"కాస్త స్లో చేయండి. తోవ కనిపించడం లేదుగా" వైపర్స్ పని చేస్తున్నా వర్షపు జల్లులో హెడ్ లైట్స్ కాంతి చీలిపోతుంటే భయంగా శశాంకని పెనవేసుకుంది సమీపంలో కూర్చున్న కృప.
"మిమ్మల్నే" రెట్టించిందామె ఇంకా వేగం పెంచిన శశాంకని చూస్తూ.
శశాంక మాట్లాడలేదు.
ముభావంగా నడుపుతున్నాడు.
"ప్లీజ్" గోముగా అతడి తలలోకి వేళ్ళు పోనిస్తూ విష్పరింగ్ గా అతడి చెవిలో గొణిగింది "పైగా నేను వట్టి మనిషిని కూడా కాదు."
కారు కీచుమంటూ ఆగింది.
మూసివున్న విండ్ గ్లాసెస్ ఖాళీలో నుంచి వర్షపు జల్లు తుంపర్లుగా లోపలికి చొచ్చుకువస్తూ ఆమె చెంపలపై పడుతుంటే తుషార బిందువుల తాకిడికి సోలిపోతున్న ప్రభాత కన్యని వీక్షిస్తున్నట్టు మృదువుగా నవ్వాడు.
"తెలుసులెండి... దేవుడు మీకిచ్చిన పెద్ద వరం ఈ నవ్వొకటేగా...అంతకంటే పెద్ద అభినందల్ని నేనేం ఎక్స్ పెక్ట్ చేయడం లేదు."
అతడి మనసులో ఉద్దీపితమౌతున్న ఆనందానికి నేపథ్యంలా బయట ప్రకృతి చేస్తున్న అలజడి.
అమాంతం ఆమెను దగ్గరకు లాక్కున్నాడు.
ఆమె ఫాలభాగంపై అలసటగా పరుచుకున్న స్వేద బిందువుల్ని నాలుకతో తాకుతూ, తన బ్రతుకు నిఘంటువులో మిగిలిన పదాల హృదయనాదాల్ని స్పృశిస్తూ పలుకులతో చెప్పలేని భావాలకు ఇలాగే భాష్యం చెప్పాలనుకుంటున్నట్టు తలవంచాడు.
తననో కొత్త శకానికి మళ్ళించే దిక్సూచిలాంటి నాసికను, తనకో వూహించని పదవినిచ్చిన పెదవుల కలయికనీ, ఉబికే ప్రేమకు నిత్య తార్కాణంగా దేవుడు మలచిన చుబుకాన్ని__
నేలజారిన నీటిబొట్టులాంటి తనను స్వీకరించి తీర్థంగా మార్చిన శంఖాన్ని గుర్తుచేసే కంఠాన్ని__
ఏ కొండ కోనల్లోనో అలగా మిగిలిపోవాల్సిన తనకు వైతరణిగా స్థానమిచ్చిన ఆ హిమసానువుల్ని__
'చా..లు..' గువ్వలా అతడి గుండెల్లో ఒదిగిపోతూ నెమ్మదిగా తల పైకెత్తి చూసింది.
అతడి కనురెప్పల మాటున ఓ బాష్ప బిందువు అనుభూతికి పరాకాష్టలా.
"వెళ్దామా"
క్లచ్ పై కాలు పెట్టబోయిన శశాంక గుండెలదిరేట్టు ఎక్కడో ఓ పిడుగు పడింది.
బోనెట్ పై నలుగురు వ్యక్తులు రెయిన్ కోట్స్ తో జారబడి వున్నారు.
ముందు అర్థం కాలేదు.
అర్థంకాగానే కారును ముందుకు దూకించబోయాడు. కాని అప్పటికే ఆలస్యమైనట్టు కారు డోర్ ని తెరిచిన ఆ వ్యక్తులు కృపని బయటికి లాగేశారు.
ఉద్వేగంగా బయటకు రాబోయిన శశాంక మొహంపై జల్లు సూదుల్లా గుచ్చుకుంది.
దూరంగా కృప ఆర్తనాదం ఓ భీభత్సానికి సూచనగా__
చెట్ల మాటుకి లాక్కుపోతున్న ఆగంతకుల్ని చేరబోయిన శశాంక తలపై బలంగా దెబ్బపడింది.
మెదడు చిట్లినట్టు మెలిదిరిగిపోతూ చేతుల్నడ్డం పెట్టాడు.
మరో దెబ్బ...
లీలగా వినిపించింది కృప తనను తాను రక్షించుకుంటూ చేసిన ఆర్తనాదం.
మోకాళ్ళపై కూలిపోతూ బరువుగా వాలుతున్న రెప్పల్ని తెరచి చూశాడు.
అప్పటికే కృప వివస్త్రగా మారిపోయింది.
"ఏ..మం..డీ"
మృతి చెందని ఒకనాటి అనుభవపు శకలాలు అతడ్ని ఉన్మాదిగా మారుస్తుంటే శక్తిని కూడగట్టుకుంటూ లేవబోయి హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టు కారు డేష్ బోర్డులో చేతినుంచి రివాల్వర్ అందుకున్నాడు.
తూలిపోతున్నాడు నిస్త్రాణతో.
వ్యవధి లేదు...
అక్కడ కృప జీవితం అన్యాయమైపోతూంది.
కాల్చాడు కసిగా.
ఒకసారి కాదు. రెండు.. మూడు..
సన్నని మూలుగు...
తన అనుభవం పొల్లుపోలేదు.
ఆ స్థితిలో కూడా తన గురి తప్పకుండా కాల్చగలిగి నందుకు సంతృప్తిపడుతూ తప్పటడుగులు వేస్తూనే కృపని చేరాడు.
రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూన్న కృప... నభం పగిలినట్టు ఓ ఆర్తనాదం "కృ..పా"
"మిమ్మల్నే! ఏమైంది?"
తడుతున్నారెవరో...
"కృ...పా" ఆయాసంతో రొప్పుతున్నాడు.
"నేనే... ఏమైంది?" శశాంక చెంపల్ని చేతుల్లోకి తీసుకుని రెట్టిస్తూంది కృప. "ఏంటీ... ఏదన్నా కలగన్నారా?"
అప్పుడు చూశాడు తేరుకున్న శశాంక...
కృప తన దగ్గరే వుంది. ఉరుములూ మెరుపులూ లేవు. తానిప్పుడు కృప కౌగిలిలో నిక్షేపంగా వున్నాడు. కాదు కృప క్షేమంగా వుంది.
మందంగా వెలుగుతున్న నీలిరంగు బెడ్ లైట్ కాంతిలో పాల నురుగులాంటి నైటీతో అతడికి అతి చేరువలో నిలబడ్డ కృప పాలపుంతలా చేతుల్ని చుట్టి కళ్ళల్లోకి చూస్తూంటే సంబాళించుకుంటూ ఆమె గుండెలపై వుండిపోయాడు చాలాసేపటిదాకా.
