Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 8

                                 4
   
    పావని ఇంటర్ థర్డ్ క్లాసులో పాసైంది. ముందుగా అనుకున్నదే కావడంతో ఎవర్నీ బాధపెట్టలేదా విషయం. పై చదువులు చదివే ఆలోచన అసలు లేకుండా పోయింది. ఇంటి భారం పూర్తిగా ఆమె మీదే పడింది. విశ్వపతి సంబంధాలు చూడాలని నిశ్చయించుకున్నాడు. పావని అందానికి, తెలివితేటలకు సంబంధం దొరకటం పెద్ద కష్టం కాదనుకున్నాడు.
   
    అయితే స్కూలు, ఇల్లు, తన ఊరు తప్ప మరో ప్రపంచం ఎరగని విశ్వపతికి కూతురు పెళ్ళి చేయడం అనుకున్నంత సులభం కాదని అనుభవంలోగానీ తెలిసిరాలేదు. ఇంట్లో భార్యకున్న వ్యాధి వలన క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకోగలిగాడు కానీ వరకట్న జాఢ్యం సమాజంలో ఎంత వేగంగా, ఎంత ఉధృతంగా వ్యాపించుకుపోయిందో అతడికి తెలియదు.
   
    'అమ్మాయికి పెళ్ళి చేయాలనుకున్నాను. సంబంధం మంచిదేమైనా వుంటే చెప్పండి' అని అడిగితే వాళ్ళడిగే మొదటి ప్రశ్న-కట్నం ఎంత ఇవ్వగలవు అని.
   
    'మా అమ్మాయి చాలా అందంగా వుంటుంది. చదువుతుంది కూడా! ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది' అంటే-'అవన్నీ ఎవరికీ కావాలోయ్. ఇప్పుడు ప్రతి పెళ్ళికొడుక్కీ ఒక రేటు ఫిక్స్ అయిపోయింది. ఫ్యూన్ ఉద్యోగం చేస్తున్నవాడికి పదిహేనునుంచి ఇరవైవేల వరకు ఇవ్వాలి. ఇక గుమాస్తాలకు, బ్యాంక్ ఉద్యోగులకూ, ఆఫీసర్లకూ పోను పోను రేటు పెరుగుతుంటుంది. అమ్మాయి అందం అంటే అదేమైనా కొరుక్కుతింటామా అని నవ్వుతారు, మరెవరి దగ్గరా ఇలా మాట్లాడకు' అని చివాట్లు.
   
    సంవత్సరం గడిచినా పావనిని చేసుకునేందుకు ఒక్కరు కూడా రాలేదు. రోజులు గడిచిపోతూనే వున్నాయి.
   
                            *    *    *
   
    "అరుంధతీ" హడావుడిగా లోపలకు వచ్చాడు విశ్వపతి.
   
    "ఏమిటండీ?" నీరసంగా తల తిప్పి చూసింది. ఆమె ముఖం చూడగానే అతడిలో సగం ఉత్సాహం చచ్చిపోయింది.
   
    "ఏమిటో చెబుదామని వచ్చారు, ఏమిటి?" అడిగింది అరుంధతి.
   
    "ఏం లేదు. పావనిని చూడటానికి పెళ్ళివారు వస్తున్నారు రేపు."
   
    "అలాగా.....! అబ్బాయి ఏం చేస్తాడట?" ఉత్సాహం కొని తెచ్చుకుంటూ అడిగింది అరుంధతి. పావని లేచి మెల్లగా బయటకు వెళ్ళిపోయింది.
   
    కానీ తలుపు దగ్గరే ఆమె పాదాలు ఆగిపోయాయి. వివరాలు వినాలని కుతూహలం.
   
    "బ్యాంక్ లో పనిచేస్తున్నాడట. త్వరలో ఆఫీసరు కూడా అవుతాడట. మన సుబ్బ్రారావే తీసుకొచ్చాడీ సంబంధం."
   
    "రేపయినా నాకు కాస్త నెమ్మదిస్తే బావుండును. భార్యని పొద్దుటే ఇంటికి పంపమని సుబ్బారావు చెప్పండి. అలాగే ఏమయినా స్వీట్లు, పళ్ళు తీసుకురండి. భగవంతుడి దయవలన ఈ సంబంధం కుదిరితే బావుండును."
   
    "మన పావనికేం? కుందనపు బొమ్మ తప్పకుండా నచ్చుతుంది. సరే నేనలా వెళ్లొస్తాను" తండ్రి లేవటం గమనించి వెనక తోటలోకి తప్పుకుంది పావని ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. జీవితంలో పెళ్ళిచూపుల ప్రహసనం మొదలవబోతుందా? పెళ్ళిచూపులంటే వినటమే గాని ప్రత్యక్షంగా ఎక్కడా చూడటంగానీ, అనుభవంగాని లేవు. సుందరి ఎప్పుడూ తన అనుభవాలని చెప్పి నవ్విస్తుండేది. దాదాపు యాభయ్ మంది పెళ్ళి కొడుకులు వచ్చి చూసినా ఎవరికీ నచ్చలేదామె. చివరకు అవివాహితగానే మిగిలిపోయింది. కానీ తనూ సుందరీ ఒకటేనా? తనకు కొద్దో గొప్పో చదువుంది. కొంత కాకపోయినా కొంతయినా ఖర్చుపెట్టగలిగే తండ్రి వున్నాడు. పావని లోపలకు వెళ్ళి అద్దంలో  ముఖం చూసుకుంది. వంక పెట్టలేని అందం తండ్రి చెప్పినట్లు అందమయిన అమ్మాయి కావాలనుకునే వాళ్ళెవరూ వద్దు అనలేని సౌందర్యం.
   
    పావనికి రాత్రంతా నిద్ర పట్టలేదు. రేపు వాళ్ళెదురుగా ఎలా కూర్చోవాలి? సమాధానం ఎలా చెపితే బావుంటుంది? అబ్బాయి వైపు చూడవచ్చో లేదో ఇంతకీ ఏ చీర కట్టుకోవాలి? తన శరీరపు రంగుకి ఎరుపు రంగు బాగా సూటవుతుంది. కానీ ఎర్రచీర కట్టుకుంటే బావుంటుందో లేదో! డేంజర్ కలర్ అనుకుంటారేమో లేత గులాబీరంగు చీర బావుంటుంది కానీ తన రంగులో కలిసి పోతుంది. ఇకపోతే మిగిలింది ఎర్ర బార్డరున్న ఆకుపచ్చ చీర అవునదే బావుంటుంది. అది కట్టుకున్నప్పుడల్లా అందరి కళ్ళూ తనమీదే వుంటాయి. ఈ సమయంలో సుందరి వుంటే ఎంత బావుండేది. అన్నీ తనే చూసుకునేది. ఆలోచనలతో చాలా రాత్రి గడిచింది.
   
    ఆ తర్వాత నిద్రెలా పట్టిందో ఆమెకే తెలీదు.
   
    "ఈ చీర కట్టుకోమ్మా" సుబ్బారావు భార్య అచ్చం తను కావాలనుకున్న ముదురు నీలం రంగు చీర అందించింది. అది కట్టుకోగానే అందం రెట్టింపైనట్లు అనిపించింది. జడలో ఒకే ఒక్క గులాబీ తురుముకుంది.
   
    బయట హాల్లో మాటలు వినిపించాయి. "అరే వాళ్ళు వచ్చేసినట్లున్నారు" గబగబా బయటకెళ్ళిపోయాడు తండ్రి.
   
    "అక్కా! పెళ్ళికొడుకు భలే బావున్నాడే. అచ్చం సినిమా హీరోలా వున్నాడు. వాళ్ళ అమ్మా, నాన్నా, అక్క కూడా వున్నారు. చాలా గొప్పవాళ్ళలా ఒంటినిండా నగలు వేసుకున్నారు. వాళ్ళు కట్టుకున్న పట్టుచీరలు భలే బావున్నాయక్కా."
   
    పావని మనసు ఉద్వేగంతో నిండిపోతోంది. చిరుచెమటలు పడుతున్నాయి. ఎన్నో యుగాలయ్యాయనిపించాక వచ్చింది ఆంటీ.
   
    "పదమ్మా" వెంట బెట్టుకు వెళ్ళిందావిడ. ఆవిడ చెప్పినట్లుగా చాపమీద కూర్చుంది.
   
    "నీ పేరేమిటమ్మా?" అడిగిందో స్త్రీ కంఠం.
   
    "పావని" మెల్లగా జవాబిచ్చింది.
   
    "ఎంతవరకు చదువుకున్నావు?" మరో పురుష స్వరం అబ్బాయి కాబోలు.
   
    "ఇంటర్ పాసయ్యానండి" అరక్షణంలో కొనగంట కనిపించిన రూపం ఆమె ఒళ్ళు పులకరించేలా చేసింది. అచ్చం సినిమా హీరోలాగా నవ్వుతున్నాడు.

    "తర్వాతెందుకు మానేశారు. డిగ్రీ చేయలేకపోయారా?" ఆ స్వరంలో ఎంత మార్దవం, గౌరవం-
   
    "ఇంట్లో పరిస్థితులు అనుకూలించక."
   
    ఆ తర్వాత వాళ్ళేం అడిగారో తనేం చెప్పిందో ఆమెకే తెలియదు.
   
    "ఇక నువ్వు లోపలకెళ్ళమ్మా?" గదిలోకి వెళ్ళిపోయిందే గాని మనసంతా అక్కడే వుంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు?
   
    "తాంబూలాలు పుచ్చుకుందాం, ఏర్పాట్లు చేయించండి" అన్నాడు మామగారు.
   
    "మిగతా విషయాలు అవీ......నేనెక్కువ యిచ్చుకోలేను బావగారూ! ఈవిడ జబ్బుతో ఏ మాత్రం నిలవచేయలేకపోయాను."
   
    "అవన్నీ ఎవరడిగారండీ! అమ్మాయి బంగారు బొమ్మలాగుంది. మాకేమీ అక్కర్లేదు. అమ్మాయి మా ఇంట్లో అడుగుపెడితే చాలు" అంది అత్తగారు.
   
    "అంతా మా అమ్మాయి అదృష్టం" అరుంధతి మొహం వెలిగిపోతోంది.
   
    "మీది కాదు, మాది. మా వదినను ఒకసారి చూస్తాను" ఆడపడుచు లేచి లోపలకొచ్చింది. పావని కిటికీ దగ్గర్నుంచి తప్పుకుంది. "మాకు నీవు బాగా నచ్చావు మరి నీకు అన్నయ్య నచ్చాడా? ఈ సంగతి వాడే అడిగి రమ్మన్నాడు." పావని సిగ్గుతో తల దించుకుంది.
   
    "నీకెలాంటి నగలంటే యిష్టం? ఎలాంటి రంగులు యిష్టం? అన్నీ చెప్పేయ్- నేనే సెలక్ట్ చేస్తాను. అసలు బంగరమైనా, పట్టుచీరయినా నీ ఒంటిమీద సిగ్గుపడుతుందనుకో."
   
    "అట్లా మాట్లాడకండి- నాకు సిగ్గుగా వుంది."
   
    "ఏం లాభంలేదు. నిన్నెప్పటికీ యిలా యేడిపిస్తుంటాను అర్ధ మొగుడిని కదా!"
   
    "నాకే నగలూ, చీరలూ వద్దు. ఒకటే కోరిక" మళ్ళీ అవకాశం పోతుందేమోనన్న భయంతో అంది పావని.
   
    "ఏమిటి?" ఆ అమ్మాయి సీరియస్ గా అడిగింది.

    "ఏం లేదు. నాన్నను చూడకుండా నేనుండలేను. అప్పుడప్పుడు ఆయన దగ్గరకు పంపగలరా? ఒక్క రోజుండి వచ్చేస్తాను."
   
    "అదెంత భాగ్యం" అందా అమ్మాయి నవ్వుతూ.
   
    "అక్కా- అక్కా-" కుదుపుతూంటే మెలుకువ వచ్చింది పావనికి. "ఎంతసేపటికీ లేవవేమిటి?" అంటూంది. నిద్రలేచి గబగబా పెరట్లోకి వెళ్ళింది. పెళ్ళివాళ్ళు ప్రొద్దున్న పదింటికి వస్తామన్నారు.
   
    "తెల్లవారుఝామున వచ్చే కలలు నిజమవుతాయట" అనుకుంటూ తయారవుతూంది పావని.
   
                                *    *    *
   
    గవర్నమెంట్ హాస్పిటల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS