Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 69


    
    "క్లాసెగ్గొట్టి నాతో మాట్లాడుతూ కూర్చోమనలేదే!"
    
    "మీరలా అన్నా అంగీకరించటానికి నేను సిద్దంగా వుండాలిగా. ప్రణయలో మామూలు ప్రసన్నతే కనిపిస్తున్నా గొంతులో మరేదో భావం ధ్వనిస్తూంది. "తరువాత మాట్లాడుకుందాం."
    
    "ప్రణయా! ప్లీజ్..."
    
    "ఏమిటి?"
    
    "మీలో ఏదో మార్పు కనిపిస్తూంది."
    
    నవ్వేసింది బాధని నొక్కిపెడుతూ- "నిజమా?"
    
    "ఏం....మీకు తెలీదా?"
    
    తల అడ్డంగా ఊపింది. - "ప్చ్!"
    
    "కాని నాకు చాలా స్పష్టంగా అర్ధమౌతూంది."
    
    ఆమె మొహంలో రంగులు మారాయి- "పరీక్షలు దగ్గర పడ్తున్నాయి ఆదిత్యా! భావుకత మానేసి బాగా చదువుకోండి."
    
    ఈ మాటలు కూడా నచలేదు ఆదిత్యకి- "నా ఎడ్యుకేషన్ విషయంలో మీరేం ఆందోళన పడకండి."
    
    "అలాగా.... కాని నా చదువు విషయంలో నాకు ఆందోళనగా వుంది."
    
    "అందుకే నన్ను తప్పించుకుంటున్నారా?"
    
    "దాన్ని మీరెలా నిర్వచించినా నాకభ్యంతరం లేదు ఆదిత్యా! కాని ఓ విషయం గుర్తుంచుకోండి మీరు నన్ను శాసించేటంతగా దగ్గరకాలేదు."
    
    మనసు చివుక్కుమంది ఆదిత్యకి. ఎందుకిలా మాట్లాడుతూంది ప్రణయ? మనసులో ఒకరిపైన మరొకరికి గల ఇష్టాల్ని వ్యక్తంచేసుకున్నాక కూడా దగ్గర కాలేదంటూందేం? అసలేం జరిగింది?"
    
    "ప్రణయా! మిమ్మల్ని శాసించగల స్థాయివాడిని కాను నేను ఆ విషయం మీరు చెప్పనవసరం లేదు. కాని రేపు మళ్ళీ యూనివర్శిటీలో పోటీలు మొదలు కాబోతున్నాయి. అందులో మనం పార్టిసిపేట్ చేయాలిగా?"
    
    "విన్నాను."
    
    "మరి మీ అభిప్రాయం ఏమిటి?"

    "జంటగా పార్టిసిపేట్ చేయడమేగా?" మృదువుగా నవ్వింది- "అక్కడేదో జంటగా జీవితం నడపబోతున్నట్టు కంగారుపడటం దేనికి?"
    
    ఇక నిగ్రహించుకోలేకపోయాడు- "మీకు గుర్తుందో లేదో తెలీదు కాని మనం ఆ విషయమూ మొన్న నిర్ణయించుకున్నాం."
    
    జవాబు చెప్పలేదు ప్రణయ.
    
    "ఏం? మర్చిపోయారా?"
    
    "దేన్నీ అంత సులభంగా మరిచిపోను ఆదిత్యా! అయినా ఇప్పుడా ప్రసక్తి దేనికి?"
    
    "మీకేమైందో తెలుసుకోవడానికి."
    
    "ఆదిత్యా! కొన్ని ప్రశ్నలకు జవాబులు అడిగి తెలుసుకునేవిగా వుండవు. అర్ధం చేసుకోవాలి."
    
    "నాకర్ధం కావటం లేదు."
    
    "అప్పుడు మన నిర్ణయాలకీ అర్ధం లేదు."
    
    ఉక్రోషంతో నిలబడిపోయాడు.
    
    "వెళ్ళండి ఆదిత్యా! మీక్కావలసింది పోటీలో నేను కలిసి పార్టిసిపేట్ చేయడమేగా? నేను సరే అంటున్నాను"
    
    "అది కాదు ప్రణయా..." ఎలా చెప్పాలో తోచటంలేదు ఆదిత్యకి. "మీరెందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలనుంది."
    
    "అందరూ మనవేపే చూస్తున్నారు."
    
    "చూడనివ్వండి."
    
    "కాని నేను ఆడపిల్లని కాబట్టి అంత ఈజీగా తీసుకోలేను."
    
    ఆమె ప్రవర్తన ఎంత గాయపరిచిందీ అంటే ఇక ప్రసక్తిని పొడిగించ కుండా ఆవేశంగా వెళ్ళిపోయాడు.
    
    కొన్ని క్షణాలదాకా నిలబడిపోయింది అలాగే ఎందుకో క్లాస్ రూం కెళ్ళాలనిపించలేదు. వెనక్కి మరలింది. కారుని చేరుకుని ఇక సీటులో కూర్చోబోతుండగా వినిపించింది-
    
    "మిస్ ప్రణయా!" ఆదిత్య కాదు, ప్రబంధ నిలబడుతుంది.
    
    అదికాదు, ఎగతాళిగా నవ్వుతుందామె.
    
    "హల్లో!" బాలెన్స్ కోల్పోకుండా తనూ పలకరించింది ప్రణయ.
    
    "ఏమిటీ....వెనక్కెళ్ళిపోతున్నారు?"
    
    నిశ్చలంగా చూస్తూంది ప్రణయ.
    
    "వెనకడుగు వేస్తున్నారా, లేక వెనక్కి వెళ్ళిపోతున్నారా తెల్సుకోవాలనుంది."
    
    నిగూఢంగా మరేదో భావాన్ని ధ్వనింపచేస్తుంటే ఇంకా చెరిగిపోని ప్రసన్నతతో అంది ప్రణయ- "రెండింటికీ తేడా తెలియాలీ అంటే మీ అనుభవం చాలదు ప్రబంధా!"
    
    "అవునవును" అవహేళనగా అంది ప్రబంధ.
    
    "ఆదిత్యతో నీ అంతగా నాకింకా అనుభవం దక్కలేదు."
    
    ఏకవచన ప్రయోగానికి మాత్రమే కాదు, ప్రబంధ అలా పచ్చిగా మాట్లాడటాన్ని హర్షించలేకపోయింది ప్రణయ- "ఆడపిల్లవేగా? నువ్వూ సంపాదించుకోవాల్సింది."
    
    "పాపం! నీకిప్పుడు కంగారుగా వున్నట్టుంది."
    
    "దేనికి?"
    
    "అనుభవించినవాడు ఇక అందకుండా పోతున్నందుకు."
    
    "షటప్!" పట్టించుకోకుండా వెళ్ళిపోవాలనుకున్న ప్రణయ బుద్ది చెప్పిగాని వెళ్ళకూడదనుకుందిక్కడే- "సభ్యత లేకుండా మాట్లాడకు."
    
    "మకాం మార్చి మరీ ఆదిత్యని గదికి రప్పించుకుంటున్న నువ్వు సభ్యత గురించి మాట్లాడకు."
    
    "నేను గదికి రప్పించుకుంటున్నాను కాని నువ్వే అతనివెంట పడుతున్నావుగా, అంటే నీకంటే నేను స్టేటస్ మెయిన్ టెయిన్ చేస్తున్నట్టే."
    
    "స్టేటస్ గురించి నువ్వు నాకు చెప్పనవసరంలేదు ప్రణయా! నేనీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతుర్ని."
    
    "ఆ స్టేటస్ ఉపయోగపడేది ప్రొఫెసర్ రాధాకృష్ణలాంటి వాళ్ళను ఇన్ ఫ్లుయెన్స్ చేసి క్విజ్ పోటీలలో నెగ్గటానికి మాత్రమే ప్రబంధా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS