Previous Page Next Page 
నానీ పేజి 5


    అసలే నీరసంగా వున్న పావనికి ఏం జవాబుచెప్పాలో పాలుపోలేదు. "నా మాటిని విడాకులకొప్పుకోవే. నెలకింతని చెల్లించుకుంటాను" ఉక్రోషంగా దగ్గరకు లాక్కుంటూ అన్నాడు.

 

    "ఇన్నిరోజులుగా చెబుతున్నా నన్ను వదిలిపెట్టమేమే" అని గోడకేసి కొట్టాడు. "మాట్లాడు" ఆమె మౌనం మరింత కోపాన్ని తెప్పిస్తుంటే గోడకేసి తల గుద్దుతున్నాడు ఆగకుండా.

 

    సెక్స్ కోసం రక్తపాతాన్ని సృష్టించిన రోషనారా గురించిగాని, సెక్స్ పరమైన వాంఛల్ని అస్త్రాలుగా సంధిస్తూ సామ్రాజ్యాల్నే కూల్చిన క్లియోపాత్రా గురించి గాని తెలీని పావని అంత బాధలోనో తన భర్తనంత రాక్షసుడిగా మార్చిన కామేశ్వరిగురించే ఆలోచిస్తూంది.

 

    అంతకుమించి ఏ తప్పూ చేయని తనను వదలించుకోడానికి భర్త ఉపయోగిస్తున్న తర్కానికి విస్తుపోతూంది శరీరం హూనమైపోతూంటే.

 

    ఒక ఆడదాని ప్రలోభంలో పడ్డ మేధావులుసైతం ఎంతో నికృష్టంగా ప్రవర్తించే ప్రపంచం మరోటుందని వూహించలేక బాధతో మెలితిరిగిపోతూ అంది. "నేనే మీకేమీ అడ్డంకాను. మరోచోట భర్తవదిలిన భార్యగా బ్రతకనూ లేను. నన్ను కొట్టండి, చంపండి అభ్యంతరంలేదు. కాని, మీరు చేస్తున్న నిర్వాకం ఆ పసివాడికి తెలియకుండా మాత్రం జాగ్రత్త పడండి. అది చాలు!"

 

    నెలల తరబడి అంతర్మథనాన్ని వెళ్ళగక్కుతున్న ఆమె పెదవులనుంచి భళ్ళున రక్తం కారింది చంద్రం బూటుకాలు పెదవులపై వేగంగా దూకడంతో ...

 

    "ఏమండీ!"

 

    కాంతమ్మ ఆర్తనాదంతో ఆ ఇల్లు ప్రతిధ్వనించిపోయింది.

 

    ఆక్రందన వినిపించింది విశ్వేశ్వరశాస్త్రి గదిలోనుంచి.

    అంతే...

 

    బలాన్ని కూడగట్టుకున్న పావని తూలుకుంటూ మామగారి గదిలోకి పరుగెత్తింది.

 

    తనకు సమీపంలోనే జరుగుతున్న మారణహోమాన్ని ఆపలేని నిస్సహాయతో లేక ఇన్ని భరిస్తూ ఇంకా ఎందుకు బ్రతకాలన్న విరక్తో విశ్వేశ్వరశాస్త్రి కళ్ళు తేలవేసి ఊపిరందక విలవిల్లాడిపోతున్నాడు.

 

    "మామయ్యా!" పావని ఆయన పాదాల్ని చుట్టేసింది. ఈ ప్రపంచంలో నన్ను వదిలి వెళ్ళిపోవద్దూ అన్నట్లుగా.

 

    గదిలోకి వచ్చిన చంద్రం పరిస్థితిని గమనించగానే దూకుడుగా పరిగెత్తాడు.

 

    మరో అయిదు నిముషాలలో డాక్టరువచ్చి పరీక్షించిన వెంటనే ఇంజక్షను చేశాడు.

 

    పోవాల్సిన ప్రాణం ఆగిపోయింది.

 

    "మిస్టర్ చంద్రం" బయటికి వచ్చాక డాక్టరు అన్నాడు. "పెరాల్సిస్ వచ్చిన వాళ్ళకి గుండె చాలా బలహీనంగా రక్తాన్ని పంప్ చేస్తూ వుంటుంది. ఏమాత్రం టెన్షన్నీ భరించలేనిస్థితిలో వున్నాడాయన. వీలైనంత జాగ్రత్తపడటం మంచిది" ఏయే మందులు వాడాల్సిందీ ప్రిస్క్రైబ్ చేసి వెళ్ళిపోయాడాయన.

 

    మరో అరగంటలో తేరుకున్నాడాయన.

 

    తన భర్త బ్రతికున్నాడనో లేక పసుపుకుంకుమలకే ముప్పు వాటిల్లలేదనో గాని కాంతమ్మ ధైర్యపడింది.

 

    పావనిని చూస్తున్న ఆయన కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.

 

    'ఏం జరగబోతూంది' పావని రేపు గురించికాదు రాబోయే ప్రతిక్షణం గురించి వ్యాకులపడుతూ ఆలోచిస్తూంది.

 

                                       *    *    *

 

    ఒక అందమైన కలకీ, కోరని పీడకలకీ మధ్య సంధికాలంగా నలిగిపోతున్న నానీకి ఒక్కరోజులో తాతయ్య చాలా మారిపోయాడనిపించింది.

 

    ఒక మామూలు పసిపిల్లవాడే అయితే జరుగుతున్నది చాలా సాధారణంగా స్వీకరించగలిగేవాడే కాని తాత నేర్పిందీ, అమ్మ చెప్పిందే నానీకి కొత్త ప్రపంచాన్ని చూపెట్టాయి. అదే యింత కలవరపాటుకి కారణమౌతుంది.

 

    "అర్థరాత్రి దాటిపోతోంది. పడుకో నానీ" పావని కొడుకుని మరింత దగ్గరగా తీసుకుంటుంటే "ఈవేళ క్లాసులో బోలెడన్ని ఆన్సర్లు కరెక్టుగా చెప్పేశాను" అన్నాడు కళ్ళు చక్రాల్లా తిప్పుతూ.

 

    ఈ అపరాత్రి చిన్నకొండ ముచ్చట్లే రేపుకూడా బ్రతకాలనిపింపజేసే సుమధుర దివ్యౌషధాలు.

 

    "ఏం జరిగింది?" అడిగింది తనూ ఉత్కంఠగా.

 

    "టీచరేమో ప్రభాత సమయమంటే ఏమిటి అని అడిగింది."

 

    "ఏమన్నావు?"

 

    "సూర్యుడుదయించేప్పుడూ అన్నాను" అమ్మ కళ్ళలోని గర్వానికి మురిసిపోతూ అన్నాడు.

 

    "అస్తమయం అంటే?" అంది.

 

    "సూర్యుడు పడమటికొండల్లో మాయంకావడం అన్నాను" చెప్పుకుపోతున్నాడు.

 

    "ఆ తర్వాత" అడిగింది పావని.

 

    "అర్థరాత్రంటే ఎప్పుడూ అంది."

 

    "రాత్రి పన్నెండుగంటలవేళ అని చెప్పావా?"

 

    "ఆహాఁ"

 

    "మరి?"

 

    "అమ్మ ఏడ్చేటప్పుడూ అన్నాను."

 

    ఛెళ్ మనిపించింది పావనికి. తన కొడుకెంత పరిశీలనగా ప్రతివిషయమూ గమనిస్తున్నాడో తెలుసుకుని "అది కాదమ్మా. అసలు నేనెందుకేడుస్తాను" అంది తత్తరపాటుతో.

 

    "నాన్న కొడతాడు కాబట్టి "

 

    "నువ్వు తప్పుచేస్తే టీచర్ కొట్టడేంటి" తన కన్నీళ్ళను దాచేయాలని తల మరెటో తిప్పుకుంటుంటే చిన్నచేతుల్తో తనవేపుకు లాక్కున్నాడు.

 

    "నువ్వు తప్పుచేస్తావా అమ్మా" నానీ కళ్ళలో ప్రపంచంలో ఏ తప్పూ చేయనిది తన తల్లిమాత్రమేనన్న తిరుగులేని నమ్మకం." అసలు తప్పంటే ఏంటీ?"

 

    అరక్షణం ఆలోచిస్తూ వుండిపోయింది. "మీ నాన్నగారి కిష్టంలేని పద్థతిలో ప్రవర్తించటం ."

 

    "మరి తాతయ్యకిష్టంలేని పద్థతిలో నాన్న ప్రవర్తిస్తారుగా!"

 

    ఆమె జవాబు చెప్పలేకపోయింది.

 

    "మరి నాన్న తాతయ్యని కొట్టబోయాడేం?"

 

    ఉద్విగ్నంతో కంపించిపోతూందామె "మీ నాన్నగారు తప్పుచేస్తే తాతయ్య చిన్నప్పుడు కొట్టేవారట."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS