Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 68


    ప్రబంధ మొండిదానిలా ఆలోచించడం సౌదామినికి ఆనందమని పించింది. ఈరోజు శౌరి జోక్యం ఆదిత్యపైన ఆమెకుగల యిష్టాన్ని మరింత పెంచిందని గ్రహించిన సౌదామిని, నిజానికి కోరుకుంటున్నది ప్రబంధ అలా ప్రవర్తించటాన్నే.
    
    అహాన్ని గాయపరిస్తే తప్ప ప్రబంధ తనవాళ్ళకి తలనొప్పిగా మారే అవకాశం లేదు.
    
    "బహుశా ప్రణయ గురించి కలవరపడుతున్నావనుకుంటాను" సౌమ్యంగా అడిగింది సౌదామిని... "కదూ?"    
    
    "అవును ఆంటీ!" ఉన్నట్టుండి ప్రబంధ ముఖం వివర్ణమైపోయింది. "ప్రణయతో కలిసి ఆదిత్య నాకు పోటీగా నిలవటాన్ని వూహించలేకపోతున్నాను."
    
    అలాంటప్పుడు ఆదిత్యతో నువ్వు కలిసి పోటీకి సిద్దపడటం బాగుంటుందిగా?"
    
    అర్ధంకాలేదు ప్రబంధకి.
    
    "అవును ప్రబంధా! ఆదిత్య నీవాడు. ప్రణయనుంచి దూరం జరిగి నీ మనిషిగా ఓ జీవితకాలం నడవాల్సిన వ్యక్తి నీతోకాక ప్రణయతో కలిసి కూర్చుని పోటీకి రావడమేమిటి?"
    
    "కాని ఎలా?" సంశయంగా అడిగింది ప్రబంధ. "ప్రణయను కాదనలేడేమో?"
    
    "అంటే నీ ప్రేమ మీద నీకే నమ్మకం లేదన్నమాట."
    
    నమ్మకం లేనిది తన ప్రేమ మీద కాదు. ఆదిత్యకు తనపైన వున్న ప్రేమ మీద. అయినా ఆ నిజం సౌదామిని ముందు వ్యక్తం చేయటానికి అహం అడ్డుపడిందేమో, నెమ్మదిగా అంది ప్రబంధ- "పూర్వం ఆదిత్య సెమీ ఫైనల్స్ లో నాతో పోటీపడింది ప్రణయతో కలిసిగా! ఇప్పుడామెను విడిచి నా పక్కన చేరమనడం బాగుంటుందా అని."
    
    నవ్వేసింది సౌదామిని. "తప్పేముంది ప్రబంధా! ఇంతకాలం ప్రణయ పక్కన ఉన్న మగాడే తప్ప పకక్మీదికి వెళ్ళినవాడు కాదుగా? ఏమిటి గ్యారంటీ అనకు అలాంటివాడే అయితే ఇప్పుడు నీతో ప్రేమకు సిద్దపడేవాడు కాడు. ఎందుకంటే ప్రణయ కూడా అందగత్తే కాబట్టి."
    
    'పక్కన చేరమనడం' అంటూ తను అసంకల్పితంగా ఓ మాట అన్నందుకు సౌదామిని పక్కల గురించి మాట్లాడ్డం నచ్చలేదు ప్రబంధకి. అయినా ఆంటీ ఎప్పుడూ ఇంతే అని సరిపెట్టుకుంది. నిజానికి కోపమంటూ వస్తే అందుక్కాదు- ప్రణయ కూడా అందగత్తే అన్నందుకు.
    
    "ప్రణయ అందం గురించి నేను సర్టిఫికెట్ ఇవ్వడం నీకు నచ్చలేదేమో కదూ?"
    
    ఉలిక్కిపడటమే కాదు. తన మనసులోని భావాన్ని అంత ఖచ్చితంగా చదివేసినందుకు సౌదామిని మేధను లోలోనే అభినందించింది. "అది కాదు ఆంటీ! ఆదిత్యని ప్రణయనుంచి ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తున్నాను."
    
    "నీ స్థానంలో నేనుంటే ఏం చేసేదాన్నో తెలుసా?"
    
    ఆసక్తిగా చూసింది ప్రబంధ.
    
    "నా మాట నిలబెట్టుకోటానికి, లేదూ కోరినవాడు నా కొంగుపట్టుకు తిరగటానికి నా సర్వస్వం అర్పించేసేదాన్ని అవును ప్రబంధా! మనసిచ్చిన మగాడికి శరీరం ఇవ్వడం తప్పుకాదు. ఎందుకంటే అందమైన ఆడపిల్ల అర్జెంటుగా ఆకట్టుకునేది దానితోనే కాబట్టి తప్పేమిటమ్మా? ఎప్పటికైనా ఆదిత్య నీ మనిషేగా?"
    
    మాటల్లో అపశ్రుతుల్ని సైతం అందంగా ధ్వనింపచేయగల సౌదామిని ప్రబంధనిక్కడ ఏ మార్గంలో వెళ్ళాల్సిందీ హిప్నాటిక్ సజెషన్ లా చెబుతూ కూడా తన వ్యక్తిత్వాన్ని సమర్ధించుకుంటూంది. "అలా అని నిన్ను ఆ పనికి పూనుకోమనడం లేదు ప్రబంధా! ఇందాక ఒంటరిగా ఆదిత్యతోబాటు ఇంటికి వెళ్ళినదానివి బెడ్ రూమ్ దాకా ఎందుకు వెళ్ళలేకపోయావూ- అని నిలదీయటంలేదు కూడా మాట వరుసకి అంటున్నాను అంతే. పంతం నిలబెట్టుకోవటానికి ఆ మాత్రం జారితేనేం అన్నది నా అభిప్రాయం."
    
    ప్రబంధ ముఖ కవళికల్ని ఏకాగ్రంగా గమనిస్తూ అంది సౌదామిని- "ఓ పని చెయ్."
    
    పడకదాకా వెళ్ళమనలేదు సౌదామిని- "ఆదిత్యని గెలుచుకో....."
    
    "ఎలా?"
    
    "పోటీలో."
    
    "అంటే?"
    
    "ప్రణయతో పోటీకి సిద్దపడి."
    
    "అర్ధం కావటం లేదు!"
    
    "నీకు ప్రత్యర్ధి స్థానంలో ఆదిత్య కూర్చోకూడదు ప్రబంధా. ప్రణయ పక్కన కాక నీతో కలిసి సిల్వర్ స్పాట్ కంపెనీ పోటీలకి సిద్దపడాలి."
    
    "కాని ఎలా?"
    
    "చెప్పింది సౌదామిని."
    
    ప్రణయ, ప్రబంధల మధ్య తిరుగులేని యుద్దానికి అంకురార్పణ జరిగిపోయిందిక్కడే.
    
                                                             * * *
    
    "హల్లో!"
    
    కారు దిగుతున్న ప్రణయని పలకరించాడు ఆదిత్య.
    
    రోహిత్ తో పోటీకి తలపడి విజయం సాధించింది మూడు రోజుల క్రితం అయినా ఆ తరువాత ప్రణయ ఆదిత్యని కలుసుకోలేదు సరికదా, కలవాలని ప్రయత్నిస్తున్నా తప్పించుకు వెళ్ళిపోతూంది.
    
    ప్రణయ ఎందుకిలా ప్రవర్తిస్తున్నదీ ఆదిత్యకి అర్ధం కావడం లేదు.
    
    ఆమె నుంచి అభినందన ఆశించాడో, లేక ఇక ఆదిత్య శాశ్వతంగా తనవాడే అన్న ఆలోచనల్ని ఆమె వ్యక్తీకరిస్తుంటే విని ఆనందించాలని అనుకున్నాడో స్పష్టంగా ఆదిత్యకీ తెలీదు. కాని ఇంతకాలం లేనిది ఇప్పుడు ప్రణయలో ఈ మార్పుని అంగీకరించలేకపోతున్నాడు.
    
    "వెళ్ళిపోతున్నారేం?" ఇంచుమించు అడ్డంపడుతున్నట్టు ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు ఆదిత్య.
    
    "క్లాసులు మొదలవుతాయి ఆదిత్యా!" ఏమీ జరగనంత మామూలు గానే జవాబు చెప్పింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS