వెంటనే -
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి మొహం వెయ్యి ముక్కలైంది.
అంటే -
టీవీ స్క్రీన్ పగిలిపోయింది!
తక్షణం -
ఆ కాన్ఫరెన్స్ హాల్లో కలకలం!
అక్కడే వున్న ఆర్మ్ డ్ గార్డ్స్ ఆటోమాటిక్ రైఫిల్స్ ని ఆ పిల్లాడివైపు గురిపెట్టారు.
క్షణంలో సగంలో అక్కడికి వచ్చేశాడు సాహస్. ఆ పిల్లాడికి కవచంలాగా తను అడ్డం నిలబడ్డాడు.
ఆర్మ్ డ్ గార్డ్స్ ని వారిస్తున్నట్టు చెయ్యి పైకెత్తింది గ్యాంగ్ లీడర్ లాంటి ఆ అమ్మాయి.
"గార్డ్స్! వీళ్ళ సంగతి నేను చూస్తాను. వాళ్ళకి కావలసింది ఇంత సులభమైన చావు కాదు. దే నీడ్ ఎక్స్ ట్రా స్పెషల్ ట్రీట్ మెంట్!" అంది.
అలా అంటుంటే, ఆమె కళ్ళలో చెప్పలేనంత క్రౌర్యం!
సాహస్ కళ్ళకి ఇప్పుడామె అందగత్తెలా కనబడటం లేదు.
కేవలం -
కఠినాతి కఠినమైన శిలతో చెక్కిన శిల్పంలా కనబడుతోంది! అంతే!
మంచితనం అన్నది మనిషికి ఎంత అందాన్ని తెలుస్తుందో, అదే మిస్సయితే మనిషి అందానికి ఎంత లోటు కలుగుతుందో అర్ధమయింది సాహస్ కి.
"కమ్! ఫాలో మీ! రిమెంబర్! స్ట్రిక్ట్ లీ నో మంకీ బిజినెస్!" అంది ఆ అమ్మాయి కఠినంగా.
ఆమె నడుస్తుంటే వెనకే నడిచారు సాహస్, ఆ పిల్లవాడూ.
ఆమె నడకలో లయతో బాటు, ఫోర్సెస్ లో వుండేవారి నడక తాలూకు ఛాయలు కనబడ్డాయి సాహస్ కి.
ఆమె పోలీస్ ఆఫీసర్ అయి వుండవచ్చుననుకున్నాడు.
ఆమెతోబాటు తాము వెళ్తోంది టార్చర్ ఛాంబర్ కి అయి వుంటుందని అతను గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు.
టార్చర్ ఛాంబర్!!
ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ తననీ, తనతోబాటు ఆ పిల్లాడినీ టార్చర్ ఛాంబర్ లోకి తీసుకెళ్తోందని సాహస్ కి మనసులో మెదిలీ మెదలక ముందే...
గుండెలు అవిసిపోయేలా ఒక మొగాడి చావుకేక!
ఆ వెనువెంటనే -
రక్తం గడ్డ కట్టించేటట్లు ఒక ఆడపిల్ల ఆర్తనాదం!
సందేహం లేదు!
తమని నడిపిస్తోంది టార్చర్ ఛాంబర్ వైపే!
రాబోయే మిలిటరీ పాలన ఎలా వుంటుందో అన్న విషయంలో కూడా అతనికి సందేహం లేకుండా పోయింది!
టార్చర్! హింస! దౌర్జన్యాలు! అణచివేత! అహంకారం! అధికార మదం!
సివిల్ గవర్నమెంటులో కూడా ఇవన్నీ వుంటూనే వుంటాయి. కానీ - దాగుడుమూతలాడుతున్నట్టు.
కనీ కనబడనట్లు!
మిలిటరీ పాలనలో ప్రభువులు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు.
చటుక్కున ఆలోచనల్లోంచి బయటపడ్డాడు సాహస్. అతనికి, తనముందు నడుస్తున్న కుర్రాడు గుర్తొచ్చాడు. భయపడిపోతున్నాడేమో పసివాడు! పాపం!
"భయపడుతున్నావా బాబూ!" అన్నాడు సాహస్ అనునయంగా.
"భయమయితే నీకంటే ముందు నడుస్తానా?" అన్నాడా పిల్లాడు అదరగండంలాగా.
చకితుడై ఆ పిల్లాడివైపు చూశాడు సాహస్.
ఎంత ధైర్యం! ఇంత ఆపదలో కూడా!
"నీ పేరేమిటి?" అని అడిగాడు నెమ్మదిగా.
"అంకుష్!" అన్నాడా అబ్బాయి.
"అంకుష్?"
"హా! అంకుష్! అంకుశం అంటే తెల్సుగా!"
"తెలుసు! నేను అలాంటివాడ్నే!"
సాహస్ పెదిమల మీదికి చిరునవ్వు వచ్చింది.
"నేను సాహస్" అన్నాడు.
"ఓహో!" అన్నట్లు తల పంకించాడు ఆ కుర్రాడు.
ఇంతలో....
ఫౌంటెన్ లోనుంచి నీళ్లు చిమ్మినట్లు వాళ్ళమీద పడ్డాయి...రక్తపు చుక్కలు!
బలమైన కత్తివేటు శబ్దం!
దానితోబాటే ఒక మనిషి చివరి మూలుగు!
