Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 67


    "ప్రబంధా!" శౌరి కేకతో ఆ గది ప్రతిధ్వనించింది.
    
    "ఇంకా నేనిలాగే మాట్లాడకూడదూ అనుకుంటే మర్యాదగా వెనక్కి రా!" అంది.
    
    "రాకపోతే?"
    
    "నాకూ, ఆదిత్యకీ అక్రమసంబంధముందని నేనే యూనివర్శిటీ గోడలమీద రాయించాల్సి వుంటుంది."
    
    అదిరిపడ్డాడు శౌరి.
    
    "వెళ్ళిపోదాం రా అన్నయ్యా!" భావరహితంగా అంది ప్రబంధ. "నీ మొండితనాన్ని ప్రదర్శించి బలహీనుడివైపోకు.... బయలుదేరు."
    
    తల కొట్టేసినట్టయింది శౌరికి. ఉక్రోషంగా బయటికి నడిచాడు.
    
    ఒకే కారులో కాదు, వేర్వేరు కార్లలో ఇద్దరూ బంగళాకి తిరిగి వచ్చారు. సుధీర్ ఇంతకుముందే జారుకున్నాడు పరిస్థితి గమనించి.
    
    ప్రబంధ నిర్లక్ష్యంగా తన గదిలోకి నడవబోతుంటే ఆవేశంగా పిలిచాడు శౌరి- "ఆగు".
    
    "చెప్పు" యధాలాపంగా అడిగింది.
    
    "నీ ప్రవర్తన నాకేం నచ్చడంలేదు."
    
    "ఏ విషయంలో?"
    
    "నువ్వు వయసులో వున్నదానివి."
    
    "సో వాట్?"
    
    "అలా పరాయి మగాడితో..."
    
    "అన్నయ్యా!" ప్రసన్నంగానే అంది ప్రబంధ- "పరాయి మగాడైనా ఇప్పటిదాకా వట్టి స్నేహితుడు మాత్రమే. ఇంకా నువ్వనుకున్నంత దూరం వెళ్ళలేదు మాపరిచయం ఇకముందు వెళ్ళదని గ్యారంటీ కూడా లేదు. అంటే వెళ్ళినా నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు."
    
    "ప్రబంధా!" అరిచాడు శౌరి.
    
    "ఆవేశపడకన్నయ్యా! ఆదిత్య నాకు స్నేహితుడు. ఇంకా చెప్పాలీ అంటే నేను కోరుకున్న వ్యక్తి కంగారుపడకు. రేపో మాపో ఇదే నిజాన్ని డాడీకి సైతం చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి నీ ప్రతాపాన్ని ఆదిత్య దగ్గర చూపించి నన్ను రెచ్చగొట్టకు."
    
    బోధపడిపోయింది శౌరికి. చాలా దూరం మాత్రమే కాదు- ఆదిత్య, ప్రబంధల స్నేహం ప్రబంధని వెనక్కి రప్పించలేనంత దూరం వెళ్ళిపోయిందని.
    
    వాగ్వివాదం కొనసాగితే ఇంకా ఏం చేసేదీ చెప్పడం మాత్రమేగాక ఆ చెప్పింది ఆచరించడానికి వెనకాడదు ప్రబంధ. దేనికీ భయపడని ప్రబంధని చెక్ చేయాల్సింది ఇలా కాదు. అందుకే మనసు మండిపోతున్నా నిగ్రహించుకున్నాడు.
    
    "ప్రబంధా!" బుద్దిమంతుడైన బాధ్యతగల అన్నయ్యలా చెప్పాడు- "నేను నిన్ను శాసించగలవాడిని కాకపోవచ్చు. కాని డాడీ నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు."
    
    "నీ మీద కూడా."
    
    "నేను చెడిపోవడం లేదు" గిల్టీగా అన్నాడు.
    
    "కాలేజీ ఎగ్గొట్టి బార్లకి తిరగడాలూ, ఇంటిలోనే లిక్కర్స్ సెషన్స్ ఓపెన్ చేయడాలూ చెడిపోవడం కాకపోతే, ఆదిత్యలాంటి సంస్కారవంతుడితో నేను ఒంటరిగా గడపడమూ చెడిపోవడం కాదు."
    
    నవ్వేశాడు మృదువుగా "నీతో నేను మాట్లాడలేను ప్రబంధా! కాని నువ్వో విషయం మరచిపోతున్నావ్."
    
    "ఏమిటది?"
    
    "ఆదిత్య నీ ప్రత్యర్ధి ఒకప్పుడు పోటీలో నిన్ను ఓడించినవాడు. రేపు నువ్వు పోరాటానికి సిద్దపడాల్సినవాడు. అవును ప్రబంధా! సిల్వర్ స్పాట్ కంపెనీ నిర్వహించే పోటీకి అర్హతను సంపాదించుకునే జంటకోసం యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మరో పదిరోజుల్లో మీ అందరికీ క్విజ్ కాంపిటేషన్స్ కండక్టు చేయబోతున్నాడు. నువ్వు, సుధీర్ కలిసి మరోసారి ప్రణయ, ఆదిత్యల్ని ఓడించబోతున్నారు. అలాంటివాడితో నీకు స్నేహమేమిటి?"
    
    ప్రబంధ జవాబు చెప్పలేదు. పదిరోజుల్లో జరగబోతున్న క్విజ్ కాంపిటేషన్ విషయం ఆలోచిస్తూంది.
    
    "నమ్మలేకపోతున్నావా ప్రబంధా? ఈరోజే తెలిసిందీ విషయం. నిజానికి మొన్నటి పోటీని రద్దు చేయించింది నువ్వే కాబట్టి ఈసారి న్యాయబద్దంగా ఆదిత్య, ప్రణయలపైన నువ్వు గెలుపు సాధించాలి" క్షణమాగేడు. "ఒకవేళ ఇప్పుడు నువ్వు ఆదిత్యతో చనువుగా వుండటం ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? భయపడి అతడితో చేతులు కలపాలని ప్రయత్నిస్తున్నావంటారు."
    
    ప్రసక్తిని మరో దోవలోకి మళ్ళించిన శౌరి ఆలోచన తప్పుకాలేదు. ప్రబంధ నిజంగానే సందిగ్ధతలో కూరుకుపోయింది.
    
    ప్రణయతో కలిసి ఆదిత్య మరోసారి తనకు ప్రత్యర్ధిగా రంగంలోకి దిగుతాడా? అదే నిజమైతే ఇప్పుడు తానేం చేయాలి? మానసికంగా అతడికింత చేరువయ్యాక ఇప్పుడు ఆదిత్యతో తను పోటీకెలా సిద్దపడగలదు?
    
    ఆదిత్య కోసం ఆదిత్యకింకా దగ్గర కావడం కోసం తను ఓడిపోవటానికి సిద్దమే కాని, ప్రణయ మాటేమిటి?"
    
    చిత్రమైన కలవరపాటు డిన్నర్ పూర్తిచేశాక బడలికగా బెడ్ పై పడుకుని ఇదే విషయం ఆలోచిస్తూ వుండిపోయింది అపరాత్రిదాకా ఈ సమస్యనెలా పరిష్కరించాలో అర్ధం కావడంలేదు.
    
    ఏదో అలికిడయింది గదిలో.
    
    "నిద్రపోలేదూ?" సౌదామిని వచ్చి బెడ్ అంచున కూర్చుని ఆప్యాయంగా ప్రబంధ తల నిమిరింది. "ఏమిటమ్మా! ఏమిటి ఆందోళనపడుతున్నావ్? ఇందాక మీ అన్నయ్య మాటల గురించేనా? చెప్పానుకదే పిచ్చిపిల్లా.... ప్రతి ప్రేమకథకీ ఇలాంటి అవాంతరాలు తప్పవు."
    
    "అదికాదు ఆంటీ..." ప్రబంధ గొంతు పూడుకుపోయింది.
    
    "నాకు తెలుసు ప్రబంధా! నీకూ, ఆదిత్యకీ పెరిగిన పరిచయం గురించి మీ అన్నయ్యకి తెలిసిపోయింది. బహుశా అదే నిన్ను ఎక్కువ కలవరపెడుతూంది."
    
    "అదే అయితే అన్నయ్యని మాత్రమేకాదు ఆంటీ, మా డాడీనైనా ఎదిరిస్తాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS