Previous Page Next Page 
ఆలింగనం పేజి 66


    వసంత కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. సాయంత్రం నేను వెళ్ళగానే "సారీ ముక్తా... నీకు డిజపాయింటింగ్ న్యూస్ ఒకటి చెప్పనా?" అంది.

 

    నేను భయంగా "ఏవిటీ?" అన్నాను.

 

    "శనివారం కర్నూలు వెళ్ళలేము. నా ప్రాణానికి...ముంబై నుండి ఎవరో బోస్ అనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ దిగబడుతున్నాడు. అతన్ని తీసుకుని మా ప్లాంటికి వెళ్ళాలిట. మళ్ళీ సోమవారం తిరిగి వస్తాను. లంచ్ టైంలో తెలిసింది నాకు. నీ కళ్ళల్లో ఆశాభంగం చూడాల్సిరావడం నా దురదృష్టం!" అంది.

 

    నేను ఊపిరి పీల్చుకుని "పోస్ట్ పోన్ అయింది ట్రిప్...కాన్సిల్ అవలేదుగా... ఫరవాలేదు" అన్నాను.

 

    "దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్! ఈ కుషీలో వెళ్ళి కాఫీ కలుపు" అంది చనువుగా.

 

    నేను కిచెన్ లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ-

 

    "అపురూపమైనవి అంత తేలిగ్గా ఎందుకు లభ్యమవుతాయి! అతన్నీ ఎంతకాలం తెరమాటున దాగి ఉంటాడో చూద్దాం!" అనుకున్నాను.

 

    కాఫీ కప్పులతో తెర తోసుకుని వస్తూ వుంటే, అవతలి వైపునుండి హడావుడిగా వస్తున్న విక్కీ నన్ను డాష్ కొట్టాడు. కాఫీ తొణికి చీరమీద పడింది.

 

    "సారీ...సారీ...సారీ..." అంటూ నీళ్ళు తెచ్చి నా పైటమీద తుడిచాడు. ఆ చర్యకి నేను విస్తుబోయి చూస్తుండిపోయాను.

 

    అతని ముఖం చాలా మామూలుగా వుంది. "ఐయామ్...రియల్లీ సారీ - చూడలేదు" అన్నాడు విక్కీ.

 

    "ఏమైందీ?" అంటూ లిల్లీ అక్కడికి వచ్చింది.

 

    "కాఫీ తీసుకొస్తుంటే... ఆయన చూసుకోకుండా వచ్చి డాష్ ఇచ్చారు" అన్నాను.

 

    "ఇట్స్...ఓ.కే...ముందు కాఫీ ఇటియ్యి" అని లిల్లీ కాఫీ కప్పు అందుకుంది.

 

    "నేను విక్కీకి కూడా ఓ కప్పు అందించాను. ఎందుకో అతనలా నన్ను ముట్టుకోవటం ఇబ్బంది అనిపించింది. తలెత్తి అతనివైపు చూడలేకపోయాను.

 

    "ఏమిటదోలా ఉన్నావు?" అడిగింది లిల్లీ.

 

    "అతను అలా టచ్ చేస్తాడేమిటీ?" కోపంగా అన్నాను.

 

    లిల్లీ పెద్దగా నవ్వి "ఫారెన్ నుండి వచ్చాడు తల్లీ! ఇంకా చాలా మర్యాదగానే ఉన్నట్లు లెఖ్క! ముక్తా...అక్కడి కల్చర్ అలవాటు అయిన వాళ్ళకి ఈ ముట్టుకోవడాలూ, పట్టుకోవడాలూ పెద్ద విషయాలు కాదు. మనసులో ఏ భావం లేకుండా చాలా క్యాజువల్ గా ముద్దు కూడా పెట్టుకోగలరు. అదే ఇక్కడ...మనసంతా కామం నింపుకుని అమ్మా...చెల్లీ...అని పిలుస్తారు!" అంది.

 

    ఆమె చెప్పింది విన్నాక కొంచెం సర్దుకున్నాను.

 

    "ఈ బోస్ ఎవరో సమయానికి వస్తున్నాడు. అతనికి చూపించడానికి రిపోర్ట్స్ అవీ రెడీ చెయ్యాలి." అని లాప్ టాప్ తెరిచి వర్క్ లోకి దిగింది.

 

    "నేను వెళ్ళొస్తాను లిల్లీ" అంటూ లేచాను.

 

    "వన్స్ ఎగైన్ సారీ ముక్తా!" అంది లిల్లీ.

 

    "ఇంక దానిగురించి ఆలోచించకు. మరో శనివారం వెళ్దాం" అన్నాను.

 

    ఇంటికొచ్చేసరికి అంతా ఏదో సీరియస్ గా చర్చిస్తూ కనబడ్డారు.

 

    "మీరూ ముక్తా వెళ్ళిరండి. చైతన్య ఒంటరివాడైపోయాడు" అంది అమ్మ.

 

    "ఏవైంది అమ్మా?" అని అడిగాను.

 

    "అత్తయ్యకి లైట్ గా పెరాల్సెస్ స్ట్రోక్ వచ్చిందట. చైతన్య పక్కింటికి ఫోన్ చేశాడు. తాతయ్య వస్తానని గొడవచేస్తున్నాడు" అన్నారు నాన్న.

 

    "పరిస్థితి ఎలా ఉందో...అందరం వెళదాంరా!" అంటూ తాతయ్య ఏడ్చేశాడు.

 

    "సరే...నాన్నా...ఊర్కో" నాన్న తాతయ్యని చిన్నపిల్లాడిని ఓదార్చినట్లు దగ్గరికి తీసుకుని ఓదార్చాడు.

 

    "ముక్తా బట్టలు సర్దు" అంది అమ్మ.

 

    నేను మౌనంగా లోపలికి నడిచాను.


                                                          *  *  *


    అందం పొంగుతున్నట్లు ఒత్తుగా, పచ్చగా ఉన్నాయి పంటపొలాలు. వాటి మధ్యలో సీతాకోకచిలుకల్లా ఉన్నారు రంగు రంగుల చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు. ఒంగి ఊగుతూ, తమాషాగా కదుల్తూ ఏవో పాటలు పాడుతుంటే రవీంద్రుడు అన్నట్లు ఆపాద స్పర్శతో ధాత్రి వీణమల్లే కంపిస్తోందా అనిపిస్తోంది!

 

    నెమ్మదిగా కొండలు దిగి, చెట్ల కొమ్మల్లో కాసేపు తూగులాడి బుగ్గలపై పొడిచి సరాగాలాడి, గుచ్చుమీద పారాడ్తూ తులసికోటల చుట్టూ తిరిగే ఇల్లాళ్ళ దగ్గరకి వస్తున్నాడు సూర్యుడు.

 

    రాత్రి కురిసిన మంచుకి తడిసిన గచ్చు వెచ్చగా అతని స్పర్శతో ఒళ్ళు ఆరబెట్టుకుంటోంది. 'అంబా అనే ఆవులూ, గంటలు మ్రోగించుకుంటూ పనికి పరిగెడ్తున్న బసవన్నలూ, కావిళ్ళతో తమాషాగా వచ్చే కూరగాయలవాళ్ళూ... అంతా కొత్తగా ఉంది నాకు.

 

    ఇంటిముందున్న వేపచెట్టు నించి పందుంపుల్ల ఒకటి విరచుకుని అరుగుమీద కూర్చున్న నా దగ్గరికి వచ్చాడు చైతన్య. రేగినజుట్టు మొహం మీదకి పడి, నుదురు ముప్పాతిక చంద్రుడిలా మెరుస్తూ కనిపిస్తోంది. ఉదయరశ్మిలో అతని నగ్నమైన వీపు మరింతగా పచ్చగా మెరుస్తోంది.

 

    చటుక్కున కళ్ళు తిప్పుకున్నాను.

 

    "ఎలా వుంది మా ఊరు?" అడిగాడు.

 

    "చైతన్యపురంలా ఉంది" అన్నాను.

 

    భుజం మీదున్న తుండుతో మొహం తుడుచుకుంటూ "అమ్మకి కుడిచెయ్యి ఇక పనిచెయ్యదన్నారు. మాటకూడా ముద్దగా మారిందికదూ!" అన్నాడు.

 

    "అవును!" బాధగా అన్నాను. అత్తయ్య ఒంటినిండా నగలు పెట్టుకుని పెద్ద పట్టుచీరలో గలగలలాడుతూ లక్ష్మీదేవిలా తిరగడమే నాకు తెలుసు. ఇలా మంచం మీద పడి ఉండడం చూస్తుంటే ఏడుపొస్తోంది.

 

    "ఇప్పుడు నాకోసం కాదు, అమ్మకోసం అయినా నేను పెళ్ళి చేసుకోకతప్పదు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS