తాను చక్రవర్తినని గర్వించి తనకి సమస్తోపచారాలూ జరుగుతున్నాయనే భ్రమలో బతికే పిచ్చివాడికన్న అదృష్టవంతు డుండడు. నిజమైన మహారాజు రాజరికం ఎంతమాత్రం వాస్తవం? తాను రాజు ననే జ్ఞానం అధికారం ధనం వున్నాయనే జ్ఞాపకమే కదా అతని కా ఆనందాన్నిచ్చేది. నిద్రలో రాజుకీ జోగికీ భేదంలేదు. అవి పిచ్చి వాడికీ వున్నాయి. ఇంగ్లీషులో ఒక కవి తన మనో ప్రపంచంలో ఎన్నో యెకరాలు పొలం తనకింద వుందని వ్రాశాడు. కృష్ణశాస్త్రి తన ప్రియురాల్ని హృదయ రాజ్యాల్ని యేలుకుందాం రమ్మని ఆహ్వానించాడు. బైట వొస్తువు లేనిదే దానినించి రాగల ఆనందాన్ని కల్పించుకోగల మనసే వుంటే అది యెంత అదృష్టం! కాని సామాన్యమానవులకి యీ illusions, self-deceptions చాలా అవసరం. లోకానికి అవసరమైన ఘనకార్యాలు చేస్తున్నామనీ, కాలం అంత మయ్యేదాకా జీవించగల పుస్తకాలు వ్రాస్తున్నామనీ, తమని చూసి లోకమంతా మెచ్చుకుంటున్నారనీ, భయపడుతున్నారనీ, తాము తక్కిన మనుషులకంటే వున్న తులమనీ నిరంతరమూ మోసపోవడానికి వీలయ్యే రంగుల ఇంద్రజాల వస్త్రాల్ని కప్పాడు లోకం మీద దేవుడు. అట్లాకాకుండా అసలు basie principles దగ్గిరికి తరచి చూడగలిగితే యేం మిగులుతుందో, శూన్యమో, పరమజ్యోతోదాన్ని భరించ గలరా ప్రజలు! తల్లి, దేశం, పుణ్యం, శౌర్యం యీసెంటి మెంట్సు అన్నీ మాయేకదా! కాని ప్రపంచం వాటిమీదే నడుస్తోంది. అని లేకుండా ఒక్కనిమిషం నిలవదు.
మొన్న సముద్రం వొడ్డున కూచుని పడమట మెరిసే చుక్కని చూసే కుక్రుడిమీద షెల్లీవ్రాసిన పద్యాలూ అనీ జ్ఞాపకం తెచ్చుకుని సాయంత్రమంతా మురికాను. గంటైనా ఆ నక్షత్రం కిందికి జారక పోతే అనుమానంకలిగి తర్కంప్ర్రారంభిస్తే అది ఆకాశానికెత్తిన సినీమా దీసనుని తేలింది. మన ఆనందమంతా యింతేనేమో! మన బాధలూ ఇంతే. సంభవించని బాధలు రాబోతున్నాయనే భయంతో వేదనలో కుమిలె వారెందరు లేరు? బాధ మాయ అని తెలుసుకో గలిగితే బాధలే వుండవేమో! జ్ఞానంవల్ల సుఖదుఖాలకన్నిటికీ అతీతుడై పరబ్రహ్మ స్వరూపంలో ఐక్యమౌతాడని వేదాంతుల వాదన. సుఖదుఖ్కాలు లేకుండావుండే స్థితి యేం సుఖమా అనుకుంటాను. బాధలోకూడా ఆనందం కనపడుతుంది నాకు. ఈ వేదాంతులకి ఆనందంలో బాధ కనపడుతుంది. బాధలు తాత్కాలికాలు. మనుశయుల మూర్ఖంవల్లా, దేవుడి క్రూరత్వంవల్లా కలిగాయి. కొన్ని యుగాలలో వీటినన్నిటినీ నిర్మూలించబోతున్నామని నా కలలు. ఈ ఆనందమంతా మాయ. దీన్ని నమ్ముకుంటే బాధ తప్పదు. లోకం రానురాను అధోగతికి నడుస్తోంది. విరక్తిని సంపాదించమని వాళ్ళ ఘోష.
'సైకాలజీ' ప్రకారమైనా యీ సుఖదుఖాలు మన నరాల సంచలనం చేతనే కలుగుతున్నాయి. బహిఃప్రపంచం లేకుండానే నరాల సంచలనం కల్పించుకోగల శక్తిగలవాడికి యిష్టానుసారం ఆనందం కలుగుతుందికదా! అదేలాగుంది యోగానందానికి రహస్యం.
ఈశ్వరుణ్ణి చూశామనీ, పరమానంద మనుభవించామనీ, అసే యీ రుషుల ఆధ్యాత్మికానుభవమంతా ఈ నరాల సంచలనమేనేమో! దేవుడైనా మెదడులో పుట్టవలసిందేగా!
-------
నియమాలు, నియమాలంటారే అదంతా చాలామటుకు saving one's face. నిజమైన నియమాలు మనస్సుల్లోనే వుంటాయి. కాని బైటికి రావు. కనక అవసరమైనప్పుడు, ఎవరికీ తెలీకుండానే వాటిని సులభంగా వొదులుకోగలరు. కాని యే నియమాలకై మనిషి ప్రసిద్ధి కెక్కాడో వాటిని వొదులుకోలేడు మనిషి. అంటే ఆ కీర్తిని మాపుకోలేడు. దాత అనే కీర్తిని పొందిన మనిషికి యాచకున్ని పొమ్మనే ధైర్యం వుండదు. మననీ, మన నియమాల్నీ ప్రపంచమంతా చూస్తున్నారనీ, గౌరవిస్తున్నారనీ అనుకుని ఆ పీఠంనించి యెక్కడ చ్యుతి కలుగుతుందోనని భయపడి 'నియమం, నియమం చాలా వున్నతమైనది. దాన్ని తప్పకూడ'దని సమర్ధించుకుంటారు. అట్లానే చాలామంది నియమాలు వారి అవసరం కొద్దీ, నమ్మకాలకొద్దీ వారు ఏర్పరచుకున్నవి గాక ప్రజలు వారిపైన విధించినవి ఐ వుంటాయి.
నిజమాలోచిస్తే మనని గురించి చాలా కొద్దిమంది - అది కూడా యే నిమిషాన్నో తలుచుకుంటారు. మనని ఎక్కువగా తలుచుకునేవారు మనని ద్వేషించేవారై వుంటారు. కాని మన మనసుకి ప్రపంచమంతా మన కార్యాలూ ఆలోచనలూ ప్రతి నిమిషమూ కనిపెడుతున్నట్టే వుంటుంది. ప్రజలు అధర్మాలూ, అవినీతులు, అనేవి చాలా వాళ్ళకి ఏ పనులు చెయ్యడానికి ధైర్యం లేదో అవి ఐ వుంటాయి. వాటిని సమర్ధించుకోడానికి శాస్త్రాలని సాక్ష్యం తెచ్చుకుంటారు. తమకి ఇష్టమైనవి శాస్త్రాలు నిషేధించినా, చెయ్యడం మానరు. తమకి చెయ్యడానికి ధైర్యం లేనివీ, ఇష్టం లేనివీ, మాని, ఆ నెపం శాస్త్రాలమీదో పెద్దల మీదో తోస్తారు. కొంచెం సాధన కలవాళ్ళు ప్రపంచమేమన్నాసరే తాము తప్పుకున్నవి వొదిలే ధైర్యం కలిగి వుంటారు. కాని తాము మంచివనుకున్నవీ నియమాలనుకున్నవీ కూడ అతిక్రమించే సాహసం disinterestedness చాలా కొద్ది మందికే వుంటుంది. ప్రేమకోసం అవసరమైతే దొంగతనం, హత్య నీచమైన పనులు చేయడానికి సంసిద్దులు కావాలి. అంత ధీరత్వం రావాలి.
