"పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు ఎన్నో రకాలుగా మారుతూ వుంటారు. మీ జీవిత కథలు వింటుంటే నాకు మీమీద అభిమానం కలుగుతోంది. ఇంకా ఈ దేశంలో సత్యం చచ్చిపోలేదని... న్యాయం కళ్ళు మూసుకోలేదని... ధర్మం రక్షించబడుతూనే వుందని నమ్ముతున్నాను.
నీ ప్రియురాలు నీకు దక్కింది. రాంసింగ్ లాంటి మంచి స్నేహితుడు దొరికాడు. ఇన్ స్పెక్టర్ వర్ధనరావుగారి ఈ చిన్న అలవాటువల్లనే నా వజ్రాలు ఆయనింట్లోనే సురక్షితంగ వున్నాయ్. నేను అన్నమాట ప్రకారం ఇన్ స్పెక్టర్ వర్ధనరావుగారికి లక్షరూపాయలు, ఆయన వుదహరించిన కానిస్టేబుల్స్ కి పాతికవేల చొప్పున నలుగురికి ఇస్తాను.
సరీగ నాలుగురోజుల క్రితం నేను దేవీపూజ చేస్తూ అమ్మవారి ముందు చేతులు జోడించి ప్రార్థిస్తూ వక కోరిక కోరాను." అమ్మా! నేనెప్పుడు డబ్బు సంపాదించినా న్యాయంగ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించానుగాని అన్యాయంగ ఒకళ్ళ నోళ్ళు కొట్టి డబ్బు సంపాదించలేదు. పోయిన నా కోటియాభై లక్షల విలువచేసే వజ్రాలు దొరికితే అవి ఎవరి ద్వారా దొరికాయో వాళ్ళకి పదిలక్షలు...మిగతా నలభై లక్షలు పెట్టి నేనొక దేవాలయము... అనాథ పిల్లలకి ఆశ్రమము... బీదసాదలకి ఫ్రీ బెడ్ లున్న ఆస్పత్రి కట్టిస్తానని మొక్కుకున్నాను. దేవి నా మొర ఆలకించింది." అంటూ ఆయన పైకిచూస్తూ దండం పెట్టాడు.
"ఇన్ స్పెక్టర్ గారి వల్లనే ఈ వజ్రాలు రక్షించబడ్డాయ్. ఆయన దగ్గర్నుంచి మేము ఉపాయంగ చేజిక్కించుకున్నాం. మేమిప్పుడు ఇన్ స్పెక్టర్ గారి కళ్ళుగప్పి తిరుగుతున్నాం. అదిచాలక అబద్ధపు ఫోను చేసి వజ్రాలు చేజిక్కించుకున్నాం. అవి తెచ్చి మీచేతికిచ్చాం. అయినా మేము నేరస్థుల కిందకే వస్తాం" తగ్గు స్వరంతో అన్నాను.
"మీరు నేరస్థులు కారు. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. మీరింకేమీ మాట్లాడొద్దు. నేను చేసేపని చూస్తూ వుండండి. అంతా మంచే జరుగుతుంది." అని ముకుందదాస్ మాకు అభయం ఇచ్చాడు.
ఆ తరువాత
ఇన్ స్పెక్టర్ వర్ధనరావుని ఇక్కడికే పిలవటం జరిగింది. మమ్మల్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంతేకాదు ఆనందపడ్డాడు?
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు గారితో ముకుందదాస్ మాకథంతా చెప్పి వివరంగా మాట్లాడాడు.
"నువ్వు నేరస్థుడివి కాదయ్యా! నిన్ను చూడంగానే ఆనాడే నాకు నీపై అభిమానం ఏర్పడింది. కోటీ యాభై లక్షల రూపాయల విలువగల వజ్రాలని నాకు తెలీకుండానే టోపీ ద్వారా నా ఇంటిలో భద్రంగా దాచానంటే అది దైవలీల కాక మరేంటి? కోటీయాభై లక్షల రూపాయల విలువగల వజ్రాలంటే ఎవరికి మాత్రం ఆశ వుండదు. మానవులం ఆశ పడటం సహజం. ఆశ వేరు దోచుకోవాలని ప్రయత్నించడం వేరు. మొత్తానికి చేరవలసినచోటుకి వజ్రాలు చేరాయి. నేనీ కేసులో పనిచేసింది ఏమీలేదు. నిమిత్త మాత్రుడ్ని. ఈ ఘనతంతా నీదే. నీవు నేరస్థుడివి కావు విజయ్" పాపం దిగ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావుగారు మనస్పూర్తిగ నన్ను అభినందించారు. అంతేగాని తీసికెళ్ళి మళ్ళీ కటకటాల వెనుక పారేస్తాననలేదు.
ఆ తరువాత అందరం కూర్చొని ఏంచేస్తే బావుంటుందని చర్చించుకున్నాం. అందరం చివరకి వక నిర్ణయానికొచ్చి లేచాం. ఈ కేసు విషయంలో ఎవరి పరువూ పోకూడదు. చేయవలసింది ఏమిటి? మేము మాట్లాడుకున్నది దీని గురించే.
మర్నాడు పేపర్లో ప్రముఖంగ ప్రచురించబడింది.
"కోటీ యాభై లక్షల రూపాయల విలువగల వజ్రాలు ఒక దొంగల ముఠా నాయకుడి దగ్గరున్నట్టు" ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేయడంతో ఇన్ స్పెక్టర్ వర్ధనరావుగారు తెలివిగ ఆనాడే దొంగలను పట్టేసినట్టు...కాని వజ్రాలను చేజిక్కించుకోలేక పోయినట్టు... ఆ తర్వాత ఆ దొంగల తాలూకా వస్తువుల్లో వజ్రాలున్నట్టు... విజయ్ అనే అతను చెప్పటం వలన వెతికి చూసినట్టు... టోపీలో రహస్యంగ దాచిన వజ్రాలు బైటపడినట్టు... విజయ్ రాజ్ అనే అతనిమీద దొంగ కేసులు బనాయించి జైలుపాలు చేసినట్టు...ఈ విధంగా... నిజం నిలకడమీద తెలిసింది" అంటూ దినపత్రికల్లో నా పేరుతో సహా ప్రముఖంగా ప్రచురించబడ్డాయ్.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావుగారికి లక్షరూపాయలు, హెడ్ కానిస్టేబుల్ అహోబిలం మరో ముగ్గురు కానిస్టేబుల్స్ కి పాతికవేలు పాతికవేలు చొప్పున ముకుందదాస్ అందించాడు.
ముకుందదాస్ నాకు పదిలక్షలు ఇస్తూంటే నేను తీసుకోడానికి నిరాకరించాను." దొంగగా, మోసగాడిగా అన్యాయంగ ముద్రింపబడిన నేను పరిస్థితులకు తలొగ్గి చిన్న చిన్న నేరాలు చేశాను. ఇన్ స్పెక్టర్ వర్ధనరావుగారు నన్ను అర్థంచేసుకుని నన్ను, నా మిత్రుణ్ణి గౌరవంగా బ్రతకమని వదిలేశారు. నేనిప్పుడు సుస్మితని పెళ్ళాడి నాకు కుడిభుజంగ వున్న రాంసింగ్ తో ఏదన్నా చిన్న బిజినెస్ చేసుకుంటూ హాయిగా బ్రతుకుతాను. లేకపోతే మా ఇరువురికి మీదగ్గరి ఉద్యోగం చూపించండి చాలు" అన్నాను.
ముకుందదాస్ నామాట విన్లేదు.
"వజ్రాలు ఎవరైతే తెచ్చిస్తారో వాళ్ళకి పదిలక్షలు ఇస్తానని దేవికి మొక్కుకున్నాను విజయ్! నామాట చెల్లించుకోకపోతే దేవి ఇప్పుడు నానెత్తి అరిచేస్తుంది. నీవీ డబ్బుని ఆశపడి తీసుకోవడం లేదు. అర్హత లేకుండానూ తీసుకోవడం లేదు. నీ నిజాయితీకి పారితోషికంగ నేనిస్తూంటే తీసుకుంటున్నావు. ఎలాగూ బిజినెస్ చేస్తానంటున్నావ్. ఈ పది లక్షలని నా దగ్గరేవుంచి వజ్రాల వ్యాపారం మీద పెట్టు. చిన్న పార్టనర్ షిప్ ఇస్తున్నానన్నమాట. నీవు! రాంసింగ్ కలిసి బిజినెస్ చేసుకోండి" బలవంతం పెడుతూ అన్నారు ముకుందదాస్.
