"బహుశా రాత్రి నిద్రపోయి వుండవు కదూ" శశాంకలో ఓ అద్భుతమైన మార్పుకి గుర్తు ఈ వాక్యమే. "కలలో కూడా నా ఆయుధం కనిపించి వుంటుంది."
"కరెక్ట్" చాలా పర్ ఫెక్ట్ గా చెప్పారు శశీ. నాకు రాత్రి కలలో జ్వరమొచ్చింది. డాక్టరుగా నువ్వొచ్చావు. నా జబ్బు పేరు కామజ్వరమన్నావు. ఎంత పెద్ద సిరంజని... ఇంజక్షను చేసి కళ్ళలోకి చూశావు. చిత్రం. ఒక్క నిముషంలో నా వేడి చల్లారిందట..."
"మొత్తానికి నయమైందిగా"
"ఎంత మాట" సన్నగా మూలిగింది సోఫియా.
"సోఫియా" అర్దోక్తిలోనే వారించాడు శశాంక.
"నీ గొంతు మారిందే"
"మనిషిని కూడా మారేను"
"రియల్లీ" సోఫియా నవ్వు వినిపించింది కాంక్షగా.
"కొంచెం జాగ్రత్తగా వుండాలి నువ్వు."
"దేనికి?"
"పోలీసులు నేరస్థుడి కోసం చాలా తీవ్రంగా గాలిస్తున్నట్టు తెలిసింది. ఏ క్షణంలో అయినా నీ వెంట పడొచ్చు."
శశాంక జవాబు చెప్పలేదు.
"నీకు తెలుసా... జయచంద్ర చావలేదు... లేవకుండా కొన్ని వారాలపాటు బ్రతికే వుంటాడట..."
"జీవచ్చవంగానా" సాలోచనగా అన్నాడు.
"జయచంద్ర అసాధ్యుడు శశాంకా. కొన వూపిరి దాకా పోరాడగల సమర్థుడు... అదే నేను ఆలోచిస్తున్నది... ముగిసిపోవాల్సిన అతడి సామ్రాజ్య వైభవాన్ని డాక్టర్లు కొంత కాలం పొడిగించారు."
"ఇదీ మన మంచికే అనుకుందాం" భావరహితంగా అన్నాడు. "అవును సోఫియా... గుండె ఆగకపోయినా నిబ్బరం సడలిపోతుందిగా... అలాగే వుండనియ్... క్రమంగా క్షీణించిపోతున్న తన ఆరోగ్యంతోబాటు అతడి ఎంపైర్ కూడా కుంచించుకుపోతుంది. నా భార్యని చంపించి నాకు విధించాడే ఆ శిక్ష ఎలా వుంటుందో తనూ ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తాడు."
"అదెలా?"
"ఇప్పుడతడి బలహీనతని నేను అవకాశంగా తీసుకుంటాను కాబట్టి. అంచెలంచెలుగా వాడ్ని మానసికంగా దెబ్బతీస్తాను కాబట్టి."
చప్పట్లు వినిపించాయి నేపథ్యంలా? ఫోన్ లో నుంచి కాదు.
ఫోన్ క్రెడిల్ చేసి చూశాడు... వెనుకగా వినీల నిలబడి వుంది.
"స్ల్పైండిడ్" వినీల నవ్వుతూంది. కాని ఆ నవ్వులో జీవం లేదు. "మార్వలస్... నీ అసాధారణమైన ప్రతిభనిలా చూపించి మృత్యువుతో పోరాడుతున్న మనిషిపై కూడా ఇంత కసిని ప్రదర్శిస్తున్న శశాంకా... నీ శాడిజానికి నా జోహార్లు."
"హిడిజర్వ్ సిటీ" ఉద్రేకాన్ని నిభాయించుకుంటూ అన్నాడు. "అవును వినీలా... మొన్నటిదాకా మబ్బు చాటున కుమిలిపోయిన శశాంకని నేను... నిన్న రాత్రి వెలుగు రేఖలా బయటికొచ్చాను... అతడి భవంతిని నేలమట్టం చేసే ప్రయత్నంలో ముందు ఓ పాశవికమైన దెబ్బ తీశాను."
"బాగుంది... తర్వాత ఏం చేద్దామను కుంటున్నావు?" _ శశాంక గమనించలేదు వినీల కళ్ళలో ఎరుపు జీరల్ని.
"జయచంద్ర కూతుర్ని బంధించి తీసుకొస్తాను."
"తర్వాత..."
"మరోమారు రాక్షసంగా ఆమె మీద కసి తీర్చుకుంటాను. నిస్సహాయంగా బెడ్ మీద పడి వున్న ఆ తండ్రికి ఈ వార్త అందేట్టు చేసి అతడ్ని మానసికంగా మరి కొంత చంపుతాను."
"ఐసీ" రొప్పుతూందామె. "ఆమెని రప్పించమంటావా?"
శశాంక నిశ్చేష్టంగా చూశాడు - "నీకు తెలుసా?"
"పరిచయమే."
"వెల్... నాపని మరింత సులభమౌతుంది."
"దెన్... డూ ఇట్."
ముందు అర్థం కాలేదు వినీల అంటున్నదేమిటో.
"కమాన్ శశాంకా...గొ ఎహెడ్" కళ్ళనుంచి జారుతున్న వైతరిణీ పాయల్ని ఆపుకోలేని వినీల చితిని అధిరోహించే సతిలా అతడి ముందుకు నడిచింది_ "రా."
అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు అర్థనగ్నంగా వున్న వినీలని. "కంగారు పడకు శశాంకా. ఈ వినీలే ఆ జయచంద్ర కూతురు."
ఒక మిస్సైల్ అతడి మెదడు అరల్లో నుంచి దూసుకు పోయింది.
* * * *
"జయచంద్రగార్ని చూడ్డానికి నాకు అనుమతి కావాలి" తన విజిటింగ్ కార్డు ఇస్తూ సాత్వికంగా అడిగిన స్త్రీని తదేకంగా చూశాడు హాస్పిటల్ సూపరింటెండెంట్.
కొన్ని నిమిషాల క్రితమే పత్రికా విలేకర్లు వచ్చి, జయచంద్ర పరిస్థితి తెలుసుకుని వెళ్ళారు... జయచంద్ర స్పృహలో వున్నా ఆయన మాటాడకూడదు. ఏ కొద్దిపాటి స్ట్రెయిన్ అయినా గొంతులో నుంచి రక్తం స్రవిస్తుంది. అంతకు మించి జయచంద్రని వ్యక్తిగతంగా ఎవరూ కలుసుకోకూడదు - ఆయన కూతురు లేదా ఆయన అనుమతించిన మనిషి తప్ప. ఇది హోం మినిష్టర్ సదాశివయ్య ఆదేశం.
పైగా ఏ క్షణంలో అయినా ప్రత్యర్థి ఏదో ఓ రూపంలో దాడిచేసే అవకాశముందన్న అనుమానంతో చాలా గట్టి రక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి.
సుమారు రెండెకరాల విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఆ హాస్పిటల్ చుట్టూ పోలీసులు మఫ్టీలో కాపలాగా వున్నారు. అంతేగాదు జయచంద్ర బలగం సైతం హాస్పిటలోనేగాక దాని కభిముఖంగా వున్న బిల్డింగ్స్ లోనూ, హాస్పిటల్ కెళ్లే మార్గంలోనూ నిలబడి ప్రతి వ్యక్తినీ పరిశీలనగా గమనిస్తున్నారు.
