శైలజ.... ఎంత మంచి పేరో, మీ వుత్తరం వచ్చినరోజు ఆ పేరుని వెయ్యిసార్లు నా నోట్ బుక్ లో వ్రాసుకున్నాను. "యస్" అన్న అక్షరం మీ పేరు ముందుంది. మీరు "యస్" అన్నారు, నా పేరూ "యస్సే" మనది అపూర్వ సంగమం అని ఇదే చెపుతూంది. నిజంగానే ఆ రోజు రైల్లో నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను శైలజా!
శైలూ డియర్! నా ప్రేమరాశీ.....వెన్నెల్లో కూర్చుని చీకట్లోకి చూడటం నా కిష్టం. నాకు నలుగురు అక్కయ్యలున్నారు. పెద్దావిడకు పెళ్ళయింది. ఇద్దరు అన్నయ్యలు ఇంకా చదువుకుంటున్నారు. నాకు చేతివ్రాత బట్టి మనస్తత్వం చెప్పటం తెలుసు. నీది నిర్మలమైన స్వభావమని తెలిసింది. ఏ నిర్ణయాన్నైనా నెమ్మదిగా తీసుకుంటావని అనుకుంటున్నాను. నీలాంటి చేతివ్రాత వున్నవాళ్ళు స్నేహపాత్రులు. అలాంటి అమ్మాయిని ప్రేమించిన వాడికి అదృష్టం కలిసొస్తుంది. నీ మొదటి ఉత్తరాన్ని ఫోటో కట్టి పెట్టుకోవాలనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు చూస్తారని భయపడి వూరుకున్నాను. జవాబు వ్రాస్తావుగా-
సుదర్శన్."
పావని ఆ వుత్తరాన్ని చదివి తెల్లబోయింది.
శైలజ నవ్వి "ఐయామ్ సారీ" అంది.
"ఫర్వాలేదులే" ఇంకేమీ అనలేక సర్దుకుంటున్నట్టు అంది పావని.
"నేను సారీ చెప్పింది అందుక్కాదు. అతని ఉత్తరంలో 'నువ్వు' అనుకుని నా పేరు గురించి పొగిడాడు. ఆ రెండూ నాకు సంబంధించినవి. అందువల్ల ఆ ఉత్సుకతతో అతనికి మళ్ళీ వుత్తరం వ్రాశాను."
పావని విద్యుద్ఘాతం తగిలినదాన్లా చూస్తూ వుండిపోయింది. శైలజ కొనసాగించింది. "దానికతను జవాబిచ్చాడు. మా ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ విధంగా ఈ రెండు నెలలూ జరిగాయి."
"పాపం అతడు నిన్ను నేను అనుకుని వుంటాడు. నువ్వు చాలా తప్పు చేశావు శైలూ! అతడిలో అనవసరంగా ఆశలు రేపావు. అతని ఉత్తరం బట్టి అతడెంతో సున్నితమనస్కుడని తెలియటంలేదూ! అంత నిజమైన ప్రేమికుడిని అల్లరి పట్టించటం భావ్యం కాదు సుమా."
"అవును అలాగే నాకూ అనిపించింది. అందుకే స్వయంగా వెళ్ళి కలుసుకున్నాను- జరిగిన పొరపాటు చెపుదామని."
"కలుసుకున్నావా?"
"అవును."
"ఏమన్నాడు?" టెన్షన్ భరించలేనట్లు అడిగింది.
శైలజ చాలా తాపీగా నెమ్మదిగా అంది "బాగా మారిపోయారే అన్నాడు."
పావని మొహంలో రక్తం ఇంకిపోయింది. "నిజమా" అంది.
"అవును ఎప్పుడో మూడు నెలల క్రితం నిన్ను రైలులో చూసి ప్రేమలో పడ్డాడు. హఠాత్తుగా ఆ పేరు మీద నేను వెళ్ళేసారికి ఒక్కక్షణం కన్ ఫ్యూజ్ అయ్యాడు. కానీ వెంటనే జరిగిందంతా చెప్పాను. అతడు రైల్లో చూసింది పావనిని అనీ, అది నేను కాదనీ చెప్పాను. నీకు పెళ్లైపోయిందని ఒక చిన్న అబద్దం కూడా చెప్పాను. కొంచెం బాధపడ్డాడు. మరీ ఎక్కువగా బాధపడలేదనుకో నా చేతివ్రాత బావుందన్నందుకు థాంక్స్ చెప్పాను. ఇద్దరం హోటల్ కి వెళ్ళి కాఫీ తాగాం. బాగా మాట్లాడాడు, ఇరవై ఏళ్ళుంటాయేమో కదా! కపిల్ దేవ్ గురించీ, అనిల్ కపూర్ గురించీ చాలాసేపు చెప్పాడు. వాళ్ళిద్దరూ తన అభిమానులట. చిత్రమేమిటంటే మా మధ్య నీ గురించిన ప్రసక్తి అసలు రానేలేదు. ఎన్నెన్నో మాట్లాడుకున్నాం. వస్తూంటే ఆ మాటే చెప్పాను. "నీతో మాట్లాడిన రెండు గంటలూ రెండు క్షణాల్లో గడిచిపోయినయ్ సుద్దూ...." అని. తనని నేను "సుద్దూ....." అని ముద్దుగా పిలవటం మొదలుపెట్టాలే! తనకీ అదే యిష్టమట. వెంటనే ఉత్తరం వ్రాయమన్నాడు. ఆగలేక ట్రైన్ లోనే కూర్చుని ఉత్తరం వ్రాశాను. దానికి జవాబు కూడా వచ్చింది ఇదిగో చదువు."
వణికే చేతివేళ్ళతో పావని దాన్ని అందుకుని చదవసాగింది.
"శైలూ!
నువ్వెళ్ళిపోయిన తర్వాత నాకేం తోచటంలేదు. మనం మాట్లాడుకున్న మాటలే గుర్తొస్తున్నాయి. బహుశా నీతో స్నేహం కలపాలనే దేవుడు ఇలా నీచేత వుత్తరం వ్రాయించి వుంటాడు. లేకపోతే ఆ అమ్మాయి నాకు వ్రాసిన కవర్లో నీ ఉత్తరం పెట్టటం ఏమిటి? జరిగిందంతా నువ్వు నాకు చెప్పడం నీ స్వచ్చమైన మనసుని సూచిస్తుంది. నువ్వెళ్ళిపోయక కూడా ఇంకా నువ్వు నాతో టీ త్రాగుతూ "సుద్దూ....." అని పిలిచినట్టే వుంది. ఆ రెండు గంటల మాటల్లో మన యిద్దరి భావాలూ ఒకేలా వుండటం గమనించాను. నీలాంటి స్నేహితులు దొరకటం నా అదృష్టం. వెళ్ళిపోతూ ట్రైన్ లోనే ఉత్తరం వ్రాశావంటే నా స్నేహం కూడా నీకు నచ్చే వుంటుంది. వెంటనే ఉత్తరం వ్రాస్తావు కదూ-సుదర్శన్."
పావని చదవటం పూర్తిచేసి నెమ్మదిగా తలెత్తింది. ఆమెవైపే చూస్తున్న శైలజ అంది.
"టైన్ సుందరీ! నీవే ఆ ఆరాధ్య దేవతవు అన్న నీ ప్రియమిత్రుడు ప్రస్తుతం నా స్నేహితుడు రైల్లో నువ్వు కనబడటం తన అదృష్టంగా భావించినవాడు-కవర్లో నా ఉత్తరం రావటం ప్రస్తుత అదృష్టంగా భావిస్తున్నాడు. అతన్ని నేను తప్పు పట్టటంలేదు పావనీ! స్త్రీని మోసం చేయటం, వల్లో వేసుకోవడంలాంటి స్కీమింగులున్న కుర్రవాడిగా కూడా అతన్ని నేను భావించటంలేదు. అతడికి అంత వయసు కూడా లేదు......ప్రేమించాలి, ప్రేమించబడాలీ అన్న ఆతృత మాత్రమే వున్న వయసు అతడిది.....అతడు నిన్ను ప్రేమించలేదు. "ప్రేమించటం" అన్న భావాన్ని మాత్రమే ప్రేమించాడు. నీ స్థానంలో నేను ప్రేమించేసరికి నన్ను ప్రేమించటం మొదలుపెట్టాడు. అతడి ప్రేమకి అవుట్ లెట్ గా ఆ వారపత్రికలో శీర్షిక కనబడిందంతే......నీ అభిరుచులేమిటో, నీ అలవాట్లేమిటో, కనీసం నీ చదువేమిటో కూడా తెలీకుండా, కేవలం ట్రైన్ లో చూసి నువ్వే నా ఆరాధ్య దేవతవు అని వ్రాసే ఆ కుర్రవాడి "కెపాసిటీ- టు-లవ్" ఏమిటో చూద్దామనే నేనీ నాటకం ఆడాను. పావనీ! నన్ను క్షమించు. అతడి ప్రేమప్రవాహం నీ నుంచి నా వైపు తిరుగుతుందని నాకు తెలుసు. అందుకే..... అతన్ని "సుద్దూ" అని ప్రేమగా పిలిచాను. అతడి మీద ఉత్సాహమున్నట్టు మాట్లాడాను. మళ్ళీ ఇంకొకసారి చెపుతున్నాను. ఇందులో అతడి తప్పేమీ లేదు. అతడి వయసు అలాంటిది! నువ్వు అనచ్చు. మన వయసు కూడా అలాటిదే కదా అని. కానీ స్త్రీ ఎప్పుడూ డిఫెన్స్ లో వుండాలి. వయసుకన్నా తొందరగా మానసికంగా ఎదగాలి. లేకపోతే నష్టపోతాం. ఒక్కటి మాత్రం నిజం. ఇదంతా నీ కోసం, కేవలం నీ కోసం చేశాను పావనీ! నీ ఉత్తరం చూస్తే నాకు భయం వేసింది. ఒక మనిషి మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పగానే అంతగా కదిలి పోవటం అనవసరం. ప్రేమ త్యాగాన్ని కోరుతుందన్నది పాతకాలం మాట! ప్రేమ కాన్ఫిడెన్స్ ని కోరుతుంది. మొదట తనమీద తనకి నమ్మకం వుండాలి. రెండు-అవతలి వాళ్ళమీద నమ్మకం వుండాలి. అప్పుడిక బాధకి తావులేదు. నిన్నీ బాధనుంచి తప్పించటానికే నేను అతడికి ఉత్తరం వ్రాశాను."
నీళ్ళు నిండిన కళ్ళతో పావని స్నేహితురాలివైపు చూసింది.....అయితే అవి దుఃఖాశృవులుకావు. ఆత్మీయతవల్ల వచ్చినవి.
"ఇది.....ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావ్ శైలూ నువ్వు?"
"పుస్తకాల్లో....." అంది శైలజ. "మన తల్లిదండ్రులు మనల్ని పుస్తకాలు చదవనివ్వరు గానీ వెతగ్గలిగే ఓపిక వుంటే సస్పెన్స్ థ్రిల్లర్ లో కూడా జీవిత సత్యాలుంటాయి. పుస్తకాలే నిజమయిన స్నేహితులని వూరికే అనలేదు."
"నేను అతడివైపు చూడటం, నవ్వటం తప్పంటావా? నాకెందుకో అతడిని చూస్తే బాగా అనిపించింది."
"వయసులో ఆకర్షణ వుండటం తప్పుకాదు. ఆ మాత్రం అల్లరి చేయకపోతే అది పదహారేళ్ళ వయసెలా అవుతుంది? ఉండు ఒక్క నిముషం" అని పక్కనున్న తనింటికి వెళ్ళి ఒక పుస్తకంతో వచ్చింది.
"ఏమిటది?"
"మొన్న రచయితల సభ కెళ్ళినప్పుడు ఒక రచయిత వ్రాసాడీ కొటేషను. నాకెంతో నచ్చింది" అంది. పావని దాన్ని తీసుకుని చూసింది. రెండు చిన్న పేజీలనిండా ఓపిగ్గా వ్రాశాడు ఆ రచయిత.
For the man, an attractive girl-and for the woman an attractive man, are the prizes they are after! "attrac- tive" usually means a nice package of qualities which are popular and sought after on the personality market. But as two persons become well acquainted, their intimacy loses more and more its miraculous and initial excitement-" If it stays then it is real love".
ఆమెకు రెండు మూడుసార్లు చదివితేగానీ అర్ధంకాలేదు. ఆ తరువాత ఆమె స్నేహితురాలివైపు చూసింది. మనసులో దిగులంతా ఒక్కసారిగా పోయినట్టు అయింది. ఇద్దరూ ఒకర్నొకరు చూసి హాయిగా నవ్వుకున్నారు.
"నిజంగా నేనెంత తెలివితక్కువగా ప్రవర్తించానో తల్చుకుంటుంటే నాకే నవ్వొస్తూంది."
"మళ్ళీ అలా అనకు. ఆ మాత్రం అల్లర్లుండాలి. దాన్ని సీరియస్ గా తీసుకోవటం...." అనబోయింది శైలజ.
"పోన్లెద్దూ అయిపోయిందేదో అయిపోయిందిగా" అంది పావని.
అంత తొందరగా అవలేదు అది.
