Previous Page Next Page 
నానీ పేజి 7


    ఒకనాటి గణవ్యవస్థలో సామూహికంగా బ్రతికే స్థితినుంచి కుబుంబాలుగా చీలిన నేటి సంఘంలోని మనుషులు క్రమంగా వ్యక్తిదృష్టిపరులుగా మారడం ఆయన మేథకి అందని విచిత్రమైన చాలా నిర్లిప్తమై వుండిపోయాడు.

 

    "తాతయ్యా!"

 

    పడుకునే నెమ్మదిగా తలతిప్పాడు నానీవేపు.

 

    "ఊళ్ళో అందరికీ నువ్వంటే ప్రేమకదా."

 

    నానీకి బాగా తెలిసిన వాస్తవాన్నే గుర్తుచేస్తున్నాడు. "అవునా?"

 

    జవాబు చెప్పలేదాయన.

 

    "నాన్నమ్మకీ, నాన్నకీ, అత్తయ్యకీ మరెందుకు ప్రేమలేదు?"

 

    "నువ్వేదన్నా మాట్లాడుతుంటే నాలాగే ఇంట్లో అందరూ బుద్ధిగాచుట్టూచేరి వినేవారు కదా. మరి ఎవ్వరూ నీ దగ్గరకి రారేం?"

 

    నానీ అమాయకంగా అడిగానా అది తాకాల్సినచోటనే తాకడంతో కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి. "బ్రతికున్న చెట్టు కూలిపోతే కట్టెగా మారిపోతుంది నానీ... కాలిపోవాల్సిన కట్టెతో వాళ్ళకి మాత్రం పనేంవుంది?"

 

    అంతకుపూర్వం తాత దగ్గరనుంచి విన్నదే అయినా అది ఏ స్థితిలో చెప్పిందీ గుర్తుకొచ్చిన నానీకళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి.

 

    "అంటే నువ్వూ దేవుడి దగ్గరకు వెళ్ళిపోతావా తాతయ్యా?"

 

    "అవున్రా భడవా! ఆ కళ్ళనీళ్ళేంటి ?" కదలనని మొరాయించే కుడిచేత్తో కాక ఎడమచేత్తో కళ్ళు తుడిచాడు.

 

    "వద్దు తాతయ్యా, నేను పెద్దోడ్ని కావాలంటే నీ దగ్గర బోలెడు నేర్చుకోవాలిగా?" ఏడుపు ఆపుకోలేకపోతున్నాడు.

 

    "అయితే ఇలాగైనా నేనింకా బ్రతకాలంటావు."

 

    బుషిలా నవ్వాడాయన. "నేనంటే..." గొంతు గాద్గాదికమౌతుంటే "నీకంత ప్రేమట్రా పిచ్చితాతయ్యా" అన్నాడాయన.

 

    తాతయ్యని చుట్టుకుపోయాడు. నానీ కళ్ళనీళ్ళు తాతయ్య గుండెలను తడిపేస్తుంటే "తమేవ..." తాతయ్య నేర్పిన శ్లోకాన్ని వెక్కిపడుతూ వల్లెవేశాడు.

 

    గండిపడిన తన కన్నీటివాగుకి వారధి వేయలేని విశ్వేశ్వరశాస్త్రి పెదవులతో నానీ తలని తమకంతో ముద్దుపెట్టుకుంటూ తననితానే మరిచిపోయాడు.    

 

    తన మనోవేదనకి భాష కూర్చలేక నానీ నలిగిపోతున్న ఆ క్షణంలోనే ఓ సంఘటన జరిగింది బయట గదిలో.

 

    చంద్రానికి ఉంపుడుగత్తెగా వుంటూ పావని అడ్డుతొలగితే రేపో మాపో భార్య కావాలనుకుంటున్న హెల్త్ అసిస్టెంటు కామేశ్వరి సరాసరి ఇంటికే వచ్చేసింది "ఆయన లేరూ?" అంటూ.

 

    ఒంటినిండా ఆభరణాలతో తానేమిటో తెలియపరిచేట్టు బింకంగా తొలిసారి ఇంట అడుగుపెట్టిన ఆమెను కాంతమ్మతోపాటు సరళకూడా సాదరంగా ఆహ్వానించారు. "బాగున్నావా వదినా" అంటూ సరళ తన ఇష్టాన్ని బహిరంగంగా ప్రకటించేసింది.

 

    సరిగ్గా అదే సమయంలో వంటగదిలోనుంచి కాఫీ పట్టుకొస్తున్న పావని క్షణంపాటు నివ్వెరపోతూ నిలబడింది.

 

    సరళ కాఫీకప్పుని అందుకోబోతుంటే "ఇది మామయ్యగారికమ్మా" అంది పావని.

 

    "మళ్ళీ చేసి పట్టుకెళ్ళు" అంటూ బలవంతంగా తీసుకుని కామేశ్వరికి అందించింది.

 

    ఆ ఇంట తనకున్న స్థానమేమిటో తెలిసిన పావని నిశ్శబ్దంగా వంటగదివేపు నడిచింది. కాని తాతయ్య దగ్గరున్న నానీ ఇది తట్టుకోలేకపోయాడు. పైగా అమ్మని ఇష్టపడని నానమ్మ, అత్తయ్య ఆవిడ్ని గౌరవించడం అసలు సహించలేక ఆవేశంగా బయటకొచ్చి "తాతయ్య కాఫీ తాగేస్తున్నారా దొంగముండల్లారా" అన్నాడు.

 

    ముందు బిత్తరపోయిన కామేశ్వరి వెనువెంటనే అవమానంగా కప్పు విసిరికొట్టి బయటికెళ్ళి పోయింది. ఆపాలని ప్రయత్నించిన సరళ "ఆవిడెవరనుకుంటున్నా"వంటూ అరిచింది నానీని చూస్తూ.

 

    "దొంగముండ" రెట్టించాడు.

 

    "ఓహో! అమ్మ కిర్రెక్కించి కొడుకుని ఉసిగొల్పుతోందన్నమాట" సరళ వాక్యం ఇంకా పూర్తికానేలేదు.

 

    పావని నానీ రెక్కపుచ్చుకుని ఎడాపెడా కొడుతూ పక్కగదిలోకి ఈడ్చుకుపోయింది.

 

    విశ్వేశ్వరశాస్త్రి మంచంపైనుంచే కేకలు వేస్తున్నా పావని అలసిపోయేవరకు కొట్టి ఆ తర్వాత ఎరుపెక్కిన నానీచెంపల్ని చూస్తూ బావురుమంటూ పెనవేసుకుపోయింది.

 

    "త...ప్పు... చేశావా... అమ్మా!" వెక్కిపడుతున్నాడు. అమ్మ కొట్టినదానికన్నా అమ్మ కన్నీళ్ళే ఎక్కువ బాధపెడుతుంటే.

 

    ఏనాడూ అంతలా చేయిచేసుకుని పావని నానీకేం జవాబు చెప్పాలో తోచక నెమ్మదిగా తలతిప్పి ఆశ్రుశిక్త నయనాలతో అలా వుండిపోయింది చాలాసేపటిదాకా. అప్పుడు చూసింది దూరంగా వస్తున్న భర్తని.

 

    ఆ నడకలోని ఉద్వేగంతోనే గుర్తుపట్టింది కామేశ్వరి ప్రోత్సాహంతో వస్తున్న తన భర్త చేయబోయేదేమిటో.

 

    "నానీ... నేనంటే నీకిష్టం కదూ."

 

    "ఓ..." అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.

 

    "వెంటనే పెరట్లోనుంచి పరిగెత్తుకెళ్ళి సందుమొగ దగ్గర నిలబడాలి. ఓ అరగంటసేపు అక్కడే నిలబడి కుడిపక్కగా మొత్తం ఎంతమంది వెళ్ళిందీ లెక్కపెట్టి నాకు చెప్పాలి."

 

    "ఎందుకూ?"

 

    వ్యవధి లేదు. నానీని వెంటనే బయటకు పంపాలి. తను దండించబడటానికి సిద్ధమేకాని నానీకే ఆపద కలిగినా తను భరించలేదు. అంతకుమించి భర్త తనపై చేయి చేసుకునేటప్పుడు నానీ చూడటం ఆమెకిష్టం లేదు.

 

 

    "చెప్పింది చెయ్... అమ్మ కళ్ళల్లో కోపం చూసేసరికి పెరట్లోనుంచి బయటకు పరుగెత్తాడు.

 

    నానీ వెళ్ళి ఒక్క అరనిముషంకూడా కాలేదు. సరాసరి ఇంటిలోకి వచ్చిన చంద్రం "ఏడి నీ కొడుకు" అన్నాడు జుట్టుపట్టుకుని.

 

    "ఏమైంది" బాధతో విలవిల్లాడుతూనే "తప్పేదన్నా వుంటే అది నాది" అంది.

 

    "అంటే వాడికి నువ్వే కిర్రెక్కించావు అవునా?" చాచి చెంపపై కొట్టాడు.

 

    అసలే నీరసంగా వున్న ఆమె గోడపై జారగిలపడిపోయింది.

 

    ఆడపడుచూ, అత్తయ్యా ప్రేక్షకుల్లా నిలబడలేదు. అతడి ఆవేశానికి ఆజ్యం పోస్తుంటే అందినచోటల్లా కొడుకూ ఆమె శరీరాన్ని నజ్జుగా మార్చేశాడు.           


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS