"అయినా మీరు నాకు దూరమైపోతున్నారేమో అన్న భ్యం....ప్రణయతో మీ స్నేహం నాలో రేపుతున్న ఆందోళన. అన్నిటినీ కాదని మీకు దగ్గర కావాలని ప్రయత్నం ప్రారంభించాను. మీరు నా మనిషో, కాదో తేల్చుకోలేని సందిగ్ధత ప్రణయ నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టు కుంటుందేమో అన్న ఆలోచన నన్ను విపరీతంగా బాధిస్తుండేది. ఆదిత్యా! నిన్న మొన్నటిదాకా ఎవరికీ తలవంచని ఆడపిల్లగా నా స్థితికి, నిజానికి చాలా కుచించుకుపోవాలి. కోరిందేదైనా సాధించుకోవడమే తప్ప సంపాదించాలీ అన్న ఆర్తితో వెంటపడటం చేతకాని నాకు, ఇది అనుభవం లేని విషయమే అయినా మీకోసం... కేవలం మీరంటే..."
"ప్రబంధా!" ఇక నిభాయించుకోలేకపోయాడు ఆదిత్య. "నేను మామూలు మనిషిని."
"దేని విషయంలో?" మొండిగా అడిగింది ప్రబంధ.
ఆమె మాటల్ని నిర్మొహమాటంగా ఖండించలేక క్రమంగా తన మనోభిప్రాయాన్ని చెప్పాలనుకున్న ఆదిత్యకి ఆమె అసలు అవకాశం ఇవ్వలేదు.
"డబ్బులోనా? అదే అయితే నాకు చాలా ఉంది ఆదిత్య. వ్యక్తిత్వం లోనా? అదే అయితే చాలామంది మగాళ్ళలో లేని ప్రత్యేకత మీ వ్యక్తిత్వంలో వుంది. వద్దు, మిమ్మల్ని మీరు మామూలు మనిషిగ అనుకోవాల్సిన ఆగత్యం లేదు. నన్ను మానసికంగా ఆకట్టుకోగలిగిన మీరు నా ఊహల్లో అరుదైన వ్యక్తి."
"అది కాదు ప్రబంధా! మన పరిచయం రేపు ఎలాంటి ఇబ్బందులకి కారణమయ్యేదీ మీరూహించలేదు. అసలు..."
"ఆదిత్యా!" అర్దోక్తిగా ఖండించింది మరోమారు "బహుశా మీరు మా కుటుంబపరమైన అవాంతరం గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. ఒక్క మాట నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. నా యిష్టాయిష్టాల విషయంలో మా డాడీ జోక్యాన్ని సైతం నేను హర్షించను. ఆ విషయం ఆయనకి తెలుసు. ఒకవేళ మీరు నాకు కావాలీ అన్న ఆలోచనకి ఏ పక్కనుంచయినా ప్రతిఘటనే ఎదురయితే నేనీ ప్రపంచంలోనే మిగలను. ఇదీ అహంకారమే అని మీరనుకున్నా నాకభ్యంతరం లేదు. ఐ లవ్యూ అండ్ ఐ సింప్లి వాంట్యూ. మనసులోని భావాన్ని యింతకంటే అందంగా చెప్పడం నాకు తెలీదు ఆదిత్యా! మీకు దూరంగా వుండమని ఏ శక్తి శాసించినా నేను వినను. ప్రాణం పోయేదాకా పోరాడతాను తప్ప మనసు మార్చుకునే ప్రసక్తిలేదు, రాదు. అంతే."
దృఢంగా, స్థిరంగా అన్న ప్రబంధ మాటల్లో తండ్రి అన్నల ప్రతిఘటన గురించే కాక, ప్రణయపరంగా ఎదురయ్యే సమస్య గురించి పరోక్షంగా హెచ్చరిక వినిపించింది.
ప్రబంధ గురించి చాలా తెలిసిన ఆదిత్య యిప్పుడు ఆమె చెప్పిన విషయాలను మామూలుగా తీసుకోలేకపోయాడు.
అసలు ప్రబంధ ఇంతసేపూ మాట్లాడింది వింటూ ఎందుకు మౌనంగా వుండిపోయాడో అతనికీ అర్ధం కాలేదు.
ఏ సరుగుడు చెట్ల నీడలోనో సరదాగా తిరుగుతూ, సంజె ఎరుపు సెలయేరు ఆకాశపు టంచులపైన కామ్ గా ప్రవహిస్తున్న క్షణాలను పరవశంగా చూసి పులకిస్తూ చాలారోజులు గడిచాక, ఏ అవాంతరాన్నో విశ్లేషించుకుంటూ చెప్పుకోవలసిన విషయాన్ని, ఇక్కడ స్నేహితులమని అనుకుంటున్న మొదటి అంకంలోనే మాట్లాడుకోవాల్సి రావడం ఆదిత్యకి విచిత్రంగా వుంది.
ప్రబంధతో ఇంతవరకూ తన ఇష్టాన్ని వ్యక్తం చేయలేదు ఆదిత్య. అలా చేసి వుంటే అది జరిగింది ప్రణయతో మాత్రమే...! కాని ప్రబంధ ఇంత లోతుగా వెళ్ళిపోయిందేం?"
ప్రబంధ బాధపడినా గాని ఆమె అదే ఊహలో బ్రతకడం అతనికి యిష్టంలేదు.
ఇక చెప్పేసేవాడే....
అదిగో... సరిగ్గా ఆ క్షణంలో ఇంటిముందు కారు ఆగిన చప్పుడయింది.
ఆదిత్య అప్రతిభుడై చూస్తుండగానే శౌరి కారు దిగడం కనిపించింది.
ఎప్పుడో కాదు, అనుకున్న అవాంతరం ఇప్పుడే ఎదురయ్యింది.
సహజంగా ధైర్యవంతురాలే గాని ఈ సన్నివేశాన్ని ప్రబంధ సైతం యింత త్వరగా వూహించలేదు. తన గురించి కాదు, ఆదిత్య విషయంలో కొద్దిగా భయపడింది.
ఎరుపెక్కిన కళ్ళతో బుసకొడుతున్న తాచులా నిలబడ్డాడు శౌరి.
పక్కనే ఉన్న సుధీర్ శౌరి ఆదేశం కోసం ఎదురుచూస్తున్నట్టు క్షణాలు లెక్కపెడుతున్నాడు.
ఉద్విగ్నతను అదిమిపెడుతూ సాదరంగా ఆహ్వానించాడు ఆదిత్య. "రా శౌరీ...వెల్ కమ్....కూర్చో."
"నేను వచ్చింది కూర్చోవడానిక్కాదు" అరక్షణం నిశ్శబ్దం తరువాత అన్నాడు- "నీ విషయం తేల్చటానికి."
"ఏమిటది...?" ఇలా అన్నది ఆదిత్య కాదు- ప్రబంధ! "చెప్పన్నయ్యా! నాకూ వినాలనుంది."
"మధ్యలో జోక్యం చేసుకోకు" ప్రబంధవేపు ఉక్రోషంగా చూశాడు శౌరి. ప్రబంధలాంటి అహంకారి కాకా మామూలు చెల్లే అయ్యుంటే యీ పాటికి ఆమె చెంప పగలగొట్టేవాడే. "నువ్వెళ్ళు."
"నువ్వూ రా" శౌరి అక్కడనుంచి కదిలితే తప్ప తనూ వెళ్ళకూడదనుకుంది.
"నేను రాను."
"అయితే అంతవరకూ నేనూ యిక్కడే ఉంటాను."
"ప్రబంధా....!" ఇక నిగ్రహించుకోలేక పోతున్నాడు. "నేను ఆదిత్యతో మాట్లాడాలి."
"నేను ఆ మాటల్ని వినాలి."
"అది వ్యక్తిగతం."
"అయినా నాకనవసరం."
"ప్రబంధా..." అరిచాడు శౌరి.
"అరవకన్నయ్యా...!" తనూ మొండిగానే అంది. "నాకు తెలుసు నువ్వెందుకొచ్చిందీ. బహుశా నా గురించి ఆదిత్యని నిలదీయాలనుకుంటున్నావు. నా విషయంలో ఆదిత్యని ప్రశ్నించటానికి యింకా నేను మైనర్ ని కాదు. పైగా ఆదిత్య నా బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టలేదు. వచ్చింది నేను కాబట్టి అడగాల్సింది నన్ను."
