Previous Page Next Page 
మంచివాడు పేజి 6


                               మీ ఓటు నాదే


    మిసెస్ కైలాసంగారు ఆ నియోజకవర్గంలో నిల్చున్నదనగానే విజయం తథ్యం అన్నారు ఆ నియోజక వర్గంలోని ప్రజలు. అంతవరకూ ఆమె ఎక్కడ కూర్చుందో ఆ నియోజక వర్గ ప్రజలకే కాదు, ఆమెగారికి టికెట్టు ఇచ్చిన ఆ పార్టీకే తెలియదు.
అంతవరకు మిసెస్ కైలాసం జి.ఓ. (గజిటెడ్ ఆఫీసరు) కుర్చీలో (రివాల్వింగ్ చైర్ లో) కూర్చుంది. జి.ఓ నుంచి ఎన్.జి.ఓ. గా మారిన మిసెస్ కైలాసం, రివాల్వింగ్ చైర్ దిగి సాదా చెక్క కుర్చీలో చస్తే కూర్చోనన్నది. తనంటి వ్యక్తిని చెక్క కుర్చీలో కూర్చోమని ఆర్డరు ఇచ్చిన ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసింది. పాలకులకు బుద్ధిలేదన్నది. అసలు ఈ దేశం బాగుపడదని గంగ వెర్రులెత్తి కేకలు వేసింది. చివరకు రాజీనామా ఇచ్చి, తన లాంటి మేధావి సర్వీసెస్ ను పొందడం చేతగాని ప్రభుత్వాన్ని చూసి జాలిపడింది.
తనలాంటి వాళ్ళు పాలకవర్గంలో వుంటేగాని ఈ దేశం బాగుపడదనే విశ్వాసం ఆమెకు కలిగింది. భర్త పోతూ పోతూ వదిలేసిన మూడు ఎకరాల మాగాణి పొలం చూసుకోవటానికి, ఏనాడో వదిలేసిన గ్రామం చేరింది. అనతికాలంలోనే మంచి పలుకుబడి సంపాదించుకుంది. ఆ నియోజకవర్గంలో టికెట్ సంపాదించుకుంది.
ఇంతకీ ఆమెగారి విజయం గురించి అభిజ్ఞ వర్గాల వారంతా ఊహాగానం చేయడం ఆమెగారి పేరు బలమేకాక, ఆమెకు టికెట్ ఇచ్చిన సీదా పార్టీ సాదా రాజకీయాలే చాలావరకు కారణం కావచ్చు! కాని ఆమెగారికి మాత్రం తన గొప్పతనమే తనకు విజయాన్ని సాధించి పెడుతుందనే పూర్తి నమ్మకం వుంది. ఆ నియోజక వర్గ ప్రజలు అంత మూర్ఖులు కాదనీ, ఎవరికి ఓటివ్వాలో వాళ్ళకు బాగా తెలుసుననీ, తనలో తనే ఎన్నోసార్లు అనుకుంది.
అసలా పార్టీ మధ్య తరగతి ప్రజల్లో పుట్టినా కార్మిక, ధనిక వర్గాల అభ్యుదయమే తమ ఆశయమని బహిరంగంగా ప్రకటించుకున్నది. ఆ పార్టీ టికెట్ దొరగ్గానే, ఆ అభ్యర్థుల విజయం తధ్యమనేందుకు మరొక కిటుకు కూడా వుంది. ఆ పార్టీ వాళ్ళు అతివాదుల్లో అతివాదులు గానూ మితవాదుల్లో మితవాదులుగానూ వుంటూ వచ్చారు. కాని ఇప్పుడు దేశ పరిస్థితుల దృష్ట్యా కానీయండి, ఎలక్షన్స్ దృష్ట్యా కానీయండి, ఎమయితేనేం గాని అతివాడుల్లో మితవాదులుగా, మితవాదుల్లో అతివాదులుగా మారిపోయారు. తామూ తమ పార్టీ సర్వనాశనమైనా వామపక్షాలతో చేతులు కలపబోమని, పార్టీ నాయకులు పదేపదే ఉద్ఘాటించి మితవాదుల మనస్సులను చూరగొన్నారు.
అందుకే తమ పార్టీ ఎన్నికల యుద్ధంలో దూకటంతోనే విజయలక్ష్మి పూలమాలతో ఎదురు వస్తుందనీ, కనీసం రెండు మూడు రాష్ట్రాల్లోనైనా మంత్రివర్గ నిర్మాణం జరుగుతుందనీ కలలు కన్నారు.
మిసెస్ కైలాసంగారు, మిసెస్ వైకుంఠం, మిసెస్ పరాంకుశం, శ్రీమతి శిఖండి, శ్రీమతి ముకుందం మొదలైన మహిళా మణులతో, ఎన్నికల ప్రచారం ప్రారంభించగానే ఎదుటి పార్టీ వాళ్ళ గొంతులు పక్షవాతం వచ్చినట్టు బిగుసుకుపోయాయి.
ఆమె గారికి రామలింగం, భుజంగం ఇద్దరూ రెండు భుజాల్లా పనిచేశారు. రామలింగంగారి మంచితనము, భుజంగంగారి కరుకుతనమూ ఆ నియోజక వర్గంలోని ఓటరు మహాశయులను తమ వైపుకు ఆకర్షించుకోగలిగినై.
కూలీ పేటల్లో బీదల పార్టీగానూ రైతు వీధుల్లో రైతు పార్టీగానూ, పెద్ద బజార్లో మధ్యతరగతి ప్రజల పార్టీగానూ చెలామణి అవుతున్న తమ పార్టీకి విజయం తథ్యమని, రామలింగం, భుజంగం మిసెస్ కైలాసానికి నమ్మకం కలిగించారు. ఆ దెబ్బతో ఆమె తనకున్న ఆ మూడు ఎకరాల మాగాణి అమ్మడం జరిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS