నేను వెంకటలక్ష్మి పచ్చని చేతికున్న ఎర్రటి మట్టిగాజుల్ని చూస్తున్నాను. ఈ చేతుల్తో మజ్జిగ చిలుకుతూ, కూరలు తరుగుతూ, చైతన్య ముఖాన్ని సవరిస్తూ...ఊహలు అక్కడితో ఆపేశాను.
"అక్కా...నీపేరేంటీ?" అడిగింది.
"ఆముక్త"
"నువ్వు బాగా చదువుకున్నావంటగా"
"డిగ్రీదాకా చదవడం పట్నాల్లో మామూలే!"
"నువ్వు చాలా బావున్నావు!" నవ్వుతూ అంది.
"అంత కల్మషం లేకుండా నేను అనగలనా?"
ప్రేమా, స్నేహం, ఈర్శ్యా, దుఃఖం అన్నీ కలగలిపిన సామాన్యమైన ఆడపిల్లని నేను!
"చైతన్య చాలా మంచివాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి" అన్నాను.
"నాకు తెలుసు" అంది.
"ఎలా తెలుసూ?"
"కాణీ కట్నం లేకుండా నన్ను చేసుకుంటున్నారుగా" బుగ్గల్లో గులాబీలు పూయిస్తూ నునుసిగ్గుగా అంది.
"నాకా విషయం తెలీదు" అన్నాను.
"ఆయన దేవుడు" భక్తిగా అంది.
చైతన్య అదృష్టవంతుడు! నాలాంటి ఆడపిల్లని చేసుకుంటే యెప్పుడో అప్పుడు 'నువ్వు చదువుకోలేదు. నాకంటే తక్కువ!' అన్న భావం చూపించేస్తుంది. ఎదిగీ ఎదగని మనస్తత్వాలు మావి. ఇటు అమాయకత్వం అటు పరిపక్వం రెండూ లేని స్థితి ఎంత దారుణం!
అత్తయ్య ఎడమచేత్తోనో వెంకటలక్ష్మి తల నిమిరింది. పెద్ద గొలుసూ, పట్టుచీరా, జాకెట్టుబట్టా అమ్మచేత బొట్టుపెట్టించి యిప్పించింది.
అమ్మ నావేపు అదోరకంగా చూస్తూనే ఇవన్నీ చేసింది. అమ్మ నగలూ, ఆస్తీ ఇవేచూస్తోంది. అంతకన్నా విలువైన వ్యక్తినే నేను పోగొట్టుకున్నాను.
వెంకటలక్ష్మి ముందు హార్మనీ పెట్టి "పాడు...పాడు" అని వాళ్ళ పిన్నీ, అత్తయ్యా బలవంతం చేశారు.
పాత సినిమాలోలా తాటాకు చాపమీద హార్మనీపెట్టె పెట్టుకుని ఆమె కూర్చోవడం చూసి నాకు నవ్వొచ్చింది. చైతన్యవేపు చూశాను. నవ్వుతూ వినోదంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో చిరాకు మచ్చుకైనా లేదు!
వెంకటలక్ష్మి పాడుతోంది "నీ ఎదుట నేనూ...నా ఎదుట నీవూ...మా ఎదట నీవూ...మా ఎదట ఓ మామా ఎక్కడున్నావూ..."
మధురంగా వున్న ఆస్వరానికి నేను విస్మయమొందుతూ వింటున్నాను.
అత్తయ్యా, తాతయ్య కళ్ళల్లో ఆనందం.
"మగసిరిగల ఎడదని చూసీ...తలవాల్చగ అది చాలన్నానూ..."
నేను చైతన్య వంక చూశాను.
అతని కళ్ళల్లో, పెదవుల్లో అదే చిరునవ్వు!
పాట అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టారు.
నేను వెంకటలక్ష్మి చేతిని స్నేహంగా నొక్కి "చాలా బాగా పాడావు" అన్నాను.
ఆమె వెన్నెలారబోసినట్లుగా నవ్వింది.
మార్చి మాసంలో ముహూర్తం నిర్ణయించారు.
పరిహాసాలతో, పిండివంటలతో భోజనాలయ్యాయి.
అందరం తిరుగు ప్రయాణం అయ్యాము.
ఓ చిన్న పిల్లొచ్చి నా కొంగు లాగుతూ "లక్ష్మక్క లోపలికి రమ్మంది" అని గుసగుసలాడింది.
అమ్మతో "ఇప్పుడేవస్తా" అని చెప్పి లోపలికి వెళ్ళాను. వెంకటలక్ష్మి నేను గదిలోకి వెళ్ళగానే తలుపు వేసేసింది.
ఎందుకా అని నేను ఆశ్చర్యంగా చూస్తుండగానే ఒంగి నాకాళ్ళకి దణ్ణం పెట్టింది.
"అయ్యో! ఇదేమిటి లే...లే" అని లేవదీశాను.
ఆమె కళ్ళనిండా నీళ్ళతో "ఇదివరకు మావాళ్ళు అడిగితే వర్ధనమ్మత్త మేనరికం వుంది. బయట సంబంధాలు అఖ్కర్లేదు అని కరాఖండీగా చెప్పేసిందిట. ఇప్పుడు నువ్వు కాదన్నావు కనుకనేగా ఆయన నన్ను ఒప్పుకున్నదీ... అందుకు, నీకు రుణపడ్డాను" అంది.
నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి.
"నేను కాదనలేదు. తనే నిన్ను ఇష్టపడ్డాడు" అన్నాను. ఆమె నాకు అంతా తెలుసు అన్నట్లుగా నవ్వేసింది.
"వస్తా" అని తలుపు తీసుకుని వచ్చేస్తుంటే.
"పెళ్ళికి తప్పకుండా రావాలి" అంది!
"అలాగే" అన్నాను.
మరునాడు ప్రయాణమై నేనూ, అమ్మా, నాన్నా హైదరాబాదు వచ్చేశాం.
మమ్మల్ని రైలెక్కించడానికి వచ్చిన చైతన్య నాకు చాలా పరాయిగా అనిపించాడు.
* * *
ఇంటికి వచ్చినప్పటినుండీ లిల్లీ దగ్గరకు వెళ్ళడానికి నా హృదయం కొట్టుకులాడిపోతోంది.
అమ్మ నా పెళ్ళి గురించి దిగులుపడినట్లుంది. ఎంతసేపూ అదే ధోరణిలో మాట్లాడ్తోంది.
