Previous Page Next Page 
ఆలింగనం పేజి 67


    తలవంచుకుని చేతిగోళ్ళవైపు చూస్తుండిపోయాను.

 

    "మావయ్యా, తాతయ్య కూడా ఉండగానే ఆ ప్రధాన కార్యక్రమం జరిపిస్తే మంచిదని ఆ ఆత్రేయపురం వాళ్ళకి కబురు పెట్టాను. బహుశా సాయంత్రానికి మధ్యవర్తి వెంట బెట్టుకుని వస్తాడు" అన్నాడు.

 

    ఎందుకో గుండెల్లో ఏదో గుచ్చుకున్న భావన! ఇక ఈ చైతన్య నాకేమీకాడు కాబోలు.

 

    "అమ్మాయి పేరేమిటి?" అడిగాను.

 

    "వెంకటలక్ష్మి."

 

    చైతన్య వెంకటలక్ష్మి మొగుడు! ఇంక నాతో ఇలా కబుర్లు చెప్పే హక్కు కూడా ఉండదు. ఒద్దనుకున్నాక మళ్ళీ ఇదేమిటి? ఎందుకీ బాధ? అయినా నేను ఇలా కోరుకోవడంలో న్యాయంలేదు. పెళ్ళి చేసుకోవడానికి పనికిరానివాడు కబుర్లు చెప్పడానికి మాత్రం పనికివస్తాడా? ఈ చైతన్యనే చింపిరితలవాడనీ, పెళ్ళి చేసుకుంటే పేడతో వాకిళ్ళు అలకాల్సొస్తుందని ఏడ్చాను...ఇప్పుడు ఎందుకు అతను దూరం అవుతున్నాడని ఫీలింగ్!

 

    పూలవానల్లా అతను చెప్పే కబుర్లు నన్నెందుకు అలరిస్తున్నాయి? తెల్లవారుజామున వీచే చలిగాలిలో అతని పక్కనుంటే ఎందుకీ వణుకు? ప్చ్! ఈ వయసు ఇంతేనేమో...ఎవరయినా తలుపు అవతల నిలబడితే రమ్మని పిలవాలనిపించే గృహస్తులా మనసు ఉబలాటపడ్తుంది.

 

    అతనితో మాట్లాడ్తుంటే, అతనికి తెలిసిన సంగతులు వింటూ ఉంటే నా చదువు యూనివర్శిటీ పరీక్షలకి తప్ప పనికిరాదని తెలిసింది. అతనిది ప్రపంచ జ్ఞానం. అన్నీ తెలిసినా అణిగిమణిగే ఉంటాడు. ఎంత దయగల కళ్ళు? హృదయంలోంచి చొచ్చుకుపోయి చూస్తుంటాయి!

 

    వెంకటలక్ష్మి చాలా అదృష్టవంతురాలు.

 

    సాయంత్రానికి టాక్సీలో ఆత్రేయపురం నుండి పెళ్ళివారు వచ్చారు. నన్ను చూసి అత్తయ్య సంజ్ఞలతో, ఇదంతా నీకు చెందవలసిన ఆస్తి, చెయ్యి జారిపోతోందని దిగులుగా కంటనీరు పెట్టింది.

 

    "నాలికకి రాసిపెట్టి లేకపోతే చేతిలోది నోటిదాకా వచ్చేలోగా నేల పాలయిపోతుంది అక్కా! దానికి రాసిపెట్టి లేదు" అన్నాడు నాన్న.

 

    చైతన్య కొత్తబట్టల్లో పెళ్ళికొడుకులా వున్నాడు. పురోహితుడు తంతు క్లుప్తంగా జరిపించాడు.

 

    చైతన్యతరపున నాన్నగారే తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ తర్వాత భోజనాలై, మర్నాటి విందుకు మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు వెళ్ళిపోయారు.

 

    నాకెందుకో దిగులుగా అనిపించింది. దగ్గరలోవున్న వేణుగోపాలస్వామి కోవెలకి వెళ్ళి కోనేటిగట్టుమీద కూర్చున్నాను.

 

    కప్పల బెకబెకలు తప్ప చుట్టూ అలికిడిలేదు. నల్లని నీళ్ళల్లో విచ్చుకున్న తెల్లని కలువలని చూస్తూ నీళ్ళల్లోకి రాళ్ళు విసుర్తున్నారు. ప్రతి రాయికీ కొలను అలజడి చెందుతోంది. కన్నెపిల్ల హృదయంకూడా ప్రతిమనిషి ఆగమనంతోటీ కలవరం చెందుతుందా!

 

    చుట్టుప్రక్కల అంతా నిశ్శబ్దం. పూలపరిమళాలు తాగి మత్తెక్కి చెట్లల్లో తూలుతోంది గాలి! చీకటి పిలవని పేరంటంగా వచ్చేసింది. చంద్రుడు నీళ్ళల్లో జారిపడ్డాడు... కలువలు కళ్ళిప్పి నవ్వుతున్నాయి.

 

    "ఆముక్తా...ఆముక్తా..." దూరంగా చైతన్య గొంతు.

 

    'ఓయ్' అని బదులివ్వాలనిపించలేదు.

 

    అలాగే కదలకుండా కూర్చున్నాను. అతను వెతుక్కుంటూ నాదగ్గరకి వచ్చాడు. చేతిలో టార్చ్ లైట్!

 

    నా మొహంలో ఎంత వెతికినా వెలుతురు లేదు!

 

    "ఇక్కడున్నావా? అందరం ఎంత కంగారుపడ్డామో తెలుసా?" కోపంగా అడిగాడు.

 

    "చైతన్యా...వెంకటలక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రేమించగలవా?" అతన్నే చూస్తూ అడిగాను.

 

    అతను నవ్వి "ఇప్పుడు ఆ సంగతి ఎందుకు కానీ...పద...ఇంటికి రా!" అన్నాడు.

 

    "ఒకప్పుడు నన్ను ప్రేమించానన్నావుగా!" అన్నాను.

 

    "అన్నాను."

 

    "మరి ఈ పెళ్ళికి ఇంత సంతోషంగా ఎలా ఒప్పుకున్నావు?" అడిగాను.

 

    "అన్నీ మనకోసమే చెయ్యము" తలవంచుకుని నా పక్కన కూర్చుంటూ అన్నాడు.

 

    "ఇప్పుడు నిన్ను పెళ్ళిచేసుకోవడానికి నేను ఒప్పుకుంటే...చేసుకుంటావా?" ఒక్కొక్క అక్షరమే వూపిరి బిగబట్టి అడిగాను.

 

    "ముక్తా!" అతని కళ్ళల్లో ఆశ్చర్యం.

 

    "చెప్పు" రెట్టించాను.

 

    చైతన్య నావేపు జాలిగా చూశాడు.


                                                         *  *  *


    మరునాడు వెంకటలక్ష్మి ఇంటికి విందుకి వెళ్లాము.

 

    ఆమె పసుపుపచ్చ పట్టుచీరలో బంతిపువ్వులా కూర్చునుంది. చిన్న చిన్న కళ్ళు...నవ్వితే మొహమంతా పరుచుకునే నవ్వే సొట్టబుగ్గలూ.

 

    రాత్రి చైతన్య అన్నమాటలు గుర్తొచ్చాయి!

 

    'ఇప్పుడు నువ్వు నన్ను చేసుకుంటానన్నా నేను ఒప్పుకోనులే ముక్తా! ఒప్పుకుంటే అది స్వార్థం అవుతుంది. నాకు అమ్మ జీవితాన్నిచ్చింది. అనాధ బ్రతుక్కి వెలుగునిచ్చింది. అటువంటి అమ్మకి సేవ చెయ్యడం నీలాంటి చదువుకున్న బస్తీపిల్ల చెయ్యలేదు.

 

    అమ్మ ఈ పల్లె వదలలేదు. నువ్వు సరదాకి నాలుగునాళ్ళే కానీ పూర్తిగా ఈ పల్లె పట్టున ఉండలేవు. చల్లకవ్వం తిప్పుతూ, జీతగాళ్ళకి చద్ది అన్నం పెడుతూ, ఊరగాయముక్కలు ఆరబోస్తూ...నిన్ను ఊహించుకోలేను! నువ్వంటే బోలెడు ప్రేమ" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS