వశీకరణ మంత్రం నేర్చుకుంటేనో?
అదే పని, తను ఇటు రాగానే అక్కడెవరైనా చేసేస్తూ ఉంటే?
ఆ ఆలోచన రాగానే తక్షణం వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది అతనికి.
రైలు ఆపడానికి అలారం చెయిన్ వున్నట్లుగా, విమానాన్ని వెనక్కి మళ్ళించే పద్ధతి ఏమీ ఉండదా?
అతను అట్లా అనుకుంటూ ఉండగానే -
వినబడింది పైలట్ గొంతు.
"సారీ ఫోక్స్! మనం విమాన ప్రమాదంలో నుంచి బయటపడ్డాం గానీ, ముందుకు వెళ్ళే స్థితిలో మాత్రం లేము. నా వుద్దేశంలో - ఈ ఎయిర్ క్రాఫ్ట్ తాలూకు హైడ్రాలిక్ సిస్టం సరిగా పనిచేయడం లేదు. వెనక్కి వెళ్ళిపోవడం సురక్షితం! మనం ఇప్పుడు చెన్నైకి తిరిగి వెళుతున్నాం. అసౌకర్యానికి చింతిస్తున్నాం" అన్నాడు.
ఆ తర్వాత ఒక ఎయిర్ హోస్టెస్ గొంతు వినబడటం మొదలెట్టింది. "చెన్నైలో ప్రయాణీకులందరికీ ఫైవ్ స్టార్ హోటల్లో అకామడేషన్ ఏర్పాటు చేస్తాము. దయచేసి ప్రయాణీకులందరూ.." మిగతా అంతా రొటీన్.
ఆ ప్రకటన వినగానే ప్రయాణీకులందరి మొహాలు వాడిపోగా-
సూరజ్ మొహం మాత్రం వికసించింది.
మళ్ళీ వెనక్కి -
మళ్ళీ చెన్నైకి.
అక్కడనుంచి హైదరాబాద్ కి. అరుణ దగ్గరకి.
అదృష్టం తనవైపే ఉందా? అరుణవైపు తోస్తోందా?
మెకానికల్ ట్రబుల్ తో చెన్నైకి తిరిగివచ్చింది ఫ్లయిట్.
ఎమర్జెన్సీ లాండింగ్ కాబట్టి ఫైర్ ఇంజన్ లు రెడీగా వున్నాయి.
తన ఎక్స్ పీరియన్స్ అంతా వుపయోగించి, ఎయిర్ క్రాఫ్ట్ ని సేఫ్ గా లాండ్ చేశాడు పైలట్.
అయితే -
అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, లాండింగ్ టైములో ఒక టైరు బరస్ట్ అయింది.
రన్ వే దాటి పక్కకి వెళ్ళిపోయింది విమానం.
అదృష్టవశాత్తూ అక్కడ ఆగింది.
ఆ విమానంలో ఉన్న అన్ని ఎమర్జెన్సీ- ఎగ్జిట్ లూ టకటక తెరుచుకున్నాయి. ఆ అత్యవసర ద్వారాల దగ్గర మెట్లకి బదులుగా, జారుడు బండల వంటివి కిందికి జారాయి. వాటిమీదనుంచి స్లయిడ్ అయ్యారు ప్రయాణీకులు.
తొందర - తోసుకోవడం - తొక్కిసలాట!
చిత్రంగా ఈసారి అలా తోసుకుంటున్న వాళ్ళలో సూరజ్ కూడా వున్నాడు!
త్వరగా వెళ్ళాలి!
త్వరత్వరగా వెళ్ళాలి!
వెళ్ళి, హైదరాబాద్ కి వెళ్ళే కనెక్టింగ్ ఫ్లయిట్ క్యాచ్ చెయ్యాలి.
అత్యవసర పరిస్థితి కాబట్టి, ఇమ్మిగ్రేషన్ చెక్ లాంటి ఫార్మాలిటీస్ అతి త్వరగా పూర్తిఅయిపోయాయి.
ప్రయాణీకుల సదుపాయాలూ చూడడానికోసం ఎయిర్ లైన్స్ తాలూకు ఒక అఫీషియల్ వాళ్ళవెంటే వున్నాడు.
"ఫ్లయిట్ టు హైదరాబాద్?" అన్నాడు సూరజ్ ఆతృతగా.
అప్పటికే అతను చెప్పి వున్నాడు. తనకి హైదరాబాద్ ఫ్లయిట్ కి టిక్కెట్ కావాలని.
"సారీ సర్! ఎంత ప్రయత్నించినా కూడా దొరకలేదు. "సాయంత్రం ఫ్లయిట్ లో తప్పకుండా అరేంజ్ చేస్తాం. ఈలోగా హోటల్లో మీ బస. మీకోసం మేము ఇంకా ఏమైనా చేయగలిగితే..."
ఇక మిగతాదేమీ సూరజ్ మనసుకి ఎక్కలేదు.
సాయంత్రందాకా ఇక్కడే ఉండాలా?
ఆ తర్వాత పాసెంజర్స్ అందరూ హోటల్ కి చేరుకున్నారు. వాళ్ళు పడుకునేసరికి తెల్లవారుఝాము నాలుగయింది.
* * * *
అంతలోనే తెల్లవారింది.
కళ్ళు తెరిచి చూసింది సునయన.
తెల్లవారడం అనేది ఒక్కొక్కచోట ఒక్కొక్క రకంగా వుంటుంది.
మన ఇంట్లో తెల్లవారడం వేరూ - హోటల్లో రూంలో తెల్లవారడం వేరూ.
రైల్లో తెల్లవారడం వేరు - విమానంలో తెల్లవారడం వేరు
సముద్రతీరంలో తెల్లవారడం వేరూ!
ఇప్పుడు తను ఉన్నది సముద్రతీరంలోనే కదా - చెన్నై.
మీరేనా బీచ్!
అలా అనుకోగానే ఇంక ఒక్కక్షణంసేపు కూడా ఆ గదిలో ఉండాలని అనిపించలేదు సునయనకి.
అది ఫైవ్ స్టార్ రూం అయినా సరే!
వెళ్ళి ఏకంగా సముద్రంలో స్నానం చేసేస్తే?
ఇదేమైనా తను ఉండే అమెరికానా?
జనం తనని చిత్రమైన జలచరాన్ని చూసినట్లుగా చూడరూ?
ఒంటరిగా అక్కడ కాసేపు కూర్చుని రాగలిగితే అదే గొప్ప!
కొద్దిసేపటి తర్వాత మెరీనా బీచ్ లో ఉంది సునయన.
ఆ సుప్రభాతపు వేళలో సముద్రపు హోరు తప్ప, సాయంత్రం పూట వినబడే జన సముద్రపు శబ్దాలు లేవు.
సగం నిశ్శబ్దం!
అలలు అటునుంచి ఇటు ఎగసి వస్తూ వుంటే, వాటిని చేరుకోవడానికి వయసు పొంగులా పరవళ్ళు తొక్కుతూ పరిగెత్తింది సునయన.
అప్పుడు జరిగింది అది!
ఇద్దరు మొగాళ్ళు ఆమెకి అభిముఖంగా వస్తున్నారు.
ధన్ మని సునయనకి తగిలాడు వాళ్ళలో ఒకడు.
వెంటనే 'చచ్చాన్రోవ్!" అని చావు కేక.
రెండోవాడు ఒంగి, మొదటివాడి తలని నొక్కి పట్టుకున్నాడు.
క్షణంలో అతని చెయ్యి రక్తంతో తడిసిపోయింది!
"కళ్ళు కనబడట్లా! ఆయువుపట్టు మీద తగిలింది డెబ్బ! హాస్పిటల్ కి తీసుకెళ్ళకాపోతే ప్రాణాలు పోతాయి! నిన్ను వదలం!" అన్నాడు ఆ రెండోవాడు అరుస్తూ.
నిశ్చేష్టురాలయి చూస్తోంది సునయన.
"కనీసం పదివేలు కక్కాలి! ఎంత ఉంది?" అన్నాడు అతను కర్కశంగా.
అప్పుడు చటుక్కున స్పృహ వచ్చినట్లయింది సునయనకి.
మూడు నెలల క్రితం...
ఈ మెరీనాలోనే.
ఒక ముసలమ్మ... డ్రగ్స్...పోలీసులు...అతను...ఆ...అభిరాం వచ్చి తనని రక్షించడం!
ఇప్పుడెవరు రక్షిస్తారు తనని?
* * * *
ఆ ఫైవ్ స్టార్ హోటల్లో -
ఉరుముకంటే ముందుగా మెరుపు మెరిసినట్లుగా, ముందుగా సూరజ్ భుజంమీద గట్టిగా చరుపు తగిలి, ఆ వెనువెంటనే వినబడింది 'హై' అనే పలకరింపు.
ఉలిక్కిపడి తిరిగి చూశాడు సూరజ్.
"నేన్రా!"
"ఎద్దూ!" అన్నాడు సూరజ్, అలవాటులో పొరబాటుగా.
"నిక్ నేమ్ మరిచిపోవన్నమాట!" అని పెద్దగా నవ్వాడు. 'ఎద్దు' అని ఫ్రెండ్సు చేత మురిపెంగా పిలవబడే యదునందన్.
ఫ్రెండ్స్ అతన్ని అలా పిలవడంలో వాళ్ళ తప్పు లేదు.
మనిషి చాలా రఫ్ గా వుంటాడు. మంచి బట్టలు వేసుకు తిరుగుతుంటాడు గానీ మహా మోటు మనిషి.
"ఆ తిరిగొచ్చేసిన ఫ్లయిట్ లో నువ్వు కూడా ఉన్నావా ఏంట్రా?" అన్నాడు యదు.
"అవును" అన్నాడు సూరజ్ క్లుప్తంగా.
"కమాన్! లెటజ్ హావ్ ఏ బియర్"
