తన చుట్టూవున్న ప్రపంచాన్ని కేజ్ లో బంధించి దశాబ్దాల చరిత్రతో తనకంటూ ఓ అస్థిత్వాన్ని సృష్టించుకున్న జయచంద్ర గుండెని కాపాడే 'రిబ్ కేజ్'ని తెరిచారు అనుభవనీయులైన థొరాసిక్ సర్జెన్లు.
రెండు ఊపిరితిత్తులకు సరిగ్గా మధ్య భాగంలో వున్న గుండెని దాని నుంచి రక్తాన్ని సరఫరాచేసి పెద్ద ఆర్డరీ 'AORTA'ని చూస్తూ ఉలికిపాటుగా ఆగిపోయాడు సర్జెన్.
AORTAకి పన్నెండు మిల్లీమీటర్ల దూరంలో ఎడమవేపు ఊపిరితిత్తిలో కనిపించింది వూండ్ ఆఫ్ ఎంట్రెన్స్. (తూటా ప్రవేశించిన గాయం)
సర్జెన్లిద్దరూ ఓ క్షణంపాటు ఒకరినొకరు చూసుకున్నారు.
ఎడమ ఊపిరితిత్తిలో స్పష్టంగా కనిపిస్తూంది ఓ మూల అమ్మ పొత్తిళ్ళలో ఒదిగిన పసికందులాంటి 'బుల్లెట్'
చాలా క్లిష్టమైన ప్రదేశమిది.
ఒకవేళ బుల్లెట్ ఆ పెద్ద ఆర్డరీకి తగిలి వుంటే ఈ పాటికే జయచంద్ర ప్రాణాలు పోయి వుండేవి.
అది కూడా కాదు ఆ క్షణంలో సర్జెన్లిద్దరూ సీరియస్ గా ఆలోచిస్తున్నది.
ఆ కొద్దిపాటి గేప్ లోనుంచి బులెట్ ని ఎలా బయటికి తీయాలా అని. ఒకవేళ 'ఆర్టా'కి ఏ మాత్రం నైఫ్ ఎడ్జ్ తగిలినా జయచంద్ర సర్జరీలోనే ప్రాణాలు వదులుతాడు.
డాక్టర్ల నుదుట చెమట పట్టేసింది. వ్యవధి లేదు. వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలి.
నిబ్బరాన్ని ఆయుధంగా మార్చుకుని తన శాసనాల్ని కవాటాలుగా ఏర్పరచుకుని బ్రతికిన జయచంద్ర గుండె నీరసంగా కొట్టుకుంటూ ఇంకా తను ఓడిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూంది.
హోంమినిస్టర్ సదాశివయ్య వచ్చి హాస్పిటల్ సూపరింటెండెంట్ గదిలో వెయిట్ చేస్తున్నాడు.
తెల్లవారుఝామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో డాక్టర్స్ టీమ్ బయటికి వచ్చింది.
అంతసేపూ వెయిట్ చేస్తున్న పత్రికా విలేకర్లు వాళ్ళని చుట్టుముట్టారు ప్రశ్నల వర్షం కురిపిస్తూ.
ఓ సర్జెను చెప్పాడు వివరంగా "గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే అతి పెద్దనాళం AORTAకి సమీపంలోని ఊపిరితిత్తిలో వున్న బులెట్ ని బయటికి తీసే అవకాశం లేకపోయింది"
"అయితే అలాగే విడిచిపెట్టారా"
"తప్పదు. తూటా బయటికి తీసే ప్రయత్నంలో AORTAకి గాయమైతే ఆయన బ్రతకడు. అందుకే అలా వదిలిపెట్టి చెస్ట్ క్లోజ్ చేశాం"
"ప్రమాదం కాదా"
"అఫ్ కోర్స్... ప్రమాదమే. బ్రతికినంత కాలం బెడ్ పైనే వుండాలి మరే పని చేయకుండా."
"ఎంత కాలమైనా అలా వుండొచ్చా"
"మహా అయితే కొన్ని వారాలు. ఈలోగా ఎలాంటి టెన్షన్ కలిగినా ఆయుష్షు రోజుల్లోకి దిగిపోతుంది. మా అంచనా ప్రకారం ఆయన బ్రతికేది ఆరేడు వారాలు. ఇట్స్ పిటీయబుల్ సిట్యుయేషన్.
ఈ చర్చ ఇలా జరుగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన డిజిపిని నిలదీశారు విలేకర్లు నేరస్థుడి వివరాలు తెలియపరచమంటూ.
"డిసిపి అవినాశ్ ఆధ్వర్యంలో ఓ బృందం ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సాయంత్రానికల్లా డిటైల్స్ అందించగలనన్న నమ్మకముంది."
అప్పుడు ఉదయం ఆరు గంటలవుతూంది.
సరిగ్గా ఇదే సమయంలో...
శశాంక కృప ఫోటోముందు నిలబడి వున్నాడు నిర్లిప్తంగా.
ఒక కసి తీరిన సంతృప్తో లేక నిన్న మొన్నటి స్మృతుల క్రీనీడల ఒరిపిడితోనో అతడి నేత్రాలు సజలాలై వున్నాయి.
"కృపా", ఆర్ద్రంగా వణికిందతడి గొంతు" ఎందరు కారుణ్యమూర్తులతోనో రూపుదిద్దుకున్న నేను ఇదిగో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మార్గంలో అడుగుపెట్టాను. నిన్ను నాకు దూరం చేసిన శతృవుపై బలమైన దెబ్బ తీశాను. నాకు తెలుసు దీన్ని నువ్వు హర్షించవని. కాని ఏం చేయను. నువ్వు లేక ఏకాకినైపోయాను. నువ్వు మిగిల్చిన స్మృతులు నా మనసును కొలిమిగా మార్చితే ఇన్నాళ్ళకి యిలా చల్లార్చుకోవాలని ప్రయత్నించాను. వెర్రివాడ్నని వెక్కిరించకు. ఇవి కన్నీళ్ళు కావు కృపా. నీ ఆత్మని అభిషేకించే ఆఖరి నీటిబొట్లు. ఒట్టు. ఇదే చివరిసారి రేపు నాకేమన్నా కాని సంతృప్తిగా బ్రతుకు నాలోచిస్తాను తప్ప నీ కోసమే పదిలపరుచుకున్న అశ్రువుల్ని అస్సలు వృధాచేయను. నిజం."
తేరుకున్నాడు ఫోన్ రింగవుతూంటే.
ఎంత ఉద్విగ్నంగా వుందని. శశాంక చూపులో నిన్నటికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పిన ఓ ఆశావాదిలోని అసాధారణమైన మెరుపు.
తానా క్షణంలో అనుభవిస్తున్నది ఆనందమే అయితే అది మరెవరితోనైనా పంచుకోవాలన్నంత ఉత్సుకత. రిసీవర్ అందుకున్నాడు.
"యస్ ప్లీజ్"
"కంగ్రాట్స్"
"ఎవరు మాటాడుతున్నది" సోఫాలో కూర్చున్నాడు రిలాక్సింగ్ గా.
"నేనే" ఆ గొంతులోని మత్తుని మార్దవాన్ని బట్టి ఆమెను సోఫియాగా గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
"వెల్. నిన్నరాత్రి నీ ఆయుధం అద్భుతంగా స్థలించి ఒక పెద్ద శతృవుని మట్టి కరిపించింది." సోఫియా కంఠంలో భావప్రాప్తి పొందిన ఓ యువతి స్వరంలోని లాలిత్యం.
