Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 70


    ప్రబంధకీ అభియోగం తగలకూడని చోటనే తగిలింది "స్టేటస్ వుండబట్టే ఆ పోటీని రద్దు చేయించగలిగాను."
    
    "అందుకే ఇప్పుడు గెలవలేనన్న భయంతో ఆదిత్యని ట్రాప్ చేస్తున్నానను కుంటాను."
    
    "ప్రణయా!"
    
    "అరవకు ప్రబంధా! నేనన్నది నూరుపాళ్ళ నిజం."
    
    "అసలు ఆదిత్య నీతో కలిసి నాతో పోటీకి సిద్దపడితేగా?"
    
    "పడదని ఎందుకనుకుంటున్నావ్?"
    
    "ఆదిత్య ఇప్పుడు నా మనిషి కాబట్టి."
    
    "కలగంటున్నావా?" వ్యంగ్యంగా నవ్వింది ప్రణయ- "ఆదిత్య నాతో కలిసే పోటీకి కూర్చుంటాడు."
    
    "నువ్వూ కలగంటున్నా వనుకుంటాను!"
    
    "చూస్తావుగా!"
    
    ప్రణయ గొంతులో ధ్వనించిన నమ్మకానికి చాలా ఆందోళనపడి పోయింది ప్రబంధ. "ఆదిత్య ముమ్మాటికీ నా మనిషే, నాతో వుంటాడు. నాతో కలిసి పోటీకి వస్తాడు తప్ప నాకు ప్రత్యర్ధి కాలేడు."
    
    "ఏమిటి నీకా నమ్మకం?"
    
    జవాబు చెప్పలేకపోయింది ప్రబంధ.
    
    "అలా నీకు మాటిచ్చాడా?"
    
    "ఇవ్వలేదు కాని తీసుకుంటాను."
    
    "మనిషినా, మాటనా?"
    
    "రెండింటినీ."
    
    "అంత తెలిసిన అమ్మాయివి కాదు నువ్వు."
    
    "ప్రణయా!" ఉక్రోషంతో ప్రబంధ కళ్ళు నీటిని చిమ్మేట్టున్నాయి. "నా తెలివేమిటో నువ్వూహించలేవు."
    
    "అవసరం లేదు. ప్రొఫెసర్ రాధాకృష్ణతో కలిసి చేసిన మానిపులేషన్ ముందే గ్రహించానుగా!"
    
    "అదే నా లక్ష్యమయితే మళ్ళీ పోటీ ఏర్పాటు చేయించేదాన్ని కాదు."
    
    "ఏర్పాటు చేయించగలిగిన నువ్వు మళ్ళీ గెలుపుకే ఏర్పాటు చేయించుకో గలవు."
    
    "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. దమ్ముంటే ఆదిత్యని నా నుంచి గెలుచుకో."
    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    
    "గెలుచుకోవడమా?" విస్మయంగా చూసింది ప్రణయ. "ఇదేం స్వయంవరం కాదే."
    
    "కాకపోయినా నీకు చేవుంటే స్వయంవరంలా నాతో పోటీపడు. నన్ను గెలిచి అప్పుడు ఆదిత్యని సాధించుకో."
    
    "గెలుపంటే....ఎలా?"
    
    "లుక్ మిస్ ప్రణయా! యూనివర్శిటీలో పోటీ మొదలుకావటానికి వారం రోజులు టైముంది. ఈలోగా నువ్వు నాతో వ్యక్తిగతంగా పోటీపడి క్విజ్ కాంపిటీషన్ లో గెలవాలి. అలా గెలిస్తే ఆదిత్య నీ వాడవుతాడు. నువ్వు ఓడితే ఆదిత్య నా మనిషిగా నాతో కలిసి పోటీకి సిద్దపడతాడు."
    
    బాగుందీ ప్రపోజల్ నిజానికి ప్రణయ ప్రబంధతో పోటీకి సిద్దపడాల్సిన అవసరంలేదు. కాని ప్రణయకి ప్రబంధ అహాన్ని చల్లార్చాలనిపించే ఆలోచన ఒక్కటే కాదు, ప్రబంధకి అలా శాశ్వతంగా బుద్ది చెప్పాలనిపించింది.
    
    "వెల్ కం మిస్ ప్రబంధా! ఈ పోటీకి నేను అంగీకరిస్తున్నాను. మరి ఆదిత్య కూడా అంగీకరించాలిగా?"
    
    "ఇది ఆదిత్యకి తెలియాల్సిన ఆగత్యం లేదు."
    
    "వెరీగుడ్!" ఈ ఐడియా కూడా బాగుంది" సాలోచనగా అంది. "మరి మన మధ్య పోటీ జరిగేదెప్పుడు?"
    
    "నీ ఇష్టం."
    
    "రేపు సాయంకాలం."
    
    "ఓ.కే."
    
    "క్విజ్ మాస్టర్ గా కాదు, న్యాయనిర్ణేతగా ఎవర్ని పిలుద్దాం?"
    
    "అది నీ ఇష్టమే."
    
    "ఆదిత్యనే రప్పిద్దాం" ప్రపోజ్ చేసింది ప్రణయ "అంటే మన పోటీని మనం పోటీపడే ఆదిత్య పర్యవేక్షిస్తాడు. మన ఇద్దరిలో ఎవరమేమిటో తేలిపోయాక ఓడినవాళ్ళు రేస్ లో నుంచి తప్పుకుంటారు."
    
    "సరే!" అంగీకరించింది ప్రబంధ.
    
    ఆ సాయంకాలం ఆదిత్యని కలుసుకున్న ప్రణయ, మరుసటిరోజు తన ఇంట్లో ప్రబంధతో తన కాంపిటీషన్ గురించి చెప్పి, న్యాయనిర్ణేతగా ఆహ్వానించింది.
    
    కాదనలేకపోయాడు ఆహ్దిత్య. ప్రణయని ఇంటి దగ్గర కలుసుకోటానికి అదో అవకాశమనుకున్నాడు తప్ప పర్యవసానాన్ని వూహించలేకపోయాడు.
    
    ఆదిత్యే కాదు, ప్రణయ కూడా ప్రబంధ గురించి తక్కువగా అంచనా వేసింది. ప్రబంధ పరిమితుల గురించి ఆలోచించి పోటీకి సిద్దపడిన ప్రణయకి తెలీదు సౌదామిని అనే మరో వ్యక్తి పాత్ర గురించి.
    
    ప్రబంధని ఇలాంటి పోటీకి ప్రోత్సహించిన సౌదామినే తిరుగులేని ఓ క్విజ్ క్వశ్చనీర్ ని సంపాదించింది- అదీ ఆదిత్యని కంగారుపెట్టగలిగిన రోహిత్ నుంచే...
    
                                                          * * *
    
    సాయంకాలం ఆరుగంటల సమయం సింధూరాంబరంలో చిక్కిన సూర్యుడు అస్తమించిన అరగంటకి ప్రణయ ఇంట్లో సమావేశమయ్యారు ప్రణయ, ప్రబంధ.
    
    దూరంగా వినిపిస్తున్న సముద్రపు హోరు.
    
    ప్రణయలో సన్నని అలజడి.
    
    నిన్నగాక మొన్న రోహిత్ ని న్యాయబద్దంగా వదిలించుకోడానికి ఆదిత్యని పోటీకి సిద్దం చేసి విజయం సాధిస్తే, ఇప్పుడు ఆదిత్య కోసం ప్రబంధతో తానే పోటీకి సిద్దపడుతూంది.
    
    అది అహమో, లేక తనమీద తనకున్న నమ్మకమో ప్రబంధ మాత్రం ప్రశాంతంగా కూర్చుని వుంది ప్రణయకి అభిముఖంగా.
    
    సోఫాలో సెటిలైన ఆదిత్య ప్రారంభం కాబోతున్న పోటీకి న్యాయనిర్ణేతలా నిశ్శబ్దంగా చూస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS