"మీ అమాయకత్వం పట్ల మీకెప్పుడూ విచారం కలగలేదా?" జాలిగా ప్రశ్నించాను.
"పోనీ మీరు చెప్పండి ఏం చేయాలో" అంది.
ఇది కోర్టులో కాకుండా ఒక భోజనాంతర విశ్రామ సంభాషణలాగా తోచి టాపిక్ మార్చాను.
"మీ కెంతమంది పిల్లలు?"
"ఇద్దరు".
"వయసు?"
"అమ్మాయికి ఎనిమిది, అబ్బాయికి ఆరు".
"మీ ఆరేళ్ళ అబ్బాయి రాత్రి పదింటికి ఇంటికొచ్చినా ఏమీ అనరు. అదే అమ్మాయి అయితే అరగంట ఆలస్యమైతే లక్ష ప్రశ్నలు వేస్తారు. స్త్రీ పట్ల ఈ వివక్ష చూపించడంపై మీ ఉద్దేశం ఏమిటి?"
"నా కూతురికి అబార్షన్ చేయించాల్సి వస్తే అదో ఖర్చు. ఈ విషయం పదిమందికీ తెలిస్తే పెళ్ళికాదు. నా కొడుకుతో అలాంటి భయాలు లేవు. కాబట్టి ఈ హక్కులకోసం పోరాడాల్సి వస్తే సమాజంతో కాదు, దేవుడితో పోరాడాలి" క్లుప్తంగా అన్నదామె.
కోర్టు మరుసటిరోజుకి వాయిదా పడింది.
* * *
'International Managment Group' తాలూకు మీటింగ్ హాలు కిటకిట లాడుతోంది. వివిధ దేశాలకి సంబంధించిన విద్యావేత్తలు అక్కడున్నారు. 'వుమన్ ఆఫ్ ది ఇయర్' బహుమతి ప్రదానోత్సవం ఆ రోజు జరగబోతోంది. వివిధ రంగాలలో ప్రసిద్ధికెక్కిన స్త్రీలకి ఆ అత్యుత్తమ బహుమతి లభిస్తుంది. కేవలం బ్రిటిషర్లకే కాకుండా ఇతర దేశాలనుంచి వచ్చి ఇంగ్లండ్ లో సెటిలై, ఏదైనా రంగంలో కృషి చేసిన వారికి కూడ ఒక ప్రత్యేక బహుమతి కేటాయించారు.
ఆ ప్రతిష్ఠాకరమైన బహుమతి ఈ ఏడాది నాకు లభించబోతోందని అనధికారికంగా తెలిసింది. "న్యాయము - చట్టము - స్త్రీ" అని నేను వెలువరించిన పుస్తకానికి ఈ బహుమతి రాబోతోంది.
వేదికపైకి ఒక్కొక్కరినీ పిలిచి బహుమతులు అందజేస్తున్నారు. "ఈ సంవత్సరపు ప్రముఖ విదేశీ వనితకి లభించే పురస్కారం..." అంటూ ఒక్కక్షణం ఆగాడు అనౌన్సర్.
కుర్చీలోంచి లేవబోయాను.
".... మిసెస్ అహల్య".
అప్రయత్నంగా కూచుండిపోయాను. కరతాళ ధ్వనుల మధ్య తను వెళ్ళి బహుమతి అందుకొంటుంది. "బాటనీ, జువాలజీ పాఠ్యాంశాలుగా చిన్న పిల్లల కర్థమయ్యేరీతిలో జీవపరిణామం గురించి ప్రారంభించి, ఆ ప్రాతిపదికతో స్త్రీ పురుష సంబంధాల వరకూ చర్చించిన అహల్యకి ఈ బహుమతి ఇవ్వడం సమంజసంగా భావించారు న్యాయనిర్ణేతలు" అంటూ దాన్ని తన కందజేశారు. నా వెనకాల సీట్ లో ఎవరో విదేశీయుడు ప్రక్కనున్న భారతీయుణ్ణి "అహల్య- పేరు గమ్మత్తుగా వుంది. దని అర్థమేమిటి?" అనడిగాడు.
నిజమే ఇంతవరకూ నాకూ ఆ పేరు కర్థం తెలీదు. విదేశాల్లో పుట్టి పెరగడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఇది!
"హిందూ పురాణ గ్రంథాల్లో రామాయణం అని ఒకటుంది. అందులో ఒక పాత్ర పేరు అహల్య. ఒక ఋషి భార్య. ఇంద్రుడు అనే ఒక దేవుడు చేసిన మొసం వల్ల భర్త శాపంతో శిలయైపోతుంది" అంటూ వివరణ ఇస్తున్నాడు పక్క వ్యక్తి.
ఏరికోరి ఇలాంటి పేరు ఎందుకు పెట్టారో నాకర్థం కాలేదు. ఈ లోగా తను నా దగ్గర కొచ్చింది.
"కంగ్రాట్యులేషన్స్" అన్నాను నవ్వుతూ.
నా పక్క కుర్చీలో కూచుంటూ "ఈ బహుమతి నీకు వస్తుందనుకున్నాను" అంది.
"ఎవరికొస్తే ఏముంది? వచ్చే సంవత్సరం నేను సంపాదిస్తాను చూడు. తల్లికొక సంవత్సరం, కూతురికి రెండవ సంవత్సరం బహుమతి రావడం కూడా రికార్డే కదా!" అన్నాను.
అమ్మ నవ్వింది.
4
కోర్టులో సూర్యమ్ తన వాదాల సారాంశం చెప్పడం ప్రారంభించాడు.
"మిలార్డ్! 'వుమన్' పుస్తక రచయిత అభిప్రాయాన్నీ, మనోగతాన్నీ స్త్రీ వాదులు కానీ, గౌరవనీయులైన లాయరుకానీ సరిగ్గా అర్థం చేసుకోలేదని నా అభిప్రాయం. మానవతా వాదంలో స్త్రీ వాదం ఒక చిన్న భాగమని రచయిత ఉద్దేశం. ఆ మాటకొస్తే సకల జీవనాదంలో మానవతా వాదం కూడా ఒక చిన్న భాగమే. "ప్రేవు" లకి సంబంధించిన నొప్పివస్తే అపెండిక్స్ ని నిర్దాక్షిణ్యంగా కోసిపారవేస్తాడు డాక్టర్. అదే ఏకంటికో జబ్బు వస్తే జాగ్రత్తగా చికిత్స చేసి కంటిని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు" అని ఆగి కొనసాగించాడు.
"ఇక్కడ కంటికి ప్రాముఖ్యం ఇవ్వడంకానీ, అపెండిక్స్ ని హీనపరచడంకానీ జరగలేదు. దేని కివ్వాల్సిన ప్రాముఖ్యం, గౌరవం, ట్రీట్ మెంట్ దాని కివ్వాలి. స్త్రీ పురుషుల విషయంలో కూడా ఇదే ఉదాహరణ వర్తిస్తుంది. ఒకే న్యాయం ఇద్దరికీ పనికిరాదు మనువు చెప్పినా, మహమ్మద్ ప్రవక్త చెప్పినా ఈ సూత్రమే చెప్పారు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక విరుచుకుపడితే ఫలితామేమీ వుండదు. స్త్రీలమీద అత్యాచారాలు జరగకూడదని ఆశించని వారెవరుంటారు? ఒక స్త్రీ లేమిటి, పిల్లలు, దళితులు, మానసికంగా బలహీనులైన మగవాళ్ళు, కోళ్ళు, గోవులు- దేనిమీదా అత్యాచారం జరగకూడదు. పరిరక్షణ విషయంలోనే అభిప్రాయ భేదాలు వస్తాయి. ఉద్యోగస్తులైన భార్యాభర్తలు తమ పిల్లల్ని చూడడానికి వితంతువైన పెద్దమ్మని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. తన మొగుడొదిలేస్తే తనకి రక్షణేదనడిగే స్త్రీ. తనింట్లో వంటచేసే అనాధ వితంతువు వృద్ధాప్యంలో ఏమవుతుంది? అని ఆలోచించదు. చాలా గౌరవప్రదంగా జరిగే హీనాతిహీనమైన చర్య కాదా ఇది? బంధుత్వం పేరిట ఓపికున్నంత వరకూ వాడుకుని, ఆ ముసలావిడకి జవసత్వాలు తగ్గిపోయాక ఏదో ఒక మిషమీద ఇంట్లోంచి పంపించేసే స్త్రీకి, భర్తనుంచి పరిపూర్ణ రక్షణ కావాలని అడిగే హక్కేముంది?"
సూర్యమ్ ఒక క్షణం ఆగాడు.
"హక్కుల పరిరక్షణ అంటే స్త్రీత్వాన్ని కోల్పోవడం కాదు, పురుషుణ్ణి ఆకర్షించడం కోసం చెవులెందుకు కుట్టించుకోవాలి? జడెందుకు వేసుకోవాలి? అని ప్రశ్నించే హిందూ స్త్రీ రచయితల్ని... క్షమించాలి... రచయిత్రులని అన్న పదం కోర్టు హాల్లో వాడితే మళ్ళీ నామీద పరువునష్టం దావా వేస్తారేమో... అటువంటి స్త్రీ రచయితల్ని తన పుస్తకంలో ఎద్దేవా చేశాడు. ఆస్తిలో సమాన హక్కు, వితంతు వివాహం, వితంతు స్త్రీ అలంకరణ మొదలైన విషయాలనేమీ ఈ రచయిత ఖండించలేదు. భర్తనుంచి బాధలు తప్ప మరేమీ లభించని స్త్రీ విడాకులు పొందడానికి మార్గం మరింత సుగమం అవ్వాలని సూచించాడు. విడాకులు పొందిన స్త్రీకి భరణం పెంచమన్నాడు. మరోపక్క ఒంటరి జీవితంలో వుండే బాధల్ని భూతద్దంలో చూపించాడు. ఎన్ని హక్కులు వచ్చినా, ఎంత ఎలుగెత్తి అరిచినా బలవంతుడైన పురుషుడు మారడని 250 సంవత్సరాల స్త్రీల యుద్ధచరిత్ర కళ్ళకి కట్టినట్టు వివరించాడు. స్త్రీ పురుషులు వేరు వేరు జాతులు కాదనీ, హక్కుల పరిరక్షణ అంటే పురుషుడితో యుద్ధం కాదని సవివరంగా విన్నవించాడు. అప్పుడప్పుడే ఆలోచన వికసిస్తున్న ఒక బాలిక మనసులో పురుషులందరూ దుర్మార్గులు అన్న భావాన్ని నాటవద్దని స్త్రీ వాదుల్ని వేడుకున్నాడు. దీనికి పాతిక సంవత్సరాల క్రితం జరిగిన మరొక ఉదాహరణ చెప్పాడు.
04-09-1995న చైనా ముఖ్య పట్టణమయిన బీజింగ్ లో అంతర్జాతీయ స్త్రీల మహాసభ నభూతో నభవిష్యతి లెవల్ లో ప్రారంభమైంది. ప్రపంచపు నలుమూలల నుంచీ వేలాది స్త్రీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశం నుంచి ఒక రాజస్థానీ యువతి కూడా వెళ్ళింది. ఆమె పనిచేసే పొలానికి సంబంధించిన ఐదుగురు కామందులు ఆమెని మూకుమ్మడిగా రేప్ చేశారు. పురుషాహంకారం వల్ల నష్టపోయిన స్త్రీగా అభివర్ణిస్తూ ఆమె అక్కడ పెరేడ్ చేస్తూంటే, ఆ అవమానం పునాదిమీద కవితలు, కథలు, తీర్మానాలు నిర్మించారు. ఇటువంటి వాటివల్ల లాభమేమిటి అని రచయిత సూటిగా ప్రశ్నించాడు. చివరగా స్త్రీ వాదాన్ని - తమ 'ఐడెంటిటీ క్రైసిస్' నుంచి బయటపడే ప్రక్రియగా మలుచుకోవద్దనీ, వేదిక లెక్కేమేధావులైన ఉపన్యాసకుల్నీ, స్త్రీ రచయితల్నీ కోరాడు. ఇది సహించలేకే వీరందరూ ఈ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతున్నారు. విజ్ఞులైన న్యాయమూర్తులు పుస్తకంలోని అన్ని కోణాలూ పరిశీలించి తీర్పు నిమ్మని, వివాహ వ్యవస్థనీ, దానికన్నా ముఖ్యంగా స్త్రీ పురుషులమధ్య వుండే అనుభూతి బంధాన్నీ నిలబెట్టమని కోరుతున్నాను" అంటూ ముగించాడు.
ఆ తరువాత జడ్జిమెంట్ వచ్చింది.
5
"ఎందుకంత మూడ్ పాడు చేసుకుంటావ్? లాయరన్నాక గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకోవాలి కదా. నువ్వు గెలిచి వుంటే నేను ఓడిపోయి వుండేవాడిని. నా గెలుపు నీది మాత్రం కాదా?" ఓదార్చాడు సూర్యమ్.
ఎర్రబడ్డ కళ్ళతో ఆవేశంగా అతనివైపు చూశాను. "ఇదే, ఇలాంటి మోసపూరితమైన మాటలతోనే అనాదిగా స్త్రీని పురుషుడు అణగదొక్కుతున్నాడు. స్త్రీకి తనదంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా చేస్తున్నాడు" దాదాపు గట్టిగా అరిచాను. లాయర్స్ ఛాంబర్ నిర్మానుష్యంగా వుంది. జడ్జిమెంట్ కి నిరసనగా బయట వున్న జనం నినాదాలు చేసుకుంటూ వెళ్ళి అరగంటైంది. వాళ్ళ కెదురు పడడానికి మొహం చెల్లక నేనిక్కడే కూర్చుండిపోయాను. సూర్యమ్ ఓదార్పు మరింత ఆజ్యం పోసినట్లైంది. "...నేనిక్కడితో ఆగుతా ననుకోకు! పై కోర్టుకి వెళ్తాను. అక్కడైనా న్యాయం జరిగేలా చూస్తాను!" నా కంఠం కోపంతో వణికింది.
"ఈ పుస్తకంలో నువ్వనుకున్నంత అన్యాయమేదీ లేదు శ్యామలా! నీకున్న ఆవేశంలో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదంతే. ఎప్పుడైతే ఒక వాదం నీ రక్తంలో జీర్ణించుకుపోయిందో, అప్పుడు మరే ఇతర వాదంలో వున్న తర్కాన్నీ అది గమనించనివ్వదు. నీ నుంచి మరికొంత స్థితప్రజ్ఞతని ఆశిస్తున్నాను శ్యామలా" అనునయంగా అన్నాడు.
"ఏమిటో నువ్వాశించే ఆ స్థితప్రజ్ఞత?" వ్యంగ్యంగా అడిగాను.
"న్యూటన్ లాంటి శాస్త్రవేత్త ఏర్ కండిషన్డ్ రూమ్ లో ఏకాగ్రతతో పని చెయ్యాలి. టైసన్ లాంటి బాక్సర్ ఎండలో కసరత్తు చెయ్యాలి. ఇద్దరి స్థానాలూ మారిస్తే ఇద్దరూ దేనికీ పనికి రాకుండా పోతారు. ఆ విధంగా స్త్రీకి కొన్ని విధులు, పురుషుడికి కొన్ని పనులు పెట్టాడు దేవుడు".
"ఓహో, అయితే మీరు ఏర్ కండిషన్డ్ రూముల్లో వుంటే మేము కసరత్తులు చెయ్యాలన్నమాట!"
"నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు శ్యామలా. శారీరకంగా కష్టపడవలసినది పురుషుడనీ, అతడికి తోడు కావలసింది స్త్రీ అనీ నా ఉద్దేశం".
"చూడు తప్పుగా అర్థం చేసుకున్నావు శ్యామలా. శారీరకంగా కష్టపడవలసినది పురుషుడనీ, అతడికి తోడు కావలసింది స్త్రీ నీ నా ఉద్దేశం".
"చూడు సూర్యమ్. నువ్వూ, నేనూ సమానంగా చదువుకున్నాం. ఇద్దరం సమానంగా సంపాదిస్తున్నాం. రేప్పొద్దున్న మన వివాహం జరిగితే నువ్వు న్యూటన్ లాగానో, టైసన్ లాగానో క....ష్ట....ప....డి సంపాదిస్తుంటే వంటింటి పొగల మధ్య సంసారం నిలబెట్టడం కోసం నేను సమిధ నవ్వాలంటావా? నీ అడుగులకి మడుగు లొత్తుతూ ప్రతి పైసాకీ నీ మీద ఆధారపడాలంటావా? నీకు భార్యగా వుండడం కోసం నా తెలివి తేటలన్నీ వంటింటి పోపుల పెట్టెలో మూతపెట్టి బిగించాలంటావా? ఒక పదేళ్ళు పోయాక నా మీద ఆకర్షణ తగ్గి నీవు ఇంకొక అమ్మాయి ప్రేమలో పడ్డా, ఏ తాగుడుకో అలవాటుపడి సంపాదనంతా దానికి ఖర్చుపెట్టేస్తుంటే, అర్థరాత్రి ఒంటి గంటకి నువ్వు వచ్చేవరకూ వీధిగుమ్మం దగ్గర కళ్ళలో దీపాలు వెలిగించుకుని సంసారం అనే కొవ్వొత్తి ఆరిపోకుండా చూడాలంటావా? నువ్వొదిలేస్తే బూజుపట్టిన నా న్యాయశాస్త్ర గ్రంథాలన్నింటినీ దుమ్ముదులిపి అప్పుడు మళ్ళీ కొత్తగా నా జీవితాన్ని ప్రారంభించాలంటావా? అమితమైన దయాదాక్షిణ్యాలతో స్త్రీపట్ల జాలితో కోర్టువారు నీ నుంచి ఇప్పించే జీవన భృతితో బతకమంటావా?"
