ఉరితీయబడ్డ శిరస్సు చెప్పే చివరి రహస్యంలా ఆ అర్థరాత్రివేళ గాలి గుసపెడుతూంది.
మొన్నటి బ్రతుకు పాటకి నిన్నటి గాయం పల్లవికాగా ఇప్పుడో చరణంతో రణానికి సిద్ధపడుతున్నట్టుగా.
శతకోటి పీడిత జన గుండె కెరటాల హోరును రుచిర స్వప్నపు సమాధుల్లో దాచుకున్న వెలుగు సంద్రంలా జయచంద్ర భవంతి మెర్క్యురీ వేడరీ కాంతిని వెదజల్లుతూంది.
మృత్యుద్వారంలాంటి కిటికీకి అభిముఖంగా కూర్చున్న జయచంద్ర నేలకి నలభై అడుగుల ఎత్తులో నిర్మాణం పూర్తికాని, ఎదురుగా వున్న ఎపార్ట్ మెంట్ ను చూడడం లేదు.
ఫంక్షన్ నుంచి సరాసరి తన ఇంటికి వచ్చిన సదాశివయ్యతో సీరియస్ గా మాట్లాడుతున్నాడు.
"నాకు కనిపించింది ప్రసాదు కాదు సదాశివయ్య శశాంక. అసలు ఎప్పుడో చచ్చిన ప్రసాదు అక్కడికి రావడమేమిటి" జయచంద్ర అన్నాడు విసుగ్గా.
"ప్రసాదు నిజంగా చచ్చాడా అని" సదాశివయ్య అనుమానాన్ని ప్రకటించాడు. ఇలా మాటాడి జయచంద్ర మేధస్సుని శంకించాననుకున్నాడేమో వెంటనే తనను తాను సమర్థించుకున్నాడు. "అది కాదు జయచంద్రా! సాగర్ ని చంపించింది నువ్వే అన్న సత్యం బయటికి రాకుండా ప్రసాదుని సర్కార్ చేత హత్య చేయించావు. ప్రసాదు పరారీలో వున్నాడని పోలీస్ రికార్డ్స్ లో కెక్కించి సాగర్ హత్యకి ఓ అందమైన ముగింపు పలికావు. మరి నాకు ప్రసాదు ఫోన్ చేయడం మాటేమిటి... శశాంక ఒక వేళ..."
"ఇంపాసిబుల్" అసహనంగా అన్నాడు జయచంద్ర "ప్రసాదు హత్య సంగతి తెలిసింది మన ముగ్గురికే. అలా అడ్వాంటేజ్ తీసుకోవడానికి శశాంకకి తెలిసే అవకాశమే లేదు. మరి ఎవరు..." సర్కార్ వేపు చూశాడు అనుమానంగా. ఏ"ఎవరిలా ప్లాన్ చేసింది. అంటే ఈ రహస్యం తెలిసిన నాలుగో మనిషి ఎవరో వుండి వుండాలి."
సదాశివయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అతడికి తెలుసు తనెక్కడ ఆ విషయం నోరు జారిందీ. సోఫియాతో అన్నట్టుగా చెప్పే సాహసం లేదతడికి.
"సర్" జయచంద్రకి సగందాకా అడ్డం వున్న సర్కార్ కొంచెం పక్కగా నడిచాడు. "ఈ రహస్యాన్ని నేను కుమార్ దాదాకి చెప్పలేదు. అంటే నా ద్వారా అయితే బయటికి పొక్కలేదు.
"డేమిట్" జయచంద్ర పైకి లేచాడు ఉన్మాదిలా. "అయితే ఆ ఫోన్ చేసిందెవరు. ఎవరూ అని" ఆవేశంగా కిటికీని చేరుకున్నాడు.
అదిగో ఆ అవకాశం కోసమే ఎపార్ట్ మెంట్ చీకటిలోనుంచి ఓ ఆకారం ఎదురుచూస్తున్నది.
చీకటి సరస్సులోని ఓ అగ్నిపుష్పంలా సుమారు తొంభైఏడు అడుగుల దూరంలో వున్న శశాంక ఓ క్షణం శ్వాసని అదుపు చేసుకున్నాడు.
స్వీడన్ మోస్ బర్గ్ ఎటిపి 500 రైఫిల్ టెలిస్కోప్ లో నుంచి చూస్తున్న శశాంక శరన్నిశీధి నేత్రం నుంచి గండిపడినట్టు ఓ రుధిరాశ్రువు ఉబికింది.
నేడు గురితప్పి తన చేతుల్లో కన్నుమూసిన అమ్మే గుర్తుకొచ్చిందో, నిన్న తను గురితప్పక నేలరాలిన కృప స్మృతే మెదిలి గుండె వికలించిందో అశ్రువు కళ్ళను పొరలా కప్పింది.
కలవరపాటుగా కంటిని తుడుచుకోడానికి ఓ లిప్తకాలం అవసరమైంది.
అంతే.
ఆ భవంతి ప్రతిధ్వనించింది.
నిశిరాత్రి కివ్వుమంది ఒక్క తూటాకే. మరో తూటాని ప్రయోగించకముందే జయచంద్రని వెనక్కి లాగారెవరో.
కాని అప్పటికే...
దశాబ్దాల సమర సంరంభంలో ఎదురులేని సార్వభౌముడై బ్రతికిన జయచంద్ర గుండె గోడలు పగిలిన సూచనగా రక్తం ఫౌంటెన్ లా బయటికి చిమ్మింది.
* * * *
సిటీ పోలీస్ బలగమంతా నేరస్థుడి వేట కోసం బయలుదేరిన ఆ నిశిరాత్రి వేళ...
ప్రజలతో, పత్రికా విలేకరులతో, ప్రముఖ రాజకీయ నాయకులతో కిక్కిరిసిపోయింది అధునాతనమైన హాస్పిటల్ ప్రాంగణమంతా.
అప్పటికే ఎమర్జెన్సీ ఆపరేషన్ మొదలైన సూచనగా థియేటర్ బయట రెడ్ లైట్ వెలుగుతూంది.
థియేటర్ లోని డాక్టర్లలో ఆ హాస్పిటల్ కి సంబంధించిన స్పెషలిస్టులు మాత్రమే కాదు. విఐపి అయినా జయచంద్రని కాపాడడానికి భారత రాష్ట్రపతి ఆనరరీ థొరాసిక్ సర్జెన్లుగా గుర్తింపబడిన ఇద్దరు డాక్టర్లతోపాటు రాష్ట్రంలో ప్రముఖుడైన ఓ కార్డియాలజిస్టు, మరో అనిసిపిస్టూ అటెండయ్యారు.
స్పృహలో లేని జయచంద్రకి ఓ పక్క ఆక్సిజను ఎక్కిస్తున్నారు.
మరో పక్క సెలైన్ డ్రిప్స్ తోబాటు సక్షన్ డ్రాప్ రేడస్ తో గొంతులోకి ఎగజిమ్మిన రక్తాన్ని బయటికి పీల్చే ప్రయత్నం జరుగుతూంది.
"ఎనస్తీఫియా' ఇవ్వబడిన జయచంద్ర ఇప్పుడు దేశాన్ని శాసించే చీకటి సామ్రాజ్యపు చక్రవర్తిలా లేడు. ఆ చీకటి కుహరంలో నిస్సహాయంగా మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన వేల మందిలో ఒకడిలా వున్నాడు.
