ట్రైన్ మళ్ళీ కదిలింది.
ఆమె పక్కనున్న సైలజతో ఎక్కువగా మాట్లాడటం సాగించింది. మాటలు మామూలు కన్నా అధికంగా వస్తున్నాయి. ఎందుకో కారణం తెలీదు. మాట్లాడుతూ మాట్లాడుతూ అతని వైపు చూసేది. అతడు ఆమెవైపు చూస్తుండేవాడు. ఆమె చప్పున శైలజ వైపు తిరిగి మాటలు కొనసాగించేది. రాత్రి వరకూ ఇలా సాగింది.
పదయ్యాక అందరూ నిద్రపోయారు. త్రీటైర్ కంపార్టుమెంట్ అది. ఆమెది క్రింది బర్త్, లైట్లు ఆర్పేసిన అరగంటకు ఆమె నిద్రలోకి జారుకుంది. ఒంటిగంట ప్రాంతంలో మెలకువవచ్చి ఆమె లేచి టాయ్ లెట్ కి వెళ్ళింది.
తలుపు తీసి తిరిగి వస్తుండగా ఆ కుర్రవాడు బయట కనపడ్డాడు.
ఆమె గుండె ఆగిపోయినట్టనిపించింది. మొహమంతా చెమట్లు పట్టినయ్. అతడి పరిస్థితీ ఇలాగే వుంది. భయంవలన వచ్చిన విచారంతో తడబడుతూ నవ్వాడు. ఆమెకు అక్కడ్నుంచి వెళ్ళిపోవాలనిపించింది. అదృష్టవశాత్తు అందరూ నిద్రలో వున్నారు.
"మీ..... మీ...... పేరు?" అన్నాడు.
ఆమె జవాబు చెప్పలేదు. అతడి పక్కనుంచి దారి చేసుకుని వడివడిగా తన సీటు దగ్గరికి వచ్చి పడుకుంది. చాలాసేపటివరకూ గుండెదడ తగ్గలేదు. ఆ తర్వాత నెమ్మదిగా తలతిప్పి అతడి సీటువంక చూసింది. చీకట్లో అతడు మెలకువగా వున్నాడో, నిద్రపోయాడో ఆమెకు తెలియదు. మరికొంచెంసేపు అలాగే చూసి, ఏమీ కనబడక కళ్ళు మూసుకుంది.
నిద్ర ఆమె ప్రేమను జయించింది.
ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఆ అబ్బాయి రెండు మూడు సార్లు గుర్తొచ్చాడు ఆమెకు. తరువాత ఆమె అతడి గురించి పూర్తిగా మర్చిపోక పోయినా, అతడి ఆలోచన అంతగా బాధించలేదు. దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత ఆమె ఒక వారపత్రిక చదవటంతో, ఆగిపోయిన ఆ సంఘటనకి మరో కుదుపు వచ్చింది.
* * *
"అక్షరమైత్రి" అన్న పేరు క్రింద ఆ వారపత్రిక శీర్షిక నిర్వహిస్తోంది. యువతీ యువకులు తమ అంతర్గత భావావేశాన్ని, ఊహల్లో ప్రేమనీ, మానసిక మైధునాన్ని ఆ శీర్షికలో వ్రాసి తృప్తి పొందుతూ వుంటారు.
కనపడిన ప్రతీ పుస్తకం సెలవుల్లో ఆమె చదివేది.
అక్షరమైత్రి శీర్షికలో ఆ వుత్తరం ఆమె దృష్టిలో పడింది.
"నా కలల వెలుగైన ట్రైన్ సుందరికి.
ఏప్రిల్ ఇరవయవ తేదీ నా జీవితంలో మరపురాని రోజు.
ఆ రోజు సికింద్రాబాద్ వరకూ ప్రయాణం చేసిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి నా మనసులో నిలిచిపోయింది. నీలం పరికిణీ మీద తెల్ల ఓణి వేసుకున్న ఆ అమ్మాయినే చూస్తూ కూర్చున్నాను. ఆ అమ్మాయి లేకపోతే నా జీవితం వ్యర్ధం అనిపిస్తుంది.
నా ప్రియతమా!
నన్ను కరుణించవా!
నీ అడ్రసు తెలీదు. ఏ వూరో తెలీదు. కన్నుమూసినా, తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు. నా వైపు నువ్వు చూసిన చూపు గుండెల్లో దూసుకుపోయింది. వివాహం అంటూ చేసుకుంటే ఈమెనే చేసుకుంటాను- అని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. ట్రైన్ లో అందరూ దిగిపోయిన తర్వాత నువ్వు కూర్చున్న సీటు దగ్గరికి వెళ్ళి దాన్ని చేత్తో స్ప్రుశించాను. ఆ సీటు క్రింద వాడిన మల్లె కనిపించింది. అది ఇప్పటివరకూ నా దగ్గర భద్రంగా వుంది. నా ప్రియురాలి తలలోంచి పడిన మల్లెకన్నా విలువయినది ఈ ప్రపంచంలో ఇంకేమీ వుండదు.
ఎక్కడెక్కడి ప్రేమికులనో కలుపుతున్న ఈ శీర్షికకి నా కృతజ్ఞతలు. దీన్ని నా స్నేహితురాలు చదవాలనీ, నాకు తన ప్రేమని తెలియజేయాలనీ ఆశిస్తున్నాను. నా హృదయ వీణపై ప్రేమ తంత్రుల్ని మ్రోగించి నన్ను భగ్న ప్రేమికుడిని చేసి వెళ్ళి పోయిన సుందరీ! నీ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తూ జీవితాంతం గడపదల్చుకున్న నీ ప్రేమికుడు-
సుదర్శనం, 116, నామాలగుండు, సికింద్రాబాదు...."
ఆమె కన్నుల్లో నీరు తిరిగింది. ఎన్నోసార్లు చదువుకుంది.
రెండ్రోజులపాటు అదే ఆమె మనసులో గిర్రున తిరగసాగింది.
ఆ రోజు పోస్ట్ లో శైలజ దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. దానికి జవాబు వ్రాసింది మామూలు యోగక్షేమాల్తో.
పక్కనే పత్రిక కనబడింది. ఆమె మరోమారు ఆ శీర్షిక చదివింది. గుండెల్లో ప్రేమ పొంగి పొర్లుతూ వుండగా ఇక ఆపుకోలేక ఉత్తరం పాడ్ మీద నాలుగు వాక్యాలు వ్రాసింది.
"సుదర్శన్ గారికి-
మీరు నన్నెంత ప్రేమిస్తున్నారో, నేను మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ నాకు ధైర్యంలేదు. నన్ను క్షమించగలరు. మీరు కూడా నాకు బాగా గుర్తుకు వచ్చేవారు. దయచేసి నన్ను మర్చిపో సుదర్శన్. నా గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఎప్పుడైనా విధి అనుకూలిస్తే మళ్ళీ కలుసుకుందాం. నువ్వు మరొకర్ని వివాహం చేసుకోకపోతే నా మీద ఒట్టే!
-పావని"
ఆమె తన అడ్రసు వ్రాయటానికి భయపడింది.
కవరుమీద సుదర్శన్ అడ్రసు వ్రాసింది.
ఆమె మనసు చాలా సంతృప్తిగా అనిపించింది. తన గురించి ఒక జీవితం నాశనం అవటానికి వీల్లేదు. అంతే ఆమె కోరిక.
అయితే ఆమె కోరిక ఆ విధంగా తీరలేదు. కారణం-
స్నేహితురాలికి వ్రాసిన కవర్లో ఆ ఉత్తరం పెట్టి సుదర్శనం అడ్రసున్న కవర్లో పొరపాటున శైలజకి వ్రాసిన ఉత్తరం పెట్టి తారుమారుగా పోస్ట్ చేసింది.
ఆ తర్వాత కొంతకలం ఆమెను సుదర్శన్ జ్ఞాపకాలు అనుక్షణం వెంటాడేవి. తను రైలు ఎక్కినప్పటి నుంచి దిగేవరకూ జరిగిన ప్రతీదీ గుర్తు తెచ్చుకునేది. తను తలుపు దగ్గర నిలబడినప్పుడు అతను పేరడగటం, తను భయంతో పరిగెత్తడం, అతడు తనని చూచి నవ్వినప్పుడు తను సిగ్గుతో తల వంచుకోవడం...... అన్నీ వరుసగా గుర్తు తెచ్చుకునేది.
సుదర్శన్, తను కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్ళినట్లు, అక్కడ ఐస్ క్రీం తింటూ అతను తనతో ఎన్నో కబుర్లు చెప్పినట్టు రాత్రిళ్ళు కలలు కూడా వచ్చేవి. అతడు పత్రికలో రాసిన ఆ ఉత్తరాన్ని ఎన్నోసార్లు చదువుకుంది. "లవ్ ఈజ్ నథింగ్ బట్ రికగ్నిషన్" అన్నాడు ఒక రచయిత. ఒక సామన్యమైన అమ్మాయిని అతను గుర్తించడం, అంతగా ఆలోచించటం ఒక అద్బుతమైన అనుభూతి.
అతడు తన ఇంటికి వచ్చి తన తండ్రిని అడిగినట్టు కూడా వూహించుకునేది. అయినా అది జరగని పని. తన తండ్రి ఎంత సనాతనుడో ఆమెకు తెలుసు. అందుకే తన అడ్రసు కూడా యివ్వలేదు. ఎప్పుడో పది సంవత్సరాల తర్వాత అదే ట్రైన్ లో భార్యాపిల్లలతో అతను కనబడినట్టు "ఇదంతా నీ వలనే.... నీవు చెప్పటం వలనే ఈ వివాహం చేసుకున్నాను పావనీ" అన్నట్టు కూడా అనుకునేది.
కానీ వీటన్నిటికీ ముందే జరిగింది ఓ సంఘటన.
ఇంకో నాల్గయిదు రోజుల్లో రిజల్ట్సు వస్తాయనగా శైలజ తిరిగి వూరినుంచి వచ్చింది "ఇదిగో నీ ఉత్తరం" అంది పావనికో కవరు అందిస్తూ.
"ఏమిటి నా ఉత్తరం?" ఆశ్చర్యంగా అడిగింది పావని దాన్ని అందుకుంటూ.
"పొరపాటున నా కొచ్చిన - సుదర్శన్ కి నువ్వు వ్రాసిన ఉత్తరం" అంటూ జరిగిందంతా చెప్పింది. పావని నిశ్చేష్టురాలై విన్నది. ఈ విషయమంతా మూడో వ్యక్తికి తెలిసిందనేసరికి ఆమెకి చాలా గిల్టీగా అనిపించింది. రైల్లో ఏం జరిగిందో చెప్పింది. ఇటువంటి విషయాల్లో అవతలి మనిషికి తన రహస్యం ఏ కాస్త తెలిసినా మొత్తం అంతా చెప్పేయటం చాలా సహజమైన విషయం.
అంతా విని శైలజ అంది "ఆ పత్రికలో ఆ శీర్షికలో ఉత్తరాన్ని నేనూ చదివాను. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నువ్వే రంగు ఓణి పరికిణీ వేసుకున్నావో నాకు గుర్తులేదు. మనలోనే ఎవరో అనుకున్నాను. నీ ఉత్తరం అందేసరికి అది నువ్వే అని తేలిపోయింది. పావని ఇంత పెద్దది ఎప్పుడయిపోయిందా అనుకున్నాను."
పావని మాట్లాడలేదు.
కొంచెంసేపు నిశ్శబ్ధం తరువాత "నేను అతనికి ఉత్తరం వ్రాశాను"అంది శైలజ.
పావని అదిరిపాటుతో "ఏమిటీ?" అంది కంగారుగా.
"అవును నీ ఉత్తరం ఎలాగూ అతనికి అందలేదు. అతని అడ్రసు పత్రికలో వుంది. నిజానికి నీ ఉత్తరమే ఇంకో కవర్లో పెట్టి పొరపాటు ఎలా జరిగిందో చెప్తూ అతనికి పంపించవచ్చు. కానీ నా పేరుమీద నా అడ్రసు యిచ్చాను. వెంటనే అతను జవాబు వ్రాశాడు. ఇదిగో" అంటూ దాన్నిచ్చింది.
కంపిస్తూన్న చేతులతో ఆమె దాన్ని చదివింది.
"ప్రియమైన శైలజా!
ఎడారిలో వెతుక్కునే బాటసారికి ఒయాసిస్సు కనిపించినట్టు నాకు మీ వుత్తరం అందగానే అనిపించింది. మనిద్దరం కలవాలని ఆ దేవుడే వ్రాసి పెట్టినట్టున్నాడు.
