Previous Page Next Page 
తృప్తి పేజి 6


    "పెళ్ళయిందా?" అని అత్తగారడిగితే కాలేదన్నట్లు తలూపింది. వయసు నలభైకి దగ్గరగా వుంటుంది. నల్లగా, బక్కపలచగా వుంది మనిషి. అభ్యంతర పెట్టాల్సిందేమీ లేదు అనుకుంది సింధు.
    సాయంత్రం అరుణ్ వచ్చేదాకా వుండి వెళ్ళిపోయింది వసుధ. చిట్టెమ్మకి చిన్నచిన్న పనులు చెప్పిందత్తగారు. సింధు వంటచేసి రమ్య గదిలోకొచ్చి "బ్రెడ్ తింటావా?" అడిగింది.
    "బామ్మ పెడ్తేనే..."
    సింధుకి చిర్రెత్తుకొచ్చింది. అయినా మాట్లాడకుండా గదిలోంచొచ్చేసింది. తేజా అప్పుడే చిట్టెమ్మకి బోలెడు కబుర్లు చెప్పేస్తున్నాడు. రాత్రి అరుణ్ అడిగాడు "రేపు కాలేజ్ కి వెళ్తున్నావా?"
    "వెళ్తాను"
    "అమ్మ ఇంకో రెండు రోజులుంటుందిట. ఆవిడున్నప్పుడు నువ్వింట్లో వుండకూడదూ"
    "ఎందుకండీ అనవసరంగా. ఆవిడా నేనూ ఉండి చేసేదేముంది? అది అన్నింటికీ ఆవిడ్నే పిలుస్తోంది కూడా. పిల్ల కులాసాగా వుంది కదా" అంది.
    "నువ్వున్నా నీ గది దాటి బయటికొచ్చి ఫోన్ రిసీవ్ చేసుకునే తీరిక కూడా లేకుండా నీ పనిలో మునిగిపోతావు కాబట్టి వున్నా వెళ్ళినా ఒకటేలే" అన్నాడు.
    ఛళ్ళుమని తగిలినట్టయింది సింధుకి.
    "ఎందుకస్తమానం నన్నేదో అనాలని చూస్తావు? నీ ఒక్కడివే కాదు నేనూ బాధ్యతకల ఉద్యోగం చేస్తున్నాను. నేను తల్లిని కాబట్టి లీవ్ పెట్టి ఇంట్లో ఉండాలి. నువ్వు తండ్రివి కాబట్టి అక్కర్లేదు అనుకుంటున్నావేమో! పిల్లల విషయంలో ఇద్దరిదీ సమానమైన బాధ్యత. మీరుండండి తల్లీ కొడుకులిద్దరూ తప్పేంలేదు" అని విసురుగా చెప్పింది.
    "తల్లి అనగానే సరిపోదు. తల్లిగా బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. అది అన్నింటికీ ఆవిడ్నే పిలుస్తోందంటే ఎందుకో ఆలోచించుకో. ఎప్పుడూ నీ చదువూ, నీ ఉద్యోగం, నీ హోదా తప్ప ఇంటి గురించి నీకు పట్టదు. నా సంగతొదిలెయ్, నువ్వెప్పుడూ భార్యగా నీ విధులు పాటించవు. పిల్లల విషయంలో కూడా ఇలా ప్రవర్తిస్తే వాళ్ళూ నీకు దూరమైపోవడం తప్పదు" చూపుడువేలితో బెదిరించినట్టుగా అన్నాడు.
    "ఏవిధంగా ప్రవర్తిస్తున్నాను? నీకు భార్యగా ఏం చెయ్యడం లేదు? ఉద్యోగం చేసి నెలకిన్ని వేలు తెస్తుంటేనే కదా ఇబ్బంది పడకుండా సంసారమెళ్తోంది! ఒక్కడి జీతంమీద ఇల్లు కట్టుకొనేవాళ్ళమా? పిల్లలకింతింత డొనేషన్లు కట్టి మంచిస్కూళ్ళల్లో వెయ్యగలుగుదుమా? వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా నేనింటా బయటా కష్టపడుతున్నది? నేను తిన్నా తినకున్నా మీ అందరికీ అన్నీ చేస్తూనే వున్నాను. మీ వాళ్ళెవరొచ్చినా వుండమనే అంటాను. వాళ్ళే వెళ్ళిపోతారు"
    "ఎందుకెళ్ళిపోతారో కూడా నువ్వే ఆలోచించుకో. అమ్మవచ్చి రెండురోజులయింది. నువ్వావిడతో ఎన్నిమాటలు మాట్లాడావు? ఆవిడ ఆరోగ్యం విషయం ఎప్పుడైనా కనుక్కున్నావా? ఆవిడకి స్వతంత్రమిచ్చి వంటింట్లో ఏ పనైనా చెయ్యనిచ్చావా? మా అక్క ఇంటికి ఎప్పుడైనా నీ అంతట నువ్వు ఏ అవసరం, అకేషన్ లేకుండా వెళ్ళావా? వాళ్ళు వుండరూ అంటే ఎందుకుంటారు? అన్నం కోసమొస్తారా వాళ్ళు? ఆప్యాయత, అనుబంధం కోసమొస్తారు. అదిక్కడ దొరకదు" కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.
    "నీ మనసులో అసంతృప్తుందని తెలుసుగానీ, ఇంతుందనుకోలేదు. నువ్వూ బయటపడ్డావు గనుక నేనూ చెప్తున్నాను విను. ఆవిడా నాతో ముక్తసరిగా మాట్లాడ్తుంది. నేనూ అంతే. ఇక వదినగారి విషయంలో నేనేం తక్కువ చెయ్యడం లేదు. వాళ్ళ పిల్లలకి ఏ వేడుకలైనా వచ్చినప్పుడు అన్నీ కొని నీతోగూడా వచ్చి ఇస్తూనే ఉన్నాను. మాటిమాటికీ వెళ్ళడానికి నాకు తీరికలేదు. మా వాళ్ళింటికెళ్తున్నానా పోనీ అంటే అదీ లేదు. అయినా ఇదేప్రశ్న నేనూ వేస్తున్నాను చెప్పు! మా వాళ్ళింటికి ఎప్పుడైనా ఒక్కడివీ పనిలేకుండా వెళ్తావా?"
    "నువ్వే ప్రశ్న వెయ్యడానికీ వెనుకాడవు. నీకన్నీ నాతో వంతులే అని తెలుసు. అందుకే మా అమ్మ మన దగ్గర ఉండకుండా, కొడుకున్నా లేనివాడిలా జమకట్టి అల్లుడి పంచన చేరింది. ఆవిడే ఉంటే ఈ పనిమనుషులతో తంటా ఉండదు. పిల్లలు అనాధల్లా పడి ఉండాల్సిన ఖర్మా ఉండదు! అంతా మేం చేసుకున్న ఖర్మ, ఒకళ్లననాల్సిన పనిలేదు" విసురుగా వెళ్ళిపోయాడు గదిలోంచి.
    సింధుకి చాలా కోపమొచ్చింది. ఎన్ని నిందలు తనమీద మోపి వెళ్ళిపోయాడు? తన కష్టాన్ని ఆవగింజంత కూడా అర్థం చేసుకోని భర్తా, అపార్థాలతో, అనుమానాలతో మనసువిప్పి మాట్లాడని అత్తా, అర్థం చేసుకునే వయసురాని పిల్లలూ! ఎవరికోసం తనింత కష్టపడడం? ఎంతకాలమీ ఎదురీత? ఆ రాత్రి ఆలోచనలతో శివరాత్రే అయింది సింధుకి.


                           *    *    *    *


    "అమ్మా! గోపి దగ్గరున్న సైకిల్ కొనవా?" అది నూరోసారేమో మధు అడగడం.
    "కొంటానన్నాగా, వూర్కో ఇంక, అడగ్గానే వచ్చేస్తుందా?" ఓపిగ్గానే సమాధానం చెప్పింది కావేరి.
    "ఎప్పుడు కొంటావు? వాళ్ళమ్మ అడగ్గానే కొంది. మీ అమ్మ ఎప్పుడూ ఏదీ కొనదు అని వాడు ఏడిపిస్తున్నాడు." ఏడుపొస్తుంటే దిగమింగుకుంటూ చెప్పాడు.
    "ఇప్పుడే ఏం తొందర నాన్నా? అంత చిన్న సైకిల్ కొంటే రెండేళ్ళకే నువ్వు పొడుగయిపోతావు. అది పొట్టిదయిపోతుంది. కాబట్టి రెండేళ్ళాగి పెద్దదే కొనుక్కుందాము" వాడ్ని దగ్గరికి తీసుకుంటూ చెప్పింది.
    "నువ్వెప్పుడూ ఇంతే" వాడు గింజుకుంటూ అన్నాడు.
    "ఏమిట్రా గొడవ? అమ్మ చెప్తుంటే వినవేం? ఇందాకట్నించీ చూస్తున్నాను" గదిమాడు సుధాకర్.
    తండ్రి కోపంగా అనేటప్పటికి చరచరా వెళ్ళిపోయాడక్కడ్నించి మధు.
    "అదేమాట నెమ్మదిగా చెప్పొచ్చుగా మీరు" భర్తతో అంది కావేరి.
    "ఏం చెప్పినా వినకుండా ఆ మొండి పట్టుదలేంటి? అన్నింటికీ గోపీగాడితో వంతుకొస్తాడు. వాళ్ళకి వాడు ఆడిందాట. పాడింది పాట. వీడికలా సాగుతుందా?"
    "చిన్నపిల్లలకవన్నీ ఏం తెలుస్తాయి? వాడికుంది కాబట్టి తనకీ కావాలనుకుంటాడు. అదే మొన్న నర్మదగారు వెయ్యిరూపాయలు పెట్టి వెంకటగిరి చీరకొన్నారు. చాలాబావుంది అని ఒకటికి పదిసార్లు అనుకున్నాను. అంతేకానీ కొనుక్కోవాలని పట్టుబట్టానా? ఒకవేళ మీరు కొనుక్కోమన్నా ఒక నేలంతా కష్టపడ్తే వచ్చేదాంట్లో సగంపెట్టి కొనేసుకుంటానా? ఆ వితరణ వాళ్ళకిప్పుడే రమ్మంటే వస్తుందా చెప్పండి. మనలాగా బాధ్యతలూ, బరువులూ మీదపడినప్పుడు వాటంతటవే తెలుస్తాయి" నవ్వుతూ చెప్పింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS