Previous Page Next Page 
నానీ పేజి 6


    "మరి నిన్ను కొట్టడానికి నువ్వేం చిన్నదానివి కాదుగా."

 

    ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది.

 

    "అమ్మా" కోటిజన్మలకి సరిపడ్డ హామీ నానీ కళ్ళలో. "తాతయ్య నేను చాలా పెద్దోణ్ని అయిపోతానని చెప్పాడుగా. అప్పుడు నిన్నూ, తాతయ్యని బాగా చూసుకుంటాను. నాన్నని బాగా ఏడిపిస్తాను!"

 

    అసహనంగా కొడుకు పెదవులపై చేతినుంచింది తప్పన్నట్టుగా. ఆ చిన్ని వయసులో తండ్రిపై అలాంటి ఏహ్యభావం పెంచుకోవటం ఆమె భరించలేకపోతూంది.

 

    తన భర్త ద్వేషించింది తననేతప్ప నానీనికాదు. ప్రేమని బాహాటంగా ప్రకటించకపోయినా కొన్నినెలల క్రితందాకా అయినా నానీ అంటే ఆయనెంత యిష్టపడేవాడో ఆమెకు బాగా గుర్తు. "నాన్నకి నువ్వంటే చాలా యిష్టం."

 

    "ఉట్టుట్టికే."

 

    "ఒట్టు" అమ్మ నిజమే చెబుతుందీ , చెప్పమంటుందీ అని తెలిసిన నానీ అయిష్టంగానైనా అమ్మమాటని అంగీకరించేస్తాడు.

 

    "ఇటు తిరుగమ్మా... పడుకుందాం" అన్నాడు నానీ.

 

    పావని వెల్లకిలా పడుకోగానే ఒక్కమారు లేచి అమ్మ పొట్టవేపు చూశాడు ప్రేమగా.

 

    ఎప్పుడో ఆ పొట్టలోనుంచే తను బయటికి వచ్చినట్టు అమ్మ చెప్పడంతో దానిపై ఎంత మమకారం పెంచుకున్నాడూ అంటే అది కేవలం తన ఒక్కడిసొత్తు అన్నట్లు ఆ పొట్టపై తను కాలుంచిగాని నిద్రపోడు.

 

    గట్టిగా కళ్ళుమూసుకుని నానీ తల్లిమెడని చేత్తో చుట్టేసి ఆమె పొట్టపై అలవాటుగా కాలుంచాడు.

 

    చురుక్కుమంది పావనికి అక్కడున్న గాయం రేగడంతో.

 

    సరిగ్గా నానీ కాలుంచినచోటనే ఓ అరగంట క్రితం భర్త భోంచేస్తూ కోపంగా విసిరిన ప్లేటు తగిలి ఎర్రగా కమిలిపోయింది.

 

    ఆ చిన్నివరాన్ని కాదనలేని శాపగ్రస్తురాలిలా కొడుకును చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

 

    "మాటలతో నన్ను అనుక్షణం బుజ్జగించాలనుకునే నా చిన్నతండ్రీ, కొడిగట్టిన దీపంలాంటి నా బ్రతుకును ఆరిపోకుండా చూడమని కోటిదేవుళ్ళకి మొక్కుకునేది బ్రతికి ఏదో బాముకోవాలని కాదమ్మా, తాతయ్య కలలా నువ్వు ఎదిగిపోతుంటే చూసి తరించిపోవాలని. ఈ నిర్భాగ్యురాలి కొడుకుగాకాక ఆ తాతకితగ్గ మనవడివై పదుగురూ నిన్ను మెచ్చుకుంటుంటే ఆ క్షణాలదాకా ఖర్చుకాగా మిగిలిన కన్నీళ్ళను ఆనందభాష్పాలుగా మార్చుకోవాలని ఆ తర్వాత నీ చేతుల్లోనే నేలరాలాలని..."

 

    ఆమె అభీష్టానికి నేపధ్యంలా ఆకాశంలో ఓ తీతువు అరుస్తూ సాగిపోతూంటే భయంగా కొడుకుని మరింత దగ్గరగా లాక్కున్నది.

 

                                       *    *    *

 

    "సరస్వతీ త్వియం ద్పష్ట్యా వీణా పుస్తకధారిణే..."

 

    ఉదయభానుడి లేతకిరణాల తాకిడితో పులకించే ప్రత్యూష పవనాల్లా విశ్వేశ్వరశాస్త్రి కంఠంనుంచి జాలువారే సరస్వతీ స్తోత్రాన్ని తాతయ్య మంచం ప్రక్కనే కూర్చుని వల్లెవేస్తున్నాడు నానీ.

 

    "హంసవాహన నమాయుక్తా విద్యాదానకరీ" మమ అనలేక ఆయన గొంతు రుద్ధుమౌతుంటే "తాతయ్యా" అంటూ కలవరపాటుగా మంచంకోడుపై ఆనుకుని ఆయన కళ్ళల్లోకి చూశాడు నానీ.

 

    జవసత్వాలుడిగి జీవకళను కోల్పోయిన తాతయ్య లోతుకళ్ళలో తడికి అర్థం వెదక ప్రయత్నం చేశాడు కాని ఆ పసిమనసుకి అర్థంకాలేదు ఏ స్మృతి శకలాల ఒరిపిడి ఆయన్నంతగా కదిలించిందీ.

 

    ఎంతటి మహోత్కృష్టమైన జీవితం ఆయనది...

 

    ఎందరికో అరాధ్యుడయ్యుండి ఏనాడైతే కన్నకొడుకు అతడిపై చెయ్యెత్తాడో ఆనాడే నవనాడులూ కృంగగా పక్షవాతంతో మంచం పట్టాడు.

 

    తిరుగులేని రాజసంతో ఆ యింటిని శాసించిన ఆ మనిషి అంపశయ్యపై భీష్ముడై ఓ మారుమూల గదిలో విసిరేయబడ్డాడు. ఆయన కాలకృత్యాలు సైతం తీర్చుకోవాలంటే సహకరించేది భార్యకాదు. కోడలు పావని.

 

    వేళకి అతడి అన్నపానాదులూ చూసేది భార్యకాదు. కోడలు పావనే.

 

    సరిగ్గా ఇక్కడే ముందు విరాగిగా, అక్కడినుంచి వేదాంతిగా మారిపోయాడు.

 

    "అయినవాళ్లంతా నాకేమీ కాకుండాపోతే యీ వృద్ధుడికోసం ఎందుకమ్మా ఇంకా తాపత్రయపడతావు? నీ బ్రతుకునిలా అన్యాయంచేసిన అలాంటి కొడుకును కన్న నన్ను శపించకుండా ఎలా సేవ చేయగలుగుతున్నావు" అన్నాడు విశ్వేశ్వరశాస్త్రి రాగిచెంబుతో నీళ్ళుతెచ్చి తన మొహం తుడుస్తుంటే.

 

    "మావయ్యా" ఆమె కళ్ళనుంచి బొటబొటా నీళ్ళురాలాయి.

 

    "రైలుపెట్టెలో ముందెక్కి సీటుపై కూర్చున్నవాడు వీలయినంత వరకూ మరొకర్ని రానివ్వకుండా జాగ్రత్తపడతాడు. తీరా కొత్తవ్యక్తి తీసుకొచ్చి తిష్టవేయాలని ప్రయత్నిస్తే తరువాత మొదటివ్యక్తి రాజీపడతాడు. సామాజిక పరిణామంలో ఇది తప్పనిసరైన మానసిక ప్రవృత్తి."

 

    భౌతికమైన వాస్తవికతనుంచి ఆధ్యాత్మిక భావం ఎలాపుట్టేదీ అమాయకంగానైనా స్పష్టంచేసిన కోడలి విశ్లేషణకి నిశ్శబ్దంగా వుండిపొయాడాయన.

 

    "తాతయ్యా... సరళత్త వచ్చింది" తాత గదిద్వారంనుంచే చూశాడు నానీ సూట్ కేస్ తో లోపలోకొచ్చిన సరళని.

 

    "ఏంటే ఒక్కదానివే వచ్చావా" అంటూ పూజగదిలోనుంచి బయటకొచ్చిన కాంతమ్మ కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ అడిగింది.

 

    "ఏమి చేయను? మూడురోజులుగా నాన్నగారు వరసగా కలలోకొస్తుంటే ఆయనతో చెప్పి వచ్చేశాను. అవునూ నన్నగారెలా వున్నారమ్మా!" అన్నది అక్కడే కుర్చీలో కూర్చుంటూ.

 

 

    "నీకు తెలీనిదేముంది, మారుతున్న కాలంతో రాజీపడలేని మనిషాయన... అవునూ కాసుల పెరెక్కడిదే?"

 

 

    "క్రిందటిసారి వచ్చినప్పుడు చెప్పాను కదమ్మా ఆయన చేయిస్తున్నారని. ఇదిగో ఇన్నాల్టికి సాధ్యపడింది."

 

    "బాగున్నారా సరళా" అంటూ ఆడపడుచుని పలకరించిన పావని ఆమెనుంచి ఏ జవాబూ రాకపోయేసరికి వంటగదివేపు నడిచింది.

 

    తనకోసం వచ్చానని చెబుతూ కనీసం తనని చూడాలని ఒక్కసారైనా గదికి రాని కూతురినీ, మారుతున్న కాలంతో రాజీపడలేని మనిషినంటూ తనగురించి అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన భార్యనీ ఆయన తూలనాడటంలేదు మనసులోనైనా.

 

    చాలా మామూలుగా ఆలోచిస్తున్నాడు.

 

    అహోరాత్రుల కృషి, దశాబ్దాల తపస్సు ఆయన్ని పండితుడిగానే మార్చాయి తప్ప ఒక మామూలు మనస్థత్వపు లోతుల్ని గుర్తించగలిగే శక్తినివ్వలేదు. అందుకు సిగ్గుపడుతున్నాడు.       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS