నిజమే!
    మూడునెలల క్రితం ఆ ముసలమ్మ ఎపిసోడ్ - ఆ తర్వాత తను మిస్ యూనివర్స్ గా సెలెక్ట్ కావడం - విమాన ప్రమాదం నుంచి బయటపడడం.
    ఇప్పుడీ ఇన్సిడెంటు!
    అన్నిటికీ మించి, ఈ వింత వ్యక్తి తనకు తారసపడడం!
    "మీ పేరు అభిరామా?" అంది, ప్రశ్నకు ఆశ్చర్యం జోడిస్తూ.
    "అది నాకు నేను ఇష్టంగా పెట్టుకున్న పేరు. అమ్మా నాన్నా పెట్టిన అసలు పేరు అబ్రహాం"
    "అభిరాం - అబ్రహాం!" అని తనలో తానే అనుకుని, "మీ పేరెంట్సు" అని అడిగింది సునయన.
    "అమ్మా నాన్నా ఇద్దరూ కూడా మాంఛెస్టర్ లో ఒక బట్టల మిల్లులో పనిచేసేవాళ్ళు. వాళ్ళది లవ్ మ్యారేజి లెండి!" అని కులాసాగా నవ్వాడు అభిరాం. మళ్ళీ తనే అన్నాడు. "ఏం? కూలీల మధ్య ప్రేమ పుట్టకూడదా ఏమిటీ? ఆ మాటకి వస్తే, ఈ ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరిమధ్య పుట్టుకొస్తుందో ఎవరు మాత్రం చెప్పగలరూ?" అన్నాడు భావగర్భితంగా.
    మాట్లాడకుండా ఉండిపోయింది సునయన.
    వేదాంతంగా అన్నాడు అభిరాం.
    "జీవితం చాలా చిత్రమైనది సునయనా! ఎప్పుడు ఎట్లాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం! రెండు జీవితాలు ఒక్కటైనప్పుడు మలుపులు మరిన్ని! ఇదంతా ఒక్కతరం సంగతే! ఇంక వంశాల విషయానికి వస్తే..." అని ఒక్కక్షణం ఆగి, మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు అభిరాం.
    "...వంశాల విషయానికి వస్తే నేను బ్రిటిష్ రాచకుటుంబానికి చెందిన వ్యక్తినని అంటే మీరు నమ్ముతారా సునయనా?"
    దిగ్ర్బమతో చూసింది సునయన.
    "ఏమిటీ?"
    "అవును! ఇండియాని పరిపాలించిన క్వీన్ ఎంప్రెస్ విక్టోరియాకి ముని ముని ముని మనవడి వరస అవుతాను నేను. అప్పటినుంచీ ఆరోతరమో ఏదో! రాచకుటుంబానికి బీద బంధువుల లాంటివాళ్ళం అన్నమాట! బ్రిటీష్ సింహాసనానికి వారసుల వరసలో నా పేరు ఏ పదివేల ప్లేసులోనో ఉండి ఉంటుందేమో! అంటే, ఇప్పటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్, ఆ తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్ ఛార్లెస్, ఆయన కొడుకులూ. అట్లా ఓ పదివేల మంది గనక వరసగా ఆ సింహాసనాన్ని వదిలేయవలసి వస్తే - అప్పుడు నేను రాజునవుతానన్నమాట!" అని చెప్పి, ఈ భూప్రపంచంలో అంతకు మించిన జోకు ఇంకేదీ ఉండదన్నట్లుగా విరగబడి నవ్వాడు అభిరాం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS